Telugu Global
Arts & Literature

రమాదేవి చిన్న కథలలో "స్త్రీ"

రమాదేవి చిన్న కథలలో స్త్రీ
X

రమాదేవి చిన్న కథలలో "స్త్రీ"

శ్రీమతి వి.ఎస్. రమా దేవి గారు రాసిన చిన్న కథల పుస్తకం "దేవుడికి ఉత్తరం"

వారీ కథలను పెద్దన్నయ్య వడ్లపట్ల లోకరాజు గారికి అంకితం ఇచ్చారు.

ఈ కథలకు రావూరి భరద్వాజ గారు ముందు మాట సంగ్రహంగా రాసారు. చిన్నకథ లక్షణాలను తెలిపారు. చిన్న కథ ను రాయడం కష్టం అన్నారు. ప్రేమ కథలు సాధారణం. ఆ కథలలో చాలా మటుకు నాజూకు తనం ఉండదు పేలవం గా ఉంటాయి అన్నారు.

చిన్న కథలలో విషయం, చెప్పే విధానం, ముఖ్యమని స్పష్టం చేసారు. మన చుట్టూ నిత్యం అనేక సంగతులు జరుగుతుంటాయి. వాటిని చెప్పే నేర్పు ఉండాలి అన్నారు.

ప్రతి సంసారం లో మామూలుగా జరిగే విషయాలను ముని మాణిక్యం గారు, సమాజం అంగీకరించని భావాలను గోపీచంద్ గారు రాసి ప్రత్యేకతను సాధించారు. సాధారణ విషయాలను గ్రహించ గలగాలి. గ్రహించినా రాయ లేక పోవడం బల హీనత అని ఉన్న మాటను విన్న వించారు.

రమా దేవి గారు విషయాలను ఎన్ను కోవడం లో వినూత్నమైన నేర్పు చూపారు. మొదటి నుంచి చివర వరకు చదివించ గలిగిన కథనం వారిది అని చెప్పారు. ఏ కథ కాకథ ఎంతో బాగున్నా "రమా దేవి గారు తమ కథ పేలవం గా ఉంది అంటే ఒప్పుకున్నారట"

నిజాన్ని ఒప్పుకోగల ధైర్యం ఆమె జీవితం లోనే కా దు కథల్లో కూడా ఉంది అని కథకురాలి స్వభావ గుణాన్ని సున్నితంగా వివరించారు.

ఇక రమా దేవి గారు తమ మాటగా ఈ కథల రచనా నేపథ్యాన్ని చెప్పారు.

ఈ కథలలో దేవుడికి ఉత్తరం, నిజం నిష్టూరం మరి రెండు కథానికలను తమ పధ్నాల్గు, పదిహేనేళ్ళ వయస్సులో రాసినవని ముందు గానే పఠితలను సిద్ధ పరచారు. అన్ని కథలూ పత్రికలలో ప్రచురణను పొందాయి. కథల రచనా కాల గమనం లో గల తారతమ్యం వాటి స్థాయి లో కనిపించిందని విన్నవించారు.

ఈ సంపుటిలో పధ్నాలుగు కథలున్నాయి. ఈకథలు 1961 లో రాసినవి. ఇవన్నీ అలనాటి కథలని మనం చెప్పుకున్నా ,సరి కొత్త అలలుగా మన్సును తాకుతాయి

ఈ కథలలో ముఖ్యంగా చెప్పుకోవలసిన వాటిలో "మరీ విపరీతం" కథ సామాన్య గృహిణి సరస్వతమ్మ స్వభావాన్ని ఎంతో సహజంగా వివరిస్తుంది. "ఆమె తన భర్తతో పర స్త్రీ లు చనువు గా మాట్లాడితే చాలు వలలో వేసుకుంటున్నారని అపోహ పడుతుంది" వారిపట్ల తన వ్యవహారం లో ధోరణిని మార్చేస్తుంది. ఆమె స్వభావాన్ని భర్త కనిపెట్టి చిరాకు పడడం సంసారం లో భోళా గృహిణుల బేల స్వభావం అంతేకదా అనిపిస్తుంది.

రచయిత్రిని అతి దగ్గరగా పరిచయం చేస్తుంది "నిట్టూర్చింది" కథ.

ఈకథ గ్రహణం మొర్రి తో రూప వైకల్యం కలిగిన సుమతి కథ. ఇతరులు ఎత్తి చూపుతున్నా తాను చదువుకుని స్థిర పడాలని నిశ్చయించు కుంటుంది. తన నల్లటి శరీరాన్ని, చీలిన పెదవినీ కడుపున పుట్టిన పిల్లల్లా రక్షించు కోవాలనుకుంటుంది. "తాను కాకపోతే వాళ్ళనింకెవరు రక్షిస్తారను కోడం సుమతి మనోబలాన్నే కాదు, రమాదేవిగారి ఆదర్శాన్ని కూడా తెలుపుతుంది.

"వడ దెబ్బ " చర్చించుకోదగిన మరొక కథ. ఒక స్త్రీ చూపించిన ఆప్యాయతలో తనమీద అనుమానం దాగి ఉందని తెలిసినప్పుడు నిర్మల కొయ్య బారి పోతుంది" పఠితలకు కూడా నిర్మల పట్ల అపేక్షను ఒలక బోసిన పిల్లల తల్లి మాటలు వడదెబ్భ కొట్టినట్లనిపిస్తాయి.

"కళ్ళకు కట్టింది" కథ కళ్ళతో చూసిందంతా నిజం కాదని చెప్తుంది. ఒకానొక పరిస్థితిలో రేఖ తన అన్నయ్య తలను నిమురుతూ దగ్గరితనం చూపితే అపార్థం చేసుకున్న ప్రమీల స్వయం గా తన పట్ల సానుభూతితో ఆప్యాయం గా వ్యవహరించిన బావ గారి ఆత్మీయతకు చలించింది. తన తప్పును తెలుసుకుంది. ఈ కథ స్త్రీలకుండవలసిన విచక్షణను గురించి హెచ్చరిస్తుంది.

తప్పక చదువ వలసిన కథ "ఎగుడు దిగుడు" .ఇందులో లలిత స్థిత ప్రజ్ఞత్వం అబ్బుర పరుస్తుంది. ఆమె భర్తకు వ్యాపారం లో లాభం వచ్చినప్పుడూ, నష్టం కలిగినప్పుడూ ఒకేలా పొంగి పోక, క్రుంగి పోక నిలకడగా ఉంటుంది. నష్టం లో భర్తను నిరాశ పడనీయక తను ఉద్యోగం చేసి ఆర్థికంగా చేయూతనిచ్చింది. ఈ కథను చదివాక లలిత అంటే తప్పక గౌరవం కలుగుతుంది.

'ఎక్కడికి పోస్ట్ చేయను? 'కథ గమనార్హమైనది. అనురాగం ఆత్మీ యత బాంధవ్యాలు ఎంతగా అల్లుకున్నా అంటరాని వ్యాధి సోకినప్పుడు తమకు తాము జాగ్రతలు తీసుకోవాలని. పరిస్థితి చేయి దాటితే ఉత్తరాన్ని ఎక్కడికి పోస్ట్ చేయాలో తెలియక మిగిలిపోతామని ఎంతో సున్నితంగా తెలియ పరుస్తుంది.

రమాదేవిగారు బాల్యం లో రాసిన దేవుడికి ఉత్తరం, చనిపోవడం అంటే ఏమిటో తెలియని సుశి అమ్మను పంపమని దేవుడికి రాసిన ఉత్తరం లోఅమాయికత్వాన్నీ …

'నిజం నిష్టూరం'కథ, ఒకేవిధమైన ఆపద వాటిల్లి నప్పుడు దుఖం సమానమే అయినా పని చేస్తే కాని రోజు గడవని పేదరాలికీ, అనుకూలమైన కుటుంబంలోని స్త్రీ కి గల స్థితి గతుల తార తమ్యాన్నీ తెలుపుతాయి.

రమాదేవిగారు సామాన్య మధ్య తరగతి స్త్రీ పురుషుల వ్యక్తిత్వాలను చక్కగా పరిశీలించి చూపారు. టైఫాయిడ్ క్షయలాంటి వ్యాధుల ప్రస్తావనలో ఆ యాపరిస్థితులలో, కుటుంబ సభ్యుల ఆత్మీయతలను చక్కగా చిత్రించారు. ఆనాటి ఔద్యోగిక వాతావరణం లో చదువుకున్న వారి ప్రవర్తనను కూడా ఉన్నది ఉన్నట్టుగాపరిశీలించారు. చదవదగిన మంచి కథల సంపుటి ఇది

-రాజేశ్వరి దివాకర్ల (వర్జినియా ,యు .ఎస్)

First Published:  29 Nov 2022 2:22 PM IST
Next Story