Telugu Global
Arts & Literature

గెలుపు - ఓటమి

గెలుపు - ఓటమి
X

గెలుపు - ఓటమి

"గౌరవ్, మీ స్కూల్ యాన్యువల్ డే వస్తోందికదా. ఎప్పటిలా గేమ్స్ కాంపిటీషన్స్ పెడుతున్నారా? ఈ మారే గేమ్స్ వున్నాయి?" కొడుకుతో ఛెస్ ఆడుతూ అడిగింది సుశీల.

"ఉన్నాయమ్మా, ఎప్పటిలాగా అన్నీ వున్నాయి. నాకు మాత్రం దేన్లోపేరివ్వాలనిపించటంలేదు."

"అదేంటి? ఎందుకలా? ఎప్పుడూ ఉత్సాహంగా గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తావు కదా!?"

"ఏమోనమ్మా ఎన్ని సార్లు, ఎన్ని గేమ్స్ లో పార్టిసిపేట్ చేసినా ఒక్కసారీ ఒక్క దాన్లో కూడాగెలవటం లేదు. నాకన్నా బాగా ఆడేవాళ్ళు చాలామంది వున్నారు. ఎందుకు గెలవని దానికి ప్రతిసారీ పార్టిసిపేట్ చెయ్యటం? అంతా నవ్వుతారు!"

"అవ్వన్నీపట్టించుకోకూడదురా. ఆటని ఆటలాగా ఆడాలి. బాగా ఆడేవాళ్ళుంటే మంచిదే

కదా. వాళ్ళతో ఆడితే నీ ఆట కూడా ఇంప్రూవ్ అవుతుంది.

ఆరోగ్యకరమైన పోటీ ఎప్పుడూ

మంచిదే తెలుసా!? ఏ గేమ్ లోనైనా ఎంతమంది పార్టిసిపేట్ చేసినా గెలిచే వాళ్ళు ఒక్కళ్ళేవుంటారు. మరి మిగతా వాళ్ళందరికీ ఆట రానట్లా!? అయినా ఈ వయసులో నువ్వు గెలిచావా ఓడావా అనేది ముఖ్యం కాదు. ఆ గేమ్ తో ఇంకాకొత్తగా ఏమన్నా నేర్చుకున్నావా అన్నదిపాయింట్. అలా నేర్చుకుంటూ వుంటే ఏదో ఒక రోజు తప్పక గెలుస్తావు. ఎప్పుడూ గేమ్స్ లో

కొత్త పాయింట్స్ నేర్చుకోవటానికీ, గెలవటానికి ప్రయత్నించాలిగానీ, ఓడిపోయినంత మాత్రాన

డల్ అయిపోయి ఆడటమే మానెయ్యకూడదు."

"ఏమోనమ్మా, నాకు ఛెస్ అంటే చాలా ఇష్టంకదా. నీతో ఇంత బాగా ఆడతాను. ఎప్పుడూ నేనే గెలుస్తాను కదా." కొడుకు గౌరవ్ మాటలకు చిన్నగా నవ్వుకుంది తల్లి. ఎప్పుడూ నువ్వుగెలవటం కాదురా, నేనే నిన్ను గెలిపిస్తున్నాను అనుకుంటూ.

"మరి ఇక్కడ నాకన్నా ఇంత పెద్దదానివి నీమీదే తేలిగ్గా గెలుస్తాను గానీ, స్కూల్లో నాతోటి పిల్లలమీద గెలవలేక పోతున్నానుఎందుకో!?"

అప్పుడు అర్ధం అయింది తల్లికి తను చేస్తున్న తప్పేమిటో. గౌరవ్ కి ఆటల్లో ఓడిపోవటంనచ్చదు. కేరమ్స్ లోగానీ, ఛెస్ లోగానీ ఏ ఆటైనా సరే తనోడిపోతే కాయిన్సన్నీ కలిపేసి అలకతెచ్చుకుని "మీరు తొండి ఆడుతున్నారు, నేనాడను పొండి" అని వెళ్ళిపోతాడు.

ఇంత చిన్న విషయానికి కొడుకు ముందు తగ్గి వుంటే పోయిందేముందిలే అనుకుని కొడుకుతోఆడేటప్పుడు తను కావాలని ఓడిపోతుంది. దాంతో వాడు తనతో ఆడటానికి హుషారు చూపిస్తాడు.

కానీ ఇప్పుడాలోచిస్తే తన భర్త వెంకట్ చెప్పే మాటే నిజమనిపిస్తుంది. తను వాడినలా గెలిపించటం కరెక్ట్ కాదంటాడు వెంకట్. వాడికి ఆట సరిగ్గా నేర్పు. వాడంతటవాడు గెలిచేటట్లు చెయ్యి.నువ్వోడి పోయినట్లు బయటవాళ్ళంతా నీ కొడుక్కోసం ఓడిపోరు కదా. ఆప్పుడువాడెలాఫీలవుతాడంటాడు వెంకట్.

కానీ ఈ విషయం తనే పట్టించుకోలేదు ఇప్పటిదాకా. ఏదోచిన్నపిల్లాడు కాసేపు సంబర పడతాడులే అనుకుందిగానీ ఇంత దూరం ఆలోచించలేదు. వాడికోసం

ఓడిపోతూ వాడిని ఆట నేర్చుకోనివ్వలేదు. ఆ ఆటలో వాడి ఎదుగుదలకి తనే ఆటంకం అయింది.

ఇప్పుడు తన పొరపాటు తెలిసింది కనక దాన్ని సరి దిద్దుకోవాలి. వాడికి సరైన ఆటనేర్పాలి. తనే నేర్పితే ఇన్నాళ్ళూ అమ్మ తనని ఫూల్ ని చేసిందనుకుంటాడు. వెంకట్ చేత

నేర్పించాలి. గౌరవ్ వెంకట్ తో ఎప్పుడూ ఆడడు ఎప్పుడూ వెంకటే గెలుస్తాడని. ముందు గౌరవ్ కి నచ్చ చెప్పి వెంకట్ తో ఆడటానికి ఒప్పించాలి.

"అది కాదు నాన్నా. నాకు ఆట సరిగా రాదు. అందుకే నేనెప్పుడూ నీతో ఓడిపో తున్నాను. నాతోనే ఆడుతుంటే నీ గేమ్ ఇంప్రూవ్ కాదు. నువ్వు కొన్నాళ్ళు నాన్నతో ఆడు. నాన్నకి ఆట బాగా వచ్చు కనుక ఆయన దగ్గర ఓడి పోతున్నానని కాకుండా, నాన్న ఎలా ఆడుతున్నారో చూసి నేర్చుకో. నువ్వు శ్రద్ధగా నేర్చుకుంటే మీ నాన్న కూడా బాగా నేర్పుతారు. అప్పుడు మీ

స్నేహితులను ఈజీగా గెలవచ్చు. మరి ఎప్పుడూ నాన్నే గెలుస్తున్నారని అనకుండా నాన్నని కూడా గెలిచేట్లు నేర్చుకోవాలి

నువ్వు. సరేనా?"

నాన్నని కూడా గెలిచేట్లు... అనే మాట ఒక ఛాలెంజ్ గా వినబడింది గౌరవ్ కి. తనకి ఛెస్ లో ఆసక్తి వుంది. ఇంకా నేర్చుకుంటే ఇంకా బాగా ఆడచ్చుకదా అనుకున్నాడు.

"సరే అమ్మా. రేపు స్కూల్లో పేరిస్తాను. నాన్న దగ్గర ఇవాల్టినుంచే గేమ్ నేర్చుకుంటాను.నువ్వు మాత్రం నాకు సపోర్టు చెయ్యాలి. నీకు రాకపోయినా సరే నా దగ్గర కూర్చుని ఎంకరేజ్

చెయ్యాలి."

"అలాగేలేరా. నువ్వు నేర్చు కుంటానంటే నేను నీ దగ్గరేకూర్చుంటానులే" అంది సుశీల.

పెద్దవాళ్ళు పిల్లల కోసం ఎప్పుడూ ఓడిపోయి వాళ్ళని గెలిపిస్తూ వుంటే సంఘంలో వాళ్ళు ఎప్పటికీ గెలవలేరని అర్ధం చేసుకుంది సుశీల. పిల్లలు సమాజంలో గెలవాలంటే

పోటీనెదుర్కోవటం ఇంట్లోంచే నేర్పాలి అని తెలుసుకుంది.

- పి.యస్.యం.లక్ష్మి

First Published:  14 Nov 2022 1:11 PM IST
Next Story