తపస్సు
నిలువునా ఎండి
పెచ్చులు పెచ్చులుగా ఊడిపోతూ
ఖాళీ ఖాళీగా డొల్లలా-
కన్నీళ్లింకిన వేదనల బావుల్లోంచి
బతికే కొద్దీ తోడుకుంటున్న జ్ఞాపకాలు
మసక ఆలోచనల్లోంచి
ఆగిన శ్వాస చిగురించినట్లు
ఊపిరి పోసుకున్న మొలక -
లోగొంతుకలోంచి ఆశల సలపరింతలు
నిత్యం తొలిపొద్దయి గడిచి
బతుకుపై ఆశలు రగిలించి
స్తన్యమిచ్చి లాలించే
మాతృమూర్తి స్పర్శకోసం-
కొత్తగా పుష్పించిన దేహంతో
ఆకలిదప్పుల నీరంతర ప్రయాణం
నా కోసం చెమ్మగిల్లే కొన్ని చూపుల కోసం-
నన్ను వెలిగించి
నా ఆలోచనలకు ఊపిరులూదే
లౌకిక మోహాలంటని నులివెచ్చని
మనిషి కోసం ఒక తపన-
నా బాధల పల్లవిని విని
నా ఎద లోతుల్ని తడితడిగా నిమిరి
నన్ను ధైర్యంగా బతకమని
వీలునామా రాసిచ్చే భరోసా వాక్యం కోసం
ఒక వెదుకులాట-
రంగురంగుల సీతాకోక చిలుక రెక్కల్లాంటి
మృదువైన స్నేహభావనల కోసం
ఒక తపస్సు-
ఆకురాలు కాలంలోనూ
నన్ను కనిపెట్టుకునుండి
నాలో ఐక్యమైపోయే
ఒక అపూర్వ కనుదోయి కోసం
ఒక నిరీక్షణ-
స్నేహమాధుర్యమే శ్వాసగా
జీవితానికొక విశాలత్వాన్నిచ్చి
వసంతగానమై పరవసింపజేసే
నిత్యనూతన హృదయం కోసం దేవులాట.
విల్సన్ రావు కొమ్మవరపు