ఆడి సేతిలో ఏదో వుంది...
అవును ఆడి సేతిలో ఏదో వుంది..
రాతిరంతా ఇంటాయన
మూసిన కన్ను తెరవలా
ఓపికేడినుండీ వొచ్చిందో
మూలుగుతానే వుండాడు
ఊ..ఆ.. తప్ప నోటంట మాటలేదాయె..
నా కొడుకు పది సదివిండు..
సిన్నా సితక తెలిసిన మందో, మాకో మేమూ ఏసినం...
మేమూ సినిమాలు సూత్తం గందా.
జర్రంత మాకూ తెలుసు..
నాడి సూసినం.. కండ్లు సూసినం
నాలుక సాపమని లైటేసి సూసినం
పొట్ట నొక్కి సూసిండు,
సెవి పెట్టి గుండె సప్పుడు కూడా ఇన్నాడంట నా కొడుకు
అయినా ఇంటాయిన లేసి కూసోలే..
నాలుగు మెతుకుల
బువ్వ కూడా తినలే.
ఇక లాభం లేదనుకోని
బండి గట్టుకొని పట్నంపోయినం
ఉన్నపలాన రోగం పెరిగిపోనాదంట
దవాఖాన పెద్ద డాటరొచ్చిండు
మేం సేసినవే
ఆ డాకటరూ సేసిండు
గదేందో..గుండెల మీన సేతులతో దబా..దబా.. నొక్కిండు
మందేసిండంట
సూది గుచ్చిండంట
గంతే... సిన్న డాటరు బయటకొచ్చి..
పరేషానేం గాకండి.. సక్కగనే వున్నాడని ఖుషీ కబురు సెప్పిపోయిండు
గప్పుడాపినాము
మా ఏడుపు రాగాలు
అదో గప్పుడే తెలిసినాది
ఏదో ఉంది ..ఆడి సేతిలో
ఏదో వుందని..
ఊపిరి ఊది.. ఊతం సూపే
బ్రమ్మ దేవుడీయనే అని
డాక్టరోడు పక్కనుండాడంటే
సెప్పలేనంత
బలమేదో వస్తాది గందా
పోయే శ్వాసని ఆపుతాడంట
నొప్పి లేకుండా బాధ తీసేస్తాడంట
నవ్వుతూ
రోగాన్ని మాయం సేత్తాడంట
ఆ సేతులలో ఏదో
మహా సెడ్డ మంత్రమున్నాది.
ఏదో ఉంది
ఆడి సేతిలో ఏదో వుంది.
ఇంటిల్లిపాదీ ఇయ్యాల సక్కంగ ఉండామంటే
ఆ దయున్నోడి సలువే గందా
ఎయ్యేళ్ళు సల్లంగ ఉండాల
ఆ అయ్య
ఎందరి బతుకులో సరిదిద్దాల
సంతసాల లోగిళ్లలో
దేవుడై నిలవాల
జీవితకాలం గురుతుండే బహుమానం మాకియ్యాల
సల్లంగ ఉండాల..అవ్....!
ఆ అయ్య..సల్లంగుండాల
-శ్రీమతి వి.యన్.మంజుల.
(హైదరాబాద్)