అందని ద్రాక్ష ...!
అడవిలో ఒక సూర్యోదయం వేళ నక్క ఒకటి పొదలలోంచి బయటకి వచ్చి, ఒళ్ళు విరుచుకొని .. ఒకసారి చుట్టూ కలయజూసి ఆహారం కోసం బయలుదేరింది.
చిన్న చిన్న జంతువులనూ, చెట్లూ చేమలనూ, ఉదయపు అందాలను ఆస్వాదిస్తూ ఉల్లాసంగా నడుస్తున్న నక్కకు ఒక మామిడి కొమ్మకు అల్లుకొని గుత్తులు గుత్తులుగా విరగగాసిన ద్రాక్షపళ్ళు కన్పించాయి.
ఈ రోజు తనపంట పండిందని అనుకొని నక్క ఒక్క ఉదుటున ఆ ద్రాక్షపళ్ళు అందుకోబోయింది. కానీ అవి అందలేదు. రెండు మూడు సార్లు ప్రయత్నం చేసింది... కానీ అందలేదు. ద్రాక్షపళ్ళు అందకపోయేసరికి నక్కకు చాలా ఉక్రోషం వచ్చింది. దానికి చాలా అవమానంగా కూడా అన్పించింది. ఈ సారి నక్క కాస్త దూరం వెనక్కు వెళ్ళి తన శక్తినంతా కూడగట్టుకొని వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి అమాంతం ఎగిరి ద్రాక్ష గుత్తులను అందుకోబోయింది. ద్రాక్షపళ్ళ గుత్తి అందలేదు సరికదా ఆ ఊపుకు ఎగిరి అవతల పడ్డది. నక్కలేచి ఒళ్ళు ఒక్క దులుపు దులుపుకొని తననెవరైనా గమనిస్తున్నారా అని చుట్టూ చూసింది. ఎవరూ లేరు. తనను ఎవరూ గమనించకముందే అక్కణ్ణుంచి జారుకోవడం మంచిదని .. ఏమి జరగనట్టుగా .. యథాప్రకారం ఈల వేస్తూ .. గెంతుతూ, ఉషారుగా అక్కణ్ణుంచి కదిలింది.
అయితే జరిగిన ఈ తతంగమంతా పొదలమాటునుండి ఒక కుందేలు చూసింది. అది ఏమీ ఎరగనట్టు నక్కకు ఎదురుగా వచ్చి '' ఏం నక్కబావా! మంచి ఉషారుగా వున్నావే ? ఏమిటి సంగతి? '' అని అడిగింది.
'' అబ్బే ఏం లేదు పొద్దున్నే అడవి ఓ మారు కలయ తిరుగుదామని బయలుదేరాను...అంతే! అన్నది.'' దానికి మనసులో ఎక్కడో .. ఈ కుందేలు నా భంగపాటు చూళ్ళేదుకదా! అని అనుమానంగానే ఉంది. అయినా బింకంగా కుందేలుతో సరదాగా మాట్లాడసాగింది.
కుందేలు కూడా .. గుంభనంగా .. పిచ్చాపాటి మాట్లాడుతూ .... ''ఇంతకూ ఆ ద్రాక్షపళ్ళు వదిలేసి వెళుతున్నావేం?'' అని అడిగింది.
నక్కకు ఠారుమంది అయినా బయటపడకూడదని ''ఆ! ఓసారి ఎగిరిచూసాను అవి పుల్లగా వున్నాయి మనకు నచ్చవు. అందుకే వెళ్ళిపోతున్నా '' అన్నది నక్క.
''వాటిని రుచికూడా చూళ్ళేదు. కనీసం తాకనైనా తాకలేదు అప్పుడే అవి పుల్లనివి అని ఎలా నిర్ణయించావు'' అని అడిగింది కుందేలు.
''ఆ మాత్రానికే రుచి చూడాలా? నాబోటిదానికి ఆ ద్రాక్షపళ్ళ రంగు చూస్తే తెలీదా?'' అన్నది నక్క నిర్లక్ష్యంగా.
కుందేలు మాట్లాడలేదు. నక్కకళ్ళల్లోకి కళ్ళు పెట్టి తదేకంగా అదేపనిగా చూడసాగింది. నక్క దానివంక ఎక్కువసేపు చూళ్ళేకపోయింది. కుందేలు ఏమి మాట్లాడపోయేసరికి మెల్లగా అక్కడనుండి జారుకోబోయింది. వెనకనించి ''నక్కబావా! నీకు మంచి తియ్యని ద్రాక్షపళ్ళు తినాలని ఉందా?'' అంటూ కుందేలు అనడం వినిపించింది.
నక్క ఆగి వెనక్కు చూసింది. దానికి కుందేలుతో ఏమని సమాధానం చెప్పాలో అర్థకాలేదు. అయినా ఏమి మాట్లాడకుండా .. సంశయంతో
ఊపీ ఊపనట్టుగా తల ఊపింది.
''అయితే నా వెంటరా!'' అంటూ కుందేలు దారితీసింది. నక్క అనుసరించింది. నక్కకు ఇందాక కుందేలు చూసిన చూపుకు చెడ్డ అవమానంగా ఉంది. సిగ్గుతో సగం చచ్చినట్టుగా ఉంది. అందుకే ఏం మాట్లాడలేకపోతోంది.
కుందేలు నక్కను ఇంతకుముందు ద్రాక్షపళ్లకోసం ఎగిరి అందుకోలేక భంగపడిన చెట్టుదగ్గరికి తీసుకొచ్చింది. నక్క కుందేలు వంక అయోమయంగా ఇబ్బందిగా చూసింది.
కుందేలు నక్కను ద్రాక్షపళ్ళ గుత్తికింద నిలబెట్టి తను కాస్త దూరం జరిగి ''ఆ! ఇప్పుడు ఎగురు!... ఎగిరి ఆ ద్రాక్షపళ్ళను అందుకో!'' అన్నది.
నక్కకుందేలు వంక దీనంగా చూసింది. ''నేను చెబుతున్నా కదా! నీవిపుడు ఆ ద్రాక్షపళ్ళను అందుకుంటావు. మనమిద్దరం ఆ పళ్ళను కడుపారా తింటాం'' అన్నది కుందేలు నక్కను ఉత్సాహపరుస్తూ.
నక్క తన బలమంతా కూడదీసుకొని ఎగిరింది, అయినా ద్రాక్షగుత్తి అందలేదు. నక్క కుందేలు వంక నిస్సహాయంగా చూసింది.
కుందేలు నక్క ఎగిరినప్పుడు .. దాని నోటికి, ద్రాక్ష గుత్తికి వున్న దూరాన్ని గమనించింది. ఆ తర్వాత అది నక్క సహాయంతో రాళ్ళను తెచ్చి ద్రాక్ష గుత్తికింద పేర్చి ఎత్తు దిమ్మగా చేసి .. నక్కను దాని మీద నుంచి ఎగరమన్నది. అయినా ద్రాక్షగుత్తి అందలేదు. కుందేలు దిమ్మను మరికాస్త ఎత్తు పేర్పించి, ధీమాగా ''ఇప్పుడు ఎగురు'' అన్నది.
నక్క ఆ దిమ్మె మీదకు ఎక్కి ఎగిరి, సునాయాసంగా ద్రాక్షగుత్తులను అందుకుంది. కుందేలు విజయగర్వంతో నక్క వంక చూసింది. నక్కకు చాలా సంతోషం కలిగింది.
రెండూ కలిసి ఆత్రంగా ద్రాక్షపళ్ళను తిన్నవి, పండ్లు చాలా తీయగా వున్నై. అది గమనించి కుందేలు ''ఇప్పుడు చెప్పు!... ద్రాక్షపళ్ళు పుల్లగా వున్నాయా?'' అని అడిగింది.
నక్క సిగ్గుపడిపోయి ఏమీ సమాధానం చెప్పకుండా ద్రాక్షపళ్ళు తినడంలో నిమగ్నమైంది.
కుందేలు నక్కవంక చూస్తూ ''వెనుకటికి మీ తాత ఎవరో .. ఇట్లే ద్రాక్షపళ్లకోసం ప్రయత్నించి, అవి అందకపోయేసరికి.. ఆ పండ్లు పుల్లవి అన్నాడట. దాంతో 'అందని ద్రాక్ష పుల్లన..' అని ఒక సామెత పుట్టింది. ప్రయత్నం సఫలం కాని ప్రతివాడు.. మరల ప్రయత్నించడం మాని ఏదో ఒక సాకు వెదికి చూపి.. పక్కకు తప్పుకుంటున్నాడు. దాంతో కొన్ని తరాలుగా ప్రపంచం తప్పుదోవ పడుతోంది. ప్రయత్నం ఎప్పుడూ ఆపరాదు. మన శక్తిమేరకు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి. సృష్టిలో ఎవరూ సంపూర్ణ శక్తిమంతులు లేరు. మన శక్తి సరిపోనప్పుడు యుక్తిని జోడించాలి. అవసరమైతే యుక్తిని అరువు తెచ్చుకోవాలి తప్ప ప్రయత్నం విరమించి వెనుదిరగ కూడదు. అందుకే వేమన చక్కగా చెప్పాడు 'పట్టుపట్టరాదు పట్టి విడువరాదు, పట్టెనేని బిగియ పట్టవలయు, పట్టి విడుచుటకన్న పడిచచ్చుటే మేలు' అని, ఈరోజు నుండి 'అందని ద్రాక్ష .. పుల్లన' అనే సామెత ఉండదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరికైనా ... జంతువులకైనా మనషులకైనా ఏపనీ సుసాధ్యం కాదు అలాగనీ అసాధ్యం కూడా కాదు. కాకపోతే కష్టసాధ్యం'' అన్నది కుందేలు.
నక్క కుందేలు మాటలను ఒప్పుకొని ''ఈరోజు నేను మంచి పాఠం నేర్చుకున్నాను '' అన్నది.
-దాసరి వెంకట రమణ