తెలుగు సాహిత్యంలో చిరంజీవి తిరుమల రామచంద్ర
కిందటి శతాబ్దపు తెలుగు సాహిత్యం నుంచి నాలుగు కాలాలపాటు స్మరించవలసిన తెలుగు రచయితలను పది, పదిహేనుగురిని పేర్కొనవలసి వస్తే ఇందులో తిరుమల రామచంద్ర పేరు తప్పకుండా ఉంటుంది. ఆ మాటకు వస్తే మొదటి ఐదుగురిలోనే ఉండవచ్చు. ఏమంటే ఆయనంత దేశాటనం, పండిత మిత్రతకల సాహిత్యవేత్త అప్పటికీ ఇప్పటికీ ఇంకొకరు కనపడరు. ఆయన దృష్టించినంత సృష్టించినంత వైవిధ్య విజ్ఞాన విలసితమైన అత్యంతాకర్షకమైన సాహిత్య సృష్టి, భారతీయ వారసత్వ, సాంస్కృతిక, పురాచరిత్ర, శిల్ప, వాస్తుశాస్త్ర, సంగీత, శాసన, లిపి, తులనాత్మక భాషాశాస్త్ర, పదవ్యుత్పత్తి విజ్ఞాన, జానపద, ప్రపంచ నాగరికత వికాస అధ్యయనపరులు, ఆ తెలిసిన విషయాలను తెలుగువారికి రోచకంగా చెప్పినవారు ఇంకొకరు లేరు. అదీ ఆయన ప్రత్యేకత, విలక్షణత, విశిష్టత, వినిర్మలత.
తన సమకాలికులలో ఆ మహానుభావుడు చూసినంత దేశం చూసినవారు తెలుగులో ఇంకొకరు లేరు. తిరుమల రామచంద్ర స్వీయచరిత్ర ‘హంపీనుంచి హరప్పా’దాకా చదివితే ఆయన విలక్షణ సాహితీమూర్తిమత్వం ఎటువంటిదో తెలుసుకోవచ్చు. ఇప్పటికి ఐదు ముద్రణలు వెలువడింది. ‘మన లిపి-పుట్టుపూర్వోత్తరాలు’వంటి రచన ఆయన మాత్రమే చేయగలరేమోననిపిస్తుంది. నిజానికి ఆయన రచనలన్నీ ఇటువంటివే.
ఆయన జీవితం ఒక సాహస వీరగాథ. పర్వతారోహకులు, సముద్రగర్భ అన్వేషణ పరులు , భూగర్భ వినిక్షిప్త విశ్వ పురా నాగరకతల గవేషణా శీలురు ఆయనను తలచుకొన్నప్పుడు స్మరణకు వస్తారు. కిందటి శతాబ్దంలో ఆయన భారతీయ పరిశోధకులలో తెలుగునాడు కు సంబంధించి అయన రాహుల్ సాంకృత్యాయన్ లాంటివారు అనవచ్చు
రామచంద్ర ఎనభైనాలుగేళ్ళు జీవించారు. (1913-1997). డెబ్భై సంవత్సరాలు నిరంతర యాత్రికుడిగా, నిత్య గవేషణ విస్మయాపాదక మనస్విగా జీవించారు. మన్నించాలి స్వవిషయం ప్రస్తావిస్తున్నందుకు. స్వాతిశయంకోసం కాదు, జన్మసార్థక్య ప్రస్తావనకోసం. పాతిక సంవత్సరాలు నేను వారిని దగ్గరగా చూశాను.
1972లో వారు హైదరాబాదు స్థిర నివాసంకోసం వచ్చారు. తదాదిగా నెలకొకసారి అయినా ఆ మహానుభావుడు మా ఇంటికి రావటం కాని, నేను వారి బసకువెళ్ళి వారిని దర్శించటం కాని జరిగేది. తిరుమల రామచంద్రగారిని గూర్చి నేను రెండు జీవిత చరిత్రలు రాశాను. ఒక దానిని కేంద్ర సాహిత్య అకాడమి ప్రచురించింది. ‘హంపీనుంచి హరప్పాదాకా’అనా? లేదా ‘కమలాపురం నుంచి క్వెట్టాదాకా’అనా, స్వీయచరిత్ర పేరుపెడితే బాగుంటుంది అని అడిగినప్పుడు హంపీ హరప్పా’ అని చెప్పాను. వారి వివిధ విజ్ఞాన విషయ సంకలనాలకు ‘బృహదారణ్యకం’ ‘అహంభో అభివాదయే’వంటి పేర్లు నేను సూచించాను. వారితో ఢిల్లీ, విశాఖపట్నం, భీమవరం వంటి చోట్లకు ప్రయాణాలు చేశాను. అప్పుడాయన ఆంతరంగికమైన ప్రస్తావనలు నాతో చేయడం నాకు గుర్తుంది. వారి స్వీయచరిత్రకు, మరపురాని మనీషులకు, తెలుగు పత్రికల సాహిత్యసేవకు నేను పరిచయ విశ్లేషణలు చేకూర్చాను.
వారికి నాపట్ల అనురాగం, ఆప్యాయత ఉండటానికి బహుశా నా లైబ్రరీ కారణం కావచ్చు. తెలుగు పత్రికల సాహిత్యసేవ అనే గ్రంథంలో నా ‘నోట్సు’నుంచి ఎన్నో ఆకరాలు వారు ఉదాహరించారు. బహుశా ఆయన జీవితకాలంలో చివరి ఇంటర్వ్యూ నేనే చేశాను. వారి పుస్తకాలలో చేరని అనేక జీవిత విషయాలు నాకు తెలుసు. ఇరాన్ దేశపు సరిహద్దు అయిన ‘శిబి’ పట్టణం, కాన్పూర్, ఢిల్లీ, లాహోర్, లక్నో, కలకత్తా, ఆగ్రాల విషయాలు ఆయన చెపుతుండేవారు. రాహుల్ సాంకృత్యాయన్‌ను ఆయన ఇంటర్వ్యూ చేశారు. తన 13, 14 సం.ల లేత వయసుననే మానవల్లి రామకృష్ణ కవికి వ్రాయసుకాడుగా ఉన్నారు.
- అక్కిరాజు రమాపతిరావు