ఖూనీ రాగం
నోట్ల రద్దుకు వంద కోట్ల నిస్సహాయులు విలవిలలాడుతున్న సందర్భంగా డిసెంబరు 11, 2016 న వ్రాసిన కవిత
తోడి రాగం లా
శ్రావ్యంగా ఉంటుందని
భ్రమసి కోట్ల ఓట్ల తో
ఎర్ర కోట లో పాగా వేయనిస్తే
గార్దభ స్వరం తో
కర్ణకఠోరంగా
మోగుతున్న మోడి రాగం
హరుడు హరించుకుపోయిన
ఖరహరప్రియ లా వెక్కిరిస్తోంది
ఆబ్స్టినేట్ 'భక్త' కోటికి
ఆయనో కలల బేహారి
ఆయన మాటల దీర్ఘం
శుద్ధ సావేరి
ఇంద్రుడో చంద్రుడో
నవ్వితే పొట్టలూ పుట్టలూ పగిలినా
పురాణాల్లో వినాయకుడు
చచ్చిపోయాడుగానీ
ఖజానాల నాయకులు
చావట్లేదు సరికదా
బ్రతికిపోతున్నారు
క్యూ లో నిలబడ్డం దండగట
అత్త మామలు
ఆలు బిడ్డలూ లేని
ఫకీరు వారు సెలవిచ్చారు
వేళకళగా కడుపులో
చల్లకదలకుండా
అన్నీ అమరుతూంటే
శ్రీమదభినవోద్దండ
పరమపరివ్రాజకాచార్య
నరేంద్రునికి
దరిద్ర దామోదరుల
బాధలేం తెలుస్తాయ్, భాయ్ ...
మోడి కాదు, మోది అని
మొదట్లో ఎవరో సరి చెయ్యబోతే
ససేమిరా అన్నా ...
ఎవర్ని "మోది"
అని ఎకసక్కేలాడా
ఇప్పుడు తెలిసింది
ఆ ఎవర్ని అనే ప్రశ్నకి
అప్పట్లో అంతు చిక్కని
సమాధానం
ఒక్క దెబ్బకి నూట పాతీక కోట్ల పిట్టలు ...
ఇంగ్లీషోళ్ళు కూడా యాడేజ్
మార్చుకుంటున్నారు
"బిలియన్ బర్డ్స్ ఎట్ వన్ షాట్" అని
ఆదాయం రూపాయల్లో లేని
ఆవలి తీరపు అంతేవాసులు కొందరు
"కొద్దిగా ... ఇంకొద్దిగా... ఓర్చుకో..."
అంటూ మంత్రసాని లా
సాంత్వన వచనాలు
పలుకుతున్నారు
మననుద్దేసించి...
అందరూ కాదు లే
మంది బాధలు తెలియని
మదాంధులు మాత్రమే ...
ప్రేమ పంచుకు పెరిగిన
అమాయకులూ,
అన్నదమ్ములూ
అక్కజెల్లెళ్ళూ
ముఖప్రీతికి కూడా ఎన్నడూ
పలకరించుకోని, అసలు
ఆ అవసరమే రాని
అపరిచితులూ
నడిరోడ్లో జుట్లూ జుట్లూ
పట్టుకుని కొట్టేసుకుంటున్నారు
నీకంటే ముందు నేనున్నా
క్యూ లో అంటూ...
రేషన్ షాపుల ముందూ,
సినిమా హాళ్ళ ముందూ,
రైల్వే, బస్సు టికెట్ల కౌంటర్ల ముందూ
ఎప్పుడు ఎడతెగక పారు
ఏరులా ఉండే క్యూ లు
టెక్నాలజీ పుణ్యమా
అని కాలం చేసినా
బ్యాంకులముందూ,
డబ్బు డబ్బాల ముందూ
మళ్ళీ ప్రత్యక్షం ...
మామూలోడికి దొరకని పదీ
పరకా, వందా, అయిదొందలూ
ఏలికల పీలికలకి మాత్రం
ట్రక్కుల్లో, టాక్సీల్లో
గోడ మాళిగల్లో
బాత్రూముల్లో
భాండాగారాల్లా
బయట పడుతున్నాయ్
పుట్టల్లోంచి బుసలు
కొడుతున్నాయ్
'నోట్ల' కట్టల పాములు
చావులని కూడా
హేళన చేసేంత
కండకావరం కొందరిలోనైనా
తొలిసారిగా
పేట్రేగడాన్ని ప్రేరేపించిన వాళ్ళకి
రక్షే గానీ...
శిక్ష ఉండదా?
యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే!!
పాపోయం పాప కర్మాహం పాపాత్మా పాపసంభవః!
త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల!!
అన్యధాశరణం నాస్తి త్వమేవ శరణం మమ!
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర!!
- సాయి శేఖర్