Telugu Global
Arts & Literature

మౌనం పరిమళించిన వేళ ( కథ) - దేవ యనగందుల (ఖమ్మం)

మౌనం పరిమళించిన వేళ ( కథ)  - దేవ  యనగందుల (ఖమ్మం)
X

శ్రీ దేవ యనగందుల

1974 లో పిండిప్రోలు లో జన్మించారు MA(Tel)TPTచదివి

ప్రస్తుతం: ఖమ్మం లో నివసిస్తున్నారు

వృత్తి: ప్రభుత్వ తెలుగు ఉపాధ్యాయులు.TPTFరాష్ట్ర మాసపత్రిక "ఉపాధ్యాయ దర్శిని"కి సంపాదక బాధ్యతలు,"భువన విజయం"సాహిత్య సంస్థ తెలంగాణా రాష్ట్రబాధ్యతలు వహిస్తున్నారు.


"వెన్నెలదీపాలు" కథా సంపుటి."లావ"వచనకవిత్వ సంపుటి."మాననిగాయాలు"రుబాయిల సంపుటి."వీడని నీడలు" స్వీయ నిర్మిత షాడోలు.మిని కవిత్వ సంపుటి వెలువరించారు .

తెలంగాణా ప్రభుత్వం చేత , పలు సంస్థలచే సత్కారాలు అందుకున్నారు.


పొద్దున లేచినదగ్గర నుండి మా శ్రీమతి పాపం ఒక్కతే ఇంటి పని వంటపనిలో నిమగ్నమై వుంటుంది. ఆ పనేదో దేశసేవలా భావించి నిబద్ధతతో నిజాయితీతో అన్ని సకాలంలో అయిపోవాలని ఆరాటంతో శ్రమిస్తుంది.డంగుకు కట్టిన ఎద్దులా వంటిల్లును కేంధ్రం చేసుకొని జీవితాన్ని కరగదీసుకుంటున్న ఆమెను చూస్తే తరుచూ నాకు బాధ వేస్తుంది. అప్పుడప్పుడు నాలోని మానవత్వం పురుషాదిపత్య భావజాలాన్ని తొక్కిపెట్టి పైకి లేస్తుంది కూడాను. అందుకు ప్రాయశ్చిత్తంగా తన పనిలో ఎంతో కొంత సహాయం చేసి తన శ్రమను కొంత పంచుకోవాలనిపిస్తుంది. అందులో భాగంగానే ఇవ్వాళ మెల్లగా తన వంటగది సామ్రాజ్యంలోకి ప్రవేశించాను.

"హాయ్ శ్రీమతిగారు ఎలావున్నారు" అన్నాను అప్రయత్నంగా.

ఆమె నావంక అదోలా చూస్తూ"మూడు గరిటెలు నాలుగు గ్లాసులతో నిక్షేపంగా వున్నాను. ఇందులోకి వచ్చి ఇవేం చెడగొట్టకుండావుంటే నా పనినేను ప్రశాంతంగా చేసుకుంటాను సరేనా" అంది యదాలాపంగా.

"అదికాదోయ్ నీకు పనిలో సహాయం చేద్దామని ఇలావచ్చాను. అంతేకాదు ఇవ్వాళ నుండి ప్రతిరోజు నీ పనిలో ఫిప్టి ఫిఫ్టి షేర్ చేసుకుందామని నిశ్చయించుకున్నాను ఏమంటావు" అంటు ప్రశ్నార్థకంగా చూసాను తన‌‌‌మోములోకి.

ఆమె ఆశ్చర్యపో యింది. నావైపు అనుమానంగా చూసి, "ఏం పాపం ఎందుకలా అనిపించింది. ఉన్నఫళంగా ఏం గుర్తొచ్చిందేంటి" అంది.

"అలా ఏంకాదు నిజమే చెపుతున్నానోయ్ నన్ను నమ్ము" అన్నాను ఊరడింపుగా.

తనపని తాను చేసుకుంటూనే "మీ సహాయం ఏం అవసరంలేదు దయచేయండి మీరు ఇన్వాల్వు అవడం వలన నాకు ఇంకో గంట లేటౌతుంది" అంది.

ఎందుకో గాని నేను చేసే పనిసహాయం మీద ఆమెకు బొత్తిగా నమ్మకం లేనట్టుగా అనిపించి. అయినా పట్టువదలక బ్రతిమిలాడుకుని చివరికి ఒప్పించాను.

ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే నేను చేయబోయే పనికి తను ముందు ఏర్పాట్లు చేయడం అన్న మాట. ఉదాహరణకు నేను టీ పెట్టాలనుకో తను టీ పొడి పంచదార వగైరాలను సిద్ధం చేయడమన్నమాట. ఆ విషయాన్ని తనకూ వివరించాను. ఇదేదో ఆగానికొచ్చిందని తెలిసినా చూపులతోనే అంగీకరించింది తను.

"అయితే బట్టలు తడిపి పెట్టాను ఉతికి రండి .ఈలోపు దోశలపిండి రెడీగా వుంచుతాను" అంది. కాపీకొట్టి పాసైన స్టూడెంటులా ఎగిరి గంతేసింది మనసు.

"సరే డార్లింగ్" అంటూ లుంగీని పైకి ఎగగట్టి వాష్ ఏరియా వైపు నడిచాను. అక్కడటబ్బులోచెద్దర్లు ,ఆ పక్కన బకెట్లో బట్టలు నానబెట్టి ఉన్నాయి. నీళ్ళలో తడిసిన చెద్దరును రెండు చేతులతో పైకి లేపాను. అది పది కిలోల బరువు ఉంటుంది. పాపం! ఇంత బరువున్న బట్టలను ఆడవాళ్ళు ఎలా ఉతుకుతారో అనిపించింది. వాళ్లపట్ల ,వాళ్ళ నిరంతర పరిశ్రమ పట్ల జాలి వేసింది.

టవలు తలకు చుట్టి రెండు చేతులతో బలంగా చెద్దరును పైకెత్తి గచ్చుకేసి కొట్టడం మొదలు పెట్టాను. అలా కొట్టిన ప్రతిసారి నా కాళ్ళకింద గచ్చు అదరటం నాకు స్పష్టంగానే అర్థమవుతోoది. ఇక శబ్దం అయితే సరా సరి పదిఇండ్లు దాటి వినిపిస్తుందేమో అనిపించింది.

అందుకే పక్కింటావిడ విసురుగా ప్రహరీ గోడ దగ్గర కొచ్చి, గోడ మీద నుండి చూస్తూ "మాస్టారూ ! మీ బలమంతా బట్టల మీద చూపించకండి. నెమ్మదిగా ఉతకండి మీరు చూపించే ఆవేశానికి మాకు ఇవతల గచ్చు తడిచిపోతుంది. నీళ్లన్నీ మా వరండా నిండు తున్నాయి "అంది వెటకారంగా.

ఇంకా ఏదేదో గొణుగుతూ వెళ్ళింది. ఏ కారణం చేతనో కాని ఆమెకు నా మీద దీర్ఘకాల కోపం ఏదో ఉన్నట్టు మొఖం లో స్పష్టంగానే కనిపిస్తోంది. ఆమె ప్రదర్శించిన నిష్టూరానికి నాకూ చిరాకు వేసింది. కొంత కోపం కూడా వచ్చింది. కాని నారీలోకం మీద నాకున్న గౌరవంతో వాయి

మూసుకున్నాను. అసలే నేను స్త్రీ పక్షపాతిని కూడా.

చెద్దర్లు ఉతకడంవల్ల లుంగీ ,నెత్తి టవల్ తో సహా అన్నీ తడిసి పోయాయి. అంతే కాదు ఇంటి ప్రహరీగోడ, కిటికీలు, పక్కింటి ఆవరణ అంతా భీభత్సంగా తడిసిపోయాయి. ఇదేంటి మా శ్రీమతి బట్టలు ఉతికితే ఇంత బీభత్సం జరగడం ఎన్నడూ గమనించలేదు నేను ఉతికితే ఇంత జరిగింది ఏంటి అనుకున్నాను. ఎక్కడ తేడా వచ్చిందాని బాగా ఆలోచించాను. ఎంతకీ సమాధానం తట్టింది కాదు.

స్నానం చేసి పొడి బట్టలతో వంటగదిలోకి వెళ్ళాను.

మా శ్రీమతి నా వైపు చూసి "వంట చేసిన తర్వాత స్నానం చేయొచ్చు కదా! ముందే ఎందుకు చేశారు" అంది సంశయంగా.

అందుకు "నేను అవసరమైతే మళ్లీ చేస్తాను దానికేం ఇబ్బంది లేదులేవోయ్" అన్నాను కొంటెగా. "నీవు వెళ్ళి బట్టలు ఆరవేసుకో నేను ఈలోపు దోశలు వేస్తాను "అన్నాను. సరే అంటూ తను చకచకా వెళ్ళిపోయింది.

నేను స్టవ్ వెలిగించాను .పెనం వేడెక్కింది. అది వేడెక్కినట్లు నేను అర్థంచేసుకోవడం లేటు అయినట్టుంది. పెనం మాడుతున్న వాసన నా ఊపిరిని ఉక్కిరి బిక్కిరి చేసింది. గుంట గంటెడు కలిపిన పిండిని పెనంపై పోసి గుండ్రంగా నెరిపాను . వాస్తవానికి నాకు పెద్దగా వంట తెలియదు. అందరి మగాళ్ళ లాగే తినేటప్పుడు వంకలు పెడుతూ తిడుతూ తినటం మా తాత మా నాన్నకు నేర్పినట్టే, మా నాన్న నాకు నేర్పాడు. నేనేం అందుకు విరుద్ధం కాదు. నేను వంకలు పెట్టడం ఎలా ఉండేదంటే మా పిల్లలకు 'మా డాడీ బాగా వంటలు చేస్తాడేమో 'అని నమ్మేంత భ్రమలు గొలిపేంతగా ఉండేది.

స్టౌ హైలో ఉండడం వల్లనేమో నిమిషంలో దోశ మాడి అదోరకమైన మాడు వాసన ముక్కుపుటాలను అదరగొడుతోంది. దోశ మీద నుండి వస్తున్న ఆవిరి పొగలు మొఖాన్ని ముక్కును గొంతును ఉక్కిరి బిక్కిరి చేశాయి. గాలి ఆడక వరుసగా మూడు తుమ్ములు తుమ్మాను. దగ్గుతో ఊపిరాడక అల్లాడి పోయాను.

దోశ మాడు వాసన పసిగట్టిందో ,నాదగ్గులు తుమ్ములు వినిపించాయో, లేదా తను నా పైన మనసు ఉంచడం వలననో కానీ- తన పని ఆపివేసి పరుగెత్తుకొచ్చి స్టౌని తగ్గించి దోశ తిప్పివేసి వెళ్ళిపోయింది.

ఆమె వెళ్తున్నప్పుడు నా అవస్థను వోరకంట గమనించడం నేను చూస్తూనే ఉన్నాను. పోతూ పోతూ లోపల గాలిని బయటకు పంపే ఎగ్జాస్ట్ ఫ్యానువేసి వెళ్ళింది. ఒక్క నిమిషంలో గది మళ్లీ మామూలు స్థితికి వచ్చింది. వంట చేయడంలో ఎంత కళాత్మకనైపుణ్యం ఉందో, ఇంటి పనిలో ఎంతటి శిల్ప చాతుర్యం ఉందో వంట గదిలో ఎంత తెలివిగా వ్యవహరించాలో ఐదు నిమిషాలలో అనుభవానికివచ్చింది.

మళ్ళీ పెనం వేడెక్కింది. పిండి పోసి గుండ్రంగా నెరిపాను .అది అంతగుండ్రంగా రాలేదు. భూగోళం ధ్రువాల వద్ద కొంత సొట్టబడివున్నా ఓవరాల్గా గుండ్రంగానే కనిపించినట్టు ,నా దోశా -వంకర టింకరగా వున్నా ఎంతోకొంత గుండ్రంగానే వుందిలే అని మనసుకు సర్థిచెప్పుకున్నాను.

మా శ్రీమతి వేసిన దోశ మిషన్ తో అచ్చొత్తినట్టు గుండ్రంగా వుండేది. మా ఇద్దరి దోశలు బజారులో జడ్జిమెంట్కు పెడితే, నా దోశను నా మొఖమ్మీదేసి కొడతారనిపించింది. ఆడవాళ్ళు కనిపించరు కాని వారిలో ఎన్ని తెలివి తేటలు ఎన్నిసూక్ష్మ పరిశీలనా కౌశలాలు, ఎంత వృత్తి పరమైన నైపుణ్యం వుంటుందో ఇప్పుడు ప్రతిక్షణం స్పురణకు వస్తుంది. వాళ్ళను అనుక్షణం తక్కువచేసి చూపటం వలన మన పెద్దరికం నిలబడుతుందను కోవడం ఎంత తెలివి తక్కువపనో అర్థమౌతొంది.

దోశచిటపటలాడుతూ కాలుతోoది.నేను కాల్చటం దానికి ఇష్టం లేనట్టుంది. నేను మనసా వాచా కర్మణా దోశలే వేస్తున్నాను.

కాని అది మాత్రం దోశనో , అట్టునో , రొట్టెనో తెలవక పెనం మీద కుతకుతలాడిపోతోo ది. అది పూర్తిగా తయారయ్యాక దానికి ఏంపేరు పెట్టాలో ఆలోచిస్తే నా అమాయకత్వంమీద నాకే జాలి వేసింది. 'గ్యాసు, పిండి, సమయం వేస్టుచేస్తూ లెస్స చెమటలు కక్కుతు నానా హైరాన పడుతున్నావెంటిరా' అంటు వెక్కిరిస్తూ నా వైపే చూస్తున్నట్టుంది వంటగది వాలకం చూస్తే.

మొత్తంమీద దోశలు వేశాను. ఒక అంకం ఏదోలా ముగిసింది. అయ్యబాబోయ్ ఎప్పుడూ హెచ్చుకై పిచ్చి పిచ్చిగా వాగి ఇరుక్కోవద్దని పించింది మొదటిసారి. ఇక తినటమనే ప్రధాన అంకమే మిగిలివుంది. ఎలా గట్టెక్కుతుందో చూడాలి.

"దోశలు రెడీ !తినటానికి రావచ్చని "ఇల్లంతా వినపడేలా కేక వేసాను. బాహుబలి కుంతలదేశాన్ని గెల్చినంత ఆనందంతో కేకైతే వేశాను కానీ మా శ్రీమతి ఏమిఅంటుందో , పిల్లలు ఏమి గోలచేస్తారోనని ఓ ప్రక్క భయంగానేవుంది.

మా శ్రీమతి "నా పని ఇంకా కాలేదు మీరూ పిల్లలూ తినండి "అని ప్రతికేక వేసింది. 'హమ్మయ్యా! 'అని గాలి పీల్చుకొని, పిల్లల నైతే ఏదోలా మేనేజ్ చేయొచ్చులే అనుకొని, పిల్లలను పిల్చాను. పిలుపువిని పిల్లలు" వావ్ !డాడి వంట" అని ఒకరి మొఖం ఒకరు చూసుకొని కుతూహలంగా వచ్చి కూర్చున్నారు.

ఆనందం పట్టలేక "ఏం టిఫిన్ చేశారు డాడీ "అని అడిగింది పాప. మా ఇంట్లో ఇదొక లాయరు. దీనినుండి తప్పించుకోవడం మన వల్లకాదు .ఇట్టేపట్టేస్తుంది. ఏదోలా మేనేజ్ చేద్దామని "అట్లు, రొట్టెలు, దోశలు వేశాను .ఎవరికేది ఇష్టమైతే వాళ్ళవి తినవచ్చు మీ ఇష్టం" అన్నాను.

వెంటనే పాప 'అఁ...'అంటూ కండ్లు పెద్దవి చేసి, పెదవి విరిచి, కనుబొమ్మలు చిట్లించి నావైపు ఆశ్చర్యంగా ,కొంత అనుమానంగా 'ఈ మహానుభావుడు ఏదో తప్పుచేశాడు 'అన్నట్టు చూసింది. దాని అనుమానపు చూపులకు సగం చచ్చాను.

అవేవి మొఖంలో కనిపించకుండా "అంతగా ఆశ్చర్యపడాల్సిందేమీ లేదమ్మా !కావాలంటే చూసుకోవచ్చు మూడురకాలు చేశాను" అన్నాను.

నేను మొత్తం చెడగొట్టి వుంటానని నా మొఖంచూసి గమనించాడేమో మా బాబు తలొంచుకొని కదిలి కదిలి నవ్వుతున్నాడు. వాడివైపు చూసినప్పుడు నాకూ నవ్వాగలేదు.

అయినా సంబాళించుకొని "ఎవరికి కావల్సినవి వాళ్ళుతినండి" అన్నాను.

పాప డిష్ ఒపెన్ చేసిచూస్తూ "అమ్మ దోశపిండి ఒకటే కదా రెడీ చేసింది మీరు అట్లు రొట్టెలు ఎలా వేశారు? మీ అదనపు టాలెంటును ఏమైనా వాడారా?! "అంటూ కొన్ని ప్లేట్లో వేసుకొని ,బాబు ప్లేట్లోకూడ కొన్నివేసింది. ఇద్దరూ ప్లేట్లో వేసిన దోశలవైపే తదేకంగా చూస్తూ ఒకరి మొఖాలు ఒకరు మార్చి మార్చి చూసుకుంటున్నారు. వారి మొహంలో మారుతున్న రంగులను నేను గమనిస్తూనే వున్నాను. దోశలు గుండ్రంగా లేక కొన్ని, అడ్డంగా చిరిగినవి కొన్ని, నల్లగా మాడినవి కొన్ని, తెల్లగా కాలినవి కొన్ని, పల్చగా కొన్ని, మందంగా కొన్ని వాటిని చూస్తూ ఆవేశానికీ అభిమానానికీ ఆశ్చర్యానికీ మధ్య నలిగి పోతున్న వారి మొఖాలు చూస్తే నాకు నవ్వుఆగితే ఒట్టు.

నేను చేసినవి ఏంటో తేల్చడానికి పురాతత్వశాస్త్ర వేత్తలకే రెండు మూడేళ్ళు పట్టేలా వుంది. పాపం !వీళ్ళేం తేల్చగలరు. నోటికి చేయి అడ్డం పెట్టుకున్నాను. ఇంతలో పాప ఒకవైపుకాలక, ఇంకోవైపు మాడి, మధ్యలో చిరిగిన ఒక దోశను రెండు చేతులతో పైకెత్తి రంధ్రం గుండా చూస్తూ "దీనినేమంటారు ? చిల్లి గారెలాగ చిల్లి దోశానా? "అంది అప్పటికే నవ్వు ఉగ్గబట్టకున్న ముగ్గురం గొల్లున నవ్వాము. ఆ తర్వాత అవి తినటం ఇష్టoలేకపోయినా నా మీద అభిమానంతోనో, జాలితోనో ఈ రెండింటితో వచ్చిన గౌరవంతోనో మొత్తానికి తిన్నారు పిల్లలు.

మా శ్రీమతి బట్టలు ఆరవేసి లోపలకు వస్తున్న ఉనికిని గమనించి "ఒరే మమ్మీదగ్గర నన్ను పలుచన చేయకండిరా ప్లీజ్ "అంటూ పిల్లలను వేడుకున్నాను. వాళ్ళునవ్వుతూనే అంగీకరించారు. ముగ్గురం నవ్వు ఆపుకొని ఎర్రగా కందగడ్డలా మాడిన మొఖాలు కిందకు దించుకొని చేతులు కడుక్కుందామని వాష్ బేసిన్ దగ్గరకు వెళ్లాము. వంటిట్లో గిన్నెల చప్పుడునుబట్టి మా శ్రీమతి దోశలు తినడానికి ఉపక్రమిస్తుందని అర్థమైంది.

నేను వాష్ బేసిన్ లో చేయి కడుక్కుంటున్నాను. పిల్లలిద్దరు ఉత్తరపువైపు సందులో నిల్చొని కడుపు పట్టుకొని నోటికి చేయి అడ్డుపెట్టుకొని ఒకటే నవ్వుతున్నారు.

'ఏంటి వీళ్ళనవ్వు ఇంకా అయిపోలేదా 'అని బట్టల దండెం దగ్గరగా నిల్చుని నవ్వుతున్న వాళ్ళ వైపు చూసాను. నన్ను చూచి ఆ చెద్దర్లవైపు చూచి ఇంకా పగలబడి నవ్వుతున్నారు. దగ్గరగా వెళ్ళి చెద్దర్లవైపు చూసాను.

మూడు చద్దర్లు మధ్యలో పేలికలు పేలికలుగా చిరిగి వేళ్లాడబడ్డాయి. వాటిని చూడగానే ఒళ్ళు చెమటలు పట్టింది.అయ్యో పాపమనిపించింది. వాటి వాలకం చూస్తే జాలివేసింది. కొద్దిగానెమ్మదిగా ఉతకాల్సివుండె. పొరపాటు జరిగింది.

వెంటనే మా శ్రీమతి గుర్తుకొచ్చింది ఎంతగా గొడవ పడుతుందోనని భయం వేసింది. 'ఇవ్వాళ డాడివలన రెండువేలరూపాయలులాసు' అంటూ పిల్లలు నవ్వుతున్నారు.

ఈ మాత్రం దానికి "రోజూమమ్మీనీ ఎంతగా సాధిస్తాడో "అంటూ పాప నా వైపు ఎగతాళిగా చూసి నవ్వడం ,నాకు మనసులో ఎక్కడో చివుక్కున అనిపించింది. నిజంగానే నాకు తెలియకుండా ఆమెను ఎన్ని సార్లు కసురుకున్నానో ఎన్ని సార్లు ఈసడించుకున్నానో తల్చుకుంటే బాధవేసింది.

నేనెంత కాదనుకున్నా నాలోదాగున్న పురుషాధిక్య సమాజపు ఆనవాళ్ళు నన్నెంతగా లోబర్చుకున్నాయో ఆలోచిస్తే నామీద నాకే అసహ్యం వేసింది. "ఒరేయ్ ఇక చాలు నవ్వులు ఆపండి" అని తలదించుకొని నా బెడ్రూమ్ లోకి వెళ్ళాను.

సమయం పన్నెండు గంటలు అవుతోంది. ఏ ఒక్కపనీ సక్రమంగా చేయని నేను ఎందుకలా ఆమెను దూషిస్తుంటానో ఎంతగా ఆలోచించినా ఆధిపత్యపు భావజాల అమాయకత్వమే కనిపిస్తుందితప్ప వేరే కాదు. అది ఎంతంటే ----చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేంత. ఇది సరైంది కాదు నాకుగా నేను పురుషుడి నుండి మనిషిగా రూపాంతరం చెందాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఇప్పటి వరకు స్త్రీల మీద నాకుంది జాలి మాత్రమేనని తెలుస్తోంది. అదికూడా వాళ్ళు సబలలన్న చిన్న చూపులోనుండి పుట్టిందే. మనసులో ఏదో అపరాధ భావన వెంటాడుతుంటే బెడ్ పైన వెన్నువాల్చాను.

మనసు పరిపరి విధాల ఆలోచిస్తుంది. సంప్రదాయ భావజాలానికి ఆధు నిక భావజాలానికీ మధ్య నా మనసు విసుర్రాయిలో కందిగింజలా నలుగుతోo ది.

అర్థగంట తర్వాత ఆమె నా రూముకు వచ్చింది. తాను వస్తున్న అందెల చప్పుడు విని నేను నిద్రపోతున్నట్టు కండ్లుమూసు కున్నాను. నేను చేసిన ఘనకార్యానికి ఎంతగా తిట్టిపోస్తుందోనని భయంతోను, ఏ ఒక్కపనీ సరిగా చేయలేకపోయానన్న సిగ్గుతోను, నా నుదిటిపై చెమటలు పట్టినట్టు నాకు అర్థమౌతూనేవుంది. తాను వచ్చి నిద్రపోతున్న నా నుదిటిపై తన పైటకొంగుతో చెమట తుడ్చి, ఫ్యానువేసి తన ముని వేళ్ళతో చెదిరిన ముంగురులను సవరించి, నుదిటిపై లీలగా ముద్దుపెట్టుకొని లేచిమౌనంగా వెళ్ళిపోయింది.

దోశలు మాడబెట్టినా ,బట్టలన్నీ చినిగేలా ఉతికినా, అవన్నీ ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని తనమీద ప్రేమతోనూ ,అభిమానం తోను పనిలో సహాయంచేయాలన్న సదుద్దేశంతోను మాత్రమే చేసాననniనమ్మింది ఆమె. వికటించిన పని వెనకాల ఆమెపై నాకున్న అపారమైన ప్రేమను గుర్తించి, అర్థం చేసుకున్న ఆమె ఆకాశమంత పెద్దమనసు కింద చీటికీ మాటికి కసురుకునే నేనెంత మరుగుజ్జునో తలచుకుంటే మనసు వేదనతో మూలిగింది. మూసివున్న కనులవెంట పశ్చాత్తాపంతో హృదయం కరిగి బొట్లు బొట్లుగా బయట కొస్తోంది.

First Published:  19 Oct 2022 1:15 PM IST
Next Story