సంజె చీకటి (కథానిక)
మునిమాపు వేళ రోడ్డంతా బైక్ లు, కార్లతో రద్దీగా ఉంది. ఆఫీసుల నుంచి ఉద్యోగులు ఇంటిముఖం పట్టే సమయం. బస్సుల్లో వెళ్లే ఏ కొందరో చేతిలో బ్యాగుతో, కూరలు, పళ్లు, టిఫిన్లు మోస్తూ నీరసంగా నడుస్తుంటే, కంగారుగా, వడిగా నడుస్తున్న ఉద్యోగినులు మరికొందరు. ఈ బాల్కనీలో కూర్చుని చూస్తుంటే ప్రపంచం నా ముందు పరుచుకున్నట్లుగా ఉంటుంది.
' హాయ్ జీతూ! ఎక్కడినుంచి ? నిన్న రాలేదేంరా.. యు మిస్డ్ ఎ లాట్... షటప్.. ఐ విల్ కిల్ యు.. ' నా మనవడు వినీత్ కి, స్నేహితుడిపై ప్రేమ మొబైల్ లో పొంగి పొర్లుతోంది.
' ఐ యాం కమింగ్.. బీ దేర్ ఓన్లీ' అంటూనే వెళ్లి హడావిడిగా బైక్ ఎక్కాడు.
అంతలో నా మనవరాలు హరిత.. ' హాయ్ పల్లవీ ! ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్..నీ కసలు నేను గుర్తున్నానా? ఒక్కటియ్యాలసలు..ఆత్మీయంగా సాధింపులు, కోపగించడాలు..మాటల ప్రవాహం అలా సాగుతూనే ఉంది.
నా ధ్యాస మళ్లీ రోడ్డు మీదకు మళ్ళింది. ఎవరో ఇద్దరు నడి వయస్కులు నడుస్తూ మాట్లాడుకుంటున్నారు. నా మనసు ఫ్రేమ్ లో వెంటనే నేను, పార్థ సారథి నిలిచాం.
పార్థూ నా మిత్రుడు. ఇద్దరం విద్యాశాఖలో పని చేసే వాళ్లం. సాయంత్రం కాగానే ఇలాగే కబుర్లు చెప్పుకుంటూ ఇంటిముఖం పట్టే వాళ్లం. కలిసి హోటల్ కు వెళ్ళడం, కష్టసుఖాలు పరస్పరం చెప్పుకోవడం, షాపింగ్ కు వెళ్ళడం, ఒకేలాంటి వస్తువులు కొనడం అంతా గుర్తొచ్చింది. పార్థూతో మనసు విప్పి మాట్లాడుకుంటే మనసులో కొండంత బరువు తగ్గి గొప్ప ఊరట పొందినట్లు ఉండేది.
నా భార్యకు మతి స్థిమితం లేదు. అరవడం, కొట్టడం వంటి విపరీత చేష్టలేవీ చేయదు కానీ ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఉంటుంది. ఏ పని చేయడానికీ ఆసక్తి చూపదు. అసలు తన మీద తనకే ఆసక్తి ఉండదు. చూపులు శూన్యంలోనే. మాకు ఇద్దరు పిల్లలు. వాళ్ల పెంపకం అంతా నా బాధ్యతే. సహచరి నుంచి ఎలాంటి సంతోషం, ఉత్తేజం పొందలేని దురదృష్టవంతుడిని. నా నిస్సార జీవితంలో ఓ ఆహ్లాద వీచిక పార్థూ స్నేహం.
కాలచక్రంలో సంవత్సరాలు దొర్లాయి. బదిలీ పేరిట ఇద్దరం దూరమయ్యాం. అయినా మా స్నేహం చిరంజీవిగానే ఉంది. మా అబ్బాయికి పెళ్లి చేశాను. అమ్మాయికి పెళ్లి కావాలి. మన దేశంలో అబ్బాయికి ఏ పరిస్థితులలోనూ పెళ్లి సమస్య కాదు.కానీ అమ్మాయి అనేసరికి అన్నీ అడ్డంకులే. దానికి తోడు దేవుడు కూడా కొంత వెటకారం చేశాడు. కాకపోతే అబ్బాయిని తెల్ల దొరబాబులా పుట్టించి, అమ్మాయికి మాత్రం కోకిల రంగు ఇవ్వడమేమిటి? ఏ సంబంధం చూసినా వెనక్కు వెళ్లిపోతోంది. ' మరీ అంత నలుపు.. తల్లేమో మతి లేనిది.. ఎందుకొచ్చిన తంటా.. ఆది నిష్టూరమే మంచిదంటూ ఏవేవో మాటలు..నాకు మొదట్లో ఇవన్నీ విని చాలా కోపం వచ్చేది. నలుపయితేనేం, మా అమలకున్నంత మంచి మనసు ఎవరికుంటుంది? ఆప్యాయతకు మరో పేరు. ఇక తల్లికి మతి స్థిమితం లేకపోతే, దానికి..అమ్మాయికి ముడిపెట్టడమేమిటి? ఇక అమల పెళ్లి ఎలా? హైదరాబాద్ వెళ్లినప్పుడల్లా పార్థూని కలిసి మనసు పుస్తకాన్ని తెరిచే వాడిని.
పార్థూ ' బాధ పడకు ప్రకాశం, అమల పెళ్లి త్వరలోనే చేస్తావు. ఆ సమయం తప్పకుండా వస్తుంది ' అంటూ ఓదార్చేవాడు. ఆ మాటలే నాకు టానిక్ లా పనిచేసేవి. పార్థూ పలుకులు నిజమయ్యాయి. మా అమల నిజంగా అదృష్టవంతురాలు.. మానవత్వమున్న మాధవ్ భర్తగా లభించాడు.
ఆ తర్వాత అమలకు చాలా కాలం పిల్లలు కలగక పోవడంతో అదో బెంగగా ఉండేది. ఎట్టకేలకు అమలకు బాబు పుట్టడంతో ఆ దిగులు తీరింది.
పార్థూ ఆలోచనల్లో మునిగిన నాకు చీకటి చిక్కబడిన సంగతి తెలియనే లేదు. ' ఏంటి నాన్నా చీకట్లో కూర్చున్నావ్? ' మా అబ్బాయి ఆనంద్ అడిగాడు.
' ఏదో ఆలోచిస్తూ కూర్చుంటే సమయం తెలియలేదు ' అంటూ అక్కణ్నుంచి లేచాను.