Telugu Global
Arts & Literature

ఇది ఇంతే! (కథ)

ఇది ఇంతే! (కథ)
X

మధ్యాహ్నం రెండయింది. కాకి కూడా భయపడుతున్నంత ఎండ. రాజన్న మాత్రం మూర్తిని గమనిస్తూ అలా రెండు గంటలుగా కూర్చునే వున్నాడు. మూర్తిగారు ఏ మాత్రం కదలకుండా అలా పడక్కుర్చీలో దీర్ఘాలోచనలో ఉన్నట్టు తీరిగ్గా కునుకు తీస్తున్నారు.

ఆకలి దంచేస్తోంది. ఇంటికెళ్లాలి. ఈయనేమో ఏ సంగతీ చెప్పకుండా అలా కూర్చోబెట్టేసాడు. రాజన్నకి వొళ్లు మండుతోంది.

ఇక లాభం లేదని తానే ధైర్యం చేసి మెల్లగా తట్టాడు. మూర్తిగారు మెల్లగా ఓ కన్ను తెరచి చూస్తే రాజన్న కనిపించాడు. వీడింకా వున్నాడేమిటన్నట్టు చూశారాయన.

“అయ్యా, మీరు మరీ అంత లోతుగా ఆలోచించాల్సినదేం కాదనుకుంటా. సాయంత్రం తమ దర్శనం చేసుకుంటా. అప్పుడు ఓ ముక్కలో చెప్పేయండి చాలు" అని లేచి దణ్ణం పెట్టి తలపాగా దులిపి తలకి చుట్టుకున్నాడు.

"నీకు మరీ తొందర్రా, కూర్చో అన్నం తినడమేగా.. ఏం రాచకార్యం వెలగబెట్టాలి?" అన్నారు మూర్తి రిస్టువాచీ వంక చూసుకుంటూ, ఇవన్నీ చూస్తూ రాజన్నకి మరీ కోపం వచ్చింది.

"స్వామీ తమరు మీ ఇంట్లోనే ఉన్నారు. మీ దీర్ఘాలోచనల్లో ఎన్నేళ్లు వెనక్కి వెళ్లారో తెలీదుగాని, గడియారంలో రెండు కొట్టి అప్పుడే పదిహేను నిమిషాలైంది.


ఆ సాంబయ్య కనీసం ఈ వీధిలోకి వచ్చిన దాఖలానూ లేదు. మీరు భోంచేసి ఆలోచిస్తే సాయంత్రానికి చెబుదురుగాని" అని బయల్దేరేందుకు లేచాడు.

"ఇదుగో రాజన్నా, నీకు మరీ తొందరయ్యా. అన్నీ క్షణాల్లో అవ్వాలంటే ఎలా? ఆ గాడిద రాకుంటే నేను చేసేదేముంది? నా మీద కోపగించుకుంటే ఎట్లా? సరే, చీకటిపడేలోగా రా, చూద్దాం.".

రాజన్న విసుగ్గా వీధిగేటు తోసుకుంటూ వెళ్లడం గమనించారు మూర్తి. నిజంగానే కోపం వచ్చింది.

"వీడికే ఇంత వుంటే, ఆ సాంబయ్యకి ఇంకెంత కోపం ఉండాలి?” అనుకుంటూ పడక్కుర్చీ పక్కకు పెట్టి వంటింటి వైపు వెళ్లారు.

వీళ్ళిద్దరూ కలవడానికి ఇలా లోలోపల తిట్టుకోవడానికి కారణం లేక పోలేదు. నెలరోజుల క్రితం ఎమ్మెల్యే వచ్చినపుడు గాంధీ పార్కు మీదుగా బస్టాండ్ కి వెళ్లే పెద్ద రోడ్డు ఎంత అధ్వాన్నంగా ఉన్నదీ కాంట్రాక్టర్ సాంబయ్యకి తెలీకుండా రాజన్నే కల్పించుకుని ఎమ్మెల్యేతో వచ్చిన పెద్దమనిషి చెవిన వేశాడు. సదరు పెద్దమనిషి మూర్తిగారికి స్నేహితుడే. రాజన్నకీ తెలుసు.

కానీ రెండేళ్లుగా రోడ్డు మరమ్మత్తు సంగతి గాలికి వొదిలేయడంతోపాటు నిర్మాణం ఫండ్ నీ ,తారు డబ్బాల్నీ తనపరం చేసుకుని కాంట్రాక్టర్ సాంబయ్యకి వంత పలకడంలో మూర్తిగారి కృషి వుందని రాజన్న మండి పడుతున్నాడు.

చెరువు దగ్గర సమావేశాల్లో ఎప్పుడూ ఆ రోడ్డు సంగతితప్పిం చడమే పనిగా పెట్టుకున్నారు.

రాజన్నకు మద్దతుగా మున్సిపల్ స్కూలు హెడ్మాస్టర్ గొంతు కలిపినా అంతగా ప్రయోజనమూ ఉండకపోవడం రాజన్ననూ ఆశ్చర్య పరుస్తోంది.

పది రోజుల క్రితం మూర్తిగారి ఆధ్వర్యంలో చెరువుగట్టున జరిగిన సమావేశానికి సాంబయ్య రానేలేదు. పనుల వొత్తిడితో రాలేకపోయానని కబురంపించాడు.

"ఏవన్నా చెప్పండి... ఇదిలా పెండింగ్ పడ్డవే తప్ప ఒక్క రవ్వ కూడా పని గాదు సవాల్ జేస్తా "కాస్తంత కోపంగానే అన్నాడురాజన్న.

నిజానికి ఆ సమావేశానికి వచ్చినవాళ్లలో కటువుగా మాట్లాడినా వాస్తవమే చెబుతాడన్నది చాలామంది అభిప్రాయం.

"ఇప్పుడు రాజన్న అన్నదాంట్లో తప్పులేదండీ. మొన్నటికి మొన్న వర్షాలొచ్చి రోడ్డు సగం కొట్టుకుపోయింది. ఎందయ్యా సాంబయ్య అంటే 'వర్షాలొస్తే చెట్టే కూలుతోంది, ఎదవ రోడ్డెంత?' అని నోటికి చుట్టబిగిస్తాడేగాని అడిగినదానికి ఎప్పుడన్నా సవ్యంగా సమాధానం చెప్పాడా ఆ పెద్ద మనిషి??" బుజంమీది టర్కీతువ్వాలు గట్టిగా దులిపి అడిగాడు నర్సింహం.

"ఇదుగో పంతులూ, నీకు మరీ ఆవేశం, కోపం. ఇది తగదయ్యా, సాంబయ్య మాత్రం ఏం జేస్తాడు సెప్పు? ఆ రోడ్డు ఏమన్నా

చిన్న చితకానా?! టెండరు పెట్టి దాని కంటే తక్కువే అమరుతున్నప్పుడు మనం కూడా పనిపూర్తిగావడానికి సమయం ఇవ్వాలిగా?" ఈ

సారి సాంబయ్య శిష్యుడిగా పేరున్న నారాయణ అందుకున్నాడు.

"ఇదుగో, నారాయణా, నువ్వు ఆ చుట్టలందించే మాటలు మాటాడమాక. మీ ఇంటికి పెంకులేర్పాటు చేయడం దప్ప కాంట్రాక్టరుగారు ఈ రోడ్డుకెప్పుడు ఏం జేశాడయ్యా?" రాజన్నకి విసుగెత్తింది.

నారాయణ సిగ్గుతో తలొంచుకోవడం మూర్తిగారు, హెడ్మాస్టరు

గమనించారు.

"మనం తన్నుకు చావడం దేనికి? ఈ ఎండాకాలంలోనైనా పని అయ్యేట్టు జూడాలంతే" కరాకండీగా చెప్పారు మూర్తిగారు.

ఆయన పెద్దరికాన్ని అంగీకరిస్తూ అంతా తలూపి సమావేశాన్ని మళ్లీ అలా ముగించేశారంతా

చెరువునీళ్లు దోసిడు తాగి మెట్లు దిగుతుండగా రాజన్నకు అనంతు ఎదురయ్యాడు.

" ఏం రాజన్నా, బాగున్నావా?" ఆప్యాయంగా పలకరించాడు.

"ఆ.. ఏం బాగులే బాబూ, తవరు పట్నం నుంచి ఎప్పుడొచ్చారు???.

"రెండు రోజులైంది. అవునూ.. అందర్నీ కలుద్దామనివస్తే, వెళుతూ కనిపించారేమిటి?

"ఇదేమన్నా అసెంబ్లీనా? ఏదో మూర్తిగారి బలవంతాన కూచోడమే.. ఆ సాంబయ్యా రాలేదు. ఇంకా వుంటే కొట్టుకుంటారనినేనే లేవదీశాలే.."

"అయితే రాజన్నా, ఇంకా పెద్ద రోడ్డు పని కాలేదా?"

"నువ్వో అమాయకుడివి. ఎట్టవుద్దయ్యా? సాంబయ్యకేమో డబ్బుపిచ్చి, నాలోటోడికేమో రోడ్డుగావాల. మూర్తిగారికి మంచి

అనిపించుకోవాల, మాస్టారికేమో స్కూలు కాంపౌండ్ గోడ తప్ప మిగతావేవీ అరజంటుగాదాయ.. రోడ్డెట్టవుద్ది?"

గుక్క తిప్పుకోకుండా సమావేశం సారాంశాన్ని రాజన్న చెప్పడం అనంతుకి నచ్చింది.

గవర్నమెంటు పని అనగానే మింగేద్దామనే అనుకుంటారు. ఇక అందరి అవసరాన్నీ ఏ మాత్రం ఎవరు చూస్తున్నారని రాజన్నకి వేదాంతం చెప్పాడు.

"అవునూ !ఆ ఎమ్మెల్యేని మీరే కలిసి ఈ పుణ్యమేదో మీరే కట్టుకోవచ్చుగడండీ" రాజన్న ఆలోచన బయటపెట్టాడు.

“నిజమేగానీ, చెప్పడం వరకే చేయగల్గుతా. ఫండ్ రావడం, పనికావడ మన్నది మళ్లీ సాంబయ్యతోనే చివరి ముడి వుండేది.అంచేత ఆయనను సానుకూలం చేసుకోవడమే మంచిదయ్యా..” ఆవేశపడి లాభంలేదని రాజన్నకు హితోపదేశం చేశాడు.

“వొచ్చే నెల్లో ఎమ్మెల్యేగారు వస్తారంట. నువ్వు ఆ సమయానికి ఒక్కతూరి వచ్చిపోరాదా. నువ్వయితే చెప్పగల్గుతావు. మూర్తిగారు నసగడమే తప్ప గట్టిగా చెప్పలేరు. పెద్దాయనగదా.. ఏమంటావు?" సరిగ్గా పెద్దరోడ్డులోకి రాగానే రాజన్న అడిగాడు.

రోడ్డువంక కనిపించినంత మేర అనంతు చూశాడు. కంకర తేలుతోంది. పిల్లలు పక్క సందుల్లోంచి ఆడుతూ వచ్చి పోతున్నారు.

వేగంగా ఆటోలు, మోటార్ బైక్లూ.. ఎవడైనా ఏ చిన్న రాయికో తట్టుకు పడితే అంతే! అనంతుకి తలచుకుంటే భయమేసింది. ఇలాగైతే లాభంలేదనుకున్నాడు.

"సరే. నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఓ వారం సెలవు పెట్టి వస్తాను కానీ నే వస్తున్నట్టు ఎవ్వరితో అనకు" అని అనంతు తనస్నేహితుడి ఇంటికి దారితీశాడు. అనంత్ హామీతో రాజన్నకు కొండంత ధైర్యం వచ్చింది. ఎలాగైనా అనంతును ఒప్పించానన్న ఆనందంతో ఇల్లు చేరాడు.

నాలుగురోజుల తర్వాత రాజన్న తన మరిది పనిమీద ప్లీడరు గుమాస్తాను కలిసేందుకు కోర్టుకు వెళ్లాడు. పని ముగించుకుని రాబోతుంటే వేపచెట్టు కింద సాంబయ్య కనిపించాడు.

అప్పటికే అతను ఎవరికో లెక్చరిస్తున్నాడు. వాళ్లిద్దర్నీ దాటి వెళ్లబోయాడు. కానీ సాంబయ్య కంట్లో పడ్డాడు.

"ఇదుగో రాజన్నా, ఇలారా పనుంది" అటూ సాంబయ్య పిలిచాడు.

ఇక తప్పదన్నట్టుగా వెళ్లాడు. సాంబయ్య పక్కనున్న వ్యక్తిని పరిశీలనగా చూశాడు.

“మనోడేలే.. కోటేశర్రావని.. ఇప్పుడు హైద్రాబాద్లో వుంటుంటున్నాడులే.." అని సాంబయ్య తన స్నేహితుడిని పరిచయం చేశాడు. మహానగరంలోనూ తన వారున్నారన్న దర్పం ప్రదర్శిస్తూ మీసాలు దువ్వుకుంటూ రాజన్నవైపు చూశాడు.

సదరు కోటేశ్వర్రావు పలకరింపుగా నవ్వాడు. రాజన్నకు వొళ్లుమండింది.

"ఇతను రాజన్న అని మనవాడే. పట్నంవారితో మాట్లాడ్డు.

ఏమనుకోకు" అని ఏదో చెప్పబోయాడు.

“అయ్యా, సెలవిస్తే...” అంటూ కొత్త వ్యక్తికి దణ్ణం పెట్టి రాజన్న బయల్దేర బోయాడు.

"ఒక్క నిమిషం. మొన్న మీటింగ్ ఏమైనట్టు? ఎవ్వరూ కలవలేదే.." వివరాల కోసం సాంబయ్య ఆరా తీశాడు.

"స్వామీ.. తవరికి వీలుగానప్పుడు అక్కడేం జరిగేదీ తెలీదంటే ఎలా సామీ?”

రాజన్న విసుక్కున్నాడు.

"అదుగో ఆ వొంకరమాటలొద్దు. నీకేంది. పతీదానికీ నెత్తిన తలపాగా చుట్టుకుంటా బయల్దేరతావ్. నాకెన్ని పనులుంటాయనుకున్నావ్? హైద్రాబాద్ నుంచి మనుషులొచ్చారు.. వొచ్చినోళ్లని పలకరించకుండా ఎలా? అందుకునే రాలేదు. అయినా ఎప్పుడూ

వుండేదేగా? ఇంతకీ మూర్తిగారేమంటారు?

అనంతుబాబు వొచ్చాడంటా? "

అనుకున్నట్టే వివరాలన్నీ వందిమాగదులు మోసేశారన్నది.

తెలిసి రాజన్న పెద్దగా ఆశ్చర్యపడలేదు.

"తపరు ఢిల్లీలో వుండాల్సిందయ్యా.. ఆళ్ల దురదృష్టం ఇక్కడున్నారు. ఇంకేం చెప్పాలి. అన్నీ తెలిసాయిగా? ఇక మీరే సమాధానంగా

ఏదైనా నాలుగు మంచి మాటలు చెప్పాల మరి!" అన్నాడు రాజన్న ఆశగా. హైద్రాబాద్ నుంచి అంటే ఎమ్మెల్యే మనుషులై ఉంటా

రని రాజన్న నమ్మకం.

“ఓర్నీ, నువ్వేమీ తక్కువదిన్నోడివిగాదయ్యో!..

ఆ గ్యారంటీగా చెప్పలేనుగాని ఎండాకాలానికి రోడ్డు పని ముగించేద్దాం. సరేనా?!"

అన్నాడు కాస్తంత రహస్యంగానే.

కానీ సాంబయ్య చూపులో ఆ నమ్మకం కనిపించలేదు రాజన్నకు. సాంబయ్య చుట్టుపొగను రింగులు తిప్పుతూ రాజన్న బుజంమీద

చెయ్యి అన్చి అలా కేఫ్ లోకి తీసికెళ్లాడు.

"ఇదుగో రాజన్నా, ఊరికే ఆవేశపడి పట్నం కుర్రాడిని పాడుచేయమాక. రోడ్డయించడమంటే గోడకి సున్నంగొట్టినంత ఈజీగాదు.

కలెక్టరాపీస్ లో పని చేయించుకోవాలా, పైసలు చేతికి అందాలా, పనోళ్లు మాట ఇనాలా?.. ఇంత తతంగం ఉంది. నేనేం కాలీగా

లేను, చెరువుకాడికి వొచ్చి మాటపడేందుకు!" అని కోపం తెలీనివ్వకుండా మనసు లో మాట అనేశాడు. కాఫీ తాగుతూ ఆరడుగుల

సాంబయ్యలో అబద్దాలకి నిలువెత్తు నిదర్శనాన్ని గుర్తించాడు రాజన్న

ఆ మర్నాడు ఉదయం పది అవుతుండగా కొత్త ఇంజనీరు సాంబయ్య ఇంటికి వెళ్లాడు. ఆయన రావడం చూసి సాంబయ్యకు

కొంత చిరాకేసినా ఆశ్చర్యం నటించాడు. కూర్చున్న పెద్ద కుర్చీలోంచి లేచినట్టు లేచి కూచున్నాడు. ఎదురుగా కుర్చీలో ఉన్న టవల్ తీసి కూచోమని ఆహ్వానించాడు.

"సాంబయ్యగారు బాగున్నారా?" అంటూ ఇంజనీరు కుర్చీలో కూలబడ్డారు. పక్కనే ఉన్న స్టీలు జగ్గులోంచి స్టీలు గ్లాసులోకి నీళ్లు పోసి అందించాడు. ఆయన గబగబా రెండు గుక్కలు తాగి విశ్రాంతిగా

కూర్చున్నాడు.

"ఇప్పుడు చెప్పండి. పొద్దున్నే వచ్చారు.. పనేంటి?" అని అనుమానంగా అడిగాడు సాంబయ్య.

“ఇంకేముంటుంది? ఆ రోడ్డు పనే. కలెక్టర్ ఆఫీసు నుంచి ఒకటే ఫోన్. చంపుతున్నారనుకోండి. మీరేమో బొత్తిగా నల్లపూసయిపోతున్నారు. నేనే కలుద్దామంటే.. ఇదుగో ఇప్పటికి కుదిరింది. ఆ వెధవ హైవే పని ఇంకా ఉండిపోయింది" అని ఇంజనీరు తన కష్టాలన్నీ ఏకరువు పెట్టారు.

"చేసేదేమిటి ?.. ఒక్క కాగితం కదలదు, ఒక్కడు మాటవినడు. అన్నింటికీ నేనే తిరగాలంటే ఎలా?"

వచ్చిన ఇంజనీరుగారు కాస్తంత భయపడ్డారు. అనుకున్నదొకటి ఈయన అనడం మరోటి... అసలు ముందుగా విన్నది మరోటి..

అర్థం కానట్టు తల గోక్కున్నారు.

"అన్నట్టు. ఆమధ్య ఓ పాతిక కుప్పలు రాయి, సిమెంటు అన్నీ వచ్చాయ న్నారుగా?!"

ఇంజనీరు ఆరా తీయబోయారు.

"ఎవడండీ చెప్పిన గాడిద? ఏవీ? మీకు కనిపిస్తున్నాయా? ఉంటే ఇక్కడే ఉండాలిగదా?" అంటూ ఎదరుగా గేటు పక్కగా ఉన్నతలుపులు బార్లా తీసే ఉన్న చిన్న గదిని చూపించాడు సాంబయ్య.

"మరి పంపినట్టు కాగితాలు, రసీదులు అన్నీ చూపించారు. మీరేమో చేర లేదంటున్నారు.. చిత్రంగా ఉంది?"

"మీకు ఆ ఇంగ్లీషు పేపర్లు, ఆర్డర్లు తప్ప నిజానిజాలు సరిగా తెలీదు. కాగితాలు వేరు. వాస్తవం వేరయ్యా సామీ!" అన్నాడు.సాంబయ్య విసుక్కుంటూ.

"కలెక్టర్ గారి దగ్గరికి మరి మీరూ వస్తారా? నేను సమాధానం చెప్పలేక ఛస్తున్నా" అన్నారు ఇంజనీరు.

"అంతా విష్ణుమాయ. కలెక్టరాఫీసుకు ఎళ్లడమెందుకు? పరిగెత్తుకు వచ్చి అడిగి ఆయాసం తెచ్చుకో వడమెందుకు?”

"ఏవిటండీ? అలా తలా తోకా లేకుండా మాట్లాడతారు? అన్నింటికీ అడ్డంగా వాదించడం తగ్గించుకోండి" ఇంజనీరు కోపం ప్రదర్శించారు. అసలు మాట మారుస్తున్నాడని గ్రహించి కోపంతో మరేం మాట్లాడలేకపోయారు.

"సరే. రేపు మీటింగ్ కి పిలవండి. అజ్ఞే తేల్చుకుందాం.. ఏమంటారు?” ఇక లాభం లేదని గట్టి నిర్ణయానికి వచ్చేశారు సాంబయ్య.

మర్నాడు ఉదయం తొమ్మిదింటికి వూళ్లో పెద్దలు, చిన్నలు,చంటిపిల్లలతో తల్లులూ అంతా పెద్ద వీధి దగ్గరలోని ఆడవారూఅంతా చెరువు గట్టున పెద్ద మర్రి చెట్టు దగ్గర చేరారు. తొమ్మిదిన్నరకి రిక్షాలో సాంబయ్య వచ్చాడు. అప్పటివరకూ పిచ్చా పాటీ

మాట్లాడుకుంటున్నవారంతా సాంబయ్య రావడం చూసి ఆశ్చర్యపోయారు.

"ఇయ్యాల కాకులు రాకుండానే కంట్రాక్టరుగారొచ్చేశారు!" రాజన్న అన్నాడు.

సాంబయ్య గంభీరంగా చూసి మూర్తిగారు కూచున్నవైపు అందర్నీ దాటు కుంటూ వెళ్లాడు.

"హమ్మయ్య, టైమ్ కు వచ్చేశారు.. సగం పని జరిగినట్టే.." అంటూ మూర్తిగారు సాంబయ్యను ఆహ్వానించారు.

"మరీ అంత వెటకారం అక్కర్లేదేమో మూర్తిగారూ..” నవ్వుతూనే కోపాన్ని ప్రదర్శించాడు కాంట్రాక్టరు.

"టైమ్ వేస్ట్ చెయ్యకుండా మొదలెట్టేద్దాం..” అంటూ వాచీ చూసుకున్నారు మాస్టారు.

ఇందులో తెలీనిదేముంది.. దీర్ఘ ప్రసంగాలు చేయడానికి?! అనాదిగా ఉన్నదేగా!" అన్నారు ఇంజనీరు.

సాంబయ్య లేచి అంరికీ వినిపించేలా అసలు సమస్యని మళ్ళీ చెప్పాడు. చాలా చిరాగ్గానే అందరూ విన్నారు.

"ఇంతకీ తమ మనసులో ఏముందో బయటపెట్టండి సంతోషిస్తాం" అన్నాడు రాజన్న.

"నేజెప్పేదేముంది. ఆవేశపడి బిపి పెంచుకోవడమేగానీ పనులు జరగవ్. ఒక్కటేనయ్యా, కలెక్టరాఫీసులో పనులు చేయించినా,రోడ్డు అయ్యే ఖర్చుకంటే తక్కువేమంజూరవుతోంది. కూలీరేటు పెరిగింది. మునపట్లా పదో పరకో ఇచ్చి అన్నం పెడితే చేసేసేవాళ్లు

ఇప్పుడు హక్కులు, డిమాండ్లు గురించి అరవడం కూడా నేర్చుకున్నారు. మరి అన్నింటికీ నన్నే అని ప్రయోజనం లేదుమరి" అని

ముక్తసరిగా ఉన్న సంగతి చెప్పాడు సాంబయ్య.

"పోనీ మన ఊరిరోడ్డే గనుక, తలా కాస్తావేసి పనిగానిస్తే... ఆలోచించండి" మూర్తిగారు సూచించారు.

"వంటకి నూనెలేదు, రోడ్డుకి వూడ్చిపెట్టమంటే ఎట్టాగండీ?!" అంది వినయంగా ఓ మహిళ.

"ఇన్నాళ్లూ వూరిత్తా వున్నారుగా, ఇప్పటికీ సాంబయ్యగారికి పరిస్కారం తెలీదా?!" అన్నాడు తోటమాలి.

"అన్నీ సిద్ధంగా వున్నాయంటున్నా, ఏమీలేదని చూపించారు. పని చేసేయమంటే ఎలా చేస్తారు?" ఇంజనీరు వెక్కిరింపుగా

అన్నారు.

"అవేం మాటలు ఇంజనీరూ.. నువ్వేగదా మొన్న ఇంటికొచ్చి మరీ చూసింది. వాటినేమన్నా మింగేసానా? అసలంటూ ఇస్తే

ఎదురుగ్గానే కనపడ తాయిగా? నీకింకా అద్దాలు కూడా రాలేదు.

మా లచ్చిగాడిలా చెవుడూ గాదు ...ఇంగ్లీసొచ్చని ఏదంటే అది

అనేయడమే?" సాంబయ్య కోపగించుకున్నాడు.

"సాంబయ్యగారూ, మీరు మరీ రాను రాను ఉలిపికట్టులా మారి పోతు న్నారుస్మా" అన్నాడు హెడ్మాస్టరు.

"మీరేమన్నా అనుకోండి. అబద్దాలాడాల్సిన ఖర్మ నాకు పట్టలేదు. పోనీ నేను తప్పుకుంటా ఎవరన్నా ముందుకొచ్చి రోడ్డుపని

చూస్తారా? అనడం గాదండి, వాస్తవాలు గ్రహించాలి. అవ్వాగావాలా, బువ్వాగావాలా అంటే ఎట్టా?" ఒక్కసారి ఇంజనీరు వంకా,

మాస్టరుగారి వంక చూస్తూ అన్నాడు.

“ఇలా వాదించుకుంటూ పోతే ఎప్పటికీ తెమిలేట్టు? ఏదో ఒకటి మీరే నిర్ణయించేయండి. ఎందుకీ గోలంతా" అన్నారు మూర్తిగారు.

"ఎండాకాలం వెళ్లేలోగా పనయ్యేట్టు చూస్తానని చెబుతున్నాగదా... కాదూ కూడదంటే చేసేదేమీ లేదు. కలెక్టరాఫీసులో పని,

ఇక్కడ పనోళ్లని జమచేయడం పనీ, దగ్గరుండీ మీరే మాట్లాడుకుని చేయండి" విసుక్కున్నాడు సాంబయ్య.

క్రమేపీ పెరుగుతోన్న ఎండతోపాటు చర్చ వాడిగానూ వేడిగానూ మారింది. పిల్లలతో వచ్చిన మహిళలు నెమ్మదిగా తిరిగి వెళిపోతున్నారు.

నీడలోకి వెళ్లలేక, ఎండలో వుండనూలేక కొందరు ఇబ్బందిపడుతున్నారు. నీళ్లకోసం వచ్చేపోయేవారంతా కడవలతో, బిందెలతోనీళ్ళను మోసుకువెళ్లడానికి దారిలేక ఇబ్బంది పడుతున్నారు. అంతా గమనిస్తున్న అనంతు లేచాడు.

“నాదొక్క సూచన. రోడ్డు వేయడం పని రెండేళ్ళుగా పెండింగ్లో ఎందు కుందో తెలీదుగాని, పెండింగ్లో పెట్టాల్సినంత పెద్దపనీ కాదు. అంత అవసరమూ లేదు. ఇదంతా కావాలని చేస్తున్న జాప్యం తప్ప మరోటి కాదు..." అని ఇంకా చెప్ప బోయాడు.

అంతలో సాంబయ్యకి చిర్రున కోపం వచ్చింది.

"అంటే ఏంటయ్యా? కావాలని పనిచేయించకుండా ఉన్నానంటావ్ అంతేనా? సదువుకున్నోడివని

గౌరవిస్తున్నాం. నీ పట్నం

తెలివిమాటలు చెప్పమాక. ఏ పని ఎలా చేయాలో, చేయించుకోవాలో మాకూ తెలుసు. ఇపుడొచ్చావ్ చెప్పడానికి" అన్నాడు.

"ఇదుగో సాంబయ్యా !, కుర్రాడు.. ఏదో సూచన చేస్తున్నాడుగా వింటే ఏమవుతుంది?" మూర్తిగారు సముదాయించబోయారు.

"మీకేమండి, ఎన్నయినా చెప్తారు. లెక్కలేసి చేయించడమంటే పడక్కుర్చీలో కూచుని మాటలు చెప్పడం కాదు" అనేశాడు.

ఒక్కసారిగా మూర్తిగారు, అనంతు అక్కడున యావన్మందీ ఆశ్చర్యంతో సాంబయ్యను చూశారు.

"అన్నీ సమకూరిన తర్వాతనే నేనే చేయిస్తా... ఎవ్వరి సలహాలు, మాటలు అవసరం లేదు" అని కోపంగా వెళ్లబోయాడు.

అనంత్ కి కోపంతో పాటు నవ్వూ వచ్చింది. ఆయన్ను కూర్చోమని చెప్పాడు. ఒక్కరిద్దరు బలవంతంగా కూర్చోబెట్టే ప్రయత్నంచేశారు.

"నేను అన్నానని కోపం వచ్చిందిగానీ, సాంబయ్యగారూ మీరే ఆలోచించండి. మీ వయసుకి, అనుభవానికి ఈ రోడ్డు పని ఓపనా?! మీరు కాస్తంత శ్రద్ధ చూపడంలేదంతే. అదే నా ఆందోళనంతా!" అనంతు చురకేశాడు.

"వాస్తవాలు గ్రహించకుండా మాట్లాడేవాళ్లు ఎక్కువయ్యారు. అదే నాకు కోపం తెస్తోంది" అన్నాడు విసుగ్గా.

"మీకు కోపం తెప్పించడానికి ఎవరికీ సరదా లేదు. రవ్వంతమెదడు ఉపయోగిస్తే ఈ పాటికి రోడ్డుపని ఎప్పుడో అయిపోయేది.

మీ హైద్రాబాద్ కనెక్షన్లను ఊరివాళ్లకు ప్రదర్శించడం మీద ఇంట్రెస్ట్ తగ్గించుకోండి పనైపోతుంది" అన్నాడు అనంతు ధైర్యం చేసి..

సాంబయ్య కోపంతో ఊగిపోయాడు. అటూ ఇటూ ఉన్నవారిని నెట్టు కుంటూ లేచి వెళిపోయాడు.

"బుర్ర, బుద్ధిలేని వాడికి కాంట్రాక్టు అప్పగించిన సన్నాసి ఎవడో? దేవుడు కూడా వాడిని రక్షించలేరు, మీకు ఈ రోడ్డు పనీఅవదు" అని ఎవరో ముని ఆగ్రహించి శపించినట్టు అన్నాడు..

ఆయన ఇంకా రోడ్డు మీదకు వెళ్లనే లేదు. అనంతు మాటలు విన పడ్డాయి.

ఆ ఊరెళ్లిన ఆ ఊరివాళ్లకి ఇప్పటికీ ఆ రోడ్డు అదే స్థితిలో ఉండటం కోపం తెప్పించదు, ఉలిపికట్టె సాంబయ్య గుర్తొస్తాడు. నవ్వుకుంటారు. చెరువులో నీళ్లు తాగి వస్తారంతే!

First Published:  31 Jan 2023 5:12 PM IST
Next Story