స్వయంకృతం (కథానిక)
"రామదాసుగారూ ! విన్నారా ఆ పిల్ల ఎంతపని చేసిందో?"
ఉదయపు నడకలో రోజూ కలిసే శేషాద్రి అడిగాడు .
ఇద్దరూ విశ్రాంత ఉపాధ్యాయులే
"ఏ పిల్ల...ఏం చేసింది ?" నడుస్తూనే అడిగాడు రామదాసు .
"అదేనండీ, రమణి అనే అమ్మాయ్ "
"ఏం చేసిందటా ?" నిరాసక్తం గా అడిగాడు రామదాసు .
శేషాద్రి చెప్పిన మాట విని నడక ఆపేసి , నమ్మలేక అడిగాడు మళ్లీ "మీరు చెప్పేది నిజమా !" అని. "అయ్యో...ఇలాంటివి అబద్దం చెప్తామా చెప్పండి ."అన్నాడు శేషాద్రి.
రామదాసు చుట్టూ చూసి, గ్రౌండ్ లో దగ్గరగా ఉన్న సిమెంట్ బెంచీ మీద కూర్చుండి పోయాడు.
"ఒక్కడ్నే ఏం నడవను... జరగండి , నేనూ కూర్చుంటాను"
తనూ కూర్చుండి పోయాడు శేషాద్రి .
రామదాసు మనసు వికలమైంది... ఆయన ఆలోచనలు ఆరునెల్ల వెనక్కి వెళ్లాయి...
<> <> <>
రామదాసు ఉపాధ్యాయుడిగా రిటైరైన సంవత్సరంకే భార్య గతించి నది. "ఒక్కడివి ఇక్కడెందుకు నాన్నా మాతో వచ్చేయ్" మంటూ కొడుకు మాధవ్ తీసుకొచ్చాడు.కొద్ది రోజులు గడిచేసరికి రోజంతా ఖాళీగా కూర్చో లేక...ఇంట్లో ఎనిమిది చదివే మనవ రాలికి, ఏడు చదివే మనవడికి ఎటూ లెక్కలు,ఇంగ్లీష్ చెప్తున్నాడు కనుక , మరీ కొంతమందికి ట్యూషన్ చెప్తే... ఇంట్లో పిల్లలకూ తోడుగా,సరదాగా ఉంటుంది , తనకీకాలక్షేపం..అంటూ
మొదలు పెట్టాడు.
కొన్నాళ్ళు బాగానే నడిచింది. ఒకరోజు పదవతరగతి వాళ్లకు లెక్కలు చెప్పటానికి టెక్స్ట్ బుక్ ని ఇమ్మని అడిగాడు రామదాసు.
దగ్గరగా ఉన్న రమణి ఇచ్చింది.
చెప్పాల్సిన చాప్టర్ తిప్పుతుంటే ఒక కాగితం జారి పడింది క్రింద.తీసి పక్కన పడేయబోతు కళ్ళ బడిన ఒక మాట చూసి...పిల్లల వైపు చూశాడు.
వాళ్లు నోట్ బుక్స్,పెన్నులు సిద్దం చేసుకుంటున్నారు రమణితో సహా.
ఆ కాగితాన్ని టేబుల్ సొరుగు లో తోసి లెక్కలు చెప్పాడు.వాళ్ళవి చేస్తుండగా కాగితం తీసి చూశాడు రామదాసు.
తలెత్తి రమణి వైపు చూశాడు.నిండా పదిహేనేళ్లు కూడా నిండని చిన్నపిల్ల. ఆపిల్లకు ఎవరో కుర్రాడు రాసిన ప్రేమ లేఖ ! అది ప్రేమలేఖా?కాదు...అమా యకపు ఆకర్షణ లేఖ !
దాన్ని బట్టి రామదాసుకి అర్థమైనది ఏమంటే...కొన్నాళ్ళ బట్టి వాళ్లిద్దరూ కలుసు కుంటూనే ఉన్నారని !
'వీళ్ళుఇలాగే కలుసుకుంటుంటే ... రేపు పర్యవసానం ఎలా ఉంటుంది?' అనిపించింది .
ట్యూషన్ అయిపోయి ఇళ్లకు పంపే ప్పుడు ,"రమణీ ! నువ్వుండు, మీరు వెళ్ళండి" అని మిగతా వారందరినీ పంపేశాడు .
ఆ లేఖ గురించిప్రస్తావించి,"ఈలేఖ..
వయసు కే ఇలాంటివి మంచివి కావని...చదువుతో పాటు జీవితం కూడా పాడై పోతుందని... ముందు ముందు నీకెంతో మంచి భవిష్యత్ ఉంది.దాన్ని చేతులారా పాడుచేసు కుని అల్లరిపాలు కావొద్దంటూ" చెప్పి, మరోసారి ఇలాంటివి నా దృష్టికొస్తే మీ పేరెంట్స్ కి చెప్తానంటూ " హెచ్చరించి,ఆ లేఖ చింపేసి,పంపాడు ఆ రోజు రామదాసు .
మర్నాటి నుండి రమణి ట్యూషన్ మానేసింది.రెండు రోజుల్లోనే వస్తున్న ఆడపిల్లలందరూ మానేశారు. క్రమంగా మగపిల్లలు కూడా .
ఇంకా ఆశ్చర్యం ఏమంటే కోడలు తన మనవరాలిని కూడా ఆపి,ఆమె గదిలోనే చదివిస్తుంది .
కోడలి రుసరుసలు...కొడుకు సైతం చిరచిరలు...ఎందుకో అర్దం కాలేదు .
మనవడిని అడిగాడు ఏమిటని.
"రమణి అక్కను నువ్వేదో తప్పుగా అడిగావని...చెప్పుకుంటున్నారు తాతయ్యా "అన్నాడు వాడు. తన
తలమీద పిడుగు పడినట్లు,గుండె మీద బండతో బాదినట్లయ్యింది .
" మీ ముఖం చూసి, మీ నాన్నను వదిలేస్తున్నాం"అని రమణి తండ్రి తనకొడుకుతో అన్నట్లు తెలిసింది .
"విషయం" ఇదీ..అని చెప్పబోయినా ఎవరూ వినిపించుకోలేదు..రుజువు చూపే లేఖను ఆరోజే చింపాడు మరి...
'తన వయసుని, మనసుని, చేసిన వృత్తిని కూడా అర్దం చేసుకోకుండా ఇంత అపవాదు వేశారు' అనుకుని బాధ పడ్డాడు రామదాసు.
నిస్తేజంగా గడుస్తున్నాయి రోజులు..
<> <> <>
"...రాత్రి తనే ఉరి పోసుకుందని
కొందరు...చెప్పినా వినకుండా చెడు సావాసాలు మరిగిందని, కొడితేనే పోయిందని కొందరూ చెప్పుకుంటూ ఉన్నారు . ఏమైనా...మీకు పూసిన బురద ఆ పిల్ల చావు బైటపెట్టిన నిజం తో కడిగేసినట్లే. నిజం నిలకడ మీదైనా తెలుస్తుంది కదండీ !"
అంటున్నాడు శేషాద్రి.
"పాపం! ఏం తెలీని అమాయకత్వం.. ఆకర్షణ...అమ్మాయి జీవితాన్ని బలి తీసుకున్నాయ్.ఇది కేవలం ఆ పిల్ల చేసుకున్న స్వయంకృతమే కాదు...
గమనింపు,ఆలోచనాలేని తల్లిదండ్రు ల స్వయంకృతాపరాధం కూడా !భారంగా నిట్టూర్చాడు రామదాసు .
- విజయశ్రీముఖి (వీరపనేనిగూడెం,కృష్ణా జిల్లా)