కనువిప్పు (కథ)
ఎంత చదివి ఉద్యోగం చేసినా వనజాక్షి మనసు మాత్రం సనాతన నమ్మకాలను వదిలి రాడానికి ససేమిరా అనేసింది.
కొడుకులిద్దరూ, కోడళ్ళూ మంచి ఉద్యోగస్తులు. వనజాక్షి కూడా బాంక్ లో ఆఫీసర్ గా చేసి రిటైర్ అవడంతో తన లిమిట్స్ తనకు బాగా తెలుసు గనక పెళ్ళిళ్ళు అవుతూనే కొడుకులను వేరు కాపురాలు పెట్టించింది.
" వద్దు నాన్నా !నా ఇల్లు అనే ఈగో నాకు ఎక్కువ. అలాగే వచ్చిన కోడళ్ళూ అదే భావంతో వస్తారు కదా, కుదిరినంత వరకూ దూరంగా ఉండి ప్రేమలు పంచుకోడం నయం కదా, ఒకే ఇంట్లో ఉండి ఎడమొహాలు పెడమొహాలకన్న. అయినా మనమేం శాశ్వతంగా విడి
పోవడంలేదు .సముద్రాలు దాటి దూరం పోడం లేదు కదా, ఒకే గేటెడ్ కమ్యూనిటీ, అయిదు నిమిషాల దూరం కూడా కాదు గదా. " అంటూ ఒప్పించగలిగింది.
అక్కడికీ తండ్రి పోయినప్పుడు పిల్లలిద్దరూ తమతో రమ్మనీ ,లేదంటే తామే వచ్చి ఆవిడతో ఉంటామనీ ఎంత బలవంతం చేసినా ఒప్పుకోలేదు.
" వద్దురా, మీ పిల్లలు పెరుగుతున్నారు. నా వల్ల వాళ్ళకూ, మీకూ డిస్టర్బెన్స్. పనిమనిషి ఉంది, వంట మనిషి కూడా ఉంది. కాకి తో కబురంపితే వచ్చి వాలతారు. ఇలాగే బాగుంది కదా" అనేసింది.
అలాగనీ ఒక్కదాన్నే ఉన్నానని ఆవిడ ఎప్పుడూ బెంగ పడలేదు. నిజమే !మనసున మనసై బ్రతుకున బ్రతుకైన మనిషి అర్ధంతరంగా వెళ్ళిపోడం కోలుకోలేని దెబ్బే. అయినా చేసేదేం ఉంది. వాళ్ళతో పాటు వెళ్ళే ప్రయాణం కాదు గదా, అలాగని ఓ మూల కూచుని ఏడుస్తూ చుట్టూ వాళ్ళను ఏడిపించడం ఎంత వరకు భావ్యం.
అందుకే రిటైర్ అయ్యాక తనద్దైన సమయ సరళిని అలవాటు చేసుకుంది వనజాక్షి.ఉదయం ఆరింటికి నిద్రలేస్తూనే ఒక అరగంట పాటు వాకింగ్, ఈ లోగా వచ్చే పనిమనిషి జ్యోతి దానిపని అది చేసుకుంటుంది. టీ పెట్టేసరికి వస్తుంది వంట మనిషి వసంత. ముగ్గురూ టీ తాగే లోగా ఏరోజు వార్తలు ఆరోజు వల్లె వేస్తూనే తమతమ కష్టసుఖాలు కలబోసు కుంటారు.మధ్య మధ్యలో సానుభూతి చూపడం వారికి సలహాలివ్వడమో చేస్తుంది వనజాక్షి.
జ్యోతి మూడిళ్ళలో పనిచేస్తున్నా ముందుగా వనజాక్షి ఇంటికే వస్తుంది. రొటీన్ పనులతో పాటు మొక్కల సంరక్షణ, డస్టింగ్ ఓ రెండు గంటల పని. ఎక్కడా దుమ్మూ ధూళీ ఉండకూడదు వనజాక్షికి. అలాగని జ్యోతి పూజ గదిలోకి రాకూడదు, తోమిన గిన్నెలన్నీ బోర్లించాలి వాటి మీద పసుపు నీళ్ళు చల్లి గాని ముట్టుకోదు వనజాక్షి.
వసంత వంట చేసినా అంతే! పొద్దున్నే స్నానం చేసి రావాలి. గిన్నెలన్నీ మళ్ళీ వేణ్ణీళ్ళతో తొలిచి వంట చెయ్యాలి.
నెలకు ఆమూడూ రోజులూ ఇద్దరూ రాకూడదు. జ్యోతి అయితే పెరటి వైపు నుండే రావాలి. పెరటి తలుపు తాళం చెవి ఒకటి దానికిచ్చింది కూడా. పొరబాటున కూడా జ్యోతి తన సమీపానికి రాకూడదు.
అయితే మిగతా విషయాల్లో మాత్రం వాళ్లకు ఆమె ఎంతో ఆప్తురాలు. వాళ్ళకష్టసుఖాలు పంచుకుని తనకు తోచిన మాటసాయమో డబ్బు సాయమో చేస్తూనేఉంటుంది.
మధ్యాహ్నం వరకు ఆఫీస్ లో ఉన్నట్తుగానే ఏదో చదువుకోడం, లంచ్ తరువాత కాస్సేఫు నడుం వాల్చడం, సాయంత్రం కమ్యూనిటి పార్క్ లో కాలక్షేపం, ఇంటికి వచ్చి పిల్లలతో మాట్లాడి కాస్సేపు టీవీ , నిద్ర.
అయితే ఆ రొటీన్ కి ఆటంకంగా నలతగా అనిపిస్తోంది వనజాక్షికి గొంతులో గర గర. నీరసం, నిద్రపట్టకపోడం, డాక్టర్ దగ్గరకు వెళ్ళి వచ్చింది.
" వైరల్ ఇన్ఫెక్షన్, కరోనా పెద్దగా ప్రభావం చూపడం లేదు కానీ చెప్పలేం! టెస్ట్ చేసుకున్నా చేసుకోకపోయినా, కొంచం ఐసొలేషన్ లో ఉండండి. లిక్విడ్స్ ఎక్కువ తీసుకుని రెస్ట్ గాఉండండి" అన్నాడు.
ఎంత జాగ్రత్తగా ఉన్నా ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఏమిటో అర్ధం కాలేదు. విషయం పిల్లలకు చెప్పి, " ఈ వైపు రాకండి, చిన్నపిల్లలు ఉన్నారు కదా! వసంతా , జ్యోతి ఉండనే ఉన్నారు. అవసరపడితే చెబ్తాను" అనేసింది.
అయినా కొడుకులిద్దరూ ఆత్రుతపడి వచ్చినా కిటికీ లోంచి మాట్లాడి పంపించేసింది.
జ్యోతి పని చెయ్యడం ఎప్పుడూ అడుగు దూరం నుండే.
కొంచం పక్కకు వచ్చినా కసిరేసేది. "దూరం దూరం, వచ్చి మీదపడి పోవాలా?" అంటూ.
మూడు రోజులైనా పరిస్థితిలో పెద్ద మార్పేమీ లేదు.ఎందుకైనా మంచిదని పెరట్లో ఉన్న మరువపు ఆకులు నలిపి వాసన చూసింది. “'ఉఃఉ అసలు పసరు వాసన కూడా రాట్లేదు.
"అంటే ..."విషయం ఇద్దరికీ చెప్పి,
" మీ ఇష్టం బలవంత పెట్టను" అనేసింది.
" నాకు చిన్నపిల్లలు ఉన్నారు. తగ్గాక పిలవండి " అంటూ వసంత వెళ్లిపోయింది.
జ్యోతి మాత్రం పెరటి వాకిట్లో ఉండిపోయింది.
*********
నాలుగు రోజుల తరువాత కళ్ళు తెరిచిన వనజాక్షికి లీలగా గుర్తుంది.
జ్యోతి బలవంతాన తనకు కషాయాలు తాగించడం, లేపి కూచోపెట్టి అన్నం కలిపి తినిపించడం.
ఆరో రోజున కొంచం తేరుకున్న వనజాక్షి కాళ్ళ దగ్గర కూచుని అరికాళ్లకు కొబ్బరి నూనె రాస్తూ..
"అమ్మా, మరి గత్యంతరం లేక, మీరు ఆరోజున టీ పెట్టడానికి లేచి కళ్ళు తిరిగి పడిపోయారు. మరొకరురాలేరు .అందుకే మీ మడీ, ఆచారం తెలిసినా... మీకు నచ్చదని తెలిసినా..."
వనజాక్షి నీరసంగా నవ్వింది.
" నీకు భయం వెయ్యలేదా?"
"లేదమ్మా, పక్క వాళ్లకు సాయపడటానికి ఏ కరోనాలు గిరోనాలు ఏం చేస్తాయమ్మా, మా ఆయనకు చెప్పాను పది రోజులు ఇక్కడే ఉంటానని. అయినా ఏమైనా అనండి !ఏ మహమ్మారి వచ్చినా ఆ రోజు వస్తే తప్ప ఏదేం చెయ్యగలదు. మీరు కొంచం కోలుకున్నాక ఇల్లంతా శుద్ధి చేయించుకోండి. మీకు వండి తినిపించిన పాపం ఏదైనా ఉంటే అది నాకే తగులుతుంది అమ్మా"
అపరాధిలా చెప్పింది జ్యోతి.
శ్రమపడి లేచి కూచున్న వనజాక్షి జ్యోతిని దగ్గరకు పిలిచింది.
" నన్నూ నా పారిశుద్దతనూ మంటగలిపావు" అంటుందేమో, చెంప పగలగొడుతుందేమో అనుకుంటూ
భయంగా భయంగా దగ్గరకు వచ్చిన జ్యోతి తెల్లబోయింది. రెండు చేతులతో దగ్గరకు తీసుకుని ఎదకు హత్తుకున్న వనజాక్షి పనికి.
"మానవ రూపేణా ...అదీ నీ రూపేణా నాకళ్ళు తెరిపించాడు భగవంతుడు" పైకి అనలేదు కాని ఆ భావం వనజాక్షి కళ్లలో కనబడింది.
- స్వాతి శ్రీపాద