Telugu Global
Arts & Literature

అదే నేల, అదే కాంతి.. - తరతరాల భారతీయ స్త్రీల భక్తి భావ పేటికలు

ముకుంద రామారావు జనవరి 7న అజోవిభో కందాళం వారి ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారం అందుకుంటున్న సందర్భంగా...

అదే నేల, అదే కాంతి.. - తరతరాల భారతీయ స్త్రీల భక్తి భావ పేటికలు
X

ముకుందరామారావు గారు అంటే ప్రపంచ భాషాసాహిత్యాలను చుట్టబెట్టి వచ్చిన మహా యాత్రికుడు. కన్నవీ విన్నవీ, చదివినవి ఇచ్చిన ఆనందాన్ని,జ్ఞానాన్ని తెలుగువాళ్లు అర్ధం చేసుకొన టానికి వీలుగా అనువదించి వ్యాఖ్యానించే గొప్ప మిత్రుడు. భౌగోళిక సరిహద్దులకు, భాషా భేదాలకు అతీతంగా సాహిత్యంలో మానవాత్మను దర్శించిన తాత్వికుడు. ఆ తాత్విక దృక్పథానికి ప్రాతి నిధ్యంవహించేవే ‘అదే ఆకాశం’(2010), ‘అదే గాలి’(2016), ‘అదే నేల’(2019) ‘అదే కాంతి’ (2022) అనే శీర్షికలతో వచ్చిన ఆయన బృహత్ రచనలు. ఆ పుస్తకాల పేర్లు నన్ను ఎంతో ఆకర్షించాయి.

2004 మే 29న సిక్కిం యాత్రలో భాగంగా భారతచైనా సరిహద్దు భాగమైన నాథుల్లపాస్ కు వెళ్లిన నాటి నా అనుభవాన్నిపదేపదే గుర్తుచేసిన పేర్లవి. సముద్ర మట్టానికి నాలుగువేల మూడు వందల అడుగుల ఎత్తున, కిలోమీటరు దూరం పైగా మెట్లమీదుగా పైకి వెళితే కొండ పై సమతల ప్రదేశంలో భారతదేశానికి , చైనాకి మధ్య విభజనరేఖగా అడ్డంగా కట్టిన ముళ్ల కంచె ప్రత్యక్షమైంది. సరిహద్దు తీగల సందులగుండా చెయ్యి చాచి చైనా భూభాగాన్ని ముట్టుకొన్నక్షణంలో నేను నిల్చున్న నేలనే కదా కంచెలకవతల నేను ముట్టిన నేల కూడా అన్న భావోద్వేగం ఏదో నన్ను పట్టి ఊపేసింది. నిటారుగా నిలుచుంటే చూపు మేరా చైనా భూభాగం లోనికి విస్తరించి ఉన్న అవే హిమా లయ పర్వత శ్రేణుల ఔన్నత్యం.విభజన రేఖలకు అందని ఎత్తులలో అంతటా వ్యాపించిన అదే ఆకాశపు అనంతత్వం. మానవనిర్మిత కంచెలను పరిహసిస్తూ ఇటునుండి అటుకు, అటునుండి ఇటుకు పరుగులు తీస్తూ దోబూచులాడే మబ్బుల సందడి, వీచే అదే గాలి అన్నీ కలిసి గొప్ప అద్భుతంగా సాక్షాత్కరించి నన్నొక శాంత సమాధి స్థితిలోకి తీసుకువెళ్లాయి. మనసుపొరలలోకి జారి జ్ఞాపకంగా నన్ను ఆవరించుకొని స్థిరపడిన ఆనాటి అనుభవాన్ని స్పృశించిన పేర్లవి.

‘అదేకాంతి’ పుస్తకం కోసం పనిచేస్తూ అందులో భాగంగా అప్పుడప్పుడూ ఆంధ్రజ్యోతి వివిధ లో ముకుందరామారావు ప్రచురించిన కవయిత్రుల పరిచయ వ్యాసాలు నా సాహిత్య ఆసక్తులకు సన్నిహితమైనవి కావటంతో మా మధ్య సంభాషణ, స్నేహం పెరిగాయి.అప్పాజోస్యుల విష్ణుభొట్ల కందాళం ఫౌండేషన్ వారు ముకుందరామారావు గారికి ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారం ఇస్తున్నఈ సందర్భం ఆ పుస్తకం గురించి వ్రాసే అవకాశం కావటం మహదానందంగా వుంది. నాకున్న ప్రత్యేక ఆసక్తి దృష్ట్యా అయితేనేమి, వస్తు విస్తృతి రీత్యా అయితేనేమి ‘అదేకాంతి’ పుస్తకంలోని భక్తి కవులలో మహిళలకు,’అదేనేల’ పుస్తకంలోని ప్రాచీన కవయిత్రులకు ఈ వ్యాసాన్ని పరిమితం చేయటం జరిగింది.

1

అదేనేల ఆగష్టు 2019లో ‘సాహితి’ ప్రచురణగా వచ్చింది.‘వైవిధ్యమే కవిత్వానికైనా ప్రజాస్వామ్యానికైనా ప్రాణం’ అనే శీర్షికతో ఎ.కె.ప్రభాకర్ సంపాదకీయ వ్యాసం వ్రాసారు. ‘అనేకభాషల భారతీయకవిత్వం’ పట్ల తన ఆసక్తి, అన్వేషణలు, అధ్యయనాలు ప్రస్తావిస్తూ రచయిత వ్రాసిన ముందుమాట ఉంది. ఈ పుస్తకాన్ని ముకుందరామారావు తన ఇద్దరు కూతుళ్లు లావణ్య, చైతన్యలకు కానుకగా ఇచ్చారు.

“ భాషల పరంగా చూస్తే భారతీయకవిత్వాన్ని రెండు భాగాలుగా చూడొచ్చు అంటారు ముకుంద రామారావు. మొదటిది - సంస్కృతం , పాళీ, ప్రాకృతం, అపభ్రంశం. రెండవది ఆధునిక భారతీయ భాషలు. అందులో అదనంగా చేరిన ఆంగ్లం, ఉర్దూ. అదేనేల ప్రధానంగా ఆధునిక భారతీయ భాషల కవిత్వ పరిచయానికి సంబంధించిన కూర్పు. అనేక భారతీయ భాషలలోని కవిత్వ చరిత్రను స్థూలంగా పరిచయం చేసి కొందరి కవితల అనువాదాలను ఇయ్యటం లక్ష్యంగా ఆ రచన సాగింది. ప్రధానంగా ఈ పుస్తకం ఈశాన్యభారతం శీర్షిక కింద అస్సాం, మణిపూర్, త్రిపుర మొదలైన ఎనిమిది రాష్ట్రాల భాషల కవిత్వాన్ని, తూర్పు భారతం శీర్షిక కింద బెంగాలీ, నేపాలీ మొదలైన అయిదు భాషల కవిత్వాన్ని, ఉత్తరభారతం శీర్షిక కింద కాశ్మీర్, డోంగ్రీ మొదలైన ఆరుభాషల కవిత్వాన్ని, పశ్చిమ భారతం శీర్షిక కింద సింధీ మొదలైన నాలుగు భాషల కవిత్వాన్ని,దక్షిణ భారతం శీర్షిక కింద తమిళం మొదలైన అయిదు భాషల కవిత్వాన్ని తెలుగువాళ్ళకు పరిచయం చేసింది.ఈ ఇరవై ఎనిమిది భాషల నుండి అనువాదమైన కవితలు అన్నీ ఆధునిక యుగానివే కావటం వలన మధ్యయుగాల భక్త కవయిత్రులతో కలిపి వాళ్ళగురించి చర్చించటంలో చారిత్రక సామాజిక సంబద్ధత ఉండదు అనిపించింది.

అయితే ‘అదే నేల’ పుస్తకంలో భారతీయాంగ్లము, వాడుకలో లేని భాషలు , ఆదివాసీల కవిత్వం అనే మరో మూడు శీర్షికలు ఉన్నాయి. వాటిలో వాడుకలో లేని భాషలు అనే శీర్షిక కింద పరిచయం చేసిన సంస్కృత ప్రాకృత పాలీ భాషల కవిత్వం దాదాపుగా ప్రాచీన మధ్యయుగాల నాటిది. వాటిలో స్త్రీల సాహిత్య ప్రస్తావనలు ఉన్నాయి. సంస్కృతంలో విద్యా కరుని ( పదవ శతాబ్ది) ‘సుభాషిత రత్న కోశం’ కవులనుండి ఇద్దరు కవయిత్రులు (పు: 656,657) 15 వ శతాబ్ది విద్యాకరుడి ‘సుభాషితావళి’ సంకలనం లోని కవులనుండి ఇద్దరు కవయిత్రులు పేర్కొనబడ్డారు. (పు:663)

ఇక పాళీ భాషలో కవిత్వం ప్రధానంగా బౌద్ధమత సంబంధమైనది. వీటిలో థేరీ గాధలు తొలి బౌద్ధ భిక్షుణుల కవితల సంకలనం. వాళ్ళు 73 మంది. వాళ్ళు చెప్పిన కవితలు 527. వీటి స్వరూప స్వభావాల గురించి, సారం గురించి 20 మంది థేరీల కవితలను ఉటంకిస్తూ రచయిత విపులంగా చర్చించారు.పది పదిహేను శతాబ్దుల సుభాషిత రత్నకోశం, సుభాషితావళి సంకలనాల కవయిత్రులు నలుగురిని కలుపుకొంటే వీళ్ళు ఇరవైనలుగురు (24 ) ఆ కవయిత్రులతో కలిపి మధ్యయుగాల భక్త కవయిత్రులను అధ్యయనం చేయటం చారిత్రక అనుస్యూతితో అర్ధవంతంగా ఉంటుందని అనిపించింది.

“అదే నేల భారతీయ భాషల కవిత్వం , సామాజిక నేపథ్యం” పుస్తకం రాస్తున్న క్రమంలో మధ్యయుగంలో భక్తి కవిత్వం నన్ను ఎంతగానో ఆకర్షించింది. ఆ గ్రంధానికి ఉన్న పరిమితుల మూలంగా ఎక్కువగా భక్తి కవిత్వాన్ని అందులో చేర్చలేకపోయాను. అది ఎప్పటికప్పుడు నన్ను వెంటాడుతూనే ఉండింది. అందుకని భక్తి కవిత్వాన్ని చదువుకొంటూ, నేర్చుకొంటూ ఆనందిస్తూ పోయాను” అని అదేకాంతి ముందుమాట ( సామాజిక తలుపులు తెరిచిన భక్తియుగం)లో చెప్పుకొన్న ముకుంద రామారావు ఆ ఆనందాన్ని అందరితో పంచుకొనటానికే ‘అదేకాంతి’ పుస్తకం తెచ్చారు.“అదేకాంతి’ మధ్య యుగంలో వచ్చిన భారతదేశ భక్తి కవిత్వాన్ని సామాజిక నేపధ్యం నుండి పరిశీలించి పరిచయం చేసిన 735పేజీల రచన. 2022 ఏప్రిల్ లో ఛాయా రిసోర్స్ సెంటర్ వారు దీనిని ప్రచురించారు. దీనిని రచయిత తన సహచరి సుభాషిణి కి అంకితం ఇచ్చారు. వెల్చేరు నారాయణరావు గారి మున్నుడి, రచయిత “ సామాజిక తలుపులు తెరిచిన భక్తియుగం” శీర్షికతో వ్రాసిన విపుల పీఠిక ఉన్నాయి.

దక్షిణ భారతం శీర్షిక కింద తమిళ కన్నడ తెలుగు మళయాళ భాషల నుండి 79 మంది కవులు , పశ్చిమ భారతం అనే శీర్షిక కింద మరాఠీ, గుజరాతీ, రాజస్థానీ, సింధీ భాషలనుండి 43 మంది కవులు , ఉత్తరభారతం అనే శీర్షిక కింద కశ్మీర్, హిందీ, పంజాబీ భాషల నుండి 43 మంది కవులు , తూర్పు భారతం శీర్షిక కింద అస్సామీ, బెంగాలీ, ఒడిస్సా భాషలనుండి 24 మంది కవులు పరిచయం చేయబడ్డారు ఈ పుస్తకంలో. ప్రతి శీర్షికలో ముందుగా ఆయా ప్రాంత చారిత్రక సాంస్కృతిక పరిస్థితులు, ఆయా భాషల కవిత్వ పరిచయానికి ముందు వాటికి నేపథ్యంలో ఉన్న సామాజిక చలనాన్ని స్థూలంగా చెప్పటం పద్ధతిగా పెట్టుకొన్నారు రచయిత. ఈ అన్ని ప్రాంతాల అన్ని భాషల మొత్తం కవులు 189 మంది. వారిలో మహిళా కవులు 47 మంది. కన్నడ కవులు అందరికన్నా ఎక్కువ. వాళ్ళు 39 మంది. వారిలో స్త్రీలు 14 మంది. 24 మందితో పంజాబ్ రెండవ స్థానం లో ఉంది. పంజాబ్ తో పాటు సింధీ, హిందీ, అస్సామీ భాషా కవులలో స్త్రీలు అసలే లేరు. 20 మందితో తెలుగు మరాఠీ భాషా కవులు మూడవ స్థానంలో ఉన్నారు. గుజరాత్ కవులు 8 మంది అయితే ఆరుగురు మహిళా కవులే.

‘అదేనేల’ కవయిత్రులు 24 మంది ‘అదే కాంతి’ కవయిత్రులు 47 మందితో కలిసి 71 మంది భారతీయ కవయిత్రుల గురించి వారి రచనలతో సహా ముకుందరామారావు గారు ఇచ్చిన విస్తృత సమాచారం భారతీయ సాహిత్య చరిత్రలో స్త్రీల కృషిని నమోదు చేయటం పట్ల ఆయనకు ఉన్న పట్టింపుకు,పట్టుదలకు, నిజాయితీకి గుర్తు. వేదకాలం నుండి మధ్యయుగాల వరకు భారతీయ కవిత్వానికి స్త్రీలు చేర్చిన ఆకాంక్షల,అభిప్రాయాల అనుభవ భావోద్వేగాల విశిష్టతను అంచనా వేయటానికి ఉపకరించే సమాచార గనులుఈ రెండు పుస్తకాలు.

2

‘అదేనేల’పుస్తకంలో ఋగ్వేద కవయిత్రులు లోపాముద్ర, విశ్వవార, అపాల, ఘోష, అధర్వవేద కవయిత్రులు సూర్య సావిత్రి, సర్పరాజిని, ఇంద్రాణి, మాత్రనామ, దేవజామ్య ప్రస్తావించబడ్డారు.

ఋగ్వేదసంకలనం క్రీ. పూ. 2500 నాటివి అని అంచనా. ఋగ్వేద సంకలన కర్తలు భారతదేశంలోకి ప్రవేశించి సింధులోయ నాగరికతా చిహ్నాలను, పట్టణాలను ధ్వసం చేసిన ఆర్యులు. అధర్వవేదం క్రీ.పూ 1200 ల నాటిదిగా చెప్తారు. వేదాలు ఏవైనా లౌకిక తాత్విక వాదులైన రిషికలు కొందరు ఉన్నా స్త్రీల ఋక్కులు ప్రధానంగా దాంపత్య సంబంధాలలో వైరుధ్యాలను, పరిష్కార ప్రయత్నాలను వివరించాయి. పతి వియోగం భరించలేని స్త్రీల వేదన, (మండలం 1, ఋక్కు 179, మండలం 5, ఋక్కు 28) , భర్తల పట్ల అసంతృప్తులు, సవతుల పై ఆధిక్యత సాధించే ప్రయత్నాలు, పుత్ర సంతాన అపేక్ష స్త్రీల ఋక్కులలో ప్రతిఫలించాయి.( ఋగ్వేద ఆర్యులు - రాహుల్ సాంకృత్యాయన్ 2015 అక్టోబర్ ప్రచురణ & ఋగ్వేద సూక్తములకు స్త్రీలు ఋషులై ఉండుట- బుర్రా వెంకట సుబ్బారాయుడు , గృహలక్ష్మి, 1933, నవంబర్/డిసెంబర్ ,పు 649-654)

చారిత్రకంగా వేదవాఙ్మయం తరువాతది బౌద్ధవాజ్మయం. క్రీ. పూ. 483 లో బుద్ధుడు మరణించాక ఆయన అనుయాయులు గుర్తున్నవి గుర్తున్నట్లుగా బుద్ధుని ప్రసంగాలు, ఉపదేశాలు, ఏర్పరచిన ప్రవర్తనా నియమావళి , కథలు మొదలైనవాటిని లిపిబద్ధం చేయటం మొదలుపెట్టారు. ఆ రకంగాబౌద్ధవాఙ్మయం క్రీ.పూ. 1 వ శతాబ్ది నుండి అభివృద్ధి చేయబడిందని చెప్తూ ఆ సాహిత్యాన్ని ముకుందరామారావు అదేనేల పుస్తకంలోపరిచయం చేశారు. బౌద్ధ సిద్ధాంతగ్రంధాలు మూడు. అవి వినయ పిటక, సుత్తపిటక, అభిధమ్మపిటక - త్రిపిటకాలుగా ప్రసిద్ధి. ధేర థేరీ గాధలు సుత్తపిటకలోని ఖుద్దకానికాయంలో భాగం.(తియ్యగూర సీతారామి రెడ్డి - సుత్తపిటక, ఖుద్దనికాయ థేరీగాథలు, తెలుగు త్రిపిటక గ్రంథమాల, మహాబుద్ధ విహార, హైదరాబాద్ , 2021,పు; viii) త్రిపిటకాలలో చేర్చిన ధమ్మపద, ఉదాన, ఇతిపుత్తక, సుత్తనిపాత, విమానవత్థు, పేతవత్థు, జాతక కథలు, అపదాన, బుద్ధవంస, ఖుద్దక పాఠ, చరియాపిటక మొదలైన విభాగాల వాఙ్మయాన్ని స్థూలంగా పరిచయం చేస్తూ థేర గాథలు, థేరీ గాధల గురించి మాత్రం విస్తృతంగా చర్చించారు ముకుందరామారావు.

థేరలు అంటే బౌద్ధభిక్షువులుగా పదేళ్ల అనుభవం ఉన్నవాళ్లు. అలాంటి 264 తొలి బౌద్ధభిక్షువుల 1289 కవితల సంకలనం థేరగాథ. కవితలను కొన్నిటిని తెలుగులో ఇస్తూ వస్తువైవిధ్యాన్ని విశ్లేషించారు. థేరీ అంటే బౌద్ధ భిక్షుణిలు. వీళ్ళు కూడా పదేళ్ల అనుభవం ఉన్నవాళ్లే. 73 మంది తొలి బౌద్ధభిక్షిణుల 527 గాథల సంకలనం థేరీ గాథ. భారతదేశంలో స్త్రీల మొట్టమొదటి కవిత్వ సంకలనంగా దీని ప్రత్యేకతను గుర్తించి చెప్పారు రచయిత. అంతే కాదు. ప్రథమ బౌద్ధస్త్రీల అవసరాలు, ఆకాంక్షలు, ఆచరణలను నమోదుచేసిన చారిత్రక ప్రాధాన్యత కూడా దీనికి ఉందని అంటారు.సంయుత్త నికాయంలోని బిక్షుని సంయుత్తలో కూడా బౌద్ధస్త్రీల కవితలు ఉన్నాయని, అలాగే ఆపాదన లో నలభైముగ్గురు థేరీల సంక్షిప్త జీవితచరిత్రలు కవితల రూపంలో ఉన్నాయని అందువల్ల థేరీ గాథలు చెప్పిన వాళ్ళే కాక థేరీలు ఇంకా అనేకులు ఉన్నారని ముకుందరామారావు స్పష్టం చేశారు. ఆకథలన్నిటినీ కలుపుకొని థేరీ గాథలు అధ్యయనం చేస్తే క్రీ.పూ. మూడు నాలుగు శతాబ్దాలలో స్త్రీలను బౌద్ధం వైపు నడిపిన కౌటుంబిక సామాజిక స్థితిగతులు వాటితో స్త్రీలు సంఘర్షించిన తీరు అర్ధం చేసుకోవచ్చు.

ముకుందరామారావు థేరీ గాథ కవులలో సామాజిక హోదాను బట్టి బ్రాహ్మణ క్షత్రియ వ్యాపార వర్గాలవారు, ఇతర తెగలవారు, ఆర్ధిక స్థాయిని బట్టి సంపన్న బానిస వర్గాలవారు, జీవికను బట్టి వేశ్యలు ఉన్నట్లు పేర్కొన్నారు. 21 మంది థేరీలను ప్రస్తావిస్తూ వారి కవితలను ఉదహరిస్తూ స్త్రీలు భౌద్ధంవైపు ఆకర్షితులై పొందిన విముక్తి స్వరూప స్వభావాలను వ్యాఖ్యానించారు ముకుంద రామా రావు. ఈ కవితలు స్థూలంగా బౌద్ధ సంఘంలో చేరకముందు వాళ్ళ అవస్థలు, సంఘంలో చేరిన దగ్గరనుండి వారి ఆధ్యాత్మిక యాత్రావిశేషాలు వివరిస్తూ జ్ఞానోదయం వల్ల వాళ్ళు పొందిన స్వేఛ్ఛ ను, ఆనందాన్నినిరూపిస్తాయి అని నిర్ధారించారు.

తల్లి మాయాదేవి మరణానంతరం బుద్ధుడి ని పెంచి పెద్ద చేసిన ఆమె చెల్లెలు,- సవతి తల్లి- మహాప్రజాపతి గొతమి బుద్ధుని వద్ద దీక్ష తీసుకొన్న మొదటి మహిళ. దుఃఖాలకు మూలకారణమైన తృష్ణను విచ్ఛిన్నం చేశానని, తల్లిగా తండ్రిగా అన్నగా తమ్ముడుగా కొడుకుగా ఇలా రకరకాలుగా పుడుతూ,మరణిస్తూ,సంసారంలో పడితిరుగుతున్నతనకు బుద్ధ దర్శనం వలన పునర్జన్మ లేకుండా పోయింది అంటుంది గొతమి. ఆమెతో పాటు బుద్ధదీక్ష తీసుకొన్న తిస్సా ను ‘గొప్ప శిక్షణతో వెనక్కిలాగే అన్ని దౌర్బల్యాలనుండి విముక్తి చెందిన భిక్షుకి’ అని అభినందించాడు బుద్ధుడు. భిక్షుణి కి ఉండవలసిన ధీరత్వంతో సైన్య సమేతంగా మన్మధుడిని జయించి మరణం తరువాత మరొక జన్మ లేకుండా చేసుకోవాలని తనను తాను హెచ్చరించుకొంటుంది వీర. బౌద్ధ ధర్మోపదేశంతో ప్రభావితులై కొడుకులను బిడ్డలను వదిలేసి, ధనధాన్యాది సంపదలు వదిలి ఇల్లూ వాకిలీ వదిలి తల బోడి చేసుకొని సంఘంలో చేరిన సకులా వంటి థేరికల అనుభవాన్ని చెప్పే గాధలు ఉన్నాయి.

సంసార దుఃఖాలనుండి, ఇంటిచాకిరీ నుండి విముక్తి ఆకాంక్ష స్త్రీలను బౌద్ధం వైపు నడిపిన బలీయమైన శక్తి. జన్మదుఃఖ విముక్తి దానికి అంతిమ ఫలితం. ముత్తా ధాన్యం చెరగటం, తిరగలితో విసరటం, గూని భర్త నుండి విముక్తమై అంతిమంగా జనన మరణాల నుండి విముక్తి చెందినందుకు సంతోషపడుతుంది. సుమంగళమాత కూడా అలాగే ధాన్యం చెరిగే, విసిరే పని నుండి , దుర్మార్గుడైన భర్త నుండి ముక్తురాలై క్రమంగా రాగం నుండి, కోరికలనుండి విముక్తి చెంది సాటిలేని సుఖ స్థితికి చేరుకొన్నది. ఇసిదాసీ అనుభవం కూడా ఇటువంటిదే. ఆమె రాసిన గాధలు నలభై. ధనిక శ్రేష్టి కి కూతురిగా పుట్టి ఒకదానితరువాత ఒకటిగా మూడు పెళ్లిళ్లు ఆమె ఎంత వినయంగా ఒదిగి ఒదిగి సేవలు చేస్తున్నా విఫలమై జీవితంపట్ల విరక్తిచెందిన సమయంలో భిక్ష కోసం వచ్చిన జినదత్తా భిక్షుణి బోధ ప్రభావంతో బౌద్ధ ధర్మ మార్గంలోకి మళ్లింది. బౌద్ధం ఆమెకు సంసార జీవితంలో పదేపదే ఎదురైన తిరస్కారానికి, అందువల్ల కలిగిన దుఃఖానికి ముగింపు అయింది అని ఇసిదాసీ థేరీగాథలు చెప్తాయి.

కిసాగొతమి గాధలు పదకొండు.కొడుకు మరణించిన దుఃఖంలో ఉన్న ఆమెకు జీవితం అనిత్య ధర్మం అన్న ఎరుకను కలిగించి ఆధ్యాత్మిక చింతన వైపు మళ్ళించాడు బుద్ధుడు. జీవ దుఃఖం గురించి ఆలోచించేటప్పుడు స్త్రీ జన్మ దుఃఖం ఆమెకు స్ఫురించింది. అది స్త్రీగా ఆమెకు అనుభవ విషయమే కదా! సవతిని పొందటం, సంతానాన్ని కనటం కూడా దుఃఖమే అంటుంది ఆమె. స్త్రీలను సంబోధించి అసంఖ్యాక జన్మలలో అపరిమితమైన దుఃఖాన్ని అనుభవిస్తున్న మీ సుఖదుఃఖాలను కనుక్కొనేవాళ్ళు ఈలోకంలో లేరు అని అమృతపదాన్ని చేరటమే గమ్యంగా చేసు కోమని ఉద్బోధించింది.ఆ రకంగా స్త్రీల సంసార దుఃఖానికి విరుగుడుగా బౌద్ధధర్మాన్ని చూపిం చింది ఆమె. సంసారం భుజాలమీద పెనుబరువై కృంగదీస్తున్నప్పుడు దానిని దించుకొనటానికి ఆధారమైనది బౌద్ధధర్మ సాధనమే అన్నది ఆమె భావన.

కోరికలు దుఃఖ కారణాలు అంటుంది బౌద్ధం. ఏదో కావాలన్న ఆరాటం, దొరికినదానితో తృప్తిలేకపోవటం,దేనికోసమో అన్వేషణ, ఆశించింది లభించక కలిగే తీవ్ర అసంతృప్తి ఇవి మను షులను అశాంతి పాలు చేస్తాయి. పటాచారా అలాంటి అసంతృప్తులతో వేగి పోయింది. అశాంతితో అలమటించింది. నా అనుకొన్న వాళ్లందరినీ కోల్పోయి ఒంటరి దుఃఖంతో తిరుగుతూ బుధుని ధర్మ బోధలు విని భిక్షుణి అయింది. జాతి గుర్రాన్ని నియంత్రించిన విధంగా మనసుని నియంత్రించి జీవిత తత్వం తెలుసుకొని పొందిన నిర్వాణ అనుభవం గురించి పటాచార తన గాధలలో చెప్పు కొచ్చింది. కని ప్రేమతో పెంచుకున్న కొడుకు చనిపోతే పిచ్చిదై వీధుల్లో తిరుగుతూ నికృష్టమైన జీవితం గడిపిన వాసెట్టీ బుద్ధుని బోధలు విని స్థిమితపడి దీక్ష తీసుకొని దుఃఖ కారణాలు తెలిసాయి కనుక మళ్ళీ దుఃఖం కలిగే అవకాశమే లేదని ప్రకటించగలిగింది.

ఎన్ని ఆకర్షణలనైనా, ఎంత ఒత్తిడిని అయినా తృణీకరించగలిగే శక్తిసాధనలోనే ముక్తి సాధ్యమని ఖేమా ఉదంతం చెప్తుంది. యవ్వనోద్రేకాలను రెచ్చగొట్టి ఆమెను బుద్ధధర్మ మార్గం నుండి తప్పించటానికి మారా చేసిన ప్రయత్నాలను తిప్పికొడుతూ చేసిన సంవాదరూప గాధ ఖేమా రచన. “ నశించే ఈ రోత రోగ గ్రస్త శరీరం” పట్ల మోహం తెంపేసుకొన్న స్థిరచిత్త ఆమె. సుమేధ థేరీ కూడా ఖేమా వంటిదే. ఇంద్రియ సుఖాలు పశు వధ్య శాల లాంటివి అంటుంది ఆమె. సుభా పేరుతో వున్న ఇద్దరు థేరికలను ప్రస్తావించారు ముకుందరామారావు. వీరిలో సుభాజీవకంబవనికా ఖేమా భిక్షుణీ బోధలవల్ల ప్రభావిత. ఈమె గాధలు కూడా ఖేమా గాధలవలె సంవాద రూపంలో ఉన్నాయి. తోటలో విహరించే ఆమెను అడ్డుకొని ఒక ధూర్తుడు కాషాయ వస్త్రాలను వదిలి శృంగార సుఖజీవనానికి రమ్మని ఆహ్వానిస్తూ లౌకిక సుఖభోగాల ఆశలు చూపిస్తూ చేసిన ప్రతిపాదనలను తిప్పికొడుతూ అతనిమీద విజయం సాధించిన థేరీ ఆమె. మరొక సుభ రాజగృహానికి చెందిన బంగారు నగలు చేసే సంపన్న కుటుంబంలో పుట్టింది. తండ్రి వెంట వెళ్తూ బుద్ధధర్మ బోధలు వింటుండే ఆమె కుటుంబం పట్ల విరక్తి చెంది ప్రజాపతి గోతమి వద్ద బుద్ధదీక్ష తీసుకున్నది. బంధువుల్ని బానిసలను, పొలాలను, వెండి బంగారాలను అన్నీ వదిలేసి వచ్చిన తను వాటికోసం మళ్ళీ సంసారంలోకి వెళ్లనని నిరాకరించటం, నిర్వాణంలోనే ఆనందం అని స్పష్టం చేయటం ఆమె కవిత్వం.

విమలా థేరిక, అంబాపాలి వేశ్యలు. రూపమే జీవన మార్గం చేసుకొన్నవాళ్ళు కనుక శరీర స్పృహ వాళ్లకు ప్రధానం.రూపం, యవ్వనం, ఐశ్వర్యం వాళ్లకు అతిశయ కారణాలు. అలాంటివాళ్ళు బౌద్ధదీక్ష తీసుకున్నాక శరీరమోహం నుండి విముక్తులయిన క్రమాన్ని వాళ్ళ గాథలు చెప్తాయి.

దీక్ష తీసుకొన్న వాళ్ళుఒక్క సారిగా కోరికలనుండి విముక్తి చెందటం అంత సులభం కాదు. పట్టి వెనక్కులాగే భౌతిక బంధాలపట్ల,మానసిక దౌర్బల్యాల పట్ల హెచ్చరిక గా ఉండటానికి నిరంతర సాధన చేస్తూ ఉండాలి. అందులో ఏకాగ్రత కుదరకపోతే విహారాలను వదిలి వెళ్ళటం, బయట కావలసిన శాంతి దొరకక మళ్ళీ తిరిగిరావటం కూడా జరుగుతుంటుంది. అలాంటి వాళ్లలో ఉత్తమా అనే థేరీ గురించి ప్రస్తావించారు ‘అదేనేల’ రచయిత. శ్రద్ధతో ఒక భిక్షుణీ మాతను సేవించి ఉపదేశం పొంది సాధనతో విముక్తురాలైన విషయాన్ని ఉత్తమా థేరీలు చెప్తాయి.

స్త్రీలు భిక్షుణీ మాతల మార్గదర్శకత్వంలో విముక్తి మార్గంలో సాగిపోవటం సోణా అనే థేరీ విషయంలో కూడా గమనించవచ్చు. పెళ్లి , సంతానం, గృహకార్యనిర్వాహణలలో జీవితమంతా గడిపి ముసలితనంలో భర్త భిక్షు సంఘంలో చేరిపోతే ఒంటరి అయిన సోణా ఒక భిక్షుణి సహాయంతో సాధనా మార్గంలో సాగి జన్మరాహిత్య స్థితికి చేరుకున్నానని చెప్పుకొన్న కవితలు చూస్తాం. చందా థేరీ గాథలు కూడా భర్త , పిల్లలు లేని , పొట్టకూటికి కరువై బిచ్చమెత్తుకొంటూ గడిపిన ఆమె ఒంటరి జీవితాన్ని, పటాచార భిక్షుణి ధర్మోపదేశంతో సాధనా మార్గంలో చేసిన ప్రయాణాన్ని కథనం చేస్తాయి. భిక్షణులు ఒకరికొకరుసహాయకారులుగా ఒకరి దుఃఖోపశమనానికి మరొకరు మార్గ దర్శకులుగా ఉండటాన్ని ఒక విశేషగుణంగా పేర్కొన్నారు ముకుందరామారావు. అది స్త్రీవాదం చెప్పే సహోదరీత్వం(సిస్టర్ హుడ్) అనుకోవచ్చు. స్త్రీవాదం అనేది ఆ నాటికి లేకపోయినా స్త్రీలుగా తమ అనుభవం లోని ప్రత్యేకతలను గురించిన స్పృహ ముత్త,కిసగొతమి,విమల,అంబపాలి మొద లైనవారి గాధలలోనే కాక మరి కొంతమంది థేరీల గాధలలోనూ కనబడుతుంది. లౌకిక జీవితం లోని పీడనకు, బహుభార్యాత్వానికి, విసుగు కలిగించే ఇంటిచాకిరికి, లైంగిక ఆసక్తుల వల్ల తలెత్తే వైరుధ్యాలకు(ఉత్పలవణ్ణా థేరీ గాధలు) పరిష్కారంగా బౌద్ధం స్త్రీలకు తరచు అనుసరణీయం కావటం చూస్తాం.

చారిత్రక క్రమంలో థేర, థేరీ గాథలు తరువాతవి హాలుని గాధాసప్తశతి కవిత్వం. క్రీస్తుశకం ఒకటవ శతాబ్దంలో తెలుగునాట వచ్చిన ప్రాకృత గ్రంధం అది. గాధాసప్తశతి కవయిత్రులు ఎనిమిదిమంది - అనులక్ష్మి, పృథివి , ఖేజ్జా, మాధవి, రేవా, రోహా, వోహా, శసిప్పాహా - ‘అదే నేల’ లో ప్రస్తావించ బడ్డారు(681). రాళ్ళపల్లి వారి గాథాసప్తశతి( 1933) లో కూడా రోహా, రేవా, మాధవి, అణులచ్చి, అనులద్ది, పహాయి, ససిప్పహా, నాథా అనే ఎనిమిదిమంది కవయిత్రులు పేర్కొనబడ్డారు. ముకుందరామారావు పేర్కొన్న పృథివి, ఖేజ్జా, వోహా బదులు రాళ్ళపల్లి వారి గ్రంథంలో అనులద్ది, పహాయి, నాథా అనే పేర్లు ఉన్నాయి. అయితే 1964 నాటి ఆంద్ర సారస్వత పరిషత్తు ప్రచురణకు వచ్చేసరికి ఖేజ్జా, వోహా ల పేర్లతో పాటు వదావహి అనే మరొక పేరు అదనంగా చేరాయి.అదేనేల పుస్తకంలో కొన్ని గాథలను ఉదహరిస్తూ హాలుని గాధాసప్తశతి కవితల ప్రత్యేక తలను, సామాజిక సాంస్కృతిక విషయాలను వివరించిన ముకుందరామారావు ఎందుచేతనో ఒక్క స్త్రీ గాథను కూడా ప్రస్తావించలేదు. వాటిని ఒకటి రెండింటినైనా ఉదాహరించి ఉంటే థేరీగాధలకు కొనసాగింపుగా అదేనేల పై గాఢమైన కోరికలతో ఆశించినది లభించని అసంతృప్తితో వేదనపడే మహిళల అంతరంగాలు, అభివ్యక్తి రీతులు తెలిసివచ్చేవి.

అదేనేల పుస్తకంలో మధ్యయుగాల సంస్కృత లౌకిక సాహిత్యం నుండి విజ్జా, ఫాల్గుహస్తిని, వికట నితంబ, సీతాభట్టారిక,సుభద్ర, త్రిభువన సరస్వతి, చిన్నమ్మసరస్వతి, భావదేవి, మారుల, మోరిక,మదాలస నాగమ్మ, ఇందులేఖ మొదలైన కవయిత్రులను ప్రస్తావించిన ముకుందరామారావు విద్యాకరుని సుభాషిత రత్నకోశం నుండి స్త్రీల కవితలను మూడింటిని అనువదించి ఉదహరించారు. ఒకటి భావకాదేవి రచన.”చాన్నళ్ల క్రిందట / మనం తొలి ప్రేమలో ఉన్నప్పుడు/ మన శరీరాలు ఎప్పుడూ ఒకటిగా ఉండేవి” అని మొదలయ్యే ఆ కవిత , ప్రియురాలు ప్రియుడు సంబంధం నుండి అవి భార్యాభర్తల సంబంధంగా మారేసరికి హృదయాలు వజ్రకఠోరాలయ్యాయి అని వాపోతుంది ఒక మహిళ. అలా జరిగిన తరువాత ఇక జీవితమెందుకు అన్న విరక్తి కూడా కలిగింది ఆమెకు. ఆధునిక కవితను చదువుతున్న అనుభవాన్ని ఇస్తుంది ఈ కవిత. ప్రియురాలు, ప్రియుడు అన్నవి పరస్పర ఇష్టం మీద ఏర్పడిన సమానత్వ సంబంధాలు. అందువల్ల వాళ్ళ సంబంధంలో ఒక జీవనలాలస ఉంటుంది. భార్యా భర్తల సంబంధం అనేది అధీన అధికార సంబంధాల వ్యవస్థ కనుక అందులో హృదయాలు బండబారిపోతాయి. జీవనలాలస నశించి గతానుగతికత్వం ప్రవేశిస్తుంది. ఈ నాటి స్త్రీల అనుభవం, అవగాహన ఆ కాలపు స్త్రీల కవిత్వంలో కనబడుతున్నదంటే ‘అదే జీవితం’ కావటమే కారణం అనుకోవచ్చు. ఇకమిగిలిన రెండు అజ్ఞాత కవయిత్రి కవితలలో దాంపత్య శృంగారం సంయోగ వియోగాల రంగులతో వ్యక్తమైంది.

15వ శతాబ్దపు విద్యాకారుడి సంకలన గ్రంథం ‘సుభాషితాలు’ నుండి ఉదాహరించినవి రెండూ మహిళల రచనలే. ఒకటి 9 వశతాబ్ది కవయిత్రి సీతాభట్టారికది. రెండవది 10వ శతాబ్ది కవయిత్రి సుభద్రది. సీతభట్టారిక కవిత లేతమొలక లాంటి యవ్వనవతి ప్రాణాంతక మైన విరహావస్థను చెబుతుంది. సుభద్ర కవిత మగవాళ్ల నమ్మకాలను వెక్కరిస్తుంది. ఆడవాళ్లను మోహకారకులుగా చెప్పే మనుసంస్కృతి పాలించే సమాజంలో స్త్రీలస్వభావాన్ని గురించి లైంగికత గురించి అభివృద్ధి చేయబడిన తప్పుడు భావాలలో ఒకటి వాళ్ళు అధికారం డబ్బు ఉన్నవాళ్లను ప్రసన్నం చేసుకొని ప్రపంచసుఖాలను అనుభవిస్తుంటారన్నది. అది సత్యం కాదు అన్నది కవి ఆంతర్యం.“ రాజుని ప్రసన్నం చేసుకుని అతని సంపదను పొంది / మేము నిరంతరం ప్రపంచ సుఖం అనుభవిస్తాం” కవిత లోని మొదటి రెండు పంక్తులు ఇవి. అందులో ఉన్నది అత్యంత తిరస్కృత వాచ్యధ్వని. అనుభవిస్తాం అని మీరనుకొంటారు కానీ అందులో సత్యం అనుభవమ య్యేది మాకే కానీ మీకు కాదు అని మగవాళ్ల మీద ఎత్తిపొడుపు అందులో వినబడుతుంది. సుఖం అనుభవిస్తుంటారు అన్నది ఆడవాళ్ళ గురించి మగవాళ్ల నమ్మకం అంతే. ఆడవాళ్ళ సుఖం అనేది భ్రమ మాత్రమే ఆ నమ్మకంతో వాళ్ళు మరణపర్యంతం భ్రమ లోనే కాలం గడిపేస్తారు అన్న ముక్తా యింపుతో ఆమెస్త్రీల గురించి మగప్రపంచం నిర్మించుకున్ననమ్మకాలను తిప్పికొట్టింది ఈ కవితలో.

ఆ రకంగా ‘తెలుగునేల’ లో మధ్య యుగాల మహిళల కవిత్వపు మచ్చు తునకలు చూపిన ముకుందరామారావు భక్తి ప్రాతిపదికగా మధ్యయుగాలమహిళల కవిత్వపు ప్రత్యేకతలను ‘అదేకాంతి’ పుస్తకంలో విస్తృత స్థాయిలో నిరూపించారు.

3

అదేకాంతి పుస్తకంలో కవులందరూ ‘అదే(ఒక) దేశం’వాళ్ళు. భిన్న ప్రాంతాల వాళ్ళు అంతే. ప్రాంతాలవారీగానే వాళ్ళను పరిచయం చేశారు ముకుందరామారావు. అధ్యయన సౌలభ్యం కోసం ప్రాంతాలతో నిమిత్తం లేకుండా కాలక్రమ వరుసలో మహిళా కవులను గురించి మాట్లాడుకొనటం ఎక్కువ ప్రయోజనకరం. ఆ ప్రకారం చూస్తే భక్తి కవిత్వం వ్రాసిన కవయిత్రులు 6 వ శతాబ్ది నుండి 18 వ శతాబ్ది వరకు పదమూడువందల సంవత్సరాల కాలం మీద విస్తరించి ఉన్నారు.

“పరస్పరం సంఘర్షించిన శక్తుల మధ్య చరిత్రపుట్టెను” చరిత్రలో భాగమే మతం కూడా. ఆర్యులు భారతదేశంలోకి ప్రవేశించి స్థానిక తెగలతో యుద్ధాలు చేస్తూ,విజయాలను కాంక్షిస్తూ యుద్ధదేవుడిగా ఇంద్రుడిని స్తోత్రాలు చేస్తుండటం దగ్గర మొదలై వ్యవస్థీకరించబడుతూ యజ్ఞయాగాది కర్మకాండతో జటిలం అవుతూ వైదికమతంగా స్థిరపడింది. ఆ క్రమంలో అది యజ్ఞ యజమానులైన రాజులకు, చేయించే బ్రాహ్మణులకు పరిమితమై సామాన్య మానవుల ఆధ్యాత్మిక అవసరాలను తీర్చలేని స్థితికి వచ్చింది. ఈ దశలో వేద ప్రామాణ్యాన్ని అంగీకరించని జైనబౌద్ధ మతాలు ప్రచారంలోకి వచ్చి సామాన్య జనుల ఆధ్యాత్మిక అసంతృప్తులను అవి కొంతవరకు సంబోధించగలిగాయి. ఈ ప్రభా వాన్ని ఎదుర్కొనటానికి వైదికమతంలో సంస్కరణ అవసరమైంది. కర్మజ్ఞాన కాండలతో నిమిత్తం లేకుండా వ్యక్తిగత ఆరాధనకు వీలుగా క్రీస్తుశకం అయిదవ శతాబ్ది నాటికి వేద దేవతలైన రుద్రఉపేంద్రాదులకు దేవాలయాల నిర్మాణం జరిగింది.ఆ క్రమంలో 6 నుండి 9 శతాబ్దుల మధ్యకాలంలో దక్షిణ భారతదేశంలో రెండు ధార్మిక ఉద్యమాలు పురుడుపోసుకున్నాయి అవి శైవ వైష్ణవ భక్తి ఉద్యమాలు అని తమిళ ప్రాంతపు మత సంస్కృతిక వాతావరణాన్ని స్థూలంగా పరిచయం చేశారు ముకుందరామారావు. నాయనార్లు శివభక్తిని, ఆళ్వార్లు వైష్ణవభక్తిని ప్రచారం చేసినవాళ్లు. పల్లవుల కాలంలో (275-897) జీవించారు.

నాయనార్లుగా ప్రసిద్ధులైన అరవై మూడు మంది శివభక్తులు స్థానిక భాషలో పాడుకొన్న శ్లోకాలు మొదటి రాజరాజ చోళుని కాలంలో ( 985-1013) నంబి ఆండార్ నంబి పదకొండు సంకలనాలుగా కూర్చాడని, రెండవకుళోత్తుంగ చోడుని కాలంలో( 12 వ శతాబ్ది ) శెక్కిళారు ముని కూర్చిన అరవై మూడు మంది నాయనార్ల చరిత్ర ‘పెరియపురాణం’ పన్నెడవ సంకలనంగా చేరటంతో తమిళ శైవ సిద్థాంతం సంపూర్ణం అయిందని పేర్కొన్నారు రచయిత. అరవై మూడుమంది నాయనార్లలో ఆరుగురిని పరిచయం చేశారు ఈ పుస్తకంలో. వారిలో ఒకరు స్త్రీ. ఆమె కవయిత్రి కారైక్కాల్ అమ్మైయ్యార్.భక్తి కవిత్వంలో స్త్రీలు, అణగారిన వర్గాల వారు తమ ఉనికిని, అస్తిత్వాన్ని చాటుకున్నమాట వాస్తవమే అయినా వాళ్ళ సంఖ్య పురుషుల సంఖ్యతో పోలిస్తే తక్కువే. మొత్తం అరవైమూడు మంది నాయనార్లలో స్త్రీలు ముగ్గురే అని ముకుందరామారావు చెప్పినమాట గమనించదగినది.

కారైక్కాల్ అమ్మైయ్యార్ ఆరవ శతాబ్ది కవయిత్రి. అసలు పేరు పునీతవతి. వ్యాపారవర్గం లో పుట్టి పెరిగింది. చిన్నప్పటినుండే శివభక్తురాలు. పెళ్లయ్యాక ఆమె శివభక్తి మహత్వ శక్తుల సంగతి తెలిసి అందువల్ల తనకంటే ఆధిక్య స్థానంలో ఉన్న ఆమెను భరించలేక భర్త ఇల్లువదిలి మరొక పెళ్ళి చేసుకున్నాడు. అది తెలిసి ఆమె ప్రాపంచిక సుఖాలను త్యజించి శివారాధనలో జీవితం గడిపింది. ఆమె వ్రాసిన 143 కవితలు నాలుగు కావ్యాలుగా వచ్చాయి. వాటినుండి ఆరు కవితల అనువాదాలను రచయిత ఈ పుస్తకంలో చేర్చారు.

కర్మజ్ఞాన స్థానాలలో హృదయం చేరటం భక్తి కవిత్వ ప్రత్యేకత. వ్యక్తికి దైవానికి మధ్య ప్రత్యక్ష సంబంధం, సంభాషణ ప్రాధాన్యం వహించాయి. కారైక్కాల్ అమ్మైయ్యార్ “నెత్తిన గంగ/జాడలు కట్టిన తలలో చంద్రవంక / అరచేతిలో జ్వలిస్తున్న మంటలు /స్వామిని మాత్రమే నా హృదయంలో ఉంచుకొన్నా’ను అంటుంది. మరొక కవితలో అతను స్వర్గంలో వున్నాడని కొందరు, ఇంద్రభవనం లో ఉంటాడని మరికొందరు అంటున్నా “దేదీప్యమానంగా అతను నా హృదయంలోనే ఉన్నాడని నేను అంటాను” అని కూడా చెప్పింది. ఆమె హృదయంలో ఉన్న శివుడు ‘ప్రాచీన కాలంలో తాగిన విషంతో కంఠం నీలవర్ణమైన’ వాడు.ఆ విశేషణం వాడటం ద్వారా కారైక్కాల్ శివుడు గరళ కంఠు డైనా హృదయంలో నిలుపుకొనటానికి తనకు ఎలాంటి సందేహం లేదని చెప్పినట్లయింది. ప్రేమ, సర్వ సమర్పణ భక్తి కవిత్వంలో కీలకమైన అంశాలు.కారైక్కాల్ మాటలు వస్తున్నప్పటినుండి అతనిని తాను ప్రేమిస్తూనే ఉన్నాను అంటుంది.ప్రేమలో కరుగుతూ ఏడుస్తూ బిగ్గరగా శివుడి గురించి పాడుతుంది. అతనికి బానిసను, దాసిని అని చెప్పుకొంటుంది.

ఆళ్వార్లు గా ప్రసిద్ధులైన పన్నెండు మంది వైష్ణవ భక్త కవులలో నలుగురు ‘అదేకాంతి’ పుస్తకంలో పరిచయం చేయబడ్డారు. వారిలో ఆండాళ్ ఉంది. ఆళ్వార్లలో ఆమె ఒక్కతే మహిళ. 9వ శతాబ్ది కి చెందిన కవయిత్రి. గోదాదేవిగా ప్రసిద్ధి. శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యద కావ్యం ద్వారా ఆమె తెలుగువాళ్ళకు కూడా దగ్గరయింది. రంగనాధుడిని భర్తగా వరించి అతనిని చేపట్టి తరించ టానికి ఆమె పడిన తపన, చేసిన ఆలోచనలు గొప్ప భావుకతతో కవిత్వం అయింది. హృదయాన్ని భగవదర్పితం చేయటమే కాదు,శరీరం కూడా అతనికే అని నమ్మింది. అందువల్లనే శరీరస్పృహ, సౌందర్య లాలస,విరహ వ్యధ,సంయోగ ఆకాంక్ష ఆమె కవిత్వంలో భాగమై కనిపిస్తాయి. లక్ష్య సిద్ధికోసం శరీరాన్ని వాహికగా వాడుకొన్నకవయిత్రి, శృంగారభావాలను సున్నితంగా, ధైర్యంగా చెప్పగలిగిన మొదటి కవయిత్రి ఆండాళ్ అంటారు ముకుందరామారావు.తిరుప్పావై నుండి రెండు నాచ్చియార్ తిరుమొళి నుండి నాలుగు పాటలు అనువాదాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. “కృష్ణు డంత ప్రియమైన / ఓ నల్లని వర్షపు మేఘమా” అని ప్రారంభమయ్యే తిరుప్పావైలో వర్ష వర్ణన, శ్రీకృష్ణ వర్ణన రెండు పాయలుగా సాగుతూ అంతిమంగా ధనుర్మాసపు సామూహిక స్నానోత్సవాలతో సంగమించటం చూస్తాం. “ఏడు జన్మల్లోనూ నిరంతరం’ గోవిందుడి సన్నిధి ఆమె ఆకాంక్షగా వ్యక్తం అయింది.

నాచ్చియార్ తిరుమొళి కవితలు నాలుగూ ఆండాళ్ విరహవేదన ను వర్ణించేవి. “ నేను చిక్కి శల్యమవుతున్నాను/ ఎన్నో రోజులుగా నా కళ్ళు మూతబడటం లేదు/ రక్షించే వైకుంఠ నావ లేక / నేను దుఃఖ సముద్రంలో కొట్టుకు పోతున్నాను” అన్న ఆండాళ్ దైన్యం ‘ప్రియునికి వేరైన వేదన’ యొక్క ఫలితం. “సముద్రంలో నీతో పెరిగినవి ఎన్నో/ పాడబడకుండా వినబడకుండా, పిలవ బడకుండా పడున్నాయి” అని ప్రారంభమైన కవిత శంఖాన్ని సంబోధించిన చమత్కార రచన. ఆండాళ్ లక్ష్మీదేవితో తనను అభిన్నంగా సంభావించుకొంటున్నది కనుక ఆమె సముద్ర తనయ. శంఖం కూడా సముద్రంలో ఆమెతో పుట్టిపెరిగినదే. అయితే శ్రీ మహావిష్ణువు శంఖాన్ని ఆదరించి అలంకారం చేసుకొన్నాడు. కానీ తనకు ఇంకా ఆ అదృష్టం పట్టలేదు. అదీ ఆమె బాధ. “కాలాతీతమైన మధుసూదనుని పెదాల రుచిని” సొంతం చేసుకొన్న శంఖం పట్ల అందుకే అసూయ. అతను ఊదే ప్రతీక్షణం శంఖానికి దొరికే అధరామృతం తనకు కావాలన్న కాంక్ష ఆమెది.” స్త్రీ విరహవేదన స్వామికి అర్ధం కాదేమో” అన్న నిస్పృహకు గురవుతుంది. అతను కట్టిన పీతాంబరపు సుగంధ వాయువో, ఎక్కడో అడవుల్లో గోవుల్ని కాస్తూ విడుపులేకుండా వాయించే వేణువు రంధ్రం నుండి కారిన అమృతమో తన మోహానికి ఉపశమనం అవుతాయేమోనని ఆశపడుతుంది ఆండాళ్. మధురభక్తి కి అచ్చమైన నిదర్శనం ఆమె కవిత్వం.

కారైక్కాల్, ఆండాళ్ ఆరూ తొమ్మిది శతాబ్దాల వాళ్లయితే భక్త కవయిత్రులు మళ్ళీ పన్నెండవ శతాబ్దిలో కానీ కనబడరు.

పన్నెండవ శతాబ్ది కవయిత్రి అవ్వయ్యార్ నాయనారూ కాదు, ఆళ్వారూ కాదు అని రచయితే చెప్పారు. ఆమె తమిళనాట పిల్లల కోసం నీతిబోధల గ్రంథం ‘అత్తిచూడి’తో పాటు ప్రాచీన సూక్తులు, సద్మార్గాల ప్రబోధ రచనలు చేసింది. అందువల్ల భక్తి కవిత్వ పరిధిలోకి ఆమె కవిత్వం రాదు. అయినా ముకుందరామారావు ఆమె కవితలను కొన్నిటిని పేర్కొన్నారు. ఆయన ఉటంకించిన ఆమె కవితా ఖండికలలో ఒకటి - “ పనికిరాని భర్తను పొందిన స్త్రీ గురించి - / జింక లాంటిదాన్ని / ఎండిన దుంగలాంటి మనిషికి జతచేసిన / ఆ బ్రహ్మె నాకు దొరికితే / అంతకు ముందే పోయిన అయిదవ మెడవైపు / అతని నాలుగు మెడల్నీ మెలేసి నాలుగు ముఖాల్నీ రువ్వుతాను” ఈడూ జోడూ కానీ దాంపత్య సంబంధాలను కూర్చిన పెద్దల పట్ల, దానిని బ్రహ్మ రాసిన రాత అని సమర్ధించే తీరుపట్ల ఆమె అసంతృప్తిని, ప్రతీకారేచ్ఛను వ్యక్తం చేస్తుంది ఈ ఖండిక.

అవ్వయ్యార్ ను మినహాయిస్తే 12 వ శతాబ్ది మహిళా కవులు పద్నాలుగు మందీ కన్నడ ప్రాంతానికి చెందిన శివభక్తి కవులే కావటం విశేషం.

4

పన్నెండవ శతాబ్దం వీరశైవ ఉద్యమ కాలం. 1130 నుంచి 1167 మధ్యకాలంలో కన్నడదేశ పాలకుడైన బిజ్జాలదేవుని ప్రధాన మంత్రిగా ఉన్న బసవేశ్వరుడు వీరశైవ ఉద్యమాన్ని వ్యాపింప చేసాడు. శివభక్తి ప్రాతిపదిక మీద సామాజిక ఆర్థిక కుల లింగ భేదాలకు అతీతంగా సర్వమానవ సమానత్వాన్ని ప్రతిపాదించింది వీరశైవం. ‘కాయకమే కైలాసం’ అని కష్టించి పనిచేయటానికి ప్రాధా న్యం ఇచ్చింది. శివుడితో భక్తుల సంబంధాన్ని,శివభక్తులమధ్య అనుభవాలను పంచుకొనటానికి, సామాజిక ఆర్ధిక ధార్మిక ఆధ్యాత్మిక తాత్విక సాంస్కృతిక సాహిత్య విషయాలను చర్చకు పెట్టటానికి ‘అనుభవ మంటపం’ఏర్పరచబడింది. స్వేచ్చ, సమానత్వం ప్రధాన విలువలుగా ముందుకు వచ్చాయి. ఆధ్యాత్మిక లౌకిక విద్య కు మాధ్యమంగా ప్రజల భాష కు గౌరవం లభించింది. శివభక్తుల సాహిత్యం ‘వచనాలు’ . శివభక్తి అనుభవకథనాలు అవి. శివభక్తులైన సామాన్యులందరూ తమతమ అనుభవాలను కథనం చేయటానికి ‘అనుభవమంటపం’ ప్రేరణ అయింది. వచనాలు వ్రాసినవాళ్లు మూడువందలవరకు ఉండవచ్చని వాళ్ళు వ్రాసిన 11వేల వచనాలు భద్రపరచబడ్డాయని ముకుందరామారావు పేర్కొన్నారు. ‘అదేకాంతి’ పుస్తకంలో ముప్పై అయిదు మంది వచనాకారులు పరిచయం చేయబడ్డారు. వారిలో పద్నాలుగు మంది స్త్రీలు.

బసవేశ్వరునికన్నా ముందే శివభక్తి పారమ్యంతో వచనాలు వ్రాసినవాడు దేవర దాసిమయ్య. అతను 980-1040 మధ్యకాలంలో జీవించాడు. ఆయన లాగానే ఆయన భార్య దుగ్గలె కూడా శివభక్తురాలై వచనాలు వ్రాసింది. దాసిమయ్య గుల్బర్గాజిల్లా సురాపూరా తాలూకా ముద్దనూరులో జన్మించాడు ఆ ఊరిలోని శివాలయ దేవుడు రామనాధుడిని సంబోధిస్తూ ఆయన వచనాలు వ్రాస్తే దుగ్గలె ‘దాసయ్యప్రియ రామనాథా’ అన్న మకుటంతో వ్రాసిన వచనం ఒకటి ఇందులో ఇయ్యబడింది. దాసిమయ్య తొలి వచన కారుడు అయితే దుగ్గలె తొలి వచన కవయిత్రి. మలి కవయిత్రి అక్కమహాదేవి బసవేశ్వరుని సమకాలికురాలు.

అక్క మహాదేవి షిమోగా జిల్లాలో శికారిపురా తాలూకాలో ఉడుతడి అనే గ్రామంలో శెట్టి దంపతులకు 1130 లో జన్మించింది. చెన్నమల్లిఖార్జునుడు ఆమె ఆరాధ్య దైవం. ఐహిక వాంఛలపై ఆసక్తి లేక తప్పనిసరై చేసుకొన్న పెళ్లి లో ఇమడలేక భర్తను తిరస్కరించి ఆభరణాలను, దుస్తుల ను విసర్జించి పొడవాటి జుట్టుతో నగ్న శరీరాన్ని కప్పుకొని ఇల్లువదలింది. ఆమె ‘చెన్నమల్లి కార్జు నుడి కాంతిని కప్పుకొని సిగ్గుని విడిచానని’ చెప్పుకొంటుంది. కళ్యాణంలోని అనుభవ మంట పాన్నిచేరి బసవన్న, అల్లమ ప్రభు వంటి వాళ్ళతో చర్చలు చేసి వీరశైవసంఘ లో గౌరవాదరాలు పొందింది. చెన్నమల్లి ఖార్జునుడిని భర్తగా కోరి శ్రీశైలం చేరి కదళీవనంలో తపస్సు చేసి లింగైక్యం చెందింది. చెన్నమల్లిఖార్జున మకుటంతో ఆమె వ్రాసిన 434 వచనాలలో మచ్చుకు కొన్ని ఈ పుస్తకంలో పేర్కొనబడ్డాయి. అక్కమహాదేవి శరీరం లింగార్పణం చేసుకొన్న స్త్రీ. “లింగానికి దేహం అర్పించుకున్నాక దేహం దేహవిహీనమయ్యింది” అంటుంది ఒక వచనంలో. ఏ దేహం తన ఆస్తిత కు గుర్తొ అది శివుడిది అయ్యాక తాను దేహం లేనిదే. “మోహాన్ని నిజమైన ఆనందానికి అర్పించుకున్నాక , మొహం శూన్యమైంది” మొహం భౌతిక వాంఛకు సంబంధించింది కాగా నిజమైన ఆనందం అనేది భక్తురాలు కావటంలో, శివునిలో లీనం కావటంలో ఉందని ఆమె భావిస్తున్నట్లు వచనం ముగిసేసరికి అర్ధం అవుతుంది. “ నా దేహం నీవే అయిపోయాక / నేను ఎవరిని సేవించాలి” అని ప్రారంభమయ్యే వచనం లో ఎన్నిరకాలుగా ఆమె తాను అతనై పోతుంటుందో చెప్తుంది. అతనిలో సంలీనమై స్వీయ అస్థిత్వాన్ని మరిచి పోయే భక్తి పారవశ్యం ఆమెది. శివుడిని తెలుసు కొనటానికి ఎన్నుకొనే జ్ఞాన సాధనాలన్నీ వ్యర్థమేనని ఆమె అభిప్రాయం. శివుడిని చేరటానికి శివుడినే ఆరాధించాలి. శరణుల సాహచర్యం అందుకు సహాయకారి.

ఈ పుస్తకంలో ప్రస్తావించని అక్క మహాదేవి వచనాలలో సాటి స్త్రీలను సంబోధిస్తూ చెన్న మల్లికార్జునుడి పట్ల స్వీయ వలపును,విరహాన్ని, చెన్నమల్లికార్జునిని కూటమి గురించిన కలలను వైనవైనాలుగా వర్ణించినవి అనేకం ఉన్నాయి. ఈ విషయంలో అక్కమహాదేవికి ఆండాళ్ తో పోలిక ఉంది. ఆ రకంగా ఆమె భక్తి మార్గంలో మధురభక్తి ఒక మజిలీ.

అక్క నాగమ్మ బసవేశ్వరుడి పెద్దక్క కాగా నీలమ్మ ఆయన భార్య. వాళ్లిద్దరూ వచనాలు వ్రాసినవాళ్ళే.”మనస్సుకు అధిపతి మహాదేవుడు” అని ప్రతిపాదించి ఆ నమ్మకమే అన్ని వ్యాకుల తలనుండి, కలవరాలనుండి కాపాడుతుందని చెప్తుంది నాగమ్మ. నీలమ్మ వచనంలోని ఒకభాగం - “ పార్వతి సౌందర్యాన్ని/ నాలో చూసి/ నేను శివునితో ఐక్యురాలనుకుని /అతను నాతో కలవలేదు” శివభక్తుడైన భర్త భార్యలో పార్వతిని దర్శిస్తే ఆమె అతనికి తాకరానిదే అవుతుంది. ఆ రకంగా దాంపత్య సౌఖ్యం ఆమెకు దూరమైంది. ఆ పరిస్థితులలో శివుడే శరణు అయ్యాడు. మనసు అతనిమీదే నిలిపి నిశ్చలతను పొందటానికి తోడ్పడేవాళ్లు సాటి శివ శరణులు. శరణులకు గరిష్ఠ స్థాయిలో ప్రతినిధి బసవడు.అతనే ఆమె భర్త. అతనితో సహజీవనం, అతని ఆదర్శంతో తాదాత్మ్యం బసవ అనుభవం. భారాలు లేని దేహాన్ని పొందటానికి మార్గం అయ్యేది ఆ అనుభవమేనని నీలమ్మ చెప్పింది.

కదిరె కాయకద కాలవ్వె శివభక్తి కవులలో మొదటి దళిత కవయిత్రి అంటారు ముకుంద రామారావు. కాలవ్వె భర్త ఊరిలింగ పెద్ది. అతనూ శివభక్తి కవే. అతని పేరును కలిపి ‘ ‘ఊరిలింగ పెద్ది గాలరసా’ అన్న మకుటంతో కాలవ్వె కవిత్వం చెప్పింది. మేకల్ని, చేపల్ని, పక్షులను తినేవాళ్లను కులజులు అని శివునికోసం పాలను ఇచ్చే పవిత్ర గోవును తిన్నవాళ్లను కులభ్రష్టులు అని అనటం లోని ద్వంద్వ విలువలను ప్రశ్నించిన సాహసి ఆమె. సామాజిక మిధ్యాచారాలను, అలవాట్లను ఆధ్యాత్మిక డంబాచారాలను విమర్శించటంలో అక్కమ్మ, అముగె రాయమ్మ ఆమె లాంటివారు అంటారు ముకుంద రామారావు. అక్కమ్మ “ ఒక వైఖరికి నిబద్ధమయ్యాక / ఈ ప్రపంచంలో /ఇతరులతో సంబంధాల మాట” తలపెట్టరాదని, అముగె రాయమ్మ కాషాయ వస్త్రాలు ధరిస్తూ నీచమైన ఐహిక సుఖాలకు చింతించరాదని శివభక్తులను హెచ్చరిస్తారు. అయదక్కి లక్కమ్మ శివభక్తులకు కోరిక, శివుడికి కోపం ఉండవని అంటుంది. అదే వచనంలో తన భర్త ఆయదక్కి మారయ్యను సంబోధించి ప్రాధమిక అవసరాలను మించిన కోరికలు శివుడికి దూరం చేస్తాయి అని హెచ్చరిస్తుంది కూడా.

సకలేంద్రియాలు, వాటికి సంబంధించిన అనుభవాలు, అనుభూతులు సమస్తం అభావ మైన స్థితికి చేరి శివ భావం ఒక్కటే ఆలోచన అయిన స్థితిలో శరణుని పాదాలతో ఐక్యం కావటమే ఆనందం అని హదపద లింగమ్మ నిర్వచించింది ఒక వచనంలో. సూలె సంకవ్వ వేశ్య. వేశ్యకు కూడా ఒక నీతి ఉంటుంది. ఒకరిదగ్గర డబ్బు తీసుకొన్నప్పుడు వారికే నిబద్ధమై ఉండటం నీతి. మరొకరి దగ్గర కూడా తీసుకొని వారితో కూడా గడపటం అవినీతి. తనకు తెలిసిన ఆ నీతి ప్రాతిపదిక గానే ఆమె శివుడిని తెలుసుకున్నాక తనకు మరే పురుషుడూ వద్దని ఒట్టుపెట్టుకొంటుంది.

ధూపదే గొగ్గవ్వ అక్కమహాదేవి లాగా పెళ్లయ్యాక కుటుంబాన్ని వదలటం కాక పెళ్లినే తిరస్కరించి కళ్యాణి కి వచ్చిన శివభక్తురాలు. ఆమె స్త్రీ పురుషుడి మీద, పురుషుడు స్త్రీ మీద ఆసక్తిని వదులుకొని ఆత్మ సంతృప్తితో జీవించటాన్ని అసలైన ఆధ్యాత్మిక స్థితిగా సంభావించింది. మోలిగె మహాదేవి, బొంతాదేవి రాజకుటుంబాల స్త్రీలు. శివభక్తితో కళ్యాణం చేరి కాయకం చేస్తూ శివభక్తుల సన్నిధిలో జీవిస్తూ వచనాలు వ్రాసారు. తత్వ చింతన ఇద్దరిలోనూ సామాన్యాంశం. బొంతాదేవి వచనాలలో కుల ఆధిక్య న్యూనత్వ భవనాల పట్ల వ్యతిరేక స్వరం వినబడుతుంది.

సోదరుడు అజగన్న గురువుగా శివభక్తి మార్గంలోకి వచ్చిన ముక్తాయక్క అతని మరణంతో క్రుంగి పోతుంటే ఓదార్చి అల్లమ ప్రభువు ఆమెను ఓదార్చి ఆధ్యాత్మిక మార్గంలో మళ్ళించాడు. ముక్తాయక్క ఒక కవితలో యోగి లక్షణాలను అనేక ఉపమానాలతో నిరూపిస్తూ చివరకు సోదరుడు అజగన్న ను కూడా ఒక ఉపమానంగా చెప్తుంది. “గాలిలో దాగిన సుగంధంలా / ఎండలో దాగిన అగ్గిలా” అని మొదలుపెట్టి చంద్రుడిలో ఆకర్షణను, శబ్దంలో దాగిన గాలిని, పిడుగులోదాగినా కళ్ళు చెదిరే తేజస్సును కూడా ఉపమానాలుగా చెప్పి “నా తండ్రి అజగన్నలా / యోగి ఉండాలి” అని కవితను ముగిస్తుంది. చివరి పాదం చదివాక గానీ పైవన్నీ యోగికి ఉపమానాలు అని బోధపడదు.

5

13 వ శతాబ్ది భక్తకవయిత్రులు ముక్తాబాయి, రత్నాబాయి, 14 వ శతాబ్దికి చెందిన సోయారా బాయి, నిర్మల, జానాబాయి, గంగా సతి మొత్తం ఆరుగురు పశ్చిమ భారత దేశానికి చెందినవాళ్లు.

ముక్తాబాయి మహారాష్ట్రలో భక్తి ఉద్యమంలో భాగంగా వారకరి సంప్రదాయం నుండి వచ్చిన సంత్ కవి.వారకరి అంటే యాత్రికులు, తీర్థయాత్రలు చేసేవారు అని అర్ధం.పండరీపుర విఠల నాథుడిఆరాధన,పండరీపురయాత్ర,విఠలుడి సంకీర్తన, అహింస,నీతినియమాలతో కూడిన జీవితం, మద్యపాన ధూమపానాలకు దూరం, శాకాహారం, ఏకాదశి ఉపవాసాలు వారకరి సంప్రదాయంలో ప్రధాన అంశాలు. ఈ సంప్రదాయంలో సుప్రసిద్ధుడైన జ్ఞానదేవ్ సోదరి ముక్తాబాయి తొలి మహిళా సన్యాసిని. ఆమెవి ఏడు అభంగులు అంటే పాటలు ఈ పుస్తకంలో ప్రస్తావించబడ్డాయి. జ్ఞానం ఉన్మాదం ఒకటే అంటుంది. దాని నుండి విముక్తి కల్పించగలవాడు విఠలుడే అని నమ్మింది. ఆకారంలేని భగవంతుడిని చూడగలగడం,అతని ప్రాభావాన్ని మనసుద్వారా తెలుసు కొనటం , రహస్య అంతరాకృతిని ఆత్మలో సాక్షత్కరింప చేసుకొనటం సాధన వల్ల సాధ్యం అని ఒక అభంగ్ లో సూచించింది.“నా హృదయానికున్న ఒకేఒక్క గృహం అతను“ అని చెప్పటంద్వారా భగవంతుడి నివాసంగా సంస్కరింపచేసుకొనవలసిన హృదయాల గురించి సూచించింది. దానిని ఆత్మల ఐక్యతగా సంభావించింది.సంత్ అలవరచుకొనవలసిన సహనం గురించి, క్షమ గురించి, రాగద్వేషా లకు , కామ క్రోధాలకు అతీతమైన హృదయ నైర్మల్యం గురించి ఆమె పాటలు బోధిస్తాయి.

ముక్తాబాయి దేశస్థ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మహిళ కాగా 14 వ శతాబ్దికి చెందిన సోయరాబాయి మహర్ కుల మహిళ. వారికరి సంప్రదాయానికి చెందిన చొఖామేలా భార్య ఆమె. పండరీపురంలో నివాసం. భర్తమార్గం సరైందనుకొని అనుసరించిన ఉత్తమ ఇల్లాలు. కులం వల్ల ఊరిచివర చంద్రభాగా నదివొడ్డున నివాసం ఏర్పరచుకొనవలసి రావటం వంటి అనుభవాలు ఏమి బాధించాయో కానీ ఆమె అభంగ్ లలో అవి వ్యక్తమైనాయి. “ రక్తపంకిలమయిన గర్భాశయం నుండి కాకూండా ఏ ప్రాణీ ఈ ప్రపంచంలో పుట్టలేదు” అని లోక సాధారణ వాస్తవాన్ని చెప్పి కొందరిని కళంకిత శరీరులనటం ఎంతవరకు సముచితం అని సవాల్ చేసింది సోయరా. తనపేరుతో చొఖా మహరి అని భర్త పేరును కూడా కలుపుకొని ప్రతి అభంగ్ కు చివర మకుటం చేసుకొన్నది. పండరంగడిని చూస్తూ అభేదాన్ని సంభావిస్తుంది. చూడబడేది ఎవరు? చూసేది ఎవరు అన్న విచికిత్స దానినే సూచిస్తుంది. సోయారా ఆడపడచు నిర్మల కూడా పాండురంగడి భక్తురాలై సర్వ సమర్పణ భావంతో కవిత్వం అల్లింది.

జానాబాయి సంత్ నామదేవ్ ఇంటి దాసి. అతనే ఆమె ఆధ్యాత్మిక గురువు. దంచటం, రుబ్బటం, ఊడ్చటం, ఉతకటం, వండటం వంటి ఇంటిపనులు చేసుకొంటూనే ఆమె పాండురంగ ఆరాధన కొనసాగించింది. ‘జానీ నామదేవ్ దాసీ’ అనేది ఆమె అభంగ్ లకు మకుటం. ఎన్ని జన్మలెత్తినా ప్రతి జన్మలో పండరీపుర దర్శనం ఆమె ఆకాంక్ష. పండరీ దొంగను పట్టి హృదయాన్ని జైలు గది చేసి బంధించానని చెప్పుకొన్నది. ‘సోహం పదంతో కొరడాతో కొట్టినట్టు’ చితక్కొట్టానని చెప్పుకొనటంలో అతనే తాను అయినానన్న సాధికార స్వరం వినబడుతుంది. దాసి గా తాను చేసే పనులన్నీ చేసే వాడిగా పండరినాధుడిని భావిస్తుంది. పక్షులకు, కోతులకు, స్త్రీలకూ సహజమైన సంతాన వాత్సల్యం, రక్షణ బాధ్యత భక్తులపట్ల విఠలుడికి కూడా ఉందంటుంది. ‘ జానీ తల్లి విఠల్’ అని అతనిని స్త్రీగా సంభావించటంలో పోషణ రక్షణ ఇచ్చే శక్తిగా నిరూపించటం చూస్తాం. స్త్రీకి కుటుంబంలోని అధికారసంబంధాలు భగవంతుడిని చేరటానికి అవరోధం అవుతాయన్న అవగాహన జానాబాయికి ఉన్నట్లు ఆమె చెప్పిన ఒక అభంగ్ ను బట్టి అనుకోవచ్చు.

రత్నాబాయి గుజరాత్ ప్రాంతపు మాహాపంత్ సంప్రదాయానికి చెందిన మహిళ. అహం గురించిన భయం నుంచి విముక్తి చెందటమే స్వేఛ్చ అంటుంది. అలాంటి స్వేఛ్చ ను పొందటానికి హద్దుల్ని గౌరవించటమే కాదు , అతిక్రమించటం కూడా తెలియటం, కామక్రోధాలను త్యజించటం, ఒకే ఒక్క భగవన్నామాన్ని నమ్మి భ్రమలను కట్టడి చేయటం షరతులుగా చెప్తుంది. స్వీయ శ్రమ జీవిత విజయ గానాలుగా కూడా ఉంటాయి ఆమె కవితలు. 14 వ శతాబ్దికి చెందిన గంగాసతి రత్నాబాయి వలెనె గుజరాత్ ప్రాంతపు మాహా పంత్ సంప్రదాయానికి చెందిన మహిళ.సంసారం సాగిస్తూనే తన ఇంటిని ఆధ్యాత్మిక చర్చలకు, సత్సంగా లకు వేదికగా చేసింది. కోడలిని సంబోధిస్తూ ఆమెను తన మార్గంలో నడిపించటానికి చేసిన ఉప దేశాలు భజనలుగా జనాదరణ పొందాయి. ఉపదేశం చేసేటప్పుడు ఎవరిని ఉద్దేశించామో వాళ్ళతో నిత్య స్నేహ సంబంధాలలో ఉండాలని, గౌరవంతో వాళ్ళను సంబోధించాలని వాళ్ళ భ్రమలను, సందేహాలను తొలగించి అసూయ ద్వేషరహిత స్థితికి వాళ్ళు చేరినప్పుడే దేవుడి గురించి చెప్పా లంటుంది గంగా సతి. అత్యంత కష్ట కాలంలోనైనా చలించనిది భక్తుల మనస్సు అంటుందామె. సద్గురువు వాక్కు భక్తులకు గుండెధైర్యాన్నిస్తుంది అని చెప్తుంది. “ “దైవిక ప్రపంచంలో/ కులానికీ మతానికీ చోటు లేదు” అని ప్రకటించింది. నిష్కపటుల సాంగత్యానికి ప్రాధాన్యతను ఇచ్చింది.

‘మననశీలవాక్కుల లల్లా’ 14 వ శతాబ్దిలో ఉత్తరభారతంలో కాశ్మీర్ కు చెందిన భక్తి కవయిత్రి. ఆమె బ్రాహ్మణ శివయోగిని. పన్నెండు ఏళ్లకు పెళ్లయి పెన్నెండు ఏళ్ళు భర్త , అత్తపెట్టే హింసలు భరించి ఆధ్యాత్మిక స్వేఛ్ఛను ఆశించి ఇల్లు వదిలింది. అక్కమహాదేవి లాగా వస్త్రాలను విసర్జించింది. యథేచ్ఛగా సంచరించింది. శరీరం ఆధ్యాత్మిక ఔన్నత్య సాధనంగా భావించింది. దేవుడి నివాసంగా శరీరానికి, హృదయానికి అనితర ప్రాధాన్యతను ఇచ్చింది కనుకనే శరీరాన్ని ఉపవాసాలతో హింసించరాదంటుంది. సర్వత్రా వ్యాపించి ఉన్న భగవంతుడిని ఎక్కడ దేనితో పూజించగలను అని నిస్సహాయతను వ్యక్తం చేస్తుంది. మనస్సుపై నియంత్రణ ను భగవంతుడిని తెలుసుకొనే మార్గంగా చెప్తుంది. సమత్వ భావన, ద్వైతం నుండి స్వేఛ్చ మనుషులకు ఇచ్చే కొత్త చూపును గురించి గొప్ప నమ్మకంతో చెప్తుంది. “ నాలోనే నిన్ను కనుగొన్నాక / కేవలం నువ్వే , అంతా నువ్వే, నేను లేనే లేను” తనలోనే శివుడు ఉన్నాడని తెలిసినప్పుడు తాను తనను కోల్పోయి తానే అతనైన అనుభవ వ్యక్తీ కరణ అది.

6

15 వ శతాబ్దికి చెందిన నలుగురు కవయిత్రులలో ఇద్దరు తెలుగువాళ్లు. ఒకరు తాళ్ళపాక తిమ్మక్క , మరొకరు ఆతుకూరి మొల్ల. నిజానికి వీళ్ళిద్దరూ భక్త కవయిత్రుల కోవలోకి రారు. వాళ్ళు కావ్యకవులు. అసలు తెలుగునాట భక్తి ఉద్యమం ప్రత్యేకంగా ఉందని చెప్పలేం. కన్నడ దేశానికి పక్కనే ఉంది కనుక వీరశైవ ఉద్యమ ప్రభావం కొంత ఉంది. అది కూడా సాహిత్యం మీదనే ఎక్కువ. మల్లికార్జున పండితారాధ్యుడు,పాల్కురికి సోమనాధుడు, యథావాక్కుల అన్నమయ్య ఆ రకంగా శివకవులు. తాళ్ళపాక కవులు వైష్ణవ భక్తి ని ప్రబోధించే సంకీర్తనా చార్యులు కనుక వాళ్ళను భక్తి కవులు అనవచ్చు కానీ అన్నమాచార్యుని భార్య అయిన తాళ్ళపాక తిమ్మక్క వ్రాసిన సుభద్రాకళ్యాణం పూర్తిగా లౌకిక కావ్యమే. అలాగే మొల్ల వ్రాసిన రామాయణం కూడా. రామాయణ కథ కనుక భక్తి కవి అనుకొంటే హుళక్కి భాస్కరాదులు, చివరకు విశ్వనాథ సత్యనారాయణ కూడా కల్పవృక్షం వ్రాసినందుకు భక్తి కవి కావాలి. కనుక తాళ్ళపాక తిమ్మక్కను, మొల్లను భక్తకవులుగా పరిగణించలేము. అట్లాగే బమ్మెరపోతన, ధూర్జటి , కందుకూరి రుద్రకవి మొదలైన వాళ్ళను భక్తి కవుల జాబితాలో చేర్చటం పునరాలోచించవలసిన విషయం.

ఇక ఈ శతాబ్ది భక్త కవయిత్రులుగా మిగిలినవాళ్లు కాన్హో పాత్ర, రామీ. కాన్హో పాత్ర మహారాష్ట్ర ప్రాంతపు వారకరి సంప్రదాయం లోని కవయిత్రి. వేశ్య కూతురు. నాట్యగానాలలో ఆరితేరిన ఆమెను వృత్తి లోకి దించాలని తల్లి , ధనిక పెద్దలు పెట్టె ఒత్తిళ్లకు లొంగక పండరీపుర విఠలుడిని చేరి మరణపర్యంతం సేవిస్తూ అక్కడే ఉండిపోయింది. పతితరక్షకుడని పేరున్న భగవంతుడు తనను ఉద్దరించ రాడేమని వాపోతుంది. “ నేను నీ ఒక్కరికే అంటున్నప్పుడు /....... / మరొక మనిషి నన్ను వశపరచుకొంటే/ సింహం వాటా నక్క కాజేస్తే / అది గొప్పనా , ఎవరు సిగ్గుపడాలి / “ అని ఆమె వేసిన ప్రశ్న తనను వేశ్యావృత్తిలోకి దించటానికి జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకోవాల్సిన బాధ్యత పండరినాధుడిదే అని నొక్కి చెప్తుంది. తన శరీరం పండరినాధుడిది.పురుష సింహుడు పండరి నాధుడొక్కడే దానికి అధికారి.”సింహం వాటా నక్క కాజెస్తే / అది గొప్పనా, ఎవరు సిగ్గుపడాలి” అని ప్రశ్నించటం దానినే సూచిస్తుంది.

రామీ తూర్పు భారతంలో బెంగాల్ ప్రాంతానికి చెందిన కవయిత్రి. చాకలి కులంలో పుట్టి స్వతంత్రంగా ఊరూరూ తిరుగుతూ నాన్నూర్ చేరిన ఆమె అక్కడి గుడిపూజారి ఛండీదాస్ తో ప్రేమలో పడుతుంది. ఆ క్రమంలో ఆమెకు ఎదురైన సమస్యలు ఆమె కవిత్వానికి వస్తువైనాయి. రాధాకృష్ణ ప్రేమామృతం గానం చేసిన ఛండీదాస్ ప్రభావం వల్ల కావచ్చు రామీ కవితలలో రాధ వేదన కొంత ప్రతిఫలించింది. చాలావరకు ఈమెను లౌకిక కవిగానే చెప్పాలి.

7

ఇక 16 వ శతాబ్ది భక్త కవయిత్రులు ఆరుగురు. వారిలో దక్షిణ భారతం నుండి మలయాళ ప్రాంతానికి చెందిన ఏకైక భక్తి కవయిత్రి కురూరమ్మ. పదహారేళ్లకు భర్త చనిపోయిన ఆమె బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం ‘విధవ’ గా ఉండటానికి నిరాకరించింది. దేవునికి తనను నిత్య వధువుగా ప్రకటించుకొన్నది. శ్రీ కృష్ణుడిని కొడుకుగా సంభావించి తాను యశోద అయి అతనిని లాలించింది. ఆమె కవిత్వానికి వస్తువు అదే అయింది. బహిష్టు సమయంలో దైవ పూజ పరిహరించవలసినది అన్న లోక నియమాన్ని ఆమె తిరస్కరించి శ్రీకృష్ణుడి ప్రార్ధనలో గడిపేది.

పశ్చిమ భారతంలో గుజరాత్ కు చెందిన సతితోరల్ , లీరల్ బాయి 16 వ శతాబ్దపు కవులే. మహాపంత్ సంప్రదాయంలో వాళ్ళు. సతితోరల్ ఇంట్లో ఒక రాత్రి సత్సంగ్ జరుగుతుండగా వచ్చిన బందిపోటు తోరల్ అందానికి ఆకర్షితుడైనాడు. సత్సంగ్ సమ యంలో వచ్చిన అతిధిని సంతోష పెట్టటానికి భర్త ఆమెనుతీసుకువెళ్ళమని అతనికి అప్పగించాడు. దారిలో ఆమె భక్తి శక్తి కి అబ్బురపడిన అతను తాను కూడా ఆమె భక్తి మార్గంలోకి రావటంతో ఇద్దరూ కలిసి ఆనందంగా జీవించారు. “భక్తి తాదాత్మ్యంలో ఆమె మారుమనువునూ దాంపత్య ద్రోహాన్ని సైతం అంగీకరించటం వూహించరానిది” అన్న రచయిత వ్యాఖ్యానం గమనించదగినది.

భక్తి ఉద్యమంలో భగవంతుడి ఆరాధనకు ఎంత ప్రాధాన్యమో భగవంతుడి భక్తుల ఆరాధన కూడా ఆంతే ముఖ్యమైనది. దానినే భాగవతారాధన అన్నారు.వీరశైవమత ఉద్యమంలో శరణులు కోరినది ఏదైనా సరే ఇచ్చి సంతోషపెట్టడం ఒక ధర్మం. శివభక్తులు కోరే వాటిలో స్త్రీలు కూడా ఉన్నారు. అందుకు నిదర్శనమైన కథలు కూడా ఉన్నాయి. అలాంటి భక్తి నిబద్ధతనుండే తోరల్ భర్త సత్సంగ్ సమయంలో వచ్చి తన భార్యను కాంక్షించిన అతనిని సంతోషపెట్టటానికి భార్యను అతని వెంట పంపాడు. భర్త ఆజ్ఞను శిరసావహించటమే భార్య ధర్మం. భర్త యొక్క ఆధ్యాత్మిక భక్తి ధర్మానికి లోబడి ఉండటం కూడా భార్యధర్మమే. ఆ ధర్మం ప్రకారమే తోరల్ మారుమాటాడక ఆ బందిపోటు వెంట వెళ్ళిపోయింది. మారు మనువుకు ఆమె భర్త ఆజ్ఞప్రకారమే వెళ్ళింది. ఆమెకు అది అంగీకారమా కాదా అన్న ప్రశ్నకు అక్కడ తావు లేదు. అందువల్ల అందులో దాంపత్య ద్రోహం ప్రసక్తే లేదు. పితృస్వామిక ధర్మం ప్రకారమైనా, భక్తి ధర్మం ప్రకారమైనా ఆమె నిజమైన సతి లక్షణాన్ని ఆచరించింది అంతే. బందిపోటును తన సాహచర్య సుగుణాలతో భక్తుడిగా మార్చింది కనుక అది భక్తి ధర్మాన్ని నిలబెట్టేదే అవుతుంది.

లీరల్ బాయ్ భర్త ఆమె ఆధ్యాత్మిక ఆసక్తులకు సరిపడనివాడు కావటం వల్ల అనేక కష్టాలు పడింది. అయినా తన సహనంతో కొన్నాళ్ళకు అతనిని తన భక్తి మార్గానికి మళ్లించగలిగింది. భక్తి ఉద్యమంలో అది ఆమె విజయం. తోరల్ అయినా , లీరల్ అయినా భక్తిసాధనలో గురువు ప్రాధాన్యతను ప్రస్తావించారు. అస్తిత్వ సముద్రాన్ని దాటాటానికి సద్గురువునుండి నేర్చుకొనటం, వివేకుల జ్ఞానవంతుల సాహచర్యం అవసరం అంటుంది తోరల్. “హరిజనుల వెంట(అంటే హరిభక్తుల వెంట) నడుస్తూ/ గురువు అనుగ్రహంతో/ పరిపక్వుడైన నావికుని నావలోనే వెళతాను” అని నమ్మకంగా చెప్తుంది లీరల్.

16 వశతాబ్ది లో బెంగాల్ కు చెందిన చంద్రాబతిని భక్తి కవి అనటం కంటే కావ్య కవి అనటమే సముచితం. బెంగాలీ సంస్కృత భాషలలో పండితుడు, కవి అయిన తండ్రి ప్రభావంతో, ప్రొత్సాహంతో కావ్యాలు వ్రాసింది. రామాయణం మరీ ప్రత్యేకమైన రచన. రామాయణాన్ని సీతను కేంద్రంగా చేసి వ్రాయటం ఆ ప్రత్యేకత. రాముడు రావణుడి ని చంపటం ముఖ్యం కాదామెకు. సీత వ్యక్తిత్వాన్ని, ప్రేమను, కోరికను, విరహవేదనను … మొత్తంగా ఆమె జీవితంలోని వ్యధను చెప్పాటానికి ఉద్దేశించింది. సీత ప్రయోజనాల కోణం నుండి రాముడి వ్యక్తిత్వాన్ని నిరూపించటం అందులో భాగంగానే జరిగింది. సీత కోణం నుండి రామాయణకథను చెప్పింది కనుక ముకుంద రామారావు దీనిని సీతాయాణం అన్నారు. సీత పక్షాన రాముడిపై విమర్శను, అతని ప్రవర్తన పట్ల విమర్శను కథనంలో భాగం చేసిన చంద్రాబతి స్త్రీవాది కావచ్చు కానీ భక్తి కవి మాత్రం కాదు.

ఈ కాలపు ఒడియా కవయిత్రి మాధబి దాసి పూరీ జగన్నాధుని భక్తురాలు. అతనిని కేంద్రం గా చేసుకొని ఆధ్యాత్మిక భక్తి కవితలు అనేకం వ్రాసింది. జగన్నాధుడి ముందు తనఅల్పత్వాన్ని ఆమోదించి దాసోహం అనటం ఆమె కవితలలో కనిపిస్తుంది.

పశ్చిమ భారతంలో రాజస్థాన్ ప్రాంతానికి చెందిన 16 వ శతాబ్ది కవయిత్రి మీరాబాయి. రాజపుత్ర రాజకుటుంబంలో పుటింది. మూడునాలుగేళ్ల వయసులోనే కృష్ణ రూపం ఆకర్షించింది. నిత్యం నిరంతరం ఒక చిన్న కృష్ణ విగ్రహంతో గడిపింది. ఆటాపాటా అన్నీ కృష్ణుడి తోనే.అతనే తన భర్త అని నమ్మింది. అందువల్లనే తండ్రి చేసిన పెళ్ళిలో ఇమడలేకపోయింది. బృందావనం వెళ్ళింది. భర్త భోజరాజ్ ఆమె ఆరాధనకు ఎవరూ అడ్డురారని ఇచ్చిన హామీతో మేవాడ్ తిరిగి వచ్చింది. తనభర్త కృష్ణుడు అని నమ్మింది కనుక లౌకిక భర్త మరణించినప్పుడు రాజపుత్ర సంప్ర దాయం ప్రకారం సహగమనం చేయటానికి నిరాకరించింది. తరువాత కుటుంబలో పెరుగుతున్న వ్యతిరేక వాతావరణంఆమెను ఇల్లు విడిచి బృందావనం వెళ్లేట్లు చేసింది. చాలాకాలం అక్కడ గడిపి ద్వారకకు వెళ్ళింది. అక్కడే మరణించింది. తంబూరా మీటుతూ కృష్ణభజనలు గానం చేయటం, పారవశ్యంతో నర్తించటంలో జీవితాన్ని ధన్యం చేసుకొన్నది మీరా. పశ్చిమ రాజస్థానీ , పంజాబీ హిందీ మాండలికమైన వ్రజ , ఖడీ బోలీ, గుజరాతీ భాషలలో ఆమె వందల కొద్దీ కవితలు, భజనలు రచించింది. సంగీత ప్రపంచంలో మీరా భజనలకు ఉన్న ప్రాధాన్యతను, ప్రభావాన్ని పేర్కొన్నారు రచయిత.

హరిలేని జీవితం జీవితం కాదు అని నమ్మిన మీరా కుటుంబం నుండి ఎన్ని వత్తిళ్లు ఎంత నిర్బంధం ఉన్నా హరిని తప్ప మరొకరిని కోరుకోలేను అని ఒక కవితలో చెప్తుంది. గోవర్ధన పర్వతాన్ని ఎత్తి చిటికిన వేలిమీద మోసి ప్రళయం నుండి గోవులను , గోపాలురను, గొల్లపల్లెను కాపాడిన కృష్ణరూపం ఆమెకు ప్రియమైనది. దాదాపు ప్రతి రచనలో కొండనెత్తిన ఆరూపాన్నే మీరాప్రభువు అని పేర్కొన్నది. గిరిధరుడిని వరించింది కనుక అతనితో పెళ్లి గురించి కన్న కలలు, అతను లభించలేదన్న విరహవేదన ఆమె రచనలకు వస్తువైంది. ప్రియుడి వాంఛలో పడి పాలిపోయిన మీరా , అతని అధరామృతమే తనకు అవసరమైన మందు అని భావించే మీరా , ఆ ప్రియుడి కోసం బయట వెతికే మీరా , “ ఆ ప్రియుడు /ఇక్కడే ఉన్నాడు /లోన/ అతను వదలడు / అని నిర్ధారణకు వచ్చే మీరా, ప్రభువును కీర్తిస్తూ ఆనందంలో తనను తాను పోగొట్టుకొన్న మీరా, ప్రభువు మత్తులో తూగుతూనే ఉండే మీరా - ఇలా అనేక స్థితులలో , అవస్థలలో జీవించిన మీరా ఆమె రచనలలో దర్శనమిస్తుంది. “ సొగసైన నలుపు వర్ణపు ప్రభువుకు / నేను లొంగిపోయాను /అవును! అతనికోసం నా జీవితాన్ని నేను త్యజిస్తాను /అతని మూలంగా /ప్రాపంచిక అణుకువని కుటుంబ కట్టుబాట్లని వదిలేసాను” అంటుంది ఒక కవితలో. అది మీరా భక్తి నిబద్ధత.

8

17 వ శతాబ్ది కవయిత్రులు నలుగురు. కన్నడ కవయిత్రి సంచియ హొన్నమ్మ ను భక్తికవి గా చెప్పటానికి వీలులేదు.ఆమె మైసూరు సంస్థానంలో రాణివాసపు సేవకురాలే కానీ భక్తురాలు కాదు. మైసూరు రాజాస్థాన కవి సింగరాచార్య ఆమె లోని కవిత్వ కళను కనిపెట్టి శిక్షణ ఇచ్చాడు. ఆమె ‘హదిబదేయ ధర్మ’ అనే కావ్యం వ్రాసింది. ‘అదేకాంతి’ పుస్తక రచయిత చేసిన కావ్య పరిచయాన్ని బట్టి అది అనుకూలవతి అయిన భార్య కుటుంబంలో నిర్వహించవలసిన ధర్మాలను ప్రబోధించిన గ్రంథం అన్నది స్పష్టం. ఆయన ఉదహరించిన ఆమె కవితలో కన్నదీ పెంచిందీ స్త్రీలే అయినా వాళ్ళను నిందించే మొగవాళ్లు మొరటువాళ్ళు అంధులు అన్న అభిప్రాయం కనబడుతుంది. ”గర్భంలో వారు ఒకటే / పెరుగుదలలో వారు ఒకటే” అయినప్పుడు ఆ తరువాత ఆడవాళ్లకు అణకువ మగవాళ్లకు అధికారం ఎక్కడినుండి వస్తున్నాయన్నవేదన అందులో వినబడుతుంది. ఆరకంగా జెండర్ వివక్షను గుర్తించి ప్రశ్నించిన కవయిత్రిగా ఆమెను తెలుసుకొనటం సంతోషకరమే అయినా పూర్తిగా సామాజిక కౌటుంబిక జీవితంలో స్త్రీలు ఉండవలసిన తీరు ను నిర్దేశిస్తూ అదే సమయంలో మార్చుకోవాల్సిన విషయాలను సూచిస్తూ వ్రాసిన కావ్యంగా ఇది భక్తి కవిత్వ పరిధిలోకి వచ్చేది కాదు.

తెలుగులో ఈ శతాబ్దపు భక్త కవయిత్రి గా పేర్కొన బడిన స్త్రీ బాలపాపాంబ. ఆమె తండ్రి వీర వసంత వసుమతీశుడు శివభక్తి పరుడు. బాలపాపాంబ కూడా శివభక్తురాలు. అందువల్లనే శివభక్తురాలై స్త్రీగా ఒక సామాజిక విప్లవం లేవనెత్తి, పన్నెండవ శతాబ్దిలో జీవించిన ఆక్కమహాదేవి జీవితం ఆమెకు కావ్య వస్తువు కాగలిగింది. లింగాన్ని చేతబట్టి దిగంబరంగా కల్యాణ నగర ప్రవేశం చేసిన అక్కమహాదేవికి అల్లమ ప్రభువుతో జరిగిన సంవాదాన్నిపాపాంబ నిర్వహించిన తీరు తాత్విక గంభీరతను సంతరించుకొంది. “పరతత్త్వ నిధియైన పరమేశ్వరుని సతికి / మరి కోకలేల .. “ అని “సుకృత దుష్కృతములకు చొరక నిర్గుణ వ్యక్తి / వికృతి బొందిన నాకు వేషమేమిటికి” అని అక్కమహాదేవి ముఖతః బాల పాపాంబ వేసిన ప్రశ్నలు ఆమె శివతత్వ జ్ఞాన గాఢతను వ్యక్తం చేస్తాయి. నిజానికి బాల పాపాంబ కాలానికి తెలుగుదేశంలో వీరశైవం వెనకబట్టింది. వైష్ణవం పుంజుకొన్నది. అటువంటి పరిస్థితులలో ఒక స్త్రీగా తన శివభక్తి నిబద్ధతను ప్రకటించటానికి తనకంటే నాలుగైదు శతాబ్దాల క్రితం ‘పురుష విరక్త’ గా పాల్కురికి సోమనాధుడిచేత చెప్పబడిన అక్కమహాదేవి సరి అయిన మాధ్యమం అని గుర్తించటంలో , యక్షగానంగా దానిని రచించడంలో వుంది పాపాంబ సామర్ధ్యం.

17 వ శతాబ్దపు భక్త కవయిత్రులలో మరాఠీ ప్రాంతానికి చెందిన బహిణా బాయి , సంత్ సక్కు బాయి ఉన్నారు.ఇద్దరూ వారకారి సంప్రదాయంలో వాళ్ళే. విఠలుడి పట్ల అచంచల భక్తి విశ్వాసా లతో అభంగ్ లు వ్రాసారు. పాడారు. బ్రాహ్మణ కులంలో పుట్టి నిమ్న కులస్థుడైన సంత్ తుకారాం భక్తి గానంతో ప్రభావితురాలై అతనినే గురువుగా స్వీకరించింది బహిణా బాయి. సంప్రదాయ బ్రాహ్మణ మతాచారాల పట్ల పట్టింపు ఉన్న తనకన్నా దాదాపు ముప్ఫయి ఏళ్ళ పెద్దవాడైన భర్త నియంత్రణ లో కష్టాలు పడుతూ కూడా ఆమె తనదైన భక్తిమార్గంలో సాగిపోయింది. ఆమె సహనం, సంసార బాధ్యతల నిర్వహణ క్రమంగా భర్తను ఆమె మార్గానికి అడ్డురాకుండా ఆపగలిగాయి. భక్తి మార్గంలో సాగటానికైనా , భర్తపట్ల విశ్వాసంగా జీవించటానికైనా ఆమె పడిన ఆంతరిక సంఘర్షణ ఆమె అభంగ్ లలో వ్యక్తమైంది.

“బిగ్గరగా అరుస్తాయి వేదాలు, నినాదిస్తాయి పురాణాలు / స్త్రీలకు ఒరిగేదేమీ లేదు” అని ప్రారంభమయ్యేరచనలో‘స్త్రీ శరీరంతో పుట్టినవాళ్లకు సర్వోన్నత ఆధ్యాత్మిక సంపన్నత పొందటానికి సాధనాలేమున్నాయి’అన్న ప్రశ్నను సంధించటమంటే బహిణాబాయి వేదాలు స్త్రీల ఆధ్యాత్మిక ఆసక్తులను సంతృప్తి పరచలేనివని స్పష్టంచేయటమే. ”వాళ్ళు అవివేకులు, మరులు గొలిపేవారు, మోసగించేవారు, - స్త్రీతో ఎటువంటి సంబంధమైనా విపత్కరం” అనే మనువాక్యాన్ని ప్రస్తావించిన ఆమె ఇలాంటి వ్యతిరేక సామాజిక సందర్భంలో స్త్రీలు ప్రపంచంలో సత్యాన్నిఎలా చేరుకోవాలి అని మథనపడింది. దానికి సమాధానమే భక్తిమార్గ గమనం. భక్తి సాధనకు హృదయసమర్పణ ముఖ్య మని కూడా గుర్తించింది.తానాలా విఠలుడికి హృదయం ఇచ్చిన భక్తురాలు. హరిని పూజించటం ఆమెకు ఇష్టం. దానికి అవరోధాలు కల్పిస్తున్నాడు భర్త. తిడుతున్నాడు, కొడుతున్నాడు. భక్తి కోసం భర్తను, సంసారాన్ని వదిలెయ్యవచ్చు. కానీ “భర్తని వదిలేయటం వేదాల బోధనలకు విరుద్ధం”, “ తన కర్తవ్యాన్ని విస్మరించరాదని వేదాలు బోధిస్తున్నాయి” అని ఏ వేదాలైతే స్త్రీలకు ఒరిగించేదేమీ లేదని నిరాకరించిందో ఆవేదాలు చెప్తున్నాయని భర్తతోనే జీవించటానికి, ఆవేదాలు బోధిస్తున్నాయి అని భర్తను సేవించటానికి, కుటుంబ బాధ్యతలు నిర్వహించటానికి తనను తాను ఆమె సంసిద్ధం చేసుకొనటం ఒక వైరుధ్యం. భక్తిని కౌటుంబిక ధర్మాలతో సమన్వ యించు కొనటానికి ప్రయత్నించిన భక్త కవయిత్రి బహిణాబాయి.

సక్కుబాయి విఠలుని భక్తుల ఇంట పుట్టి విఠల భక్తురాలై అత్తింటి ఆరళ్ళు పడుతూ కూడా విఠలుడి పాదాలు చేరటం హృదయాభిలాషగా జీవించింది.

9

18 వ శతాబ్ది భక్త కవయిత్రులు తొమ్మిది మంది. దక్షిణ ప్రాంతం వాళ్ళు నలుగురు. హెలవ కట్టె గిరియమ్మ కన్నడ కవి. వీర శైవం తరువాత వ్యాప్తిలోకి వచ్చిన హరిదాస ఉద్యమానికి ప్రతినిధి అక్కమహాదేవిలాగా వివాహబంధాన్ని తిరస్కరించింది. మిగిలిన ముగ్గురు తెలుగువాళ్లు. కందిమల్లయపల్లె ఈశ్వరమ్మ కాలజ్ఞాన తత్వవేత్త వీరబ్రహ్మం మనుమరాలు. పెళ్లి చేసుకోకుండా ఆత్మజ్ఞాన సంపాదనలో జీవితం గడిపింది. తాత గారి తరువాత వీరబ్రహ్మేంద్ర మఠానికి అధిపతి అయింది.నిర్గుణోపాసనలో భక్తి ని ప్రచారం చేసింది. కాలజ్ఞానతత్వాలు అనేకం వ్రాసినట్లు చెప్తారు. కానీ పోతులూరి వీరబ్రహ్మం, దూదేకుల సిద్దయ్య, యాగంటి లక్ష్మయ్య నాసరయ్య, చలమయ్య , తూము నరసింహం మొదలైన వాళ్ళ పేర్లతో నమోదైనట్లు ఈశ్వరమ్మ తత్వాలుగా స్థిరపడి ఏవీ దొరకటం లేదు. రచయిత ఇందులో ఇచ్చిన తత్వం ఆమెదే అని నిర్ధారించి చెప్పినదే అయితే ఈశ్వరమ్మ తత్వాల సేకరణలో అది ఒక ముందడుగు అవుతుంది.

తరిగొండ వెంగమాంబ అక్కమహాదేవి వంటి భక్త కవయిత్రి. విష్ణుభక్తురాలు. బాల్యంలోనే భక్తి భావం చిగిర్చి మొలక కట్టి పాటలు పాడుతుండేది. సుబ్రహ్మణ్య దీక్షితుల వద్ద శిక్షణ అందుకు మరింత దోహదం చేసింది. వేంకటేశ్వరుడే తన భర్త అన్న నమ్మకం బలపడింది. అక్కమహాదేవి లాగానే భర్తను దరిచేరనీయలేదు. అతను మరణిస్తే శిరోముండనానికి అంగీకరించలేదు. తనభర్త వెంకటేశ్వరుడుండగా తాను జుట్టు తీయించుకొనటం ఏమిటన్నది ఆమె అభిప్రాయం. వితంతు విధులను నిర్వర్తించకపోవటం,తరిగొండ నృసింహస్వామి కొండ గుడిలో ఏకాంత ధ్యానాలు ఆమెను లోకవిమర్శకు గురిచేశాయి.తరిగొండ వదిలి తిరుమలకు ప్రయాణమైంది. తుంబుర కొనలో తపస్సు చేసింది. తరువాత తిరుమల చేరి యోగినిగా వేంకటేశ్వరస్వామి సేవలో జీవితం గడిపింది.

స్వామి సేవలో తాళ్ళపాక కుటుంబం సరసన సగౌరవంగా నిలబడిన భక్త కవయిత్రి వెంగమాంబ. ఆమె సాహిత్యమంతా భక్తి ప్రధానమైనదే. శతకాలు, యక్షగానాలు, ద్విపద కావ్యాలు, పద్య కావ్యాలు మొదలైన భిన్నప్రక్రియలలో ఉన్నాయి ఆమె రచనలు. వాటిని స్థూలంగా పరిచయం చేస్తూ ముకుందరామారావు ఒక కీర్తనను శివనాటకం యక్షగానం నుండి ఉదాహరించి శివకేశవులకు అభేదాన్ని చూసే ఆమె మత్తతాత్వికత విశిష్టతను సూచించారు. ఆ కీర్తనలో ‘ స్వామి శ్రీ తరిగొండ నరహరి యాయే అన్నది చివరి పాదం ప్రారంభం. తరిగొండలోని లక్ష్మీ నరసింహ స్వామికి వెంకటాచలపతికి ఆమె దృష్టిలో అభేదం.ఇక్కడ ఒక్కచోటే కాదు, కావ్యాలలో తానుగా చేసిన వర్ణనలలోనైనా పాత్రముఖంగా చేసిన భగవత్ ప్రార్థనలలో నైనా పదేపదే ఈ అభేదాన్ని చెప్పింది ఆమె.

వెంగమాంబ మనిషి వికాసానికి, స్వేఛ్చకు అవరోధంగా ఉన్న సామాజిక ఆచారాలను, గుణంతో నిమిత్తం లేని కులాధిక్య భావనలను నిరసించింది. ఆచారాలకన్నా అంతరంగ శుద్ధికి ప్రాధాన్యతను ఇచ్చింది. మూడు దినాల బహిష్టు ముట్టు ఒక స్నానంతో పోతుందా అన్నది ఆమె ప్రశ్న. బహిష్టు రక్తస్రావ మూల స్వభావం దేహాన్ని వీడినది కాదుకదా ! మళ్ళీ నెలకు కనబడేదేకదా! అన్న లౌకిక వాస్తవ మూలం నుండి వచ్చిన ప్రశ్న అయిఉంటుంది అది.

దార్లసుందరమ్మ గురుముఖతః తత్వజ్ఞాన బోధపొందింది. సాలె కుల సంజాత. వివాహిత. “పాపభయ విభంగ భావలింగ” అన్న మకుటంతో భావలింగశతకం తన ముప్ఫయ్యవ యేట వ్రాసింది. ఎందుకు వ్రాసింది? “నిన్నుఁ దెలియఁ గాన” “నీమీది పద్యములు చెప్పబూనుకొంటి” అంటుంది. తెలియని దానిని తెలుసుకొనే అన్వేషణలో పద్యరచన జరిగింది. తెలియనివాడు, తెలుసుకోవలసినవాడు శివుడు. సుందరమ్మ భావలింగ శతకంలో భక్తికన్నా తత్త్వానికి ప్రాధాన్యత. భక్తి అయితే ఆకారం, అలంకారం, గుణం కలిగిన అవతారమూర్తి లీలావిలాస వర్ణన ప్రధానం అవుతుంది. భావలింగ శతకంలో ఏ ఆకారం లేని ఎవరూ తయారుచేయని ప్రాకృతిక పదార్ధం రాయి ప్రధానం. దానిని నిఖిల రాజ్యములకు పట్టు అంటుంది. రాయి శివుడికి ప్రతీక అయిన లింగం. దానిని అరచేత పెట్టుకొని కళ్లారా చూచి కళ్ళుమూసుకొని మనసులో దానిని దర్శించగలగటమే లింగైక్యత అంటుంది సుందరమ్మ. అదే సమయంలో రామేశ్వరం, శ్రీశైలం, కాశీ , గయ మొదలైన చోట్ల భగవంతుడు అని కొలవబడేది రాయే కదా అని విగ్రహారాధనను పరిహసించింది.

ఐక్యత అంటే నీవు నేను అనే ద్వంద్వాలు లేని అనుభవ స్థితి. దానికి మార్గం యోగం. అందుకు చేయూత ఇయ్యవలసిన గురువును ఆమె ‘మరచినట్టి సొమ్ము దొరకటానికి సహాయపడే వాడుగా’ పేర్కొంటుంది. యోగ సాధన సాధ్యం కానివాళ్లే వేదాలను వల్లెవేస్తుంటారని ఆమె అభిప్రాయం. ప్రాణహింసతో కూడిన యజ్ఞ యాగాదులను నిరసించింది. “కటికవాని కాళ్ళు గడిగి మ్రొక్కఁ గ వచ్చు / సోమయాజి ముఖము జూడరాదు” అని నిష్కర్షగా చెప్పింది. కులము,ధనము, విద్య ఇవేవీ గొప్పకావు, మాట మీద నిలబడటమే గొప్ప అట్లా మాటమీద నిలబడేవాడు మాదిగైనను గొప్ప అని భావించింది.

సతి లోయల్, గౌరీబాయి ఇద్దరూ 18 వ శతాబ్ది గుజరాతీ కవయిత్రులు.లోయల్ కమ్మర కుటుంబంలో పుట్టింది. పశువుల కాపరి కులానికి చెందిన లాఖాను ప్రేమించింది. కులాల అంతరం వాళ్ళ పెళ్ళికి అవరోధం అయింది. డబ్బు సంపాదించి తమకులాల వారి ఆమోదం పొందటానికి లఖా దొంగ అయి ఎక్కడెక్కడో తిరగటం మొదలు పెట్టాడు. ఈ ఎడబాటు కాలంలో లోయల్ తమగ్రామానికి వచ్చిన ఒక సంత్ కు శిష్యురాలైంది. ఆమె వ్రాసిన భజనలు లఖాను సంబోధిస్తూ సన్మార్గానికి రావటానికి మంచి గురువును ఎంచుకోమని ప్రబోధిస్తూ ఉంటాయి. ‘నేను’,‘అంతానాదే’ అనే అహం భావాలు వదుల్చుకోవలసినవని , సజ్జన సాంగత్యం చేయవలసినది అన్నది ఆమె నమ్మకం.

గౌరీబాయి బ్రాహ్మణ వితంతువు. పుట్టిల్లు చేరి భక్తి మార్గంలో జీవించింది. అనేక భజనలు రాసింది పాడింది.

ఈ దశాబ్ది రాజస్థానీ కవయిత్రులు సహజో బాయి, దయాబాయి. పెళ్లయిన కొన్నాళ్లకే భర్త మరణిస్తే అతని వితంతువుగా జీవించటానికి అంగీకరించక మేనమామ చరణ్ దాస్ ను ఆధ్యాత్మిక గురువుగా ఎంచుకొని సాధనలో పడింది. ఆ చరణ్ దాస్ కు మరొక శిష్యురాలు దయాబాయి. ‘కోరిక లేనివారికి సంతృప్తి , స్వచ్ఛత’ అంటుంది సహజో. యోగినికి స్వీయ అస్తిత్వమే సహచరి అని ఆమె అభిప్రాయం యోగిని జాగృతి వలన పరమానందంలో ఉంటుందని, అది నిత్యం నిరంతరం అని ఆమె భావిస్తున్నట్లు ఆమె భజనలు చెప్తాయి. ఏకాంత ధ్యానమే పరమానంద కారణం అని ఆమె కు తెలుసు. దేవుడు గురువు -ఈ ఇద్దరిలో దేవుణ్ణి వదులుకోవచ్చుగానీ గురువును మాత్రం కాదని ఆమె నమ్ముతుంది. ఎందుకంటే పంచేద్రియాలు అనే దొంగలముందు అసహాయంగా ఉన్న తనను కాపాడేవాడు గురువే అని తెలిసిన సాధకురాలు ఆమె. దయాబాయి కవిత్వంలో ఉద్దేశిత దైవం పట్ల విరహంతో వేగిపోయే జీవుని వేదన కనబడుతుంది. “ ఎడబాటు గుంజాటన మంట నా హృదయంలో పుడుతుంది / ఓ దైవమా రా , నా ప్రియతమా రా / రా హృదయాల మాంత్రికుడా / రా, ఓ కృష్ణా , ఓ సహాజుడా / నిన్ను చూడాలని కోరుకుంటున్నాను” అన్న కవిత భాగం దానినే సూచిస్తుంది. ఎడబాటు లో కూడా వున్నది విరహమే. అయితే ప్రభునామస్మరణలో భక్తులు ప్రభువుగా మారిపోయి పొందే అనుభవం సర్వోన్నతమైంది అంటుంది దయాబాయి.

ఇక ఈ దశాబ్ది మరో కవయిత్రి కాశ్మీర్ కు చెందిన రూప భావాని. శ్రీనగర్ లో ఆధ్యాత్మిక వాతా వరణం గల పండిత్ కుటుంబంలో పుట్టి పెరిగిన కారణంగా రూపకు బాల్యంలోనే ఆధ్యాత్మిక మార్గం లో ఆసక్తి కుదిరింది. లోకాచారం ప్రకారం తండ్రి చేసిన పెళ్లి ఆమెకు సుఖ కరం కాలేదు. భర్త అత్తల నిరాదరణకు గురైంది. ఆధ్యాత్మిక పురోగతికి ఆ పరిస్థితులు అవరోధం అయ్యాయి. అత్తిల్లు వదిలి పుట్టిల్లు చేరింది.అక్కడ కూడా ధ్యాన సాధనకు భంగం కలుగుతున్నదని ఒక చోటు నుండి మరొక చోటుకు మారుతూ యోగసాధనలో అనేక సంవత్సరాలు గడిపింది.చివరకు తండ్రి ఇంటికి చేరి తొంభై ఆరేళ్ళు జీవించి మరణించింది.ఆమె కవితలలో భక్తిని మించి గాఢమైన తాత్వికత ఉంటుంది.

10

క్రీ. పూ. మూడు రెండు శతాబ్దాల నుండి క్రీ.శ. పద్దెనిమిదవ శతాబ్దం వరకు దాదాపు రెండువేల సంవత్సరాల కాలం మీద దేశంలోని భిన్న ప్రాంతాల నేల మీద జరిగిన సాహిత్య వ్యవసాయంలో 71 మంది స్త్రీలు హాలికులై పండించిన పంటను ఒక్కచోట చూడటం నిజంగా కన్నులపండుగ. హృదయానందం. భక్తి కవిత్వం అన్న పరిమితి తీసేసి శోధిస్తే ఈ పంట ఇబ్బడి ముబ్బడిగా ఉంటుందనటంలో సందేహం లేదు. నిజానికి ఆ పరిధికి అవతలి వైపు కవయిత్రులు కొందరు ఇందులో చేరకపోలేదు. ‘అదేనేల’ సంకలనంలోని థేరీ లు 20 మందే భక్తకవయిత్రులు. భావకాదేవి,ఒక అజ్ఞాత కవయిత్రి,సీతభట్టారిక, సుభద్ర నలుగురూ వ్రాసినవి లౌకిక వస్తువిషయ సం బంధ రచనలే. అలాగే ‘అదేకాంతి’ పుస్తకంలో అవ్వైయ్యార్ (తమిళ ),సంచియ హొన్నమ్మ( కన్నడ)

చంద్రాబాతి( బెంగాలీ ), తాళ్ళపాక తిమ్మక్క , ఆతుకూరి మొల్ల (తెలుగు) లౌకిక కావ్య కవులే కానీ భక్త కవులు కారు. ఆరకంగా చూసినప్పుడు 71 మంది నుండి ఈ తొమ్మిది మందిని మినహాయిస్తే ఆధ్యాత్మిక భక్తి మార్గ సాధనానుభవాన్నికవిత్వం చేసిన మహిళలు 62 మంది. వీరిలో బౌద్ధ ధర్మా వలంబకులైన థేరీలు 20 మంది పోగా మిగిలిన 42 మందిలో 18 మంది శివ భక్తి కవులు,21 మంది విష్ణు భక్తి కవులు, ముగ్గురు నిర్గుణ ఈశ్వరోపాసకులు.

భౌద్ధం, శైవం మాత్రమే ఒక సిద్ధాంతంతో, నిర్మాణంతో,నిర్దిష్ట ఆచరణ సూత్రాలతో, సరైన మార్గదర్శకత్వంతో సమష్టి మీద నడిచిన మత భక్తి ఉద్యమాలు. ఈ రెండింటికీ సాధారణ అంశాలు: 1. వేదాలను తిరస్కరించటం 2. కర్మకాండను నిరసించటం 3. స్త్రీ పురుష కుల భేదాలతో నిమిత్తం లేకుండా ఎవరైనా మత దీక్ష తీసుకొనటానికి అవకాశం.4. సంస్కృత ఆధిపత్యాన్ని నిరాకరించి జనసామాన్యానికి అర్ధమయ్యే ప్రాంతీయ భాషలలో బోధన, సాహిత్య సృజన. 5. సామాజిక ఆర్ధిక స్థాయీభేదాల ప్రమేయం లేకుండా భక్తులుగా అందరికీ ఒకేరకమైన జీవితవిధానంనిర్దేశించబడటం. అందువల్లనే అవి అనేక అసమానతల మధ్య నలిగిపోతున్న సామాన్య జనాన్నిముఖ్యంగా శూద్రులను, దళితులను, స్త్రీలను ఆకర్షించగలిగాయి. అస్తిత్వ గౌరవ చేతనను మేల్కొల్పి సామాజిక కట్టుబాట్లను, ఆచారాలను ధిక్కరించగల నైతిక ధైర్యాన్ని ఇచ్చాయి. 62 మంది ఆధ్యాత్మిక భక్తకవయిత్రులలో 20 మంది బౌద్ధ ధర్మ స్వీకర్తలు, కారైక్కాల్ ను కలుపుకొని 15 మంది వీర శైవ భక్తులు కాగలిగారంటే అదే కారణం. కారైక్కాల్ ను మినహాయిస్తే 14 మంది కవయిత్రులు వీరశైవం ఉఛ్ఛ దశలో ఉన్న 12 వ శతాబ్ది కవులే కావటం విశేషం. అందరూ కన్నడ కవులే. తెలుగు ప్రాంతాలలో వీరశైవ ఉద్యమ ప్రభావం సాహిత్యంలో కనబడుతుంది. స్త్రీలలో బాలపాపంబ ఉంది. దార్ల సుందరమ్మ కూడా లింగైక్యత లక్ష్యం గా భావలింగ శతకం వ్రాసినప్పటికీ వీరబ్రహ్మేంద్ర మఠ సం ప్రదాయ ప్రభావం, అచల యోగ ప్రభావం ఆమెలో నిర్గుణ బ్రహ్మొపాసన లక్షణంగా కూడా వ్యక్తం అయ్యాయి. కాశ్మీర్ కు చెందిన లల్లాదేవి, రూపభవానీ ఇద్దరూ శివ భక్తి కవిత్వ కర్తలే. 18 వ శతాబ్దం వరకు ఉన్న ఈ నలుగురు కవయిత్రులను కలుపుకొంటే శైవ కవయిత్రులు 18 మంది. అదేకాంతి పుస్తకంలో కనబడే ఈ 62 మంది భక్తి కవయిత్రులలో థేరీలు 20 శివ భక్తి కవయిత్రులు 18 మంది కలిసి 38 మంది అంటే సగానికి పైనే.

వీరశైవం తరువాత కన్నడ ప్రాంతంలో నిలదొక్కుకున్న హరిదాస ఉద్యమం కూడా సంస్కరణ ఉద్యమమే అయినా ‘వీర శైవం లాగా అది అందరినీ కలుపుకున్న సామూహిక ఉద్యమం గా కాక హరిభక్తిని పెంపొందించే వ్యక్తి కేంద్రీకృత ఉద్యమం గా’ మిగిలిపోయింది అంటారు ముకుందరామారావు ( 143) వీర శైవ ఉద్యమంలో వలే హరిదాస ఉద్యమంలో స్త్రీల భాగస్వామ్యం ఎక్కువగా లేకపోవటాన్ని గూడా రచయిత గుర్తించారు. దానికి ప్రతినిధిగా హేలవనకట్టె గిరియమ్మను ఒక్కదానినే ప్రస్తావించగలిగారు.

13 వ శతాబ్దిలో మరాఠీ ప్రాంతంలో పండరీపురంలోని విఠలనాధుడ్ని కేంద్రంగా చేసుకొని జ్ఞానదేవ్, నామదేవ్ వ్యాప్తిలోకి తెచ్చిన వారకరి ఉద్యమం ఒక రకంగా హరిదాస ఉద్యమం వలె విష్ణు పారమ్యాన్ని ప్రబోధించింది. ప్రచారం చేసింది. హరిదాసఉద్యమం వలే కాక వీర శైవ ఉద్యమంవలె ఇది నిమ్నవర్ణాలవారిని, స్త్రీలను ఆకర్షించిన ఉద్యమం. ఈ ఉద్యమం లో భాగస్వాములైన ఏడుగురు (7) స్త్రీలు వ్రాసిన కవిత్వం ఈ పుస్తకం ద్వారా పరిచయం అవుతుంది. గుజరాత్ ప్రాంతం లో మహాపంత్ సం ప్రదాయంలోని భక్తకవయిత్రులు ఆరుగురు(6) కనబడతారు. గురువు,సత్సంగం, అద్వైతం, భజనలు ఇందులో ముఖ్యం. ఆరాధనా రూపమా కృష్ణుడు, రాముడు ఏదైనా కావచ్చు. గంగా సతి వంటి నిర్గుణోపాసకులు కూడా ఇందులో ఉన్నారు. ఏమైనా ఇది కూడా వారకరి సంప్రదాయం వలెనె విష్ణు ప్రాధాన్య శాఖ అనుకోవచ్చు. అయితే హరిదాసు ఉద్యమం వాలే ఇవన్నీ కూడా వ్యక్తి కేంద్రీ కృత ఉద్యమాలే. మీరాబాయి వంటివాళ్ల భక్తి చేతన పూర్తిగా వ్యక్తిగత ఆధ్యాత్మిక పిపాసకు, ఆర్తికి సంబంధించినదే. ఆండాళ్ దగ్గర నుండి ఇలాంటి కృష్ణభక్తులైన కవయిత్రులను అందరినీ కలిపితే స్థూలంగా వైష్ణవ భక్త కవయిత్రులు ఈ పుస్తకంలో 24 మంది.

ఈ మొత్తం కవయిత్రులలో వివిధ ఉత్పత్తి కులాల శూద్రులు, దళితులు క్షత్రియులు, వైశ్యులు ఉన్నప్పటికీ బ్రాహ్మణ స్త్రీలు ఎక్కువే.

కుటుంబంలో భర్తలతోటి అన్యోన్య సంబంధంలో ఒకే భక్తి మార్గంలో సాగిపోయిన స్త్రీలు చాలామంది. కుటుంబంలో ఎదురవుతున్న వ్యతిరేక పరిస్థితులను తట్టుకొంటూ తనదైన భక్తి మార్గానికి , కుటుంబ అవసరాలతో , బాధ్యతలతో సమన్వయము చేసుకొంటూ సాగిపోయిన స్త్రీలు మరికొందరు. సాధనకు అవరోధంగా ఉందని కుటుంబాన్ని వదిలేసిన స్త్రీలు ఉన్నారు. భగవంతుడినే భర్తగా భావించుకొని పూర్వ వివాహ సంబంధాలను వదులుకొన్న అక్కమహాదేవి, మీరాబాయి వంటి వాళ్ళు ఉన్నారు. భగవంతుడిని భర్తగా భావించినవాళ్లు ఇహలోక భర్త మరణానికి వైధవ్య చిహ్నాలు మోయటానికి నిరాకరించటం ఎక్కువగా కనబడుతుంది. తరిగొండ వెంగమాంబ, సహజో బాయి మొదలైనవాళ్లు ఆ కోవలో వారే. మొత్తం మీద భక్తి ఉద్యమం స్త్రీలకు స్వంత ఆధ్యాత్మిక జీవితాన్నే కాదు, జీవితాన్ని నియంత్రించే అధికారాలకు, నియంత్రణలకు, నిర్బంధానికి ఆలవాలమైన వివాహవ్యవస్థను, దాంపత్య ధర్మాల పేరిట బరువై కూర్చున్న బాధ్యతలను, ఆచారాలను ధిక్కరించే స్వేఛ్ఛను కూడా ఇచ్చింది.

భక్తి ఆత్మాశ్రయం కనుక భగవంతుడి ని సంబోధించి చేసుకొనే విన్నపాలలో తరచు స్త్రీల స్వీయ జీవిత వ్యధలు, గాథలు భాగమవుతాయి. భక్త కవయిత్రుల రచనలు ఆ రకంగా తరతరాల స్త్రీల అనుభవ ధారను మనవరకు అందిస్తాయి. సాహిత్య చరిత్రలో తరచు ఉపాంతీకరించబడే స్త్రీల సాహిత్య కృషి గురించి ఇదేకాంతి పుస్తకం ఇచ్చే అవగాహన సాహిత్య చరిత్రలను పునర్నిర్మించుకోవలసిన అవసరాన్ని గుర్తు చేస్తున్నది. స్త్రీల ఆత్మగౌరవ అస్థిత్వచైతన్య వికసనకాలంలో నిలబడి మధ్యయుగాల వరకు భక్తి ని వాహికగా చేసుకొని తమ అంతరంగాన్ని విప్పిన స్త్రీలను వినటం, చదవటం మనకు తెలియని మన చరిత్రను తెలుసుకొనటమే.సాహిత్యం ద్వారా స్త్రీల భావాల, భావజాలాల అనుభవాల చరిత్రను నిర్మించుకొనటం గురించి ఆలోచించమని ఈ స్త్రీలు మనల్ని హెచ్చరిస్తున్నారు.

మనకోసం ఇంత పని చేసిన ముకుందరామారావు గారికి ధన్యవాదాలు. అభినందనలు.

- - కాత్యాయనీ విద్మహే

------------------------------------------------------------------

First Published:  7 Jan 2024 12:00 AM IST
Next Story