కొన్ని ..కొన్ని ..!(కవిత)
కొంత మంది పరిచయం
మరపురాని మధురస్మృతి
మన జీవన గమనం లో మలుపుతిప్పుతాయి
కొన్ని రహదారులు
కడదాకా వుండవు
ముసలితనంలో కూడా
కఱ్ఱపట్టుకోనైనా
కలిసుందామనే మాటలు
అసంపూర్ణ ప్రేలాపనలే
కొన్ని విషయాలు
మనిషిని బలహీన పరుస్తాయి
కొన్ని బాధకు కారణాలవుతాయి
కొన్ని ఘటనలు
మనిషిని గట్టిగా చేస్తే
కొన్ని సంఘర్షణలు
పరిపక్వతనిస్తాయి
కొన్ని సమస్యలు
అసందర్భంగా మనల్ని చుట్టుముడితే
అధిగమించాల్సినవి కొన్ని
కొన్ని బంధాలు
వదులుకోలేని బరువులు
కొన్ని గాయాలు
మాయలేని గరుతులు
కొన్ని సందర్భాలు విలువైనవయితే
కొన్నిస్పందనలను కూడగట్టేవి
కొన్ని జ్ఞాపకాలు
నిగూఢమైనవి
మనసు పొరలలో
నిక్షిప్తమైపోతాయి
ఎదుటి వారి కళ్ళల్లో
కటువైన సత్యాలు తెలుస్తాయి
కొన్ని స్వప్నాలు
ఇరు హృదయాల
కలయికకు పునాదులు
ఎన్నో మాటల పొందికలు
భవిష్యత్ వెలుగుల
ఆశాదీపాలు
మాట్లాడుకున్న అన్ని ఊసులు
మన మనస్సు పొరల్లో
విచ్చుకున్న స్మరణా విరులు
ఇరు హృదయాలు
నింపుకున్న
సజీవ సంఘర్షణలు
- కళ్ళే వెంకటేశ్వర శాస్త్రి
(బెంగుళూరు)