Telugu Global
Arts & Literature

కవి సుగమ్ బాబు కు కొందరు సాహితీ మిత్రుల నివాళులు

ప్రముఖ కవి, పైగంబర కవుల్లో ఒకరైన సుగమ్ బాబు ఈ మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సరాలు.

కవి సుగమ్ బాబు కు కొందరు సాహితీ మిత్రుల నివాళులు
X

పైగంబర కవులు పుట్టుక ముందు నుండి సుగమ్ బాబు నాకు మిత్రుడు...దాసరి నాగవర్ధన్, కిరణ్ బాబు, కమలాకాంత్, ఇలా మిత్రులం చాలా మందిమి గుంటూరులో

( పరుచూరి రాజారాం గారి ఇంట్లో కూడా) కలిసే వాళ్ళం.. అతని తల్లి చేతి వంటనీ, సేమియా పాయసాన్ని ఆప్యాయంగా తిన్నవాళ్ళం...

హైదరాబాద్ లో కూడా చాలా సార్లు కలిశాను.... రెక్కల తొలి రోజుల్లో రెండు మూడు వ్యాసాలు రాస్తే చాలా ఆనందించాడు.... పదిహేను రోజుల క్రితం కమలాకాంత్ భార్య చనిపోయారు... అప్పుడు ఇతని గురించి అనుకున్నాం....ఇవాళ ఈ అనివార్య దుర్ఘటన! అతని ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తూ..

- విహారి (సాహితీవేత్త )

పైగంబర కవిగా కొంతమంది పెద్ద కవులకు కూడా సుగమ్ బాబు గారు స్ఫూర్తి. తరవాత వివిధ ప్రక్రియల్లో ప్రయోగాత్మకంగా తన ముద్ర వేసిన కవి. చిరకాల మిత్రుడు. అనేక సందర్భాల్లో చిరునవ్వే సమాధానంగా అందించిన స్నేహశీలి సుగమ్ బాబు గారికి నివాళి.

- అఫ్సర్ (కవి)

క‌వి మిత్రుడు సుగ‌మ్ బాబు మృతికి నా నివాళి. నా జ‌ర్న‌లిజం తొలిరోజుల్లో ఆయ‌న‌తో క‌లిసి ఆంధ్ర‌భూమిలో ప‌నిచేశాను. ప్ర‌తి రోజూ రాత్రి 9 గంట‌ల‌కు ఇద్ద‌రం మా ఆఫీసు నుంచి స్టేష‌న్ వ‌ర‌కూన‌డుచుకుంటూ వెళ్లేవాళ్లం. సికింద్రాబాద్‌లో ఇప్పుడు సాగ‌ర్ హోమియో ఆసుప‌త్రి ఉన్న చోట అతి చిన్న మిఠాయి దుకాణం ఉండేది. అక్క‌డ రెండు రూపాయ‌లకు మసాల వేరుసెన‌గ ప‌లుకులు విధిగా కొనేవారు సుగ‌మ్ బాబు.

ఆ దుకాణ‌దారు సాహిత్యాభిమాని. అక్క‌డ ఓ ఇర‌వై నిమిషాలు కూర్చుని ఆ వేరుసెన‌గ ప‌లుకులు తింటూ సాహిత్య క‌బుర్లు చెప్పుకునే వారు వారిద్ద‌రు. ఆ దుకాణ య‌జ‌మానికి చ‌లం అంటే ఇష్టం. దిగంబ‌ర క‌వులు గురించీ చెప్పేవారు. ఓసారి ఆంధ్ర‌భూమిలో సుగ‌మ్ బాబు క‌విత వ‌చ్చింది. ఆ ప‌ద్యాన్ని ఆరోజు రాత్రి మిఠాయి దుకాణం య‌జ‌మానికి వినిపించి ఎలా ఉంది అని అడిగారు సుగ‌మ్ బాబు. పైగా ప‌క్క‌న ఉన్న నేను రాసాన‌ని చెప్పారు.

క‌విత విని పొంగిపోయిన ఆ య‌జ‌మాని ప్ర‌తిరోజూ నాకు కూడా వేరుసెన‌గ‌కాయ‌లు ఇచ్చేవారు డ‌బ్బులు తీసుకోకుండా. జీతం వ‌చ్చిన రోజున ఆయ‌న డ‌బ్బుల‌తో ఓ చిన్న పార్టీ... న‌న్ను క‌న్న‌కొడుకులా చూసుకున్నారు ఆంధ్ర‌భూమిలో ఉన్నంత వ‌ర‌కూ. ఓ సారి ఆయ‌న‌కు న‌ల‌త‌గా ఉందని తెలిసి స‌న‌త్‌న‌గ‌ర్ వెళ్లి చూసాను. ఆ త‌ర్వాత మాయ‌దారి గ‌జిబిజి బ‌తుకుల్లో ప‌డి క‌ల‌వ‌లేక‌పోయాను. ఇదిగో ఈ రోజు ఈ దుర్వార్త‌. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటున్నాను.

- ముక్కామ‌ల చ‌క్ర‌ధ‌ర్ ( సీనియర్ జర్నలిస్ట్ )


పైగంబర కవి,'రెక్కలు' రూపకర్త,రచయిత,

సినిమా దర్శకుడు, ఎం.కె. సుగమ్ బాబు మృతి బాధాకరం. జీవితమంతా కవిత్వంకోసం కలవరించిన ఆయనకు అక్షర నివాళి. కుటుంబ సభ్యులకు, మిత్రులకు సానుభూతి.

- నందిని సిధారెడ్డి ( తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షులు )


1986లో కరుణశ్రీగారి పనిమీద హైదరాబాదు నాంపల్లి స్టేషన్ రోడ్డులో ఉండే మయూరి వారపత్రిక ఆఫీసుకు వెళ్లి సుగమ్ బాబుగారిని తొలిసారిగా కలిశాను. ఆ తర్వాత చాలా కాలం సన్నిహితంగా గడిపాం. 'మయూరి'లో నా కవితలు ప్రచురించారు. నా చేత పుస్తకసమీక్షలు రాయించారు.

సుగమ్ బాబుగారు మొదట పైగంబరకవిగా, తర్వాత 'రెక్కలు' రూపకర్తగా ప్రసిద్ధులు.

సుగమ్ బాబుగారికి కన్నీటి వీడ్కోలు.

- గాలి నాసరరెడ్డి (కవి )


ప్రసిద్ధ కవి సుగమ్ బాబు గారికి నివాళులు.తెలుగు సాహిత్య రంగంలో విన్నూతమైన కవిగా,రెక్కలు ఆవిష్కర్తగా ప్రభావవంతమైన పాత్రను పోషించారు.నాకెంతో ఆత్మీయులు.మేమిద్దరం ఎప్పుడు కల్సినా సాహిత్య చర్చలు సాగేవి.మంచి వ్యక్తిత్వం కలిగిన వారు.సుగమ్ బాబు గారి మృతి సాహిత్య రంగానికి తీరని లోటు.

ఇన్నాలిల్లాహి వ ఇన్నాఇలైహి రాజివూన్.

- కవి కరీముల్లా (ముస్లిం రచయితల సంఘం, ఆంధ్రప్రదేశ్ )

అయ్యో ! మా పెద్దాయన సుగమ్ బాబు గారు ఇక లేరా ? ""అమ్మ "" కావ్యాన్ని కవిత్వీకరించి నాకు అంకితమిచ్చాడు ..నేనే ప్రచురించాను ..మా అబ్బాయి కీర్తి కిరణ్ పెళ్లికి గుంటూరుకు వచ్చాడు ..రెండు రోజులున్నాడు ..

తిరుపతిలో మేము జరిపిన సాహిత్య సంబరాలకు పిలవగానే సంతోషము తో వచ్చేవాడు .రెక్కలు కవితారూప సృష్టికర్త ,గొప్పకవి ,కమ్యూనిస్టు .

సుగం బాబు గారికి మా హృదయ పూర్వక ఆత్మీయ కన్నీటి నివాళులు ....

- కోట పురుషోత్తం ( సాహితీ వేత్త )

First Published:  18 Oct 2022 6:09 PM IST
Next Story