సింగినాదం జీలకర్ర
అక్కడ ఏమీ లేదు. అంతా ఉత్తుత్త ఆర్భాటమే అని చెప్పడానికి సింగినాదం జీలకర్ర అనే జాతీయం ఉపయోగిస్తారు. కొంతమంది ఉన్నదానికన్నా పదింతలు చెబుతుంటారు. ప్రచార ఆర్భాటంతో అదరగొడతారు. ఖచ్చితంగా వెళ్ళి తీరవలసిందే అనేలా భ్రమపెడతారు..... దాంతో మనం ఎంతో ఆసక్తిగా ఉత్సాహంతో ఉరుకులు పరుగులమీద అక్కడకి వెళతాం. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకేముంది మనం అనుకున్నదానికి చూసిన దానికి దోమకు ఏనుగుకు వున్నంత తేడా వుంటుంది. నిరాశతో నిట్టూరుస్తారు. ఎవరైనా దాని గురించి మరలా మనతో చెబుతుంటే సింగినాదం జీలకర్రలే ఉత్తమాటలు ఆపు అంటాం.
ఇంతకీ ఈ సింగినాదం జీలకర్ర అనే జాతీయం ఎలా పుట్టిందంటే.... నిజానికి ఇది సింగినాదం కాదు శృంగనాదం. శృంగనాదం అంటే పెద్ద పెద్ద కొమ్ముబూరలతో ఊదేటప్పుడు వచ్చే ధ్వని. అది చుట్టుపక్కల చాలా దూరం వరకు పెద్ద శబ్దంతో వినబడుతుంది. ఈ శృంగనాదం అనేమాట జానపదులు నోరు తిరక్క సింగినాదంగా పలకడం మొదలు పెట్టారు. సింగినాదం అనే మాట ఎలా పుట్టిందో తెలిసిపోయింది కదా మరి ఈ జీలకర్ర అనే పదం దానికి ఎలా జతయ్యింది. దాని వెనుక వున్న కథ ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ జాతీయం నెల్లూరు ప్రాంతంలో చాలా ప్రసిద్ధి కెక్కింది.
పూర్వకాలంలో అడవుల్లో దొంగలు గుంపులు గుంపులుగా తిరుగుతుండేవాళ్ళు. వాళ్ళు ప్రయాణీకుల మీద దాడి చేసి వాళ్ళ దగ్గరున్నవన్నీ ఎత్తుకొని పోయేవారు. కొన్ని సార్లు చుట్టుపక్కల వున్న వూర్లమీద పెద్ద ఎత్తున కత్తులు బళ్ళాలతో, గట్టిగా కొమ్ము బూరలు వూదుతూ, అరుపులు కేకలతో దాడి చేసేవాళ్ళు. ఆ చప్పుళ్ళకు జనాలు భయపడి ఎక్కడి వక్కడ వదిలేసి వెనక్కు తిరిగి చూడకుండా పారిపోయేవాళ్ళు. దొంగలు దొరికిన జనాల వంటి మీద వున్నవి దోచుకొని, ఇళ్ళలోకి దూరి ధాన్యం, నగలు, బట్టలు, వస్తువులు... అలా విలువైనవన్నీ ఎత్తుకొని పోయేవాళ్ళు. జనాలు ఆ కొమ్ము బూరల చప్పుడు వింటే చాలు భయపడి పోయేవారు. వణికిపోయేవారు.
ఆ తరువాత జనాలు దొంగలకు తాము సంపాదించినవి దొరక్కుండా భూమిలోపల రహస్యంగా ఎవరికీ తెలియని చోట దాచి పెట్టసాగారు. యువకులు కత్తులు, బళ్ళాలు తిప్పడం నేర్చుకొని గుంపులు గుంపులుగా రాత్రుళ్ళు కాపలా కాస్తూ దొంగలను ఎదిరించడం మొదలు పెట్టారు. దొంగలు వాళ్ళను ఓడించి వూరిలోకి అడుగుపెట్టినా ఎక్కడా ఏమీ దొరికేవి కావు. దాంతో నెమ్మదిగా కొంతకాలానికి దొంగల దాడులు తగ్గిపోయాయి.
చాలా రోజుల తరువాత ఒక సారి పెద్ద ఎత్తున శృంగనాదాలు వినబడ్డాయట. ఆ వూరివాళ్ళంతా భయంతో అదిరిపడి ఎక్కడివక్కడ సొమ్ములు, ధాన్యం, గబగబగబ భూగృహాలలో దాచి పెడుతుంటే, యువకులు అటకలమీద పెట్టిన కత్తులు, కొడవళ్ళు, తీసి పోరాటానికి సిద్ధం కాసాగారు.
నిజానికి అలా ఊదిన వాళ్ళు దొంగలు కాదు. జీలకర్ర వ్యాపారస్తులు. అప్పట్లో జీలకర్రను విదేశీయులు పడవల్లో వేసుకొని అమ్మడానికి వచ్చేవాళ్ళు. పూరు దగ్గరపడగానే తాము వచ్చినట్లు తెలియడం కోసం వూరి పొలిమేర నుంచి శృంగనాదం చేసేవాళ్ళు. జీలక్రర కావలసిన వాళ్ళు ఆ చప్పుడు విని అక్కడికి పోయి కొనుక్కొని వచ్చేవాళ్ళు.
అది తెలీని ఆ వూరివాళ్ళు వచ్చింది దొంగలనుకొని కత్తులు కటార్లు సిద్ధం చేసుకొని అక్కడికి పోయారు. పోయి చూస్తే ఇంకేముంది దొంగలు కాదు. "సింగినాదం విని దొంగలనుకున్నాం కానీ వచ్చింది జీలకర్ర " వ్యాపారస్తులని అందరూ నవ్వుకొన్నారంట.
అలా అప్పటినుంచి ఏమీలేదు వుత్తుత్తిదే అని చెప్పడానికి సింగినాదం జీలకర్ర అని జాతీయం వాడుకలోకి వచ్చింది.
(జాతీయం వెనుక కథ) -డా.ఎం.హరికిషన్-(కర్నూలు)