ఉద్యోగ విరమణ పర్వం అనే యుద్ధకాండ (కథ)
తెల్లవారుజాము 4 గంటలకే మెలుకువ వచ్చింది శ్రీనివాస్ కి.ముప్ఫయ్యారు ఏళ్ల ఉద్యోగ జీవితం లో ఇవాళ ఆఖరి రోజు. రిటైర్మెంట్. " ఆ పదం తలుచుకుంటేనే ఒక వైపు సంతోషం ఇంకో వేపు భయం.అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగం అంటేనే గొప్ప. అందులో చేరడమే ఆఫీసర్ గా చేరి ఈ రోజు జనరల్ మేనేజర్ గా రిటైర్ అవుతున్నాడు.
పద్మావతి , తన అర్థాంగి.నిజంగా ఇన్నేళ్లు ఆమె సహకారం ఉండబట్టే తాను ఈ స్థాయి కి వచ్చాడు. పిల్లలని తానే చూసుకుంది. వాళ్ళ చదువులు , ఉద్యోగాలు , పెళ్లిళ్లు అన్నీ తనే చూసుకొంది .అందరూ "నువ్వు అదృష్టవంతుడివోయి రిటైర్ అయ్యేసరికి పిల్లలు చక్కగా సెటిల్ అయ్యారు. "అని పొగిడే పొగడ్త కి పద్మ పూర్తి అర్హురాలు.రేపటి నుంచి ఇద్దరూ హాయిగా కాలం గడపచ్చు , ఆలోచిస్తూ హుషారుగా లేచాడు.అప్పటికే పద్మ లేచి వంట ఇంట్లో పని చేస్తోంది.లేచారా ? త్వరగా మెలకువ వచ్చిందా , "ఆప్యాయంగా అడిగింది. " కాఫీ తాగుతారా? "అడుగుతూనే వేడి వేడి గా ఘుమ ఘుమ లాడుతున్న కాఫీ గ్లాస్ అందించింది.
సాయంత్రం శ్రీనివాస్ ,పద్మావతి ఫంక్షన్ కి వెళ్తే ఆఫీస్ వాళ్ళు అందరూ శ్రీనివాస్ గురించిఇంద్రుడు ,చంద్రుడు అని పొగిడి భార్య భర్తలిద్దరికి శాలువాలు కప్పి సన్మానం చేశారు.అలాగే శ్రీనివాస్ కూడా ఆఫీస్ లో పనిచేస్తున్న అందరికి కృతజ్ఞతలు చెప్పి ఇంటికి వచ్చారు.
పద్మ అలసిపోయి నిద్రపోతే తనకి కంటిమీద కునుకు లేదు.ఇంక ఆఫీస్ కి వెళ్ళక్కర్లేదు అంటే ఒక దిగులు వచ్చేసింది. మర్నాడు పొద్దున్న 6 గంటలకి పద్మ లేచి పాలప్యాకెట్లు ,పేపర్ లోపలికి తెచ్చేసరికి నిద్ర లేచాడు. " అప్పుడే లేచారే? ఇంకా కాసేపు పడుకోపోయారా ? ఇంత తొందరగా లేచిచేసేది ఏముంది ? "అంది పద్మ. ఆమె మాములుగా అన్న శ్రీనివాస్ కి వేరేలాధ్వనించింది. "ఇవాళ్టి నుంచి నీకు పనీ పాట లేదుగా ? అన్నట్టు. "నిద్ర పట్టకపోతే ఏమి చెయ్యాలి అలా శవం లా పడుకోవాలా? " విసుగ్గా అన్నాడు . గతుక్కుమంది పద్మ . సర్దుకొని "సరేలెండి కాఫీ ఇస్తాను " అని వెళ్ళింది.కాసేపు అయ్యాక టిఫిన్ ఇస్తే " ఉప్మా నా " అన్నాడు. "ఇల్లంతా సర్దేసరికి ఓపిక లేదు. రేపు ఏమి చెయ్యమంటారు చెప్పండి చెస్తాను "అంది. పొద్దున్న 9 కల్లా ఆఫీస్ కి వెళ్లే అలవాటు కొద్దీ అతను కూడా స్నానం చేసాడు.ఏదో దేముడు దగ్గర దణ్ణం పెట్టుకొని ఒక అగరువత్తి వెలిగించటం తప్ప పూజ అలవాటు లేదు .కాసేపు టీవీ న్యూస్ , కాసేపు పేపర్ చదివి తోచక విసుగు వచ్చింది. " అమ్మో ! ఒక్క రోజు కూడా అవలేదు ఇంక జీవితం ఎలా గడుస్తుంది ? " భయం వేసింది శ్రీనివాస్ కి.
భోజనం దగ్గర కూర్చుని ఏమి వంట అని గిన్నెల మీద మూత తీసి చూసాడు.అరటికాయ కూర , తోటకూర పప్పు, చారు అంది పద్మ.అరటికాయ ఆవ పెట్టావా ? అంటే లేదండి. అల్లం పచ్చిమిరపకాయ వేసా "అందిఅయ్యో ఆవ పెట్టి చేయలేదా ? ఈ సారి మా అమ్మమ్మ చేసినట్టు చెయ్యి "అంటే "మీ అమ్మమ్మ ఎలా చేసారో నాకేమి తెలుసండి "అంది పద్మ అయోమయంగా." మన పెళ్లి అయ్యాక కొంత కాలం ఉందిగా అమ్మమ్మ నీకు తెలీదా " అదేదో చాలా పెద్ద తప్పు అన్నట్టు అన్నాడు.
భోజనాలు అయి అన్ని సర్దుకొని కాసేపు పడుకుందామంటే " నాకు నిద్ర అలవాటు లేదు. నువ్వు నిద్ర పోతావా ? ఏదైనా సినిమా చూద్దాము యు ట్యూబ్ లో అన్నాడు. పోనిలే పాపంకాలక్షేపం కావాలి కదా అని తనూ కూర్చుంది. కాసేపు పాత సినిమా అని పెట్టి బోర్ కొడుతోంది ,'అని ఇంకో సినిమా సగం పెట్టి కాసేపు పడుకొని కాసేపు అటుఇటు తిరిగి ఎలాగో మొదటి రోజు కాలక్షేపం చేసాడు.
ఇంట్లో ఉంటే తోచట్లేదు కదా అని ఇద్దరం మార్కెట్ కి వెళ్లి కూరలు తెద్దాముఅని రెండు రోజుల తరవాత బయలుదేర తీసింది పద్మ.పెద్ద బాధ్యత ఉన్న ఉద్యోగం అవడంతో ఈ పనులేవీ శ్రీనివాస్ కి అలవాటు లేదు. అన్ని పద్మ చూసుకునేది. మార్కెట్ కి వెళ్లి కూరలు తేవడం , సరుకులు తేవడం , బ్యాంకు పనులు , బిల్లులు కట్టడం అన్నీ పద్మ డ్యూటీలే నేను ఆఫీస్ కి వెళితే నీకేమి తోచదు కదా అవి నువ్వే చూసుకో అనేవాడు శ్రీనివాస్ ఇంట్లో ఏ పనులు ఉండవన్నట్టు. మార్కెట్ కి వెళ్లిన దగ్గర నుంచి ఒకటే సణుగుడు. పార్కింగ్ లేదు , తూకం సరిగా లేదు , అందరు చేతులు పెడుతున్నారు., నేను రాను ఇంకా మార్కెట్ కి అంటూ .ఎందుకు తీసుకోవచ్చానురా బాబు అని తల పట్టుకొంది పద్మ.
రోజు రోజు కి శ్రీనివాస్ కి తోచక విసుగు ఎక్కువ అయింది. కాఫీ ఇస్తే " ఏమి కాఫీ ఇది పద్మా డికాషన్ చిక్కగా ఉండాలి ,అంటూ ఉన్నట్టుండి "మా అమ్మది ఇత్తడి ఫిల్టర్ ఉండాలి ఏమైంది అందులో వెయ్యి డికాషన్ "అన్నాడు .బాంబు పేలినట్టు చూసింది పద్మ . అమ్మో ! ఆ ఫిల్టర్ చిలుము పట్టి చిల్లులు పడితే తీసేసింది. అవి ఇంకొన్ని ఇత్తడి సామాను మార్చి మంచి స్టీల్ గిన్నెలు కొంది . చెపితే చంపుతాడు అనుకోని " అది అది అని సణుగుతూ ఉంటె " పోయిందా నీకు మరీ అజాగ్రత్త " అన్నాడు కోపంగా.పద్మ కి మధ్యాన్నం పడుకోవటం అలవాటు.ఇప్పుడు కుదరడం లేదు. కాసేపు టీవీ లో వంటలో , సినిమానో చూసేది ఇప్పుడు శ్రీనివాస్ టీవీ కి అతుక్కు పోయి ఉంటున్నాడు. పోనీ ఏదో తన జోలికి రాడు కదా అంటే న్యూస్ చూస్తున్నంత సేపు " ఈ దేశం బాగుపడదు ఎవ్వరు పట్టించుకోరు అంటూ అన్న పార్టీల వాళ్ళని తిడతాడు ఎవరు ఏమి సరిగ్గా చెయ్యరు అంటుంటే ఊరుకోలేక "మీరు గవర్మెంట్ లోనేగా చేసారు మీకు తెలీదా అక్కడ పనులు ఎలాఅవుతాయో " అని పద్మ అంటే "నేను బ్రహ్మాండం అంటాడుసినిమా పెడితే "ఇవేమి పాటలు,అసలు బాలేదు , డైలాగులు అలాగేనా రాసేది , సినిమా ఇలాగేనా తీసేది "అంటూ గోల ,కుదురుగా అరగంట చూడడు. "మీరు తియ్యండి మంచి సినిమా " అని పద్మ విసుక్కుంటే " ఆఁ , నేను ఇంతకంటే బాగానే తీస్తా " అన్నాడు. "నాకూ ఇచ్చేవాళ్లే లేరు ఇస్తే నేనూ తీస్తా " అంటూ పద్మ విసుగు.
ఒకళ్ళ మాటలు ఇంకొకళ్ళకి విసుగ్గా , చిరాగ్గా ఉంటున్నాయి. పోనీ "పొద్దున్నే లేచి వాకింగ్ వెళ్ళండి "అంటే "పొద్దున్న మెలుకువ రాదు "అంటాడు "టైం పాస్ కి మీరు కూడా ఏదైనా ప్లాన్ చెయ్యండి "అంటేఏమి చెయ్యాలి అని ఎదురు పద్మని అడుగుతున్నాడు.ఏది చెప్పిన ప్రతిదానికి ఎదో వంక చెప్తాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకా భయంకరమైన శిక్షఏమిటి అంటే "నేను వంట చెస్తాను "అని మొదలు పెట్టాడు.మీకు వంట ఏమి వచ్చు అంటే ఎప్పుడో చిన్నప్పుడు చేశాను అంటారు. సరే పోనీ అంటే "వంకాయ పచ్చడి చేస్తాను కుంపటి తెమ్మంటాడు. "కుంపటిలో కాలిస్తేనే రుచి అని. "కుంపటి ఎక్కడి నుంచి తేను "అని పద్మ.రోట్లో రుబ్బితేనే కంది పచ్చడి రుచి "అని అతను"ఆ రోలు ఎప్పుడో మూల పడేశాం కింద కూర్చుని రుబ్బటం కష్టం నేను గ్రైండర్ లో చేస్తాను "అని పద్మ.అన్ని పొయ్యి దగ్గర రెడీ పెట్టి పోయ్యి వెలిగిస్తే సగం కింద సగం మీద పోసి చేసి "అదిరిపోయింది "అంటాడు . తప్పని సరిఅయి "అవును బావుంది " అంటూ తిన్న పద్మ పొయ్యి శుభ్రం చేసుకోడానికి గంట పట్టేది.
ఇదివరకు అతను ఆఫీస్ కి వెళ్ళాక ఇల్లంతా సర్దేది . ఇప్పుడు అసలు తీరక ఇల్లంతాచెత్తగా ఉంది. "కనీసం మీ బట్టలు ,వస్తువులు ఎక్కడివి అక్కడ పెట్టుకోండి మిగిలినవి నేను సర్దుతాను "అంటే "రిటైర్ అయ్యాననేగా నా చేత ఈ చాకిరీ చేయుస్తున్నావు "అని అలక .మీ బట్టలు మీరు సర్దుకోవడం చాకిరి అయితే ఇంట్లో నేను చేసేది వెట్టి చాకిరీ అని పద్మ.
శ్రీనివాస్ రిటైర్ అయేముందే ఇది అనుభవించిన వాళ్ళు , తెలిసిన వాళ్ళు చెప్పారు. రిటైర్ అయ్యాక ఒక డిప్రెషన్ లాగా వస్తుంది అని , అందుకే సర్దుకు పోదామనుకుంటే అసలు అవడం లేదు పద్మకి.
పక్కవాళ్ళో , ఎదురువాళ్ళో వచ్చి ఏదైనా మాట్లాడితే వాళ్ళు వెళ్ళగానే ఏమిటి అంటాడు , చెపితే సోది కబుర్లు అని చెప్పకపొతే ఏమిటా రహస్యాలు అని .
అలసిపోయిన పద్మ ఇంకా ఓర్పు పట్టలేక కొడుక్కి , కూతురుకి ఫోన్ చేసింది. "మీ నాన్నకి 60 వస్తే నాకు 55 అది అర్థం చేసుకోరు , పరిస్తితి ఇలానే ఉంటే నేను అడ్డం పడతాను లేదా పిచ్చెక్కుతుంది అది మాత్రం ఖాయం "అని.నువ్వు ఖంగారు పడకు అమ్మా మేము చూస్తాము "అని పిల్లలు అభయం ఇచ్చాక ఊపిరి పీల్చుకుంది.కూతురు, కొడుకు వచ్చి "నాన్నా ! మా అత్తగారు ,మామగారు ట్రావెల్స్ వాళ్లతో ఢిల్లీ ,కాశ్మీర్ టూర్ కి వెళుతున్నారు , మీకు ,అమ్మకి కూడా టికెట్స్ బుక్ చేశాను, ఒక్కళ్ళు వెళ్లేకంటే వాళ్ళ తోడు మీకు ఉంటుంది కదా . ముందు కొన్ని రోజులు అలా హాయిగా తిరిగి రండి. " అంది కూతురు. "వచ్చిన తరవాత ఇక్కడ కొన్ని సంస్థలు ఉన్నాయి , అక్కడ మీరు గెస్ట్ లెక్చర్స్ ఇవ్వచ్చు. మీలాగా అనుభవం ఉన్నవాళ్ళని వాళ్ళు ఆహ్వానిస్తారు. మీరు హాయిగా రిటైర్డ్ జీవితం ఆస్వాదిద్దురుగాని "తండ్రితో చెప్పాడు కొడుకు .
పద్మ పొంగిపోయింది. కానీ శ్రీనివాస్ వద్దు అంటే ఎలా సర్దిచెప్పి ఒప్పించాలి అని ఆలోచిస్తున్న ఆమెకి " ఓకే అలాగే వెళ్తాము. నాకు ,అమ్మకి కొంత మార్పు కావాలి. పాపం అమ్మకి నా రిటైర్మెంట్ తట్టుకోవడం కష్టంగా ఉంది " నవ్వుతూ అంటున్న శ్రీనివాస్ ని ఆశ్చర్యం గా చూస్తున్న పద్మ అమ్మయ్య అని గాలి పిల్చుకొంది .
శ్రీపతి లలిత