Telugu Global
Arts & Literature

శ్లోకమాధురి... భాస మహాకవి భాసుర పాత్ర చిత్రణ

శ్లోకమాధురి... భాస మహాకవి భాసుర పాత్ర చిత్రణ
X

కవికులగురు కాళిదాసుని కావ్యకన్య ను విలాసంగా చెప్పిన జయదేవుడు ఆమె నవ్వు భాస మహాకవి అంటూ “భాసో హాసః “అని వర్ణించాడు. కాళిదాసు మాళవికాగ్నిమిత్రంలో ప్రథిత యశస్కులైన భాసాదులముందు జనులు నా నాటకాన్ని ఏమాదరిస్తారు అని వాపోతాడు.అలాంటి మహాకవి రచించిన నాటకాలు 19 వశతాబ్దం పూర్వార్థంలో శ్రీ గణపతి శాస్త్రి గారు వెలికితెచ్చేవరకు కనుమరుగయినాయి.

భాసుని నాటకాలలోని పాత్రల యొక్క మనోభావ వ్యక్తీకరణ ఎంత సున్నితంగా ఉంటుందంటే అది హృదయపు లోతులలోనికి ప్రవేశించి రసోత్పత్తిని కలిగించి ఒక చిరు మందహాసాన్ని పెదవుల పైకి తెప్పిస్తుంది.

పాత్రల స్వభావాన్ని ,వారి పైన ఒక మధుర భావనను కలిగించే రీతిలో ఆయన రచనలు సాగుతాయి. చిన్నచిన్న వాక్యాలతో సంభాషణ అద్భుతంగా అనిపిస్తుంది. ప్రతిమానాటకంలో రాముని పాత్ర సర్వోత్కృష్టంగాను, అతని పితృభక్తిని, ఋజు ప్రవర్తనను, అలాగే దశరధుని ప్రేమను ఎలా వివరించాడో చూడండి.

దశరథుడు రామునికి పట్టాభిషేకం చేయాలని హఠాత్తుగా నిర్ణయిస్తాడు. రాముని పిలిచి ఇక రాజ్యభారం నువ్వే వహించాలి అని చెబుతాడు. ఇదంతా రాముడు సీతకు వివరిస్తూ ఉంటాడు. దానికి మీరేమన్నారు అని సీత ప్రశ్నించగా నువ్వేం అనుకుంటున్నావు అని రాముడు ఎదురు ప్రశ్నిస్తే “ఏముంది దీర్ఘంగా నిశ్వసించి పాదాలపై వాలి ఉంటావు” అంటుంది ఆ భర్త మనసెరిగిన సీత.

దశరధుడే మహారాజుగా ఉండాలని రాముని కోరిక. కానీ తండ్రి మాటనెదిరించలేని వినయం , ఇహ మరి దుఃఖంతో నోరు పెగలలేదు, కళ్ళ నుండి నీరు, చెప్పడానికి సాధ్యం కాని మనోవేదనతో దీర్ఘంగా నిశ్వసించి తండ్రి పాదాలపై వాలుతాడు. పాదాలు కన్నీటితో తడుపుతున్న కొడుకుని చూచి దశరధుని మనసులో తీవ్రమైన భావవేశం కలిగి తానూ కన్నీరు కారుస్తాడు. ఆ నాలుగు కళ్ళ నుండి భాష్పాలు ప్రవహించాయి. ఈ మానసిక స్థితిని భాసుడు చిత్రీకరించినట్టు ఇంకెవరికి చిత్రించడం సాధ్యం కాదేమో. ఆ అశ్రువులు ఇద్దరి మానసిక స్థితిలోని గాంభీర్యాన్ని సూచిస్తాయి.

రామునిది పితృభక్తి, దశరధునిది పుత్ర ప్రేమ. ఇదంతా సరిగ్గా సీత ఊహించినదే. రాముడు అంటున్నాడు సీతతో

” తత్ర పాదయో రస్మి పతితః .

సమం బాష్పేణ పతతా తస్యోపరి మామప్యధః

పితు ర్మే క్లేదితౌ పాదౌ

మమాపి క్లేదితః శిరః"

నేనప్పుడు తండ్రి గారి పాదాలపై పడ్డాను, ఆయన కళ్ళల్లో నుంచి, నా కళ్ళల్లో నుంచి కిందకి ఒకేసారిగా అశ్రువులు స్రవిస్తున్నాయి, నా కన్నీటితో తండ్రి పాదాలు తడవగా నా శిరస్సు తండ్రిగారి కన్నీటితో తడిసింది. తండ్రీకొడుకుల భావ సంఘర్షణలోని సౌందర్యం ఇలా కళ్ళ కట్టినట్టు వర్ణించాడు.

తండ్రి పైన అవ్యాజమైన అనురాగం కలవాడు తండ్రి మాటను జవదాటని వినయశీలి అయిన పుత్రుడు రాముడు. అలాంటి పుతునిపై అచలమైన విశ్వాసము, సత్యవాక్ పరిపాలకుడైన వృద్ధుడు దశరథుడు. ఆ సన్నివేశం ప్రేక్షక శ్రోతల మనసులలో ఒక ఆర్ద్రతను కలిగించి, తండ్రీకొడుకుల

అనుబంధాలని తలచి మధురభావనలో ముంచి నిండైన మందహాసం పెదవులపై నర్తింపచేస్తుంది. ఆ ఇద్దరి ప్రేమాభిమానాలు అంతరంగ వేదన స్వాభావికంగా చిత్రీకరించడంలో భాసుని ప్రతిభ అసాధారణం.

కైకేయి కోరిక కారణంగా అభిషేకం నిలిపి వేసినందుకు లక్ష్మణుడికి కలిగిన కోపావేశాన్ని శాంతింప చేస్తూ రాముడు పలికిన మాటలు కైకేయి చారిత్రం పై మరకలు తుడిచి వేసి ,మనకు కైకేయి చేసినపని ఎంత సమంజసం కదా అనిపిస్తాయి.

"తాతే ధనుర్మమయి సత్యమవేక్షమాణే ముంచాని మాతరి శరం స్వధనం హారంత్యాం

దోషేషు బాహ్యమనుజం భరతం హనామి కిం రోషణాయ

రుచిరం త్రిషు పాతకేషు "

సత్య వాక్పరిపాలకుడైన తండ్రిపైనా, స్వధనం స్వీకరిస్తున్న తల్లిపైనా, ఏ తప్పు చేయక దూరంగా ఉన్న తమ్ముడు భరతుడి పైననా ఎవరిపై బాణాలు విడు వను? ఈ మూడు పాపాలలో ఏ పాపం చేయమంటావు నన్ను అని రాముడు లక్ష్మణుడిని ప్రశ్నిస్తాడు.

ఆవిధంగా భాసుడు కైకేయి ఏ తప్పు చేయలేదని, పరిశుద్ధస్వభావురాలని ఒక విధమైన నూతనత్వాన్ని ప్రతిపాదించాడు. కైకేయి కనుక రాజ్యమడిగి వుండకపోతే , రాముడు వనవాసానికి వెళ్లకపోతే రాముడు దేవుడయ్యే ప్రసక్తియే వుండేది కాదేమో. కైకేయి పాత్రను కొత్త దృక్కోణంలో చూపి ఆమెను ఉదాత్తస్వభావురాలిగా మలిచాడు భాసమహకవి.

-డా.భండారం వాణి

First Published:  28 March 2023 4:36 PM IST
Next Story