భాగవతంలో మానవీయ విలువలు (వ్యాసం)
మన పురాణాలైన మహాభారత భాగవత రామాయణాది గ్రంథాలు ప్రాతః స్మరణీయాలు,కైవల్యప్రదాతలు అవి గ్రంథస్థం కాకమునుపు ఒకరి నుండి ఒకరికి చెప్పబడుతూ, నిత్య ప్రసార సాధనాలుగా ప్రజలకు జీవన సందేశాలను అందజేస్తూ వారిని జీవన్ముక్తులను చేశాయి ఇప్పటికీ చేస్తూనే ఉన్నాయి భారతం పంచమ వేదము గా ప్రసిద్ధి పొందింది ఇక భాగవతం ఇది భాగవతుల గురించి తెలియజేస్తుంది భాగవతులనగా-భావతత్వాదివేదులు ,బ్రహ్మ వేదానవేదులు అంటే బ్రహ్మను గూర్చి చర్చిస్తూ భక్తి భావ తత్వములను తెలుసుకున్న వారు ఇక భాగవతంలో మానవీయ విలువలు అంటే ఏమిటో తెలుసుకుంటే సృష్టిలో మానవులు దానవులు అనే రెండు రకాల వాళ్ళు ఉన్నారు మానవీయ విలువలను పాటించి ధర్మవర్తనులుగా ప్రవర్తించే వారు మానవులు .
దాష్టీకంతో అధర్మంగా, అరాచకంగా ప్రవర్తించే వారు దానవులు .ఇక మానవీయ విలువలను భాగవతంలో తెలియజేసే ముఖ్య పద్యాన్ని పోతనగారు ప్రహ్లాదుని గుణగణాలని వర్ణిస్తూఇలా తెలియజేస్తారు - "తనయందునఖిలభూతములందు ఒక భంగి సమహ తత్వంబును నెరపువాడు"అంటూ ప్రహ్లాదునియొక్క భూతదయను ప్రదర్శింప చేస్తాడు, ఇతర స్త్రీల యెడ మాతృభావన, తోడి వారి తోటి వారి యెడ సోదర భావం,పెద్దలను, గురువులను, తల్లిదండ్రులను దైవములుగా కొలుచుట అన్నవి మానవీయతకు సంబంధించినవి.
అసలు మానవీయత అంటే ఏమిటి దయ,సానుభూతి,సమానత్వం , సహృదయం కలిగియుండడం అలాగే ఆడిన మాట తప్పకపోవడం అనే సుగుణాన్ని రాక్షస రాజైన బలి చక్రవర్తి యందు దర్శింప జేస్తాడు పోతన .
వచ్చినవాడు వటువు కాదని విష్ణువని తన గురువు శుక్రాచార్యుడు చెప్పినప్పటికి"మాటతప్పరెపుడు"అంటూతన నిజాయితీని ప్రదర్శిస్తాడు ఇక తనతోటివారిని,తన గ్రామస్తులని ఎలా ప్రేమించాలో,ఆపదవచ్చినప్ప ఎలాకాపాడు కోవాలో కాళీయమర్ధనం గోవర్ధన మెత్తడం ద్వారా చూపిస్తాడు ఇక విద్యయొక్క ఉపయోగము గొప్పతనము తద్వారా సాధించు మానవీయత గురించి హిరణ్యకశిపుని పాత్రద్వారా తెలియజేస్తాడు"చదవనివాడజ్గుడగు"అనుచు చదువు మంచి చెడులను,వివేకమును నేర్పునుఅని ప్రహ్లాదుని తో చెప్తూ ,చదువు అన్నది కేవలం శాస్త్ర విజ్ఞానమే కాదు ఆధ్యాత్మిక జ్ఞానము కూడా అట్టి జ్ఞానాన్నినేర్పే విద్యే విద్య అదిమనుషుల నడవడికను తీర్చిదిద్ది వారిని మానవతా మూర్తులుగా తీర్చి దిద్దుతుంది భాగవతంద్వారా తెలియజేయబడిన ఈ సత్యము నేడు కేవలం ర్యాంకుల కోసం పోటీపడే విద్యకు గొడ్డలి పెట్టువంటిది.
అటువంటి విద్య విద్యే కాదు .పోటీతత్వాన్ని పెంచి మనుషులలో ఈర్ష్యా సూయలను కలిగించే విద్యావిధానం మారాలి.
అలాగే నైతిక విలువలను పెంచే విద్యా విధానం రావాలి .అదే భాగవతం యొక్క ఉధ్బోధ ఇక మానవీయ విలువల్లో ముఖ్యమైనది గురుశిష్య సంబంధం.
ఉప పాండవులను చంపిన అశ్వద్ధామ ను వధించ నిశ్చయించుకున్న అర్జనునిధాటికి తాళలేక పారిపోతున్న అశ్వధ్ధామని చంపడం ధర్మం కాదని, అప్పటికే ఉప పాండవులు చనిపోయి పుత్రశోకంతో వున్న ద్రౌపది "మీరు మా భర్త యొక్కగురు పుత్రులు, పుత్రరూపంలో ఉన్నద్రోణాచార్యులు.
పుత్రశోకం ఎటువంటిదో నాకు తెలుసు మిమ్మల్ని వధించి వృద్ధులైన మీ తండ్రి కి పుత్రశోకాన్ని కలిగించలేం" అని అతన్ని భర్త నుండి విడిపించి గురు భక్తి ని ప్రదర్శించింది .అంతేకాకుండా భర్తని బ్రహ్మహత్యా పాతకం నుండి రక్షిస్తుంది.
తను పొందుతున్న వేదన ఇంకొకరు పడకూడదన్న మానవీయతా విలువ ని ద్రౌపది పాత్ర ద్వారా తెలియజేస్తాడు పోతన .
శత్రువునికూడా మెప్పించే సహనం ఇటువంటి సద్గ్రంధాలను చదవడం వల్ల సాధ్యమవుతుంది.
ఇకమానవీయతకు పరాకాష్ట రంతిదేవుని దానగుణం. "తనకు మాలిన ధర్మం"కాని దానశీలురు తమకు లేకపోయినా దానము చేస్తారు .అటువంటి మహాదాతే రంతి దేవుడు అతడు తన సర్వ సంపదలను దాన ధర్మాలకి వెచ్చించి ఆఖరికి దరిద్రుడై సుమారు 40దినములు పస్తులుండగా,ఒక రోజు పాయసం దొరికింది .
అన్నార్తుల లైన వారికి అది అమృతము తో సమానం కాని రంతిదేవుడుముందు ఆ పాయసాన్ని భార్యా బిడ్డలకిచ్చి, మిగిలింది తాను తిందామనుకుంటుండగా ,ఒక రిద్దరు అతిథులకుపెట్టి,మంచి నీళ్ళతో ఆకలితీర్చుకుందామను కుంటుండగా, ఒకదాహార్తికిఅదికూడా అందజేసిన దానశీలి .
ప్రాణులకుఆపద వచ్చినప్పుడు వారి ఆపదలను ముందుగా తొలగించుటే మానవీయత.
ఇక మానవీయతను ప్రతిబింబించుటలో ప్రధాన పాత్రవహించేవి రెండు1.ధనం.2 .ప్రేమ.
భాగవతంలో దేవదూత పుత్రుడైనకపిలుడు తన తల్లికి చేసిన జ్ఞానబోధ లో ధనము వల్ల . సుఖము లభించునని తలచిన మానవులు "ధనమూలంమిదం జగత్"అని డబ్బుకులోకం దాసోహంఅంటూ , తాము సృష్టించిన డబ్బుకు తామే బానిసలై ఆధనసంపాదనా వలయంలో చిక్కుకొని ఆ ధనాన్ని అధర్మ మార్గంలో సంపాదించడం లో మానవత్వాన్నికోల్పోతున్నారు .
"మాతాపుత్రవిరోధాయ హిరణ్మాయనమోనమః,"అన్నట్టుఆ డబ్బు కోసం రక్తం సంబంధాలను కూడా త్రోసి రాజునడం శోచనీయం .సంపాదనకి అక్రమమార్గాలని అన్వేషించడం, అనుసరించడం అమానుషత్వం .ధనవినియోగంలోగాని, ధన భాగస్వామ్యం లోగాని మానవత్వాన్ని ప్రదర్శించగలగితే మనిషిగా కాక మనీషిగామన గలుగుతాడు.
ఇక ప్రేమ -కని పెంచిన తల్లి దండ్రులను ప్రేమతో ఆదరించుట మానవత్వానికి ప్రతీక .అలావారి మరణానంతరం వారి సద్గతి ప్రాప్తి కై చేయు కర్మలు మానవతకు ప్రతీకలు.
తమపూర్వికులకు పట్టిన దుర్గతిని తండ్రి ద్వారావిని, వారి చితాభస్మాలపై గంగని ప్రవహింపసజేసి వారికి ఉత్తమగతులను కలిగించిన భగీరథుని మానవీయత మానవీయతకే పరాకాష్ట .
అటువంటి సంస్కృతి గల భారతదేశంలో నేడు కన్నతల్లి దండ్రులను వృద్ధాశ్రమాలకు తరలించే నేటి పిల్లలు వారి మానవత్వాన్ని ఒక్కసారిప్రశ్నించుకుంటే,తమనిపుట్టినప్పటినుండి మమతాను రాగాలతో పెంచిపెద్దచేసి,పెద్ద చదువులు చదివించిసంఘం లో ఉన్నత స్థానం కల్పించిన వారికి అవసానదశలో ఆదుకోవడం పోయి అనాధలుగా వారిని వృద్ధాశ్రమానికి చేర్చడం అమానుషత్వం .తల్లి దండ్రుల ఋణం తీర్చు కోవడం మానవత్వం అని గ్రహింపుకురాగలదు .
దాన్ని మరుస్తున్న నేటి యువతకిప్రేమలోని స్వచ్ఛత,త్యాగం లోని మహనీయత,దానిలోని గొప్పదనం,స్నేహంలోని తియ్యదనాన్ని తెలియ జేసే ఇటువంటి భాగవత గాధలు చిన్నప్పటి నుండి చెప్తూ వారిని మానవతామూర్తులుగా మార్చ వలసిన బాధ్యత తల్లి దండ్రులది, గురువులదీ,
పెద్దలందరిదీ!
- సత్యవతి కూరెళ్ళ