సంస్కృత శ్లోకం
ఆరోగ్యం విద్వత్తా సజ్జనమైత్రీ మహాకులే జన్మ
స్వాధీనతా చ పుంసాం మహదైశ్వర్యం వినాప్యర్థైః
(నీతి శాస్త్రం.)
ఆరోగ్యం, విద్వత్తు, సజ్జన మైత్రి, కులీనత (మంచి కుటుంబ నేపథ్యం), ఇంద్రియ నిగ్రహం ఈ ఐదు ఉన్నవాడు పేదవాడైనను, ధనవంతుడే.
మనలో ధనికులున్నారు, పేదవారూ ఉన్నారు. ఎంత ధనమున్నా, ఆరోగ్యం లేకుంటే వృథా, అక్షర జ్ఞానం లేకపోయినా వృథా, సజ్జన సాంగత్యం లేకపోతే భయభక్తులు లేని జీవితమౌతుంది, కులీనులు కాకపోవుటచే అవమానకర జీవితం గడుపుతారు. అలాగే, ఇంద్రియ నిగ్రహం లేకపోవుటచే సమస్తం కోల్పోతున్నారు.
ఆరోగ్యమే మహాభాగ్యమని అందరికీ తెలుసు. శారీరక, మానసిక, సామజిక, ఆర్దికంగా, హాయిగా జీవించడమే అసలైన ఆరోగ్యం. ఆరోగ్యం మనిషి యొక్క ప్రాథమిక హక్కు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి, అలాంటి చోట్ల ఉండాలి. ఆరోగ్యంగా ఉండమని ఇతరులకు సలహా ఇవ్వాలి.
విద్య, ఉద్యోగం కోసం కారాదు, విజ్ఙానం కోసం కావాలి. ఇప్పుడు కేవలం ఉద్యోగాల కోసమే విద్యనభ్యసిస్తున్నారు. ఇది దురదృష్టకరం. వ్యవసాయ, వ్యాపార, ఉద్యోగాలతో మనిషి బ్రతకవచ్చు. అయితే, విద్య వల్ల, మూడింటినీ సమర్ధవంతంగా నిర్వర్తించవచ్చు. వ్యవసాయ, వ్యాపారాలలో కష్టపడితే, తలెత్తుకొని జీవించవచ్చు. ప్రస్తుత కాలేజీల్లో సమకాలీన ఆర్థిక, రాజకీయ పరిస్థితుల విలువల గుఱించి అంతగా చెప్పడం లేదు.
సజ్జనమైత్రి ద్వారా, మనలోని మానవత్వం జాగృతమై, ఆపదలో ఉన్న వారిని, ఆదుకుంటాం. దీనులపై దయ చూపిస్తాం. సత్సంగ కాలక్షేపం సకల క్షేమదాయకం. తలిదండ్రులకు కష్టం కలిగించకుండా, ధర్మ మార్గంలో ఉంటూ, అబద్దాలు ఆడకుండా, వంశాభివృద్ధిని కోరుకునే వాడే కులీనుడు. ఆచార సంపత్తి ద్వారానే మంచితనం సిధ్ధిస్తుంది. అందుచేత, మనమంతా సదాచారాలను రక్షించుకొని, ఆచరిద్దాం.
మనలో, పది జ్ఙానేంద్రియ, కర్మేంద్రియాలను ఏర్పాటు చేసి, వాటిని ఉపయోగించుకొనే బుద్ధిని కూడా కలుగజేశాడు పరమాత్మ. వీటిని చెడువైపు కాకుండా, మంచి వైపుకి త్రిప్పి, ఒక క్రమ పద్ధతిలో ఉంచుకోవడమే ఇంద్రియనిగ్రహం. కామంతో కళ్లు గానక, నీవంటి పుత్రుని ప్రసాదించమని కోరుతుంది ఊర్వశి. నవమాసాల నిరీక్షణ ఎందుకు? ఈ రోజు నుండి నేనే నీకు పుత్రుడినని సమస్కరిస్తాడు అర్జునుడు. అతడిలోని నియంత్రణ, ఇంద్రియ నిగ్రహం ఊర్వశిని ఆశ్చర్యచకితురాలిని చేస్తుంది. ఆమె వరం వల్ల అజేయుడవుతాడు.
అందువలన, మన దగ్గర ఎంత ధనమున్నా సంస్కృతశ్లోకంలో చెప్పినవి లేకపోయినట్లయితే నిరుపేదతో సమానమే.