సామాజిక అసమానతలపై అక్షర సమరం వర్ణ యుద్ధం
వర్తమాన సామాజిక అసమానతలపై వర్ణ యుద్ధం ప్రకటించిన కవి డాక్టర్ బద్దిపూడి జయరావు. బడుగు, బలహీన ప్రజల జీవితాలలోని అనేక పార్శ్వాలను వర్ణ యుద్ధంలో ఆవిష్కరిస్తూ, వేదనాభరితమైన వారి జీవనాన్ని, అందుకు గల కారణాలను తులనాత్మకంగా విశ్లేషిస్తూ, సమస్య మరియు పరిష్కార మార్గాలను స్పష్టికరించారు.
అస్పృశ్యత, వివక్షతలు నాటి నుండి నేటి ప్రజాస్వామ్య స్వాతంత్ర్య భారతదేశంలో గుడి, బడిల నుండి విశ్వవిద్యాలయాలకు పాకిందని, అపనిందలతో అసువులు బాసిన వీరులను, శ్రామికులను, మానవతావాదులను బలి చేసిందని, ఆకలికి పొద్దులతో కొట్లాడే మాకు కాస్త ఆత్మగౌరవం ఇవ్వండి అప్పుడే ఈ దేశాన్ని క్షమించి మా బతుకు బతుకుతూ చూపుడు వేలుతో మా రాతలు మార్చుకుంటూ నడిచేస్తాం అని ప్రతిఘటనను మరియు ప్రశ్నించే తత్వాన్ని, అంబేద్కరిజాన్ని కవి వర్ణ యుద్ధంలో ఉద్బోధించారు.
కులాంతర ప్రేమ వివాహాలు వ్యతిరేకిస్తూ పరువు కోసం ప్రాణాలు తీసే సమాజాన్ని ప్రశ్నిస్తూ, మనుషుల మధ్య వర్ణ విభేదాలు, అసమానతలు నశించాలని మానవత్వం విలసిల్లాలని కోరుకోవడం మాత్రమే కాదు వర్ణ విభేదాన్ని విడనాడ లేదంటే కాలం ప్రతీకారం తీర్చుకుంటుందని కవి నిషిద్ధ ప్రేమలో హెచ్చరించారు.
మానవత్వపు గొప్పతనాన్ని తెలుపుతూ చీకటి హద్దులు చెరుపు శక్తి మానవత్వానికి ఉన్నదని మట్టి రుణం తీర్చవోయి అనే కవితలో వక్కానించారు.
నగరాల్లో యాంత్రిక జీవితాన్ని, డబ్బు చుట్టూ మరియు డబ్బు కోసం తిరిగే నగర జీవనాన్ని, గ్రామాలలో గల శ్రమైక జీవన సౌందర్యాన్ని ఊరులే విచ్చుకున్న విశ్వ నగరాలు లో కవి వ్యక్తికరించారు.
నాన్న యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తూ
నవ మాసాలు మోయలేని మాతృమూర్తి నాన్న
పురిటి నొప్పులు పడలేని అమ్మ నాన్న
అమ్మకు మలి రూపం నాన్న అని వినూత్నప్రయోగాన్ని ఒంటరి నాన్న కవితలో ప్రయోగించారు.
మనిషి తత్వాన్ని, మానవత్వాన్ని వివరిస్తూ మృత్యువు కరోనా రూపంలో సమస్త మానవాళిపై విరుచుకు పడిందని ధనవంతులు, బలవంతులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారని, మనసులో మలినాల్ని కడుక్కోవాలని, ఆకలి అన్నవారికి పట్టెడన్నం పెట్టాలని అలా జరిగినప్పుడే మానవత్వం పరిమళించి మనిషితత్వం వర్ధిల్లుతుందని వివరించారు.
భర్త మరణించి, కడుపున పుట్టిన బిడ్డలు వివాహాలు, ఉద్యోగాలు అంటూ తలోదిక్కయి, అవసాన దశలో ఒంటరిగా మిగిలిన ఒక తల్లి పడిన ఆవేదనను ప్రేమలేఖ లో ఆవిష్కరించారు.
నెత్తుటి గాయాలు శీర్షికలో ప్రజాస్వామ్య దేశంలోని అసమానతల్ని పరిష్కరించలేని పాలకుల స్వార్థ పరత్వాన్ని బట్టబయలు చేశారు.
కులమత వ్యత్యాసాలు లేని చిన్ననాటి పాఠశాల ఔన్నత్యాన్ని, చదువుల కర్మాగారం మా బడి ఆత్మీయతా అనుబంధాలకు జీవముడి మా బడి అని గొప్పగా అమ్మ ఒడి మా బడి శీర్షికలో తెలియజేశారు.
పాశ్చాత్య సాంస్కృతి వల్ల బలవుతున్న యువ భారతాన్ని, వర్ణ వివక్షతలను అంతర్జాలపు అంతరంగంలో ఆవిష్కరించారు.
మనసును మురిపించేది
మనిషిని మరిపించేది
స్నేహబంధం అని స్నేహ బంధానికి ఉన్న గొప్పతనాన్ని కవి రుచి చూపించారు.
వెలివాడ గుడిసెల్లో వెలుగు చూపిన బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి
ఊరు వాడల్లో
విశ్వ మేడల్లో
బతుకై, మెతుకై
జీవమై బతుకుతున్న వాడు
అని బహుజన బాంధవుడు లో అక్షరీకరించాడు.
పొట్టకూటి కోసం కండల్ని పిండి చేసే శ్రామికుల, వలస కార్మికుల బతుకు చిత్రాన్ని, తీరని పేదరిక శోకాలను పొద్దుచాలని మనుషులు లో కవి తెలియజేశాడు.
అనేక దురాచారాలకు, విష సంస్కృతుల విజృంభనకు ఎండిన ఎడారిలా మారిన మన దేశానికి ధర్మాన్ని బతికించే గుండె కావాలని అప్పుడే సమసమాజ శాంతి చైతన్య స్థాపన జరుగుతుందని కవి ప్రబోధించారు.
ఎస్సీ వర్గీకరణ గురించి
మేం రేగ బలిసి అడగడం లేదు
రావాల్సిన వాటా అడుగుతున్నాం అని వర్గీకరణ పర్వంలో తెలియజేశారు.
జీవిత అనుభవాలలోని జయాపజయాలను గత స్మృతులను, అనుభూతుల్లోని గొప్పతనాన్ని అనుభూతుల ఆనవాళ్లు శీర్షికలో వివరించారు కవి.
నాటి అగ్రవర్ణాల అఘాయిత్యాలను, అవమానాలు దిగమింగి జీవన సమరం చేస్తున్న దళితులను రెచ్చ గొట్టినా , కవ్వింపు చర్యలకు పాల్పడినా మా ఆవేశానికి ఆహుతి అయిపోతారని అంతిమ సమరం నందు కవి బాస చేశారు.
అమెరికాలో నల్లజాతీయులపై శ్వేత జాతి వారి దురాహంకారానికి బలై ప్రాణాలు కోల్పోయిన జార్జ్ ఫ్లాయిడ్ మరణాన్ని I Can't breath please శీర్షికతో నిరసించాడు.
ఒకనాటి విలక్షణ సంస్కృతితో వెలసిల్లిన పంచమవాడను, నాటి పరిస్థితులను, నేటి ప్రపంచీకరణ, నగరీకరణ వలన పనిముట్ల ప్రయోగశాలగా వెలుగొందిన మాదిగ పల్లె నేడు మూతి ముడుచుకున్న ముత్తైదువుల తయారైందని ఎవరికి వారే బతుకు పోరు చేయమని శాసిస్తుందని సౌందర్య శాస్త్రంలో కవి తెలిపారు.
ప్రస్తుతం దేశంలోని పరిస్థితులను, ఉగ్రవాదుల విధ్వంసక చర్యలను, విద్వేషాలను రెచ్చగొట్టే రాజకీయాలను, దొంగల దోపిడీలను, శ్రమ దోపిడీల పై ప్రతిఘటించే, రాజ్యాధికార గళం విప్పే సామాజిక చైతన్యం రావాలని యుగ స్పృహ కవితా శీర్షికలో ఉద్ఘటించారు కవి.
స్వతంత్ర భారతదేశంలో శ్రామికులు, పేద ప్రజలు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న జీవన పోరాటాన్ని మరియు వారికి జరుగుతున్న అన్యాయాక్రమాలను నిరసిస్తూ ఆంక్షలు అసమానతలు లేని అమర భూమి కావాలని స్వరాజ్యమా! మేలుకో! శీర్షికలో కవి ప్రస్తుత సమాజాన్ని ప్రతిఘటించారు.
కుండలో నీరు తాగాడని దళిత విద్యార్థి మరణానికి కారణమైన ఉపాధ్యాయుని తీరుని నిరసిస్తూ అసమానతలు లేని విశ్వ మానవ సమాజం కావాలి అని మనిషిగా బతకనివ్వని సమాజాన్ని బడిలో వెయ్యాలనుంది అని ధిక్కరించారు కవి.
నెల్సన్ మండేలా గొప్పతనాన్ని, మహాకవి గుర్రం జాషువా, మహా స్వప్న, ఫిడేల్ క్యాస్ట్రో సమధర్మ సాధనకు సాగుచేసిన ఎండ్లూరి సుధాకర్ మహనీయులను గురించి కవిత్వీకరించారు.
చివరిగా
సమీకరించు - బోధించు - పోరాడు అను బాబాసాహెబ్ అంబేద్కర్ త్రి సూత్రాలను పాటించి బహుజన రాజ్యస్థాపన వైపు అడుగులేస్తున్న విధానాన్ని అంతిమ లక్ష్యంగా ప్రబోధించాడు.
వర్ణ వివక్షతను వ్యతిరేకించి, మనిషిని మనిషిగా చూడాలన్న మానవత్వాన్ని ప్రబోధించి, బహుజన రాజ్యాధికారాన్ని కాంక్షించిన డాక్టర్ బద్దిపూడి జయరావు కలం నుండి మరిన్ని రచనలు వెలువడాలని కోరుతూ....
అనిల్ కుమార్ దారివేముల
మాచర్ల, పల్నాడు జిల్లా.