ఫోటో ఆల్బమ్ స్వగతం
దుమ్ము బూజు పట్టి ఉన్న నేను మూడేళ్లుగా ఎదురుచూస్తున్నాను ఎవరైనా ఈ అటక మీద నుండి కిందికి దింపుతారేమోనని.
హమ్మయ్య! ఇన్నాళ్ళకి అభిషేక్ వాళ్ళ ఫాదర్ వచ్చాడేమో !,ఏదో పొద్దుపోక నన్ను కిందికి దింపి బూజు ,దుమ్ము దులిపాడు మరేం చేయమంటారు? కొడుకు కోడలు ఇద్దరు వారి వారి ఆఫీసులకు వెళ్లిపోయారాయే.
నాలో చలనం వచ్చింది." ఓ పెద్దాయనా!త్వరగా తెరువు .ఒక్కొక్క ఫోటో గురించి నీకు చెప్పాలి"అనేసరికి పాపం ఆ వెంకట్ రామ్ అనే పెద్దాయన చుట్టూ దిక్కులు చూస్తున్నాడు ఎవరా! అని తర్వాత తెలుసుకుని ఆశ్చర్యపోయి నేను చెప్పినట్లుగానే ఆల్బమ్ ఓపెన్ చేశాడు
ఇది నీ కొడుకు కోడలు పెళ్లికి ముందు ఫ్రీ ఫోటో షూట్ లో దిగిన ఫోటో .దీని తర్వాత ఇంకా ఓ 16 ఫోటోలు ఉన్నాయి .చౌముళ్ల ప్యాలెస్ ,చార్మినార్, గోల్కొండ ,బిర్లా మందిర్ ,నెక్లెస్ రోడ్డు ఇలా హైదరాబాదు, తర్వాత దాని పరిసరాల్లో ఉన్న ముఖ్య ప్రదేశాల్లో దిగినవి. చూడు ఎలా హత్తుకుపోయి ముద్దులు పెట్టుకుంటున్నట్లు
రకరకాల పోజులలో దిగారో !
ఇది ఈరోజుల్లో ఫ్యాషన్ ,ట్రెండ్ అట .మన కాలంలో ఉన్నాయా! ఇలాంటివి. పెళ్లయిన ఎన్ని రోజులకో కదా! మొగుడు పెళ్ళాం కలుసుకునేది .అసలు పెళ్లిలో కూడా సరిగా చూడనిచ్చేవారా ,అంతా సీక్రెట్ .మరి ఇప్పుడూ ,కొంతమంది ముసలోళ్ళు సొట్టలు నొక్కుకుంటూ బరి తెగించారని పిదపకాలం పిదప బుద్ధులని అజ్ఞానంతో ఏవేవో మాట్లాడేస్తున్నారు .వారికి ఇంకా అర్థం కావడం లేదు ఇది జనరేషన్ గ్యాప్ అని.
ఇప్పుడు ఈ17వ ఫోటో చూసావా పెళ్లి కుమార్తెను బుట్టలో తీసుకురావడం .పాపం ఆ ఫోటోగ్రాఫర్ ఎన్ని తిప్పలు పడ్డాడో ఈ ఫోటో తీయడానికి. ఆ పెళ్లికూతురు ఓ పట్టాన బుట్టలో కూర్చుంటే కదా !"ఇట్స్ మై ప్రిస్టేజ్ ఇష్యూ "అని ఏదేదో వాగేసింది. అందరూ కలిసి ఆమెను ఒప్పించేసరికి తల ప్రాణం తోక కొచ్చినంత పని అయింది అంటే నమ్ము .
ఈ ఫోటో చూసావా !పర్దా అడ్డం పెట్టి జీలకర్ర బెల్లం ఒకరికొకరు తలమీద పెట్టుకునే సీను. సరిగా రాలేదని రెండు వైపులా వధూవరుల వైపు ఫోటోగ్రాఫర్ల ,వీడియో గ్రాఫర్ల సూచనలు సలహాలతోనే చాలా సేపు గడిచింది.
ముహూర్తం మించిపోతుందనే పురోహితుడి మాటలు ఎవరి చెవికీ ఎక్కడం లేదు. స్టేజి మీద అంతా ఫోటోగ్రాఫర్లతో ,వీడియో గ్రాఫర్లతో నిండిపోయింది. అక్కడ ఏం జరుగుతుందో కింద కూర్చున్న ఆహుతులకు, అతిథులకు తెలియని అయోమయ పరిస్థితి .
పురోహితుడు మంత్రాలు చదివి జీలకర్ర బెల్లం ఒకరి తల మీద మరొకరు పెట్టుకోండి, అని చెప్పిన తర్వాత కూడా ఆ రెండు చేతులు అలాగే ఫోటోల కోసం ఒరగంట ఉండేసరికి పాపం ఆ చేతులు లాగ సాగాయి. చూడు !ఆ ఫోటోలో పెళ్లికూతురు మొహంలో అసహనం తర్వాత ఫోటోలో అల్లుడి కాళ్లు మామ కడిగే సీను. మామగారి ఉత్తరీయం అడ్డం వచ్చింది కదూ! అయినా పెళ్ళికొడుకు కనబడడం ముఖ్యంగానీ కాలు కడిగేవాడు ఎవడైతేనేమీ .
ఇక ముఖ్యమైన ఫోటో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మెడలో తాళి కట్టడం. ఇక్కడ నీకు ఒక విషయం చెప్పాలి ఈ ఫోటోలు నాలోకి రావడానికి ఇంత బాగా రావడానికి ఓ 50 ఫోటోలు వేస్ట్ అయ్యాయి తెలుసా! పెళ్ళికొడుకు అంగవస్త్రం అడ్డం రావడం, పురోహితుడు ఇలా కాదు అలా అని, అలా కాదు ఇలా అని
అమ్మాయి దగ్గర ఉన్న ముత్తైదువు లతో ఇబ్బందులు, ఫోటోగ్రాఫర్లు వీడియో గ్రాఫర్లు ఇచ్చే సూచనలు, సలహాలు, దానికి తోడు ప్రతి ఫోటోలో పురోహితుడు మధ్యలో కలగజేసుకొని పోజులు ఇవ్వడం. కదలమంటే కదలడే .ఇన్ని ఆటంకాలు!
ఇక తలంబ్రాలు అయితే ఒక ప్రహసనమే. !ఒక ఫోటోగ్రాఫర్ తలపై నుంచి మెల్లగా ,ధారగా పోయాలంటాడు. మరొకడు పెళ్ళికొడుకు పొడుగు కాబట్టే నిలబడితే ఫోటోలో రావడంలేదనీ కూర్చుని పోయామంటాడు.
రంగురంగుల బాల్స్, మెరుపు కాగితాలు ఒకరిపై ఒకరు పోసుకుంటూ పోజులు ఇమ్మంటారు .ఊదుకోమంటారు. కొందరు మెల్లగా అంటే కొందరు స్పీడ్ గా అంటూ ..ఇలా తలంబ్రాలు రకరకాలుగా పోసుకోవడం ప్రతి షాట్ నీ ఫోటో గా తీయడం. అబ్బ !నాకే విసుగొచ్చేసిందనుకో. తలంబ్రాలు ఎందుకు పోసుకుంటారో అర్థం తెలియని వారంతా స్టేజి పైనే .
ఇక వధూవరుల మిత్రబృందం చేసిన నానా హంగామా ఈ ఫోటోలో ఉంది. ఒకటే కేకలు అరుపులు !!ఒకరిపై ఒకరు పై చేయి సాధించాలనే తాపత్రయం. ఓ పెద్దాయనా !వధూవరుల మధ్య దగ్గరితనం కోసమే ఈ తలంబ్రాల కార్యక్రమం అని పెద్దలంటారు కానీ జరుగుతున్నది ఏమిటి?
ఇక నూతన వధూవరులకు రెండు సింహాసనాల లాంటి కుర్చీలు వేశారు కూర్చున్నాక విచ్చేసిన బంధుమిత్రులు ఆశీర్వాదాలు బహుమతులు ఇస్తూ ఉన్నారు .ఇవన్నీ 50 ఫోటోల దాకా ఉన్నాయి చూడు .
ఇదిగో ఈ ఫోటోలో కట్నం పెట్టి ఫోటో దిగకుండా దిగిపోతున్న వాడిని పిలిచి మరీ ఫోటో తీసుకున్నారు .
ఈ ఫోటోలో నా ఫోటో తీయరా అని బలవంతంగా నిలబడి ఫోటో దిగాడు. మరో ఫోటోలో తన ఉంగరాలు చూపుతో దిగిన ఓ మహానుభావుడిది.
ఈ ఫోటో చూసావా !ఈయన మీకు దూరపు బంధువు అట కదా! పల్లె నుండి పట్నం దాకా ఎన్నో తిప్పలు పడివచ్చాడట. ఒక్క ఫోటో తీయరా అని ఎలా మొహం మాడ్చుకున్నాడో ఓ మూల నిలబడింది
కనపడుతుంది .అయినా ఎవరూ పట్టించుకోరే ! తీసే ఫోటోగ్రాఫర్ పక్కకు జరగమని చేయి ఊపుతున్నాడట. అయినా ఆ పెద్దమనిషి కదల్లేదు. చివరికి పోనీలే అని తీసిన ఫోటో ఇది. అందరి మొహాల్లో ఏదో చిరాకు కదా!
అంతేనండి !తన వారైతే ఒకరకంగా పరాయివారైతే మరోరకంగా ,,!దీనికి ప్రత్యక్ష సాక్ష్యాలు ఈ ఫోటోలు.
ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం దిగింది ఈ ఒక ఫోటోలో! అయితే ఎవరో లేరని మైకు ద్వారా మరీ పిలిపించి ,ఫోటో తీశారు. ఒక్కొక్క ఫోటో తీయడంలో ఫోటోగ్రాఫర్లు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అపరిమితం .వారిని అటు జరుగు, ఇటు జరుగు, వంగు, భుజం మీద చెయ్యి వెయ్యి . ఇంకా దగ్గరగా జరుగు, అలా నిలబడు !నవ్వు !నిటారుగా నిలబడు.. ఇలా రకరకాల సూచనలతో జాప్యం జరిగింది.
మరి ఆశీర్వాదం చెప్పడానికి వచ్చిన లైన్లో నిలబడ్డా, అతిథులలో ఓపిక నశించినట్లు ఉంది, వారి మొహాల్లో అసహనం ఎలా ప్రస్ఫుటమవుతుందో ఈ ఫోటోలో చూడు.
ఇలా వద్దన్నవారివి ,ఇష్టమైన వారివి ,ఏదో లే అనుకున్న వారివి.ఎంతోమంది ఫోటోలు వధూవరులతోతో కలిసి తీశారు .ఇంక ఈ ఫోటోలు ...పెళ్లి పందిరి ,
వంటకాలు ,డెకొరేషన్లు, ఆర్భాటాలు వాళ్ల గొప్పతనం చెప్పుకోవడానికి తీసినవి.
పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఫోటోలు అయితే రకరకాల పోజుల్లో తీశారు. వాళ్లేమో మాకు ఆకలి అవుతుంది అని మొత్తుకుంటున్నా వినకుండా ఫోటో కార్యక్రమం జరిగింది .
అంతా బాగానే ఉంది. ఓ పెద్దాయనా !నన్ను తర్వాత ఎప్పుడైనా చూసారా .అసలు హీరోహీరోయిన్లకే టైమ్ లేదు ఎప్పుడూ బిజీ .అది సరే గానీ !మీరు బలవంతంగా, లేక ఇలా ఫోటోల కోసం నిలబడిన వారు గానీ! నన్ను చూశారా !పోనీ మీరైనా చూపించారా ?మీ బంధువులు మిత్రులు చూసి ఆనందించారా! నేను వచ్చిన కొత్తలో నేను చూస్తా నేను చూస్తా !అంటూ ఒకరిపై ఒకరు మీద మీద పడిచూసారే! కొత్త మురిపెం.
ఆ తర్వాత నన్ను అటకెక్కించారు. అయినా ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టారు .అప్పుడప్పుడు చూడండి నాయనా !కొంచెం. మైండ్ రిఫ్రెష్ అవుతుంది మంచిగా ఉంటుంది అని చెప్పినా వినరే! మీ ఇష్టం.
ఇంకేం చూశావుగా !నన్నింక అటకెక్కించెయ్!.ఈసారి ఏ మహానుభావుడొస్తాడో నా దుమ్ము దులపడానికి.
- రూపాకృష్ణ