'రబ్బర్ బ్యాండ్' (కథానిక)
భర్త శ్రీనివాస్ మీద కోపం రోజు రోజుకీ పెరిగిపోతోంది భార్య శ్రీనిధికి. అసలు ఒక పట్టాన అర్థం కాని జీవి శ్రీనివాస్. ఉన్నది ఉన్నట్లుగా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటం శ్రీనివాస్ నైజం అయితే, తనకు ఇష్టం వున్నా లేకపోయినా పై పై మెరుగులతో నలుగురితో నవ్వుతూ పనులన్నీ చక్కబెట్టడం శ్రీనిధికి బన్నుతో పెట్టిన విద్య.
"ఏమండీ మీరు చేసిన పని ఏమైనా బాగుందా! ఇలా ఒక్కసారి కాదు. రెండుసార్లు కాదు. నాకు ఫోన్లు వస్తున్నాయ్! వాళ్లందరికీ సమాధానం చెప్పలేక నా తలప్రాణం తోక కొస్తోంది తెలుసా? "అంటూ కోపంగా శ్రీనివాస్‌ని ప్రశ్నించింది శ్రీనిధి.
"అయితే నీకు ఒక తోక కూడా ఉందన్నమాట" అని సరసంగా ఒక చలోక్తిని విసిరాడు.
"చూడండి! జోకులకి ఇది సమయం కాదు, మనకి కూడా పెళ్ళీడొచ్చిన అబ్బాయి ఉన్నాడు. రేపొద్దున్న వాడికి మనం పెళ్ళి చేస్తే, మనక్కూడా అలాంటి చెత్త కానుకలే వస్తాయి అర్థం అయిందా!" అంటూ తన స్వరాన్ని ఇంకా పెంచింది శ్రీనిధి.
శ్రీనివాస్‌కి సహనం తగ్గిపోతోంది. "చూడు శ్రీనిధి !నీవు ఏది చెప్పినా సూటిగానూ, స్పష్టంగానూ చెప్పటం నేర్చుకో! అసలు విషయమేమిటో చెప్పకుండా ఈ నస, రుసరుసలేమిట"ని తను కూడా విరుచుకుపడ్డాడు.
"మనం పెళ్లిళ్లకు, ఫంక్షల్నికీ వెళ్లినపుడు ఏదో మనకి తగ్గట్టుగా క్యాష్‌ని గిఫ్టుగా ఇస్తున్నాం కదా! మరి ఆ కవరులో డబ్బుతోపాటు ఒక రబ్బరు బ్యాండ్‌ని కూడా పెట్టి మరీ ఇస్తున్నారు ఎందుకు వాళ్లకి?"
"ఓహో! అదా నీ బాధ! అది నీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదులే. పూజలు పునస్కారాలు, నోములూ చాలానే చేస్తున్నా నీకు ఇంకా జ్ఞానోదయం కాలేదన్నమాట" అని జవాబిచ్చాడు శ్రీనివాస్.
"ఇప్పుడు నీతో వాదించే ఓపిక సమయం నాకు లేదు కానీ, నన్ను వదిలేయ్. నాకు ఆఫీసుకి టైం ఐపోతోంది "అంటూ గగబగబా టిఫిన్ ముగించుకుని ఆఫీసుకు బయల్దేరాడు శ్రీనివాస్.
క్రమశిక్షణతో చేసే పనినే దైవంగా భావిస్తారు శ్రీనివాస్. అంతేగానీ దేవుడు లేడనిగానీ, ఉన్నాడనిగానీ వృధా కాలయాపన చేయడు. అది అర్థం కాని వాళ్ళు అతన్ని నాస్తికుడంటారు.
సమయం దొరికినప్పుడల్లా పుస్తకాలు చదవటం అలవాటున్నవాడు. శ్రీనివాస్ ఎదుటివాళ్ళు చెప్పేవి ఎక్కువగా వింటాడు కాబట్టే అతనికి విషయం పరిజ్ఞానం ఎక్కువ.
"నా పోనీటేల్‌కి పెట్టుకునే క్లిప్ ఇక్కడే పెట్టానే! మీరుగానీ తీసారాది"
శ్రీనివాస్‌ని అడిగింది.
"అయినా నీ క్లిప్ తీసుకుని నేను పెట్టుకుంటానా! పోనీలే! ఇదిగో ఇంద, ఈ రబ్బర్ బ్యాండ్ తీసుకో"మన్నాడు శ్రీనివాస్.
"ఔను! మొన్న ఈ రబ్బరు బ్యాండ్ గురించి అడిగితే తరువాత చెపుతానని తెలివిగా దాటేసారుగా! ఇప్పుడు చెప్పండి ఎలాగూ ఈ రోజు ఆదివారమే కదా, బోల్డంత టైముంది మనకు "అంటూ మళ్ళీ పెండిరగ్ టాపిక్‌లోకి వచ్చింది శ్రీనిధి.
"శ్రీనిధి మనం ఎక్కడ పుట్టాం?"
"నేనైతే ఆసుపత్రిలో పుట్టాను. మరి నువ్వెకడ పుట్టావో నాకు తెలియ"దంది.
"అది కాదు నే చెప్పేది శ్రద్ధగా విను
మనమంతా ''భూమిమీద'' జన్మించాం. ఎంతో సహజంగానూ, ఎత్తుగానూ కన్పించే ''ఆకాశం'' మనం అందుకోలేనిది.
అలాగే ''వాయువు లేక గాలి''. అదే కదా మనకు ప్రాణవాయువునిచ్చేది.
అసలు ''అగ్ని'' లేనిదే వంట కూడా చేసుకోలేము కదా! అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుంటాం. చివరికి దహన సంస్కారంకి కూడా అగ్నితోనే ముగుస్తుంది.''సూర్యుడు'' లేనిదే ఈ సృష్టి లేనే లేదు. కాలము, ఋతువులు అన్నీ సూర్యునివల్లే ఏర్పడతాయన్నది సత్యం.
పావురం గూట్లోని పిల్లలకు తనకు దొరికిన ఆహారాన్నిస్తుంది. ప్రేమానురాగాలకు మనకు పావురాలే ఆదర్శం.
కొండ చిలువ కూడా తనకు దొరికిన ఆహారంతో మాత్రమే జీవిస్తుంది.
ఎన్ని ''నదులు'' ఉప్పొంగి సముద్రంలో కలిసినా సాగరం పొంగదు. ధర్మమనే చెలియలి కట్ట దాటదు.''మిడుత'' అగ్నికి ఆకర్షింపబడి అందులో దూకి నశిస్తుంది. అలాగే అజ్ఞాని కూడా మాయలో పడి సుఖాలని భ్రమించి వాటితోనే అంతమైపోతాడు.
అడవిలో నిలిచిన ఆడ ఏనుగు ప్రతిమను చూచి భ్రమించి, దాని స్పర్శను కోరి, దానిని సమీపించగానే మగ ఏనుగు బంధించబడుతుంది. ఆ పోరులో చంపబడుతుంది. అదే రీతిలో స్త్రీ యొక్క స్పర్శ కోరిన అజ్ఞాని కూడా అంతే.''జాలరి'' వేసిన గాలానికి వున్న ఎరను తిందామన్న అమాయకమైన ''చేప'' చనిపోతుంది. మనం జిహ్వను జయిస్తే సమస్తం జయించగలం.
''వేశ్య'' ధనాశతో ఆనందమైన నిద్రను కూడా పాడు చేసుకొని విటుని కోసం పరితపిస్తుంది. ఆపై వైరాగ్యంలోకి వెళ్ళిపోతుంది. ఆశయే దుఃఖము, ఆశ లేకపోవటమే సుఖము.ఒక ''శరకారుడు'' బాణాలను తయారుచేయటంలో నిమగ్నమై తన ప్రక్క నుండీ వెళుతున్న ఊరేగింపును కూడా గమనించడు. లోకంలో భ్రమింపజేసే అనవసర విషయాలను మనం విస్మరించాలి.''చీమవలే'' ధనాన్నార్జించిన ధనంతో దానధర్మాలు చేయక కూడబెడుతుంది. దాన్ని దుర్మార్గులు దోచుకుంటారు. అయినా కృషితో జ్ఞానధనం సంపాదించాలి, కూడబెట్టాలి.వాస్తవానికి ''నెలబాలుడు'' చంద్రకళలు పెరుగుట మరియు తగ్గుటలుండవు. అది కేవలం కాలభ్రమణమేనన్న వాస్తవాలు మనం తెలుసుకోవాలి.
సర్వజీవులకూ ఆనందంతోపాటు చల్లదనాన్నిచ్చే ''చంద్రుడు'' మాత్రం ప్రతిఫలాన్ని ఆశించడు.
వివిధ పుష్పాల పుప్పొడి రేణువుల నుండీ సేకరించిన తేనెను ''తేనెటీగ'' అతి తక్కువగా గ్రోలుతుంది. దాదాపు తొంభైశాతం తేనెను మనమే త్రాగుతున్నాము కదా!
ఆకలితో వున్న ''గ్రద్ధ'' ఒక ఎలుకను కొనిపోతుండగా ఎన్నో గ్రద్ధలూ, కాకులూ ఆ ఎలుక కోసం గ్రద్ధతో వెంబడిస్తాయి. ఎగురుతూ అలసిపోయిన గ్రద్ధ ముక్కు నుండీ ఎలుక జారి పడిపోతుంది. అలాగే లౌకిక సుఖాలను ఆశించటం దుఃఖాన్ని కొని తెచ్చుకోవటమే అని మనం తెలుసుకోవాలి.
కపట వేటగాడి సంగీతానికి పరవశించి పోయిన ''లేడి'' అతనికి చిక్కి, నశిస్తుంది.
ఒక ''కన్య''ను చూడటానికై వస్తారు బంధువులు. అ సమయమందు కన్య యొక్క తల్లి ఇంట్లో లేదు. వచ్చిన వారికోసం ధాన్యాన్ని దంచుతుంది కన్య. కానీ తన చేతి గాజుల చప్పుడు వాళ్లు ఎక్కడ వింటారోనని ఒక్కొక్క చేతికీ రెండు గాజులు మాత్రమే ఉంచుకొని ధాన్యం దంచుతుంది. అయినా ఆ రెండు గాజులు కూడా శబ్దం చేయగా ఒక్కొక్క చేతికీ ఒక్కొక్క గాజునే ధరించి మరలా ధాన్యం దంచుతుంది. అదే విధంగా యోగులు కూడా ''యోగసాధన'' చేయాలన్నదే సందేశం.
''సర్పం'' చదలపుట్టలలో దూరి జీవిస్తుంది. చదలవలే అవివేకులు శ్రమకోర్చి గృహాలు నిర్మిస్తారు. తన కదలికలను ఎవ్వరికినీ తెలియనివ్వక సర్పం గుప్తంగా పుట్టలో దాగి ఉంటుంది. అదే విధంగా యోగి కూడా యోగాన్ని నిశ్చింతగా అభ్యసించాలి.స్వయంగా అల్లుకున్న సాలెగూడును ''సాలెపురుగు'' తానే మ్రింగేస్తుంది. అదే విధంగా జీవుడు కూడా పలు సంస్కారాలను, ఉపాధులనూ పెంచుకొని మరలా తన అవసాన దశలో వాటిని అంతర్గతం చేసుకుంటాడు.
''భ్రమర కీటకం'' ఒక కీటకాన్ని తెచ్చి గూటియందుంచి రaంకారం చేస్తుంది. కొంతకాలానికి తానే భ్రమరంగా మారుతుంది.
ఇక 24వదీ ''జలం''. ఈ చరాచర సృష్టియందు అతి ముఖ్యమైనది, సస్యశ్యామలానికీ, పశుపక్ష్యాదులకు, వృక్షసంపదకు మరియూ మానవుల మనుగడకు మూలకారణమైనది జలం. నీరు కాలువగా, నదిగా ప్రవహిస్తుంది. మన అందరి దాహాన్నీ తీరుస్తుంది. కానీ ఏ ఒక్కరి నుండీ ప్రతిఫలాన్ని మాత్రం ఆశించదు."
"హమ్మయ్య నన్ను బ్రతికించావు నాయనా! ఏదో ''రబ్బర్ బ్యాండ్'' గురించి చెప్పమంటే గంటసేపు ఇంత ఉపోద్ఘాతం ఇస్తావా! నాస్తికుడవైనా నీవు చాలా విషయాలే తెలుసుకున్నావే! ఇంతకీ అసలు నేనడిగిన ''రబ్బర్‌బ్యాండ్'' గురించి చెప్పనే లే"దని శ్రీనిధి చిరుకోపంతో అడిగింది.
"మన మానవ సంబంధాలను, బంధుత్వాలను అలాగే స్నేహాన్ని జీవితాంతం సమతుల్యంగా కొనసాగించుకోవాలంటే ఒక నిర్ధిష్టమైన నియంత్రణ మరియు పరిధి ఎంతో ముఖ్యమైనది. అలాంటి ప్రక్రియకు ఉదాహరణగా ''రబ్బర్ బ్యాండ్''ను మనం గురువుగా ఎంచుకోవాలి."
"అయినా ''రబ్బర్‌బ్యాండ్'' గురువు ఎలా అవుతుంద"ని మళ్ళీ మొండిగా వాదనలోకి దిగింది శ్రీనిధి.
"పూజ్యులు, గురువు దత్తత్రేయస్వామివారు ఇంతకు నేను చెప్పిన ఈ ఇరవై నాల్గింటినీ తన గురువుగా భావించి, తద్వారా వారి అనుభవసారాన్ని మనకందించారు.
అందుకే ఇరవై ఐదవదిగా ''రబ్బర్ బ్యాండ్''ను నేను కనుగొన్నాను. మన బంధుత్వం పటిష్టంగా ఉండాలంటే తెగేవరకూ లాగకూడదు అన్నదే దీనియొక్క సారాంశం "అని తన అనుభవసారాన్ని భార్య శ్రీనిధికి వివరించాడు శ్రీనివాస్.
"నన్ను క్షమించండి, అనవసరంగా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. ఇక నుండీ ఎవరైనా ''రబ్బర్ బ్యాండ్'' గురించి అడిగితే నేనే వాళ్ళకు వివరంగా చెపుతానండి.
అబ్బ! ఏమిటో అర్ధరాత్రివేళ వీధి కుక్కలు భయంకరంగా మొరుగుతున్నాయండి, ఏదో కీడు జరుగుతుందేమోనని నాకు భయంగా ఉందండి. వాటిని వెంటనే తరిమేయండి. నా బంగారంలాంటి నిద్ర కాస్త పాడైపోతోంది "అంటూ ఆవలిచ్చింది శ్రీనిధి.
వీధి కుక్కలు ఆకలితో మొరుగుతున్నాయి. వాటికి ఆహారాన్ని వేసి వస్తాను నువు పడుకో " అన్నాడు శ్రీనివాస్
- కొండూరి కాశీ