Telugu Global
Arts & Literature

రావిశాస్త్రి ఓ మ‌హావ్య‌క్తి

రావిశాస్త్రి అని తెలుగు సాహితీ లోకం ముద్దుగా పిలుచుకునే రాచకొండ విశ్వనాథ శాస్త్రి 1922వ సంవత్సరం జులై 30న శ్రీకాకుళంలో జన్మించారు. ఇతని తల్లిదండ్రులు నారాయణమూర్తి, సీతాలక్ష్మి. ఇతని స్వస్థలం మాత్రం అనకాపల్లి దగ్గర తుమ్మపాల గ్రామం. తండ్రి న్యాయవాద వృత్తి చేసేవారు.

రావిశాస్త్రి ఓ మ‌హావ్య‌క్తి
X

రావిశాస్త్రి అని తెలుగు సాహితీ లోకం ముద్దుగా పిలుచుకునే రాచకొండ విశ్వనాథ శాస్త్రి 1922వ సంవత్సరం జులై 30న శ్రీకాకుళంలో జన్మించారు. ఇతని తల్లిదండ్రులు నారాయణమూర్తి, సీతాలక్ష్మి. ఇతని స్వస్థలం మాత్రం అనకాపల్లి దగ్గర తుమ్మపాల గ్రామం. తండ్రి న్యాయవాద వృత్తి చేసేవారు.

రావిశాస్త్రి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి బి.ఏ.(ఫిలాసఫీ) పట్టా పుచ్చుకొని, ఆ తరువాత 1946లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో పట్టభద్రుడయ్యారు.

ఆ తరువాత 1950లో విశాఖపట్నంలో సొంతంగా న్యాయవాద వృత్తి చేపట్టారు. న్యాయవృత్తికి అవసరమైన మెళకువలను అతను తన తాతగారైన శ్రీరామమూర్తి దగ్గర ఆకళింపు చేసుకున్నారు.

మొదట్లో అతను కాంగ్రెస్‌ వాదిjైునా 1960 ప్రాంతంలో మార్క్సిస్ట్‌ సిద్ధాంతాలకు ప్రభావితం అయ్యారు.

ఇతను న్యాయవాది వృత్తిని స్వీకరించాక వెనకబడిన శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల ప్రజల జీవనాన్ని విస్తృతంగా అధ్యయనం చేసారు. వాళ్ళ భాషపై మమకారం పెంచుకున్నారు.

చెప్పుకోవాలంటే గురజాడ, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిల తరువాత ఎక్కువగా మాండలిక శైలిని వాడిన వారు రావిశాస్త్రి. తన రచనల్లో ఎక్కువగా తాడిత, పీడిత వర్గాల వారికి సముచిత స్థానం ఇచ్చి వారి సమస్యలను, బాధలను తన రచనల్లో చిత్రీకరించాడు.

రావిశాస్త్రి శైలి చాలా ప్రత్యేకమైనది. ఎవ్వరూ అనుసరించలేని విశిష్టత కలిగినది. అది అనితర సాధ్యం. అతని కథ, కథనం చాలా పదునైనవి. జన బహుళత్వం లోకి దూసుకెళ్ళే తత్వం కలిగినవి.

న్యాయవాదైన రావిశాస్త్రి సాహిత్యంలోనూ అదే బాటను కొనసాగించాడు. ధనికులు, భూస్వాముల అన్యాయాలకూ, దౌర్జన్యాలకు గూర్చి చిత్రహింసలు పడే దీన, హీన, బడుగు వర్గ ప్రజల తరుపున వకాల్తా పుచ్చుకొని తన వారి సాంఫీుక న్యాయం కోసం రచనలు చేసాడు.

రావిశాస్త్రి సమాజంలోని పేద, నిమ్న బడుగు జనుల ఆక్రందనలను, దు:ఖాన్ని పాఠకుల గుండెలకు సూటిగా నాటుకునేలా తన రచనలు సాగించి వారిపై సమాజంపై మొత్తం సానుభూతి కురిపించేలా చేసిన గొప్ప రచయిత, మానవతామూర్తి.

ముఖ్యంగా ఉత్తరాంధ్ర అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల మాండలికలంలో అట్టడుగు ప్రజల వాడుక భాషలో పాఠకులకు హత్తుకుపోయే రీతిలో పదునైన గొప్ప రచనలు చేసాడు.

సాహితీ వ్యాసంగం :

రావిశాస్త్రి ఉత్తరాంధ్ర మాండలికంలో ఎన్నో మరువలేని గొప్ప రచనలను చేసారు. వాటిలో అతి ముఖ్యమైనవి కథా సాగరం (1955), ఆరుసారా కథలు (1961), ఆరు సారో కథలు (1967), రాజ మహిషి (1968), కలకంఠ (1969), బానిస కథలు (1972), ఋక్కులు (1973), ఆరు చిత్రాలు (1974), రత్తాలు ` రాంబాబు (1975), సొమ్ములు పోనాయండి, గోవులొస్తున్నాయి జాగ్రత్త బంగారం, ఇల్లులను చెప్పుకోవచ్చు.

ఇక ఇతర రచనల విషయానికొస్తే నిజం, తిరస్కృతి, విషాదం వంటి గొప్ప నాటికలను వ్రాసారు.

వీటిలో అన్నిటికన్నా గొప్పది అల్పజీవి నవల. ఇది తెలుగు నవలా ప్రపంచంలోనే ఒక ప్రయోగాత్మక నవలగా చెప్పుకోవచ్చు. దీన్ని ఆయన చైతన్య స్రవంతి పద్ధతిలో వ్రాసారు. ఈ పద్ధతిలో తెలుగులో వచ్చిన మొదటి రచనగా మనం చెప్పుకోవచ్చు.

దీన్ని ఆయన 1952లో వ్రాసారు. ఆ తరువాత రాజు మహిషి, రత్తాలు ` రాంబాబు అనే రెండు అసంపూర్తి నవలల్ని వ్రాసారు. ఇక చరమాంకంలో అతను ఇల్లు అనే నవలని కూడా వ్రాసినా అతని నవలల్లో అత్యంత గొప్పదైనదిగా విమర్శకుల ప్రశంసలు అందు కున్నదే కాకుండా అత్యంత ప్రజాదరణ కూడా పొందిన నవల కూడా అల్పజీవే.

అప్పట్లో ఆంధ్రలో మధ్యపాన నిషేధం చట్టం వల్ల సమాజంలో జరిగిన పరిణామాలను చిత్రిస్తూ అయన రాసిన ఆరు సారా కథలు తెలుగు సాహితీ ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపి ఎంతో మంది విమర్శకుల్ని ఆలోచింపచేసాయి.

రావిశాస్త్రి తన మొదటి కథను 1936లో తన స్వగ్రామమైన తుమ్మపాలలో వ్రాసేరు. అతను 1963 లో జరిగిన ఓ సాహితీ సభలో రచయితలనుద్దేశించి ''ప్రతీ రచయిత తన రచనలను రాసే ముందు విశ్లేషించు కోవాలనీ'' చెప్పారు. 1970లో అతన్ని విరసం ఉపాధ్యక్షునిగా ఎన్నుకున్నారు.

పురస్కారాలు :

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనకు 1983లో కళా ప్రపూర్ణని ప్రకటిస్తే దానిని ఆయన తిరస్కరించారు. అలాగే 1966లో తీసుకున్న సాహిత్య అకాడమీ అవార్డుని తిరిగి ఇచ్చి వేసాడు.

అతను కన్యాశుల్కం, నిజం వంటి నాటకాల్లో నటించి ఎంతో పేరు గడిరచాడు.

''రచయితన్న ప్రతివాడూ తాను వ్రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో, ఏ చెడ్డకు ఉపకారం చేస్తుందో అనీ ఆలోచించాలి'' అనీ అన్నారు రావిశాస్త్రి.

రైతులు, కార్మికులు వాళ్ళ హక్కుల కోసం ఉద్యమించాలి. ఉదాసీనత వహిస్తే, వాళ్ళు మరింత దోపిడీకి గురౌతారు. పాలకులు హిరణ్యకశ్యపుల్లా తయారై ప్రజలను పీడిస్తే ప్రజలు నరసింహావతారం ఎత్తాలి. అనీ తన రచనల్లో ఎలుగెత్తి చాటారు.

రావిశాస్త్రికి ఆంగ్ల రచయితలైన లేంచ్‌, డికెన్స్‌ల రచనలు ప్రభావితం చేస్తే, తెలుగులో గురజాడ, శ్రీశ్రీ రచనలు అతని మీద ప్రభావం చూపాయి.

అతనికి చలనచిత్ర పరిశ్రమతో కూడా అనుబంధం ఉంది. 1969 ` 71ల మధ్య అతను తెలుగు చిత్రం 'స్త్రీ'కి, సంభాషణలు, హిందీ చిత్రం 'రాజా ఔర్‌ రంక్‌'కి స్క్రీన్‌ ప్లే సమకూర్చారు. అతను వ్రాసిన రత్తాలు ` రాంబాబు చలనచిత్రంగా రూపొందినా విడుదలకు నోచుకోలేదు.

అతనికి విశాఖపట్నం అంటే బాగా ఇష్టం. ముఖ్యంగా అక్కడి 'యారాడకొండ అంటే ఎంతో ప్రీతి. యారాడ కొండే గాని లేకపోతే విశాఖకు మణిహారం వంటి పోర్టు ఉండేది కాదు' అనీ చెప్పాడాయన.

రావిశాస్త్రి విగ్రహం విశాఖ బీచ్‌ రోడ్‌లో నెలకొల్పబడిరది.

రత్తాలు ` రాంబాబు నవలని రావిశాస్త్రి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన కాలంలో (1975 ` 77) జైలు జీవితం గడుపుతూ వ్రాసారు. రత్తాలు అనే పల్లెటూరి పడుచు ఎలా వ్యభిచార గృహం నుండి తప్పించుకొని రాంబాబుని చేరుకుందన్నది దీని ఇతివృత్తం. ఈ నవలని కమ్యూనిస్టు నాయకులు వాసిరెడ్డి వెంకటప్పయ్య, ఎన్‌.ఎస్‌. ప్రకాశరావులకు అంకితం ఇచ్చాడు.

అల్పజీవి నవలను 1955లో వ్రాసారు. రావిశాస్త్రి` ఇది ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టిన తన మొదటి నవల. ఈ నవల్లోని వేగం, కథనం ఆ రోజుల్లో కొత్త కావడం వల్ల దీనికి పాఠకుల విశేష ఆదరణ లభించింది.

ఇందులో సుబ్బయ్య అనే పిరికివాడి కథ ఆద్యంతం ఉత్కంఠభరితంగా వ్రాయబడిరది. బావమరిది వల్ల అతనికి ఎదురైన సమస్య, దాన్ని ఒక స్నేహితురాలు ఎలా పరిష్కరించిందో నవల్లో ఆసక్తికరంగా చిత్రీకరించారు రావిశాస్త్రి.

అలాగే 'వర్షం' కథ కూడా గొప్ప కథ... దీన్ని పాఠకులు ఎంతగానో ఆదరించారు. ఒక పరాన్నజీవిjైున ఓ వ్యక్తి ఓ వర్షం కురిసిన రోజున ఒక కుర్రవాడి మాటల ప్రభావానికి లోనై ఎలా మార్పు చెందాడన్నది దీని ఇతివృత్తం.

అలాగే 'పిపీలికం' కథలో ఒక చిన్న చీమ ద్వారా జీవనసత్యాన్ని ఆవిష్కరించ డం ఓ గొప్ప ప్రయత్నం.

రావిశాస్త్రి ఆలోచనలు స్రవంతిలాగా సాగుతాయి. అతను ఒక కొత్త కాలాన్ని, శకాన్ని అతని రచనల్లో సృష్టించారు. ఆలోచించి రచనలు చేస్తారు. ఆలోచించే పాత్రలతో రచనలు చేస్తారు. చాలామందిలాగ వాస్తవాన్నే నమ్ముకోకుండా వాస్తవాన్ని ప్రతిఫలించే వాస్తవం అనిపించే వాస్తవానికి నమూనాలాగ రచనలు చేస్తారు.

ఉత్తరాంధ్ర మాండలీకాన్ని చాలా మంది రచయితలు వ్రాసేరు. కాళీపట్నం రామారావు మాస్టారు, గొల్లపూడి, పతంజలి లాంటి ఎందరో గొప్ప రచయితలు తమ రచనల్లో ఆ మాండలీకాన్ని వ్రాసినా రావిశాస్త్రి గారు తీసుకొచ్చిన గుబాళింపు వారెవ్వరూ రచనల్లో తీసురాలేకపోయారు.

ఒక గొప్ప విషయం ఏంటంటే ఏ కథా రచయితకూ ఏ సమాజం ఒక శిలావిగ్రహం ఎక్కడా పెట్టలేదు. కానీ మన తెలుగు సమాజం విశాఖపట్నంలో అతని శిలా విగ్రహాన్ని ప్రతిష్టించడం అతనికి మన తెలుగు సమాజం ఇచ్చిన ఓ గొప్ప గౌరవంగా చెప్పవచ్చు. అది మన జాతి ఆయనకిచ్చిన ఓ గొప్ప నివాళి. ఆయన రాసిందే ఆయన ఆచరించారు. ఆచరించిందే తను రాసారు.

ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన కథకు నవలకు తేడాను చెబుతూ ''అలా రాస్తూ పోతే కథ, అలా.... రాసుకుంటూ కొనసాగితే నవల'' అనీ రెండు ముక్కల్లో వాటి గురించి అద్భుతంగా విశ్లేషించారు. అలాగే వృత్తిపరంగా తేడాల గురించి చెబుతూ సివిల్‌ కేసుల్లో మేమెక్కువగా అబద్ధాలాడవలసి వస్తుంది. అదే క్రిమినల్‌ కేసుల్లో పోలీసులు ఆడే అబద్ధాలను మేము రుజువు చెయ్యవలసి ఉంటుందనీ ఎంతో చమత్కారంగా చెప్పారు.

అలాగే కథా రచన గురించి రావిశాస్త్రి గారు చెబుతూ కథల్లో ఎక్కువగా ఉపమానాలు వాడకూడదనేవారు. ఒక చెట్టుకు పూలు అందమే కానీ మొత్తం చెట్టంతా పూలమయం అయిపోతే చెట్టు ఉనికికే ప్రమాదం అనీ సోదాహరణంగా చెప్పడం కథ మీద ఆయనకుండే పట్టుని తెలియజేస్తుంది.

అతని రచనల్లో ఎక్కువగా వామపక్ష, హేతువాద ధోరణులు కనిపిస్తుంటాయి.

రావిశాస్త్రి గారు లేని వెలితి విశాఖకు తీరేది కాదు. నీటిలో చేపలా నిత్యం ఇక్కడ జనంలోనే మసిలేవారాయన. వాళ్ళ సాంగత్యమంటే మక్కువ. వారి పట్ల విసుగూ, కోపం మచ్చుకైనా ఉండేవి కావు. 'పేదల సొద' వినడానికి ఆయనకు ఎంతో ఓపిక. సామాన్యులకు అసమాన్యంగా పట్టాభిషేకం చేసిన రచయిత.

అంతేకాదు, ప్రజల మీద స్వారీ చేసే ప్రభువులంటే ఆయనకు మంట. వాళ్ళ ఆస్తులకి కాపలాకాసే పోలీసుల్నీ, జైళ్ళనూ, మొత్తం రాజ్యాంగ వ్యవస్థనీ కత్తిలాంటి తన కలంతో చీల్చి చెండాడాడు. దిక్కులేని వారికి పెద్ద దిక్కుగా నిలిచాడాయన.

రచయిత దృక్పథం బట్టి కథాసారం మారిపోతుందని నిరూపించడానికే ఆయన ''మంచి చెడ్డల్లో ఏ కథ'' అనేది రాసారు. నేలా, నీరూ, నిప్పూ, ఎండా, గాలి ` వీటికి కూడా కలిమిలేముల తేడా ఉంటుందనీ ఆ కథలో తెలిపారు. ఒక ఊళ్ళో నిప్పంటుకుంటే ముందుగా కాలేవి మాల కొంపలు... ఆ తరువాత చాకలి వారి ఇళ్ళు.. ఇలా సాగుతుంది ఆ కథ...

ఈ సమస్యకు విరుగుడుగా చీమల్లాంటి సామాన్యులు కలిసికట్టుగా పాములాంటి సమస్యలపై పోరాటం చెయ్యాలనీ తన 'పిపీలికం' అనే కథలో చెప్పారు.

''చదవడం వల్ల సంస్కృతం రాలేదు. చదవకపోవడం వల్ల తెలుగు వచ్చింది. తెలుగుని నేను చదివి నేర్చుకోలేదు. విని నేర్చుకున్నాను. జనం దగ్గర ఓనమాలు దిద్దాను. ప్లీడరు వృత్తిలో గుణింతాలు నేర్చుకున్నాను.

జీవితం ఓ పెద్దబాల శిక్ష. మంచి పుస్తకాల చిన్న బాలశిక్ష'' అనీ భాష గురించి రచనా విధానం గురించి రావిశాస్త్రి చెప్పారు.

అందుకే ఆయనది జనం భాష. జీవ భాష, జిగిబిగి, చిక్కదనం అతని రచనల్లో ఓలలాడుతుంటాయి. మాట్లాడే కథలు వ్రాసిన అతి తక్కువ మంది ఈ తరం రచయితల్లో రావిశాస్త్రి గారొకరు. తన మీద గురజాడ ప్రభావం ఉందనీ పలుమార్లు రావిశాస్త్రి గారు చెప్పుకున్నారు.

గొల్లపూడి మారుతీరావు గారు తన ఎలిజీలో ''వర్గపోరాటం గురించి నాకంతగా తెలియదు. దాని గురించి ఆవేశంతో, బాధతో, ఏడుస్తూ చాలా మంది రచనలు చేసారు. శాస్త్రిగారి రచనల్లో ఆ స్పృహతో పాటు చిన్న హాస్యం, పెద్ద చురక, వెక్కిరింత ఉంటుంది. వాస్తవాన్ని బలంగా పట్టుకుంటూ` తను చెప్పదలచిన విషయాన్ని అంతే బలంగా నిలపగలిగిన దమ్ము చాలా తక్కువ మంది రచయితలకి ఉంటుంది.. ఈ విషయంలో పెద్దపీట ఏ నాటికైనా గురజాడకే. ఈ తరంలో అంత గొప్ప ప్రక్రియని సాధించిన అఖండులు రావిశాస్త్రి గారు'' అనీ చెప్పారు.

చివరగా శ్రీశ్రీ ''శతాబ్దాల కిందట ఒక రావి గౌతముణ్ణి ప్రభావితం చేసింది. ఈ శతాబ్దంలో ఒక రావి తెలుగు వారిని ప్రభావితం చేసి ప్రబుద్ధుల్ని చేస్తోంది'' అనీ రావి శాస్త్రీయం పుస్తకం గురించి వ్యాఖ్యానిస్తూ చెప్పారు.

ఏదైనా తెలుగు వారిని, తెలుగు జాతిని తన సాహిత్యం ద్వారా ప్రభావితం చేసిన ఓ గొప్ప వ్యక్తి 'రావిశాస్త్రి'.

- గ‌న్న‌వ‌ర‌పు న‌ర‌సింహ‌మూర్తి, 77520 20123

First Published:  18 Oct 2022 5:16 PM IST
Next Story