గెలుపు ( కథానిక)
"ఎవరు గెలుస్తారంటావ్?"
"ఇందులో సందేహం దేనికి? రమణియే విజేత అవుతుంది."
"నేనూ అదే అనుకుంటున్నా!"
ఉత్కంఠ భరితంగా సాగుతున్న టెన్నిస్ మ్యాచ్ చూస్తున్న ఇద్దరి ప్రేక్షకుల సంభాషణ అది.
అలా అక్కడ రమణి అభిమానులు ఎంతోమంది ఉన్నారు. అందరిలోనూ ఉత్కంఠత.
ప్రతీ ఏడాది రాష్ట్రస్థాయిలో జరిగే ప్రముఖ
'సమతా మహిళా టెన్నిస్ ట్రోఫీ' ఫైనల్స్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులతో స్టేడియం కిక్కిరిసి ఉంది.
ఆట ప్రారంభమవడానికి రెండు నిముషాలుంది.
సెమీ ఫైనల్స్ దాటి ఫైనల్స్ కు చేరిన ఇద్దరు రమణి, శ్రావణి తలపడడానికి సిద్ధంగా ఉన్నారు.
అత్యంత ప్రాముఖ్యత ఉన్న పోటీ అది.
ప్రైజ్ మనీ కూడా పెద్దదే.
బరిలో దిగిన రమణి , శ్రావణి ఇద్దరూ సమ ఉజ్జీలే ఐనా శ్రావణి సీనియర్.
గత సంవత్సరం కూడా వీరిద్దరే పైనల్స్ కు చేరుకున్నారు. శ్రావణిని ఓడించిన రమణి గత సంవత్సరపు విజేతగా నిలిచింది.
ఆ తర్వాత రమణి మరెన్నో ఇతర ట్రోఫీలను గెలుచుకొని పేరు సంపాదించింది.
ఆట మొదలైంది.
**
"నమ్మలేక పోతున్నాను. అలా ఎలా? "
"ఇది అనుకోనిది"
"కలలో కూడా ఊహించనిది"
"చివరి వరకూ తనే ముందంజలో ఉంది. అయినా ఎలా మిస్సయింది?"
"ఓవర్ కాన్పిడెన్స్ ఎక్కడా కనిపించలేదు.
సామర్ధ్యం ఎక్కడా తగ్గలేదు. మరి ఫలితం ఇలా వచ్చిందేమిటి?"
"చివరి గేమ్ లో పొరబాట్లు చేసింది. అందుకే ఓడిపోయింది. "
"ప్చ్! గెలుపు ఓటములు దైవాధీనాలు. బ్యాడ్ లక్ "
అక్కడున్న ప్రేక్షకుల్లో అధికశాతం మంది అనుకుంటున్న మాటలివి.
ఆ ఫైనల్ ఆటలో శ్రావణి గెలిచింది.
పోటాపోటీగా సాగిన ఆటే. చివరి వరకూ ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠత తో సాగిన ఆట.
రమణికి శ్రావణి గట్టి పోటీ ఇచ్చింది. గత విజయం తాలూకూ ఆత్మ విశ్వాసం రమణిలో కనిపిస్తూ శ్రావణి కంటే పైచేయిలో ఉన్నా,
చివరి ఐదు నిముషాల ఆటలో శ్రావణి కంటే రమణి వెనకబడింది. చివరకు శ్రావణి రమణిపై గెలిచి ట్రోఫీని అందుకుంది.
ఊహించని ఫలితమిదని రమణి ట్రైనర్ బాధగా అనుకుంటున్నాడు. రమణి అభిమానులందరూ నిరాశకు గురయ్యారు.
ట్రోఫీని చేతిలో పట్టుకుని రమణి దగ్గరకు శ్రావణి వచ్చింది.
"ఈ ట్రోఫీ గెలవాలన్న నా కల సార్ధకమైంది.
నువ్వు ఎప్పట్లా బాగా ఆడావు. నేను ఈ సారీ గెలవలేననే అనుకున్నా. కానీ నేను గమనించిందేమిటంటే ఆట చివర్లో నువ్వు కాన్సన్ట్రేషన్ తగ్గించావని అనిపించింది. ఎందుకో తెలీదు... తోటి క్రీడాకారిణిగా గమనించాను. నువ్వేదో కావాలనే ఈ గేమ్ ను వదిలేసినట్టుగా నాకు అనిపించింది."
తన మనసులోని మాట చెప్పింది శ్రావణి రమణితో.
"అదేం లేదు. మీరు బాగా ఆడారు. మీ ప్రాక్టీస్ కూడా చూసాను. ఈ ఆట గెలవాలన్న మీ ఆశయం, దాని వెనక మీ శ్రమ చూసాను. ఈ విజయం మీదే!...కంగ్రాచ్యులేషన్స్ " అభినందిస్తూ
అందమైన చిరునవ్వుతో చెప్పింది రమణి.
####### ###### #######
'ఓటమిని ఈజీగా తీసుకునే మనస్తత్వం కాదు రమణిది. గెలిచే ఆత్మ విశ్వాసం సంపూర్ణంగా రమణిలో ఉంది. ఈ ట్రోఫీని మరలా మరలా గెలవాలన్న పట్టుదల బాగా ఉంది. అలాగే గత విజయాలను తలపైకెక్కించుకునే అమ్మాయీ కాదు. ఈ ఆట గెలవలేకపోయినా, ఎందరో అభిమానులను నిరాశ పరిచినా, రమణి ముఖంలో ఏమాత్రం బాధ కనబడలేదని, మరింత ఉత్సాహంగా కనిపిస్తోందని'..గమనించాడు రమణి తండ్రి కేశవరావు.
ఇంట్లో బాల్కనీలో కూర్చుని పేపరు లోవచ్చిన ట్రోఫీ ఫలితాలు, విజేతగా శ్రావణి ఫొటో చూస్తున్న రమణి దగ్గరికి వచ్చాడు కేశవరావు.
"నువ్వీ ఆటను మనస్పూర్తిగా ఆడావా? నాకలా అనిపించలేదు. కావాలనే ఓడినట్లున్నావు... నిజమేనా!?" ఆప్యాయంగా అడిగాడు కేశవరావు.
తండ్రి వైపు చూసింది రమణి.
ఆమె కళ్లల్లో ఒక సంతోషపు మెరుపును గమనించాడు కేశవరావు.
"అవును నాన్నగారు. ఈ ఆటను నేను కావాలనే ఓడిపోయాను. గట్టి పోటీ ఉండేట్లుగానే చూసుకున్నాను. శ్రావణి గెలవాలనే నేను ఆడాను" చెప్పింది రమణి.
'తన కూతురు రమణి, ఏదన్నా నిర్ణయించుకుందంటే దాని వెనక బలమైన కారణం ఉండుంటుంది' మనసులోనే అనుకున్నాడు కేశవరావు.
రమణి ఇంకా వివరంగా చెప్తోంది..
"ఈ ట్రోఫీకై ఆడాలంటే శ్రావణికి వయసు రీత్యా ఈ సంవత్సరమే ఆఖరు. ట్రోఫీ గెలవాలని గత నాలుగు సంవత్సరాలుగా ఆమె చేస్తున్న ప్రయత్నం విఫలమౌతోంది. కఠిన శ్రమ చేస్తోంది.
మొన్న శ్రావణి ప్రాక్టీస్ కోసం వచ్చినప్పుడు, తనతో కూడా వచ్చిన తన తల్లితో "నేనెంతో శ్రమ పడుతున్నాను... ఈ సారి గెలవకపోతే ఇక ఆట మైదానానికే రాను. ఇక ఎవరినీ కలవను. నాదిక చీకటి జీవితమే" అన్న నిరాశతో కూడిన మాటలు విన్నాను. అవి ఆమె హృదయంనుంచి వచ్చిన మాటలవి.
వరుసగా ఫైనల్స్ లో ఓడిపోవటం వల్ల ఆమెకు తన ఆటతీరుపైనా, కఠోర శ్రమ పైనా విశ్వాసం సన్న గిల్లుతోంది. ఒక మంచి క్రీడాకారిణి మనసు చివుక్కుమంటోంది.
ఆటలో స్పర్ధ ఉంటుంది. ఒకసారి గెలిస్తే, ఆ గెలుపుతో వచ్చే ఆత్మ విశ్వాసానికి మించిన శక్తి లేదు..."
"...నాకింకా భవిష్యత్తు ఉంది. ఈ ఆట నేను గెలవకపోయినా నాకొచ్చే నష్టమేమీ లేదు. నాకింకో అవకాశం ఉంది. కానీ ఆమెకిదే ఆఖరి అవకాశం. అందుకే శ్రావణి నాపై గెలవాలి అని నిశ్చయించుకున్నాను.
కావాలనే ఆట చివరలో ఓడిపోయాను. ఈ విషయం తనకు తెలియకూడదు" అసలు సంగతి
చెప్పింది రమణి.
అది విన్న కేశవరావుకు తన కూతురుపై ఉన్న విశ్వాసం , నమ్మకం రెట్టింపైంది. ఆమెపై గౌరవం పెరిగింది.
"గెలవటమే గమ్యమైన క్రీడలలో అసలైన గొప్ప విజయమిది. క్రీడా స్ఫూర్తినిస్తున్న రమణిది మంచి మనసు.. కనిపించే విజయాల ఆకర్షణలేవైనా కనబడని , నిస్వార్ధమైన మనసు అదే గొప్ప అంతఃసౌందర్యం ! ఓడి గెలిచింది .. ఇంతకన్నా కావలసినదేముంది?" మనసులోనే కూతుర్ని మెచ్చుకున్నాడు కేశవరావు.
-రామశర్మ