Telugu Global
Arts & Literature

మార్గశిర మేళం

మార్గశిర మేళం
X

చలిమల శిఖర మెక్కిన గరిమకు

దినకరుడెగరేసిన మకరధ్వజ కేతనం.

తొలి తొలి ఝాముల

ధనుర్మాస దేవళాన

అల వైకుంఠ పురానికి బెత్తెడు దూరం

మధుర భక్తి గీతికల

శృతి మీటిన దివ్య ప్రబంధం.

పొగరులన్ని వదిలేసి

నులివెచ్చని సెగ ఉంటే చాలని

చితుకులన్నిటిని ఏరుకొచ్చి

రాజేసుకున్న భోగీ మంటకు

చుట్టుత గుమిగూడిన జనం

సరిసమాన జీవుని వేదనకు

అగ్ని సాక్షి ప్రమాణం.

అలికిన వాకిళ్ళకు

చుక్కలు ఆత్రంగా దిగివచ్చిన

ముత్యాల ముగ్గు రథం.

స్వచ్ఛం గా గొబ్బిళ్ళకు

గుమ్మడి పూల అందాలను

తరుణులు ఉమ్మడిగా

సమకూర్చిన తరుణం.

హరి దాసరి పదాలకు

చిడతలు పలికిన వేదం,

గజ్జెల గిట్టల గంగి రెద్దు ఆటలు

బుడబుక్కలు, జంగమ దేవర్ల రాకడలకు

కట్టెదుట జానపదం

చిత్తడి చెమటల కృషికి

పంట సిరులసంతసం.

గడి దాటిన పతంగులు

తోక ఝాడించి తాకిన గగనం

బరికి దిగిన పందెంకోళ్ళ

స్పర్థకు అడ్డు తెగిన రోషం.

పల్లెకు వ్యాపించిన నగరాలకు

అంటు కట్టు కున్న సంప్రదాయ బంధం.

అమ్మాయిలు ,అబ్బాయిలు,

పట్టు పావడాలు ,ఓణీలు,

జుబ్బాలు పంచెలు,

తీసి కట్టిన దినం.

చెరుకు కండెల తీపి రసాలకు

చెక్కెర అచ్చుల పోతలు

కొలువు బొమ్మలు,

నువ్వులు బెల్లాలు,

నవ్వులే నవ్వులు

పంటి కొరుకు చెక్కిలాలు

కర కరలాగని దవడక్రింది జపం.

పసిపిల్లల భాగ్యానికి

భోగి పళ్ళ తల పోతల భాగ్యం .

వ్రతాలు నోములు పూజలు

ఉడుకు పొంగళ్ళ నైవేద్యాలు.

పులిన ధమనుల ఆయనాలకు

ప్రేమ దామాల కంఠ హారం

మాయ రోగాలను వదిలించే

వైజ్ఞానిక సంప్రదాయాల

మార్గశిర మేళం

సంక్రాంతి సంబరం

-రాజేశ్వరి దివాకర్ల

(వర్జినియా యు .ఎస్)

First Published:  14 Jan 2023 9:06 PM IST
Next Story