Telugu Global
Arts & Literature

ఉనికి..- శశిబాల ( హూస్టన్ )

ఉనికి..- శశిబాల ( హూస్టన్ )
X

మానవత్వమా.....దైవత్వమా

ఏది గోచరం....ఏది అగోచరం

అయినా కూడా

ఉందా లేదా అని సందేహం.

సందేహమన్నది లేక

ఉండబోదుఏ దేహం.

మానవత్వం

మనిషి అంతఃకరణలొనే

కానీ.....

దైవత్వం...

అంతటా,అన్నింటా....

విశ్వ వ్యాప్తమై,సృష్టి విచిత్రమై....

పంచభూతాత్మికమై...

పరమాణు సిద్ధాంతమై...

ఆనంతకోటి జీవరాసులలో అంతర్లీనమై..

స్థిరంగా... నిస్సందేహంగా...మిళితమై ఉంది.

సృష్టి కారకుడట బ్రహ్మ...

నిజమా ...సందేహమే వితండవాదానికి.

బ్రహ్మే బ్రహ్మాండం...

ఎన్నో ,ఎన్నెన్నో జీవరాసుల్ని పుట్టిస్తూ,బ్రతికిస్తూ...

ఎన్నో అగోచరమైన

అనుభూతుల్ని సృష్టిస్తూ...

అనుభూతా.

అంటే..ఉన్నదానికా...లేనిదానికా..

హ హ ...సందేహమా దేహమా...

అవును సందేహాలన్నీ దేహమున్న ,బుద్ధి ఉన్న మనకే...

ఆ ప్రశ్నకే ఈ సమాధానం.....

ఊపిరి,గాలి,ప్రాణం కనబడని ఉనికి.

అనుబంధం,ఆప్యాయత,వైరాగ్యం,విషాదం,ఆవేశం,క్రోధం,జుగుప్స,...

ఉన్నాయి అన్నీ .

ఉన్నాయి....అందరిలో

అనుభవాన్ని కలిగిస్తూ,

అనుభూతిని రేకెత్తిస్తూ.

అహ్హో..ఈ కనబడని ఉనికికి

ఎంత శక్తి ..

జడపదార్థాలను సైతం

జటిలంగా మారుస్తూ.

అవాస్తవాలను సైతం

వాస్తవాలుగా మారుస్తూ

అద్భుతాలను సృష్టిస్తూ...

అంతరంగాల స్పర్శిస్తూ.

అంతా తానై అన్నింటా తానై...

విశ్వ విభ్రమమొనరిస్తూ..

విధాతనే సవాలు చేస్తూ

సృష్టికి ప్రతిసృష్టి చేస్తూ....

సమస్తం మళ్లీ నాశనం చేస్తూ

సృష్టించినదాన్నే అంతమొందిస్తూ....

ఒహ్హో...

ఏమి విధాత చాతుర్యం.

కనబడని చెయ్యేదో చేస్తున్న విన్యాసం.

అదే కదా బ్రహ్మ...

అదే కదా విష్ణు..

అదే కదా శివం..

అదే కదా బ్రహ్మం..బ్రహ్మాండం

అదే..అదే...

సృష్టి ,స్థితి, లయకారకం..

అదే దైవత్వం.

అందుకే...కనబడేదీ...కనబడనిదీ...అంతా వునికే

అంతా వాస్తవానికే

ఊపిరులందిస్తూ,

ఊపిరులు తీస్తూ

చరిస్తూ,గతిస్తూ

విశ్వ కారణమై,విశ్వ వ్యాప్తమై,

విశ్వ నాశనమై

First Published:  29 Oct 2022 1:30 PM IST
Next Story