Telugu Global
Arts & Literature

పూలసందడి (కవిత)

పూలసందడి (కవిత)
X

హరివిల్లులోని సప్తవర్ణాలను

సవాల్ చేస్తూ

ఎన్నెన్ని రంగుల

అందమైన చీరలను

అలంకరించుకుని

ఉదయాన్నే డాబా మీద

సందడి చేస్తారో

మిమ్మల్ని చూసిన ప్రతిమారు

సరికొత్తగా జన్మెత్తుతూ

పదే పదే

ప్రేమలో పడిపోతూనే ఉంటాను

ఏ వన్నెల వెన్నెల లోకంలో నుండి

మెత్తదనంతో కూడి

ఇంత పూలతనాన్ని మోసుకొచ్చారో

అని ఆలోచించినప్పుడల్లా

నా మనసు కొమ్మకు

ఒక నవ్యకవితా సుమం

తప్పక పూస్తుంది

ఇక పరిమళాలను

ఆఘ్రాణించినపుడల్లా

వేవేల వాక్యాలు

మదిమడిలో ఆకుపచ్చగా

మొలకెత్తుతూనే ఉంటాయి

నా భావాలు చిగురులు తొడిగి

ఆకాశాన్నంటే వృక్షాలుగా

ఎదుగుతాయి

అనుకోని అతిధిలా

నింగి నుండి వాన

వచ్చినపుడల్లా

తడి చేతులతో

పూబాలను ముద్దాడి

రేకులపై చినుకుముత్యమై మెరుస్తుంది

ఒక పువ్వు

పసుపును దేహమంతా పూసుకుంటే

మరొకటి ముఖమంతా

ఎరుపును అద్దుకుంది

మధ్యలోని తెల్లనిది

నుదుటిపై

మరో పూలరంగును

బొట్టుగా దిద్దుకుంటుంది

మీ సొగసుకు మైమరచినపుడల్లా

నా కలం

సాహితీకొలనులో పదకమలమై విరుస్తుంది

ఇలా కవిత్వమై కురుస్తుంది

- పద్మావతి రాంభక్త

First Published:  10 Nov 2022 6:06 PM IST
Next Story