Telugu Global
Arts & Literature

అంతా మన మంచికే! ( కథ)

అంతా మన మంచికే! ( కథ)
X

"అబ్బబ్బా... తొందరగా తెమిలి చావరు కదా! మీరు తయారయ్యేసరికి మనమెక్కాల్సిన రైలు తన చివరి స్టేషన్ కి రెండు మూడు టర్న్ లు తిరిగేసేటట్లుంది !" గేటుముందు నిలుచుని ఆటో కోసం ఎదురుచూస్తూ...భార్యా,కూతురిపై కోపంతో కేకలేశాడు వామనరావు.

అతని కేకలకు భయపడి హడావుడిగా భుజాలకు బ్యాగులు తగిలించుకుని ఇంట్లోంచి బయటికొచ్చారు తల్లీకూతుళ్లు.

మరో పదినిమిషాల్లో ఆటో వచ్చింది.అందులో ఎక్కి కూర్చున్నారు వామనరావు ఫ్యామిలీ.

ట్రాఫిక్ పద్మవ్యూహన్ని చేధించుకుని రైల్వేస్టేషన్ చేరుకుంది ఆటో.వాళ్ళ అదృష్టమో,దురదృష్టమోకానీ...వామనరావు ఫ్యామిలీ ఎక్కాల్సిన రైలు అప్పటికే వెళ్ళిపోయింది.

సమయం,డబ్బు దగ్గర చాలా కాలిక్యులేటెడ్ గా ఉండే వామనరావు... తల్లీకూతుళ్లు చేసిన ఆలస్యం కారణంగా ఆరోజు తమ ప్రయాణం తప్పిపోయినందుకు వాళ్ళిద్దర్నీ ఆరోజంతా తిడుతూనేవున్నాడు .

"మేమేం చేసామండీ! ఆ ఆటోవాడే ఆటోని నెమ్మదిగా గుడ్డెద్దులా తోలాడు. అందుకే మనమెక్కాల్సిన రైలు మనమెళ్ళేసరికి వెళ్ళిపోయింది!" అంది వామనరావు భార్య సుశీల.

"మీరు చేసిన పనిని ఆటోవాడిపైన తోయడమెందుకు! మీ పెంకు మొహాలకి అంతంత మేకప్ పూసేసరికి ఉన్న టైం ఇక్కడే అయిపోయింది. మనమేమో రాజావారి ఫ్యామిలీలాగా ఊపుకుంటూ వెళ్ళేసరికి, ఎక్కాల్సిన రైలు వెళ్లి చచ్చింది. మీతో ప్రయాణం పెట్టుకున్నాను చూడు… నాది… నాది బుర్ర తక్కువ పని…" అంటూ భార్యపై అంతెత్తున లేచాడు వామనరావు.

భర్త కోపం ఎరిగిన భార్యగా మరింకేం మాట్లాడకుండా గమ్మునుండిపోయింది సుశీల.

తెల్లారింది…

నిద్ర మత్తుతో టీవీ పెట్టిన వామనరావు అందులో వస్తున్న స్క్రోలింగ్,చూపిస్తున్న దృశ్యాలు చూసి కూర్చున్న సోఫాలోంచి అంతెత్తున ఎగిరిపడ్డాడు. ఒక్కసారిగా అతని నిద్రమత్తు ఎగిరిపోయింది.

మళ్ళీ ఓసారి టీవీవైపు కళ్ళు చికిలించి చూశాడు.

నిన్న తాము ఎక్కాల్సిన రైలు ఒడిషా రాష్ట్రం బాలాసోర్ దగ్గర ప్రమాదానికి గురైనట్లు,అక్కడి హృదయవిదారక దృశ్యాలు టీవీలో చూపిస్తున్నారు. ఆ దృశ్యాలు చూస్తున్న వామనరావు గుండె కాసేపు ఆగి కొట్టుకోవడం ప్రారంభించింది. ఒళ్ళంతా భయంతో చెమట పట్టేసింది.

జరిగిన ప్రమాదంలో రెండు రైళ్లు బలంగా ఢీకొట్టినట్లు టీవీలో కనిపిస్తోంది. దూరంగా ఎగిరిపడి నుజ్జునుజ్జయిన బోగీలను చూస్తుంటే ప్రమాద తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో ఇట్టే అర్థమైపోతోంది.

'నిన్న తాము అనుకున్న టయానికి చేరుంటే… అదే రైలు ఎక్కుంటే…' ఆ ఆలోచన మనసులోకి రాగానే ఒక్కసారిగా ఒళ్ళు జలదరించింది అతనికి.

కాస్త ఆలస్యం చేసారనే కారణంగా, నిన్నంతా భార్య,కూతురిని తిట్టినందుకు ఆ క్షణంలో నిజంగా సిగ్గు పడ్డాడు. వాళ్ళలా ఆలస్యం చేయడం వలనే తమ ప్రాణాలు దక్కాయని, ఏం జరిగినా అంతా తమ మంచికేనని గ్రహించి ఆనందపడ్డాడు వామనరావు.భార్యా కూతుళ్ళకు విషయం చెప్పి తృప్తిగా తేరుకున్నాడు.

- పూజితాచరణ్

First Published:  20 Nov 2023 6:54 PM IST
Next Story