చిగురంత ఆశను చూడు! (కథ)
గోదావరి గట్టు వెంట ఇంటికి నడిచి వెళుతున్న అపర్ణ దూరం నుండి ఎవరో నదిలో దూకబోవడం గమనించి గబాలున ఒక్క అంగలో ఆమె దగ్గరకు వెళ్లి చెయ్యి పట్టుకుంది ...తీరా చూస్తే ఆమె తన ప్రాణ స్నేహితురాలు ధరణి.
" నువ్వా ధరణీ , ఏమిటి ఈ పని?" అని ఆమె పనిని అడ్డగించి అక్కడికి దగ్గరలో ఉన్న సిమెంట్ బెంచీ మీద కూర్చోబెట్టింది అపర్ణ.
ఆమె చేతులు వదిలించుకుంటూ " వద్దు అపర్ణా నన్ను ఆపకు, నాకు ఇంక బ్రతకాలని లేదు బ్రతుకు మీద ఆశ చచ్చిపోయింది ...ఏం చూసి బ్రతుకు మంటావు నన్ను? చిన్నప్పటి నుండి కష్టాలనే ఎదుర్కొన్నాను.. చిన్న చిన్న ఆశలు కూడా తీర్చుకోలేకపోయాను ప్రతి దానికీ సంకోచమే , అమ్మ నేను అడిగింది ఇవ్వలేక బాధ పడుతుందేమో ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని నా కోర్కెలు నా మనసులోనే దాచుకున్నాను . నా చిన్నతనంలోనే నాన్నగారు పోయారు . అమ్మ రెక్కల కష్టం మీద మేమంతా బ్రతికాము. ఆడపిల్ల గుండెల మీద కుంపటి అంటూ అమ్మ మీద ఒత్తిడి తెచ్చి చిన్నప్పుడే మా పెళ్లిళ్లు జరిపించారు మా బంధువులు .. తాహతు కి తగిన వరుణ్ణి తెచ్చి పెళ్లిళ్లు చేసింది అమ్మ..
చిన్ని చిన్ని ఆశలు సరదాలు తీరక తోటి వాళ్లలా ఏ ఆనందము పొందలేక పోయానని మనసులోనే బాధపడుతూ ఉండేదాన్ని.
పెద్ద చదువులు చదువుకొని మంచి ఉద్యోగం చేసి నా కాళ్ల మీద నేను నిలబడాలని ఎంతో ఆశ పడ్డాను ..పెళ్లితో అదంతా అడుగంటి పోయింది. నీకు తెలుసు కదా నాకు సంగీతం అంటే ఎంతో ఇష్టమని కానీ నేర్చుకునే అవకాశం ఏది? టెన్త్ క్లాస్ తోనే చదువుకి గండిపడింది. ఉమ్మడి కుటుంబంలో పెద్ద కోడలిగా అడుగు పెట్టాను అక్కడ బాధ్యతలే గాని హక్కులనే మాటకి ఆస్కారమే లేదు.. రోజులు వారాలు నెలలు సంవత్సరాలు ఏ మార్పు లేకుండా యాంత్రిక జీవితం గడిపాను.
నాకు పిల్లలు లేకపోయినా నా మరదులు ఆడబడుచులే నా బిడ్డలు అనుకున్నాను ..నేను వాళ్లని నా బిడ్డలు గా చూసినా వాళ్లు మాత్రం నాలో తల్లిని చూడలేకపోయారు సాధింపులు చీత్కారాలే నిత్యము ఎదుర్కొన్నాను. ఆ ఇంటికి జీతం బత్తెం లేని పని మనిషిగా మాత్రమే నన్ను చూశారు.. వాళ్ల పురుళ్లు పుణ్యాలు అన్నీ నేను చూశాను.. చివరికి రెక్కలు వచ్చిన పక్షుల్లా అందరూ ఎగిరిపోయారే గాని మా కోసం కొంచెం కూడా ఆలోచించలేదు..
ఇప్పుడు నా నెత్తి మీదకు 55 ఏళ్లు వచ్చేశాయి. ఆయనకు 60 నిండి రిటైర్ అయ్యారు. బాధ్యతలన్నీ తీరిపోయాయి.. విశ్రాంతిగా నాలుగు పుణ్యక్షేత్రాలు తిరిగి వద్దామంటే మా అత్తగారిది పెద్ద సమస్య అయిపోయింది. పట్టుమని పదిరోజులు ఆమె బాధ్యతను ఎవరైనా తీసుకుంటారేమోనని చూసాము.. కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఎవరి స్వార్థం వాళ్లు చూసుకున్నారు తప్ప మేము మనుషులమే మాకు ఆశలు కోరికలు ఉంటాయి అనుకోలేదు ఎవరూ.
పుణ్యక్షేత్రాలు వెళ్లనందుకు నేనేమీ బాధ పడడం లేదు.. కనీసం రోజూ గుడికి వెళ్ళి ఆ దేవదేవుని దర్శించుకునే అవకాశం కూడా నాకు లేకపోయింది అపర్ణా.. మావారికి దేవుడంటే నమ్మకం లేకపోవడం కాదు , దేవాలయానికి రావడానికి ఆసక్తి లేదు అంతే! వెళ్తానంటే.. రోజూ ఇంట్లో పూజ చేస్తావు కదా ఇంకెందుకు గుడికి వెళ్లడం అంటారు.. దాని వలన కలిగే ప్రశాంతత గూర్చి చెప్పినా ఆయన అర్థం చేసుకోరు.
ఈరోజు వైకుంఠ ఏకాదశి అని వెంకటేశ్వర ఆలయానికి వెళ్లాను.. ఆయనతో చెప్పి వెళ్లాను అపర్ణా గుడికి.. అప్పుడు ఏమీ అనలేదు.
గుడిలో బాగా రద్దీగా ఉండడం వలన ఆలస్యం అయిపోయింది... ఇంటికి వచ్చేసరికి రెండు గంటలయింది. మా అత్తగారు ఆయన ఇంట్లో కాలు కాలిన పిల్లుల్లా నా కోసం ఎదురు చూస్తున్నారు కానీ.. ఏదో గుడి కి వెళ్ళింది కదా , అన్నీ సిద్ధంగానే ఉన్నాయి అన్నం పెట్టుకొని తిందామని అనుకోకుండా అలా చిందులేస్తున్నారు... చాలా గొడవ పెట్టేసారు ఇద్దరు కలిసి. వాళ్లకే కాదు నాకూ ఆకలి గానే ఉంది.. అసలే షుగర్ పేషెంట్ ని వేళకి ఇంత తిండి పడకపోతే ఆగలేను నేను.
కానీ గుడికి వెళ్లిన నన్ను మా అత్తగారు యుక్తాయుక్త విచక్షణ మరచి" ఇప్పటిదాకా ఎవరితో కులికి వస్తున్నవే?" అన్నారు నా వయసును కూడా చూడకుండా.
మావారు "ఛీ. అవేం మాటలు అమ్మా?" అని అన వలసింది పోయి జవాబు చెప్పు అన్నట్లు నా వంక ప్రశ్నార్ధకంగా చూశారు. దాంతో నాకు పిచ్చి పట్టి నట్టు అయింది.
" మీరు మనుషులా రాక్షసులా? ఆడవారై ఉండి నేను గుడికి వెళ్ళాను అని తెలిసి కూడా ఇంత అభాండం వేస్తారా? ఇలా అనడానికి మీకు నోరు ఎలా వచ్చింది ? మీకు ఒక కూతురు ఉంది తనని ఎవరైనా ఇలా అంటే మీకు ఎలా ఉంటుంది?" అని అడిగాను
" నా కూతురికి నీకు పోలికా? నా కూతురు నిప్పు" అన్నారు.
" అయితే నేను తప్పుడు దాన్నా?" అన్నాను బాధగా. అయినా ఆవిడ నోటికొచ్చినట్లు ఏదేదో అంది ఆయన బెల్లం కొట్టిన రాయిలా నించున్నారే కాని ఏమీ మాట్లాడలేదు. నేను వారిద్దరి వంక ఆ భావంగా చూశాను .
ఇలాంటి మనుషులు కోసమా ఇన్నాళ్ళు నేను ఇంత కష్టపడింది? ఇంత మనసులేని మనిషి తోనా ఇన్నాళ్ళు నేను కాపురం చేసింది అనుకున్నాను నిరాశగా. ఇంకా నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకనే ప్రయత్నం చేయలేదు.. ఇంట్లో నుండి ఏడుస్తూ బయటకు వచ్చేసాను.
ఎటు వెళుతున్నానో ఏం చేస్తున్నానో తెలియకుండా ఈ గోదావరి బొడ్డుకు వచ్చేసాను. వచ్చేసాక అనిపించింది ఇంకెందుకు బ్రతకడం అని..
"అందుకని గోదారిలో దూకేద్దాం అనుకున్నావా? నేను చూడడం కొంచెం ఆలస్యం అయితే ప్రాణాలు తీసుకునే దానివి కదా.. నువ్వు ఎంతో ధైర్యవంతురాలివి అని అనుకున్నాను. ఇంత పిరికి తనం ఎలా వచ్చింది ధరణి నీకు.. పేరుకు తగినట్లే భూదేవంత ఓర్పు నీకు ఉంది అనుకున్నాను ఇలా చేస్తావని కలలో కూడా అనుకోలేదు.. పద , ఇంటికి వెళ్దాం!" అంటూ ధరణి చేయి పట్టుకుని లేపింది అపర్ణ.
" చెప్పాను కదా అపర్ణ నాకు బ్రతుకు మీద ఆశ లేదు ఏం చూసుకుని బ్రతుకు మంటావు?" అంది ధరణి చేతుల్లో ముఖాన్ని దాచుకుని ఏడ్చేస్తూ.
"బాధపడకు ధరణీ నీ బాధని నేను అర్థం చేసుకోగలను కానీ దానికి చావు పరిష్కారం అని అనుకుంటే మాత్రం నేను సమర్దించను. ప్రతిదానికి నీవు లొంగిపోతుండటం వలనే వారి ఆటలు అలా సాగేయి. నీ ఆత్మగౌరవాన్ని నిలుపుకునే ప్రయత్నం నీవు ఏనాడు చేయలేదు . నేను ఎన్నిసార్లు చెప్పాను అణిగిమణిగి ఉంటే నిన్ను పాతాళానికి తొక్కేస్తారు అని. నిన్ను నువ్వే ప్రొటెక్ట్ చేసుకోవాలి గాని ఎవరూ నీకోసం రారని ..అయినా ధరణి నేను ఒకటి అడుగుతాను చెప్పు నీ అవసరం వాళ్ళకి ఉందా? వాళ్ల అవసరం నీకు ఉందా? నీవు చేసి పెట్టకపోతే వాళ్లకి నోట్లోకి ఐదువేళ్లూ ఎలా వెళ్తాయి?
సమస్య అంటూ ఉంటే దానికి పరిష్కారం కూడా ఉంటుంది.. తాళంతోపాటు తాళంచెవి తయారైనట్లే ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుంది. మనం కొంచెం ఓర్పు వహించి పరిష్కార మార్గం వెతుక్కోవాలి.. లేదా దాన్ని కాలానికి వదిలేయాలి తప్ప సమస్య వచ్చిందని చింతిస్తూ కూర్చోడం చావుని పరిష్కార మార్గంగా ఎంచుకోవడం సరైంది కాదు.. దానివలన ప్రయోజనం ఏమీ ఉండదు. ధైర్యంతో అడుగు ముందుకు వేసి తిరడమే జీవితం!" అంది అపర్ణ.
" ఇప్పుడు నేను బ్రతికి ఎవరిని ఉద్దరించాలే?" అన్ని ధరణి తిరిగి ఏడ్చేస్తూ.
" ఊరుకో, ముందు ఆ ఏడుపు ఆపు, నువ్వు చచ్చి ఎవరిని ఉద్దరిద్దామనుకున్నా వే ? ఇవన్నీ ఎందుకు.. ఇంటికి వెళ్దాము. జరిగిందంతా మీ అన్నయ్య గారితో చెబుదాం . ఆయన ఏదో ఒక పరిష్కారం చూపిస్తారు!" అంది అపర్ణ.
ఇద్దరూ ఇంటికి వెళ్లేసరికి సాయంత్రం నాలుగున్నర గంటలు అయింది. సోలి పోతున్నట్లు ఉన్న స్నేహితురాలికి మధ్యాహ్నం తినగా మిగిలిన అన్నం పెరుగు వేసి పెట్టింది.. ఆ తరువాత జరిగిందంతా భర్తకి చెప్పింది.
అంతా విన్న ఆనందరావు" అమ్మా ధరణి, జరిగిందానికి నేను చాలా బాధపడుతున్నాను.. వీళ్లు మాటలతో చెప్తే లొంగే రకాలు కాదు , దండం దశ గుణం భవేత్ అని వీళ్ళకి తగిన గుణపాఠం చెప్తే తప్ప దారికి రారు. కనుక వాళ్లకి తగినట్లు చేద్దాం!" అన్నాడు ఆనంద రావు ఆలోచనగా.
" ఈ వయసులో వాళ్లకి ఏమిబుద్ధి చెబుతాం అన్నయ్యా?" అంది ధరణి నిరాశగా.
" ఈ వయసులో నీ మీద ఇంత అభాండం వేయవచ్చా? ఇదీ అంతే.." అంటూ భర్త వైపు తిరిగి" అయితే ఏం చేద్దాం అండి!" అని అడిగింది అపర్ణ ఆసక్తిగా.
" నా ఫ్రెండ్ కేశవరావు లాయర్ కదా వాడితో లీగల్ నోటీసు ఇప్పిద్దాము" అన్నాడు ఆనందరావు.
"ఇంత బ్రతుకు బ్రతికి ఈ వయసులో కుటుంబం పరువు తీసి కోర్టుకెక్కించానన నన్ను బంధువులందరూ దుమ్మెత్తి పోస్తారు అన్నయ్యా!" అంది ధరణి భయంగా చూస్తూ.
" ఈ పిరికితనమే నిన్ను ఈ స్థితికి చేర్చింది.. ముందు ఆయన ఏం చెబుతారో విను.. చావుకు పెడితే లంకణానికి వచ్చినట్లుగా దారికి రాక పోరు! " అంది అపర్ణ.
" అవునమ్మా అపర్ణ చెప్పిన మాట నిజమే.. అలాగే చేద్దాం.. మీ ఇంట్లో వాళ్ళిద్దరి ఆరడీ రోజు రోజుకి మితిమీరి పోతున్నదని ఇక భరించడం నా వల్ల కాదని కలిసి ఉండడం కష్టమని భరణం ఇప్పించమని లాయర్ నోటీసు ఇద్దాము." అన్నాడు ఆనందరావు.
" అమ్మో, నోటీస్ ఇచ్చాక కాంప్రమైజ్ అయినట్లు నటించి దీన్ని తీసుకు వెళ్ళి చంపేస్తేనో?" అంది అపర్ణ భయంగా.
" నువ్వు కూడా ఏమిటి అపర్ణ ఇంత పిరికి గా మాట్లాడుతున్నావు? మనం తగిన బందోబస్తు తీసుకోకుండా ధరణిని అక్కడికి పంపిస్తామా? వాళ్లు మాత్రం ఏమైనా పిచ్చివాళ్ళా? ఈమె ఇంటి నుండి వెళ్ళిపోతే వాళ్లకి ఇంత ముద్ద ఉడకేసి ఎవరు పెడతారు? రోగం వచ్చిన రొస్టు వచ్చినా ఎవరు చూస్తారు? ఇంతకాలం ఇంటిల్లిపాదికి చేసింది చూసింది తానే కదా చాకిరీ చేయిఃచుకునేందుకైనా రాజీకి వస్తారు లేదా అతని ఆదాయంలో నుండి ధరణికి నెల నెలా ఎంతో కొంత మొత్తం ఎత్తి ఇవ్వాలి.. అలా చేయాలంటే కష్టం కదా , తప్పక దారికి వస్తారు" అన్నాడు ఆనందరావు.
కానీ ధరణి తన అంగీకారాన్ని వెంటనే తెలప లేకపోయింది.. భయంగా అయోమయంగా వారి వంక చూస్తూ ఉండి పోయింది.
" అమ్మా ధరణి, ఇంకేమీ సందేహించకు.. దీనివలన నీకు ఎలాంటి హాని జరగదు. పైగా కొంచెం మెరుగైన జీవితమే లభిస్తుంది. లాయర్ ఎదుట వాళ్ళు అన్న మాటలకు అన్నిటికీ క్షమాపణ చెప్పి స్తాము
మనిషిగా పుట్టడమే ఒక అద్భుతం తల్లీ..మనం బ్రతికి ఉండడం ఈ లోకంలో ఒక అదృష్టం. ఎదురవుతున్న సమస్యలు నుండి కష్టాలనుండి పాఠాలు నేర్చుకుని బ్రతుకు మీద చిగురంత ఆశతో ముందుకు సాగాలంతే తప్ప ఏ సమస్యకీ చావుని పరిష్కారంగా ఎంచుకోకూడదు.. దానివలన సాధించేది ఏమీ లేదమ్మా!" అన్నాడు ఆనందరావు.
"ఏమిటి ధరణి ఆలోచిస్తున్నావు? ఈ జీవితం నీది ... స్వప్నం నీది ... గమ్యం నీది ... లక్ష్యం నీది ... గెలుపు కూడా నీదే! ఓటమి నీదే ... అన్నీ నీవే! పడితే లేవాల్సింది కూడా నువ్వే ..బాధను దిగమింగు
కోవాల్సింది నువ్వే! గాయాన్ని భరించి ధైర్యాన్ని తెచ్చుకోవాల్సింది నువ్వే! నీవు పడితే ఇతరులు చోద్యం చూస్తారు ... ఎగతాళి చేస్తారు అయినా లెక్క చేయకు! ఈ వయసులో నాకు ఇదంతా అవసరమా అనుకోకు..వయసుతో నిమిత్తం లేకుండా ఈరోజు నుండి కొత్త జీవితానికి శ్రీకారం చుట్టు..55 ఏళ్లు వచ్చినంత మాత్రాన జీవితం అంతమై పోయింది అనుకోకు. ఈ వయసులో కూడా ఎన్నో అద్భుతాలు సృష్టించిన వారు ఎందరో ఉన్నారు చరిత్రలో... జీవితంలో ఎన్నో ఆశలకు సమాధి కట్టేశావు బాధ్యతల వలన.. ఈరోజు నుండైనా వాటిని తీర్చుకునే దానికి మార్గం సుగమం చేసుకో!" అంది అపర్ణ నచ్చజెప్తున్నట్లుగా.
వారి మాటలు ధరణిలో నిరాశను పారద్రోలి బ్రతుకు పై ఆశను చిగురింపజేసింది.
- పెబ్బిలి హైమవతి