భావన: నిగ్రహం పాటించాలి..!
త్రాతారో దేవా అధి వోచతా నో
మానో నిద్రా ఈశత మోత జల్పిః
వయం సోమస్య విశ్వహ ప్రియాస:
సువీరాసో విదథమా వదేమ ॥
(ఋగ్వేద 8/48/14)
అంటే సోమరితనము, అనవసరమైన సంభాషణ నుండి తప్పించుకొనుటకు ఎల్లప్పుడూ చురుకుగా వుండాలి. మనము దుర్గుణాల నుండి దూరంగా ఉందాము. శ్రేష్ఠ సంతానానికి జన్మనిద్దాము. అన్ని చోట్లా జ్ఞానము గురించిన చర్చయే జరగాలి అని భావన .
ప్రతి వ్యక్తి పని తక్కువ మాట లెక్కువ సిద్ధాంతం మీద నడవాలనుకుంటాడు. తమోగుణము మనుష్యుని సోమరిగా, రజోగుణము అబద్ధపు ఆత్మప్రశంసను ప్రేరేపిస్తుంది. ఈ దుర్గుణాలు అతని స్వభావంలో అంగములుగా మారుతాయి. సోమరిపోతు అప్రాకృతిక జీవితాన్ని జీవిస్తూ తనకే నష్టం కలుగ చేసుకుంటాడు. అజ్ఞానం, సోమరితనంలో వున్న వ్యక్తి చీకటిలో తిరుగుతుంటాడు. ఎదురు దెబ్బలు తిని, తన అసఫలతకు బాధ్యత ఇతరుల మీద మోపటానికి ప్రయత్నిస్తాడు. జ్ఞానులకు అతని జిత్తులు తెలిసిపోతాయి. పరమాత్మ దృష్టి నుండి ఎవరమూ తప్పించుకోలేము. ఆయన అతణ్ని మళ్ళీ మళ్ళీ హెచ్చరించినా తామసిక రాజసిక ప్రవృత్తి వలన చెవులు కళ్ళూ పనిచేయవు. అతడేదీ వినడు, చూడడు. ప్రకృతి సందేశాన్ని గ్రహించే సామర్థ్యం అతనిలో వికసించదు. అతడు నిద్రలో, సోమరితనంలో అణచబడి, ఆత్మ వంచనలో మునిగి వుంటాడు.
మనల్ని మనం నిగ్రహించుకోవాలి. ఆహారం, నిద్ర, విశ్రాంతి విషయంలో తగిన నియంత్రణ ఉండాలి. అవి మన మీద పెత్తనంచేయకూడదు. అలా చేయగలిగితే మనం శ్రేష్టులమవుతాం.
నలువైపులా మాధుర్యం, స్వచ్ఛత, నిరాడంబరం, సజ్జనత్వపు వాతావరణం ఉత్పన్నం చేయగల్గుతాం. మనం సమయ సంయమం తెలుసుకొంటే అన్ని పనుల తర్వాత కూడా ఎంతో సమయం మిగిలే ఉంటుంది. దానిని మనం సమాజంలోని దురాచారాల నిర్మూలనకు వినియోగించవచ్చు.
మనం మన పిల్లలు, స్నేహితులు, ఆశ్రితులకు సోమరితనం నుండి దూరంగా ఉండుట నేర్పాలి. శ్రమశీలుడు, సంయమియైన వ్యక్తిని ఆదర్శంగా చూపించాలి. బాల్యం నుండి సద్గుణాల బీజారోపణ చేయాలి. ఇది ఒక రోజులో అయ్యేది కాదు. నిరంతర ప్రయత్నం కావాలి. పిల్లల మనస్సు త్వరగా దోషదుర్గుణాల ప్రలోభంలో చిక్కుకుంటుంది. వారిలో దుర్గుణాలే ఉత్పన్నం కాకుండా పూర్తి జాగరూకత వహించాలి. ఒక మంచి రైతు పొలంలోని గడ్డిని తొలగించుటలో తీసుకొనేంత జాగ్రత్త తీసుకోవాలి. దుర్గుణాలను ప్రారంభంలోనే తొలగించి వ్యాపించకుండా, పెరగకుండా తగిన శ్రద్ధ వహించాలి. పిల్లలను ఎల్లప్పుడూ సత్కర్మలలో ప్రేరేపిస్తూ, వారు సృజనాత్మక కార్యకలాపాలలో నిమగ్నమయ్యేటట్లు చేయాలి. దాని వలన సమాజంలో ఒక శ్రేష్ఠనాగరికుడుగా యశస్సును పొంద గల్గుతాడు. సంతానం మంచి సంస్కారవంతులగుటకు, సచ్చరిత్రులగుటకు తల్లి దండ్రులు తమ సుఖసౌకర్యాలను త్యాగం చేయవలసి వస్తుంది. దోష దుర్గుణాలను మన ఆచరణ ద్వారా తొలగించుకొని ఒక ఆదర్శాన్ని నెలకొల్పాలి. ఇదే వేదము యొక్క ఆదేశం.
సోమరితనం, పోసుకోలు కబుర్ల నుండి ఎల్లప్పుడూ కాపాడుకొందాం ఇదే మానవ ధర్మం.
- పండిత శ్రీరామశర్మ