Telugu Global
Arts & Literature

నిజమైన సాయం

నిజమైన సాయం
X

నిజమైన సాయం

కరుణ పిల్లల్ని తీసుకుని ట్యూషన్ కి వచ్చింది

"ఈరోజు నువ్వెందుకు మమ్మీ !ట్యూషన్ కి రావడం" అడిగాడు చింటూ

"ఈరోజు నీ ట్యూషన్ ఫీజ్ కట్టాలి కదా "కొడుక్కి చెప్పింది.

నడుచుకుంటూ ట్యూషన్ దగ్గరకు వచ్చారు. గేటు తీసి లోపలికి వెళ్ళేసరికి పిల్లలు ఉన్నారు టీచర్ లోపల ఏదో పని చేస్తున్నట్టుంది అప్పుడే బయటకి వచ్చింది,

టీచర్ ని చూస్తూనే కరుణ "నమస్తే టీచర్ గారు బాగున్నారా "అంది ?

"బాగున్నా మీరు ఎలా ఉన్నారు? "

బదులు ఇచ్చింది "బానే ఉన్నాను !మా వాడు ఎలా చదువుతున్నాడు," "ఆ పర్వాలేదండి !ఇది వరకు మీద ఇప్పుడు బానే చదువుతున్నాడు" టీచర్ సమాధానం చెప్పింది.

చింటూ వెళ్లి తన ప్లేసులో కూర్చుని బుక్స్ బయటికి తీశాడు. ఇంతలో టీచర్ చేతిలో ఫీజు పెట్టింది కరుణ

అప్పుడే గేట్ తీసుకుని లోపలికి వస్తున్న ఇద్దరు పిల్లల్ని చూసింది కరుణ .వాళ్ళు ఆ ఏరియాలో ఉండే బీద వాళ్ల పిల్లలు.

" ఈ పిల్లలు మీ దగ్గర ట్యూషన్లో చదువుతున్నారా?" అడిగింది టీచర్నీ "అవును" అంది టీచర్ .

"వీళ్ళ మొహానికి తిండికే గతిలేదు మీకు ఫీజు ఇస్తున్నారా?" అనుమానంగా అడిగింది?

ఇద్దరు పిల్లల్లో పెద్దవాడు ఆ మాటకి "టీచర్ గారు మా దగ్గర ఇప్పటివరకు ఫీజు తీసుకోలేదు ఆంటీ!" అని భక్తితో నిండిన చూపులతో వినయంగా చెప్పాడు.

దాంతో కరుణకి కోపం వచ్చింది "ఏంటి టీచర్ !మా పిల్లలకు ఫీజు తీసుకొని చెప్తారు .వాళ్ళ పిల్లలకు అయితే ఉచితంగా చెబుతారా?" కాస్త గట్టిగానే అడిగింది అప్పుడు టీచర్ ఆవిడని పక్కకు తీసుకెళ్ళింది.

"మీరు అందరిని సమంగా చూడాలి మీరే డబ్బున్న వాళ్లకు ఒక రూలు, డబ్బులు లేని వాళ్లకు ఒక రూల్ అంటే ఎలా "అంది .

దానికి టీచర్ డబ్బులు వెనక్కి ఇచ్చి "మీరు రేపు10 కేజీల బియ్యం ,కొన్ని కూరగాయలు తీసుకొని రండి నేను మీకు సమాధానం చెప్తాను"అని చెప్పింది.

దాంతో కరుణ మాట్లాడకుండా వెళ్ళిపోయింది.

మర్నాడు చెప్పినట్టుగానే బియ్యం ,ఒక పెద్ద కవర్ లో అన్ని రకాల కూరగాయలు తీసుకొని వచ్చింది . అప్పుడు టీచర్

"మీ నాన్న మిమ్మల్ని తీసుకువెళ్లడానికి వస్తే ఒకసారి లోపలికి రమ్మను." అని ఆ పిల్లలకి చెప్పింది.

కాసేపటికి ఆ పిల్లల్ని తీసుకెళ్లడానికి వాళ్ళ నాన్న వచ్చాడు. వస్తే "టీచర్ గారు పిలుస్తున్నారు " అని చెప్పి లోపలికి పిలిచారు.

అప్పుడు ఆయన వచ్చి" నమస్కారం టీచర్ అమ్మ !"అని "పిలిచారంట"అన్నాడు

దానికి టీచర్ "అవును. ఇదిగో !ఈ బియ్యం కూరగాయలు కరుణ గారు పోయిన వారం వాళ్ల అబ్బాయి పుట్టినరోజు జరిగిందని ఇవి మీకు ఇవ్వమని నాతో చెప్పారు" అని పక్కనే ఉన్న కరుణని, బియ్యం ఇంకా కూరగాయలను చూపించింది .

అప్పుడు అతను దండంపెట్టి "చాలా సంతోషం అమ్మగారూ ! మీరు బాగుండాలి ! మీ అబ్బాయి మీకన్నా గొప్పగా ఎదగాలి .మీరు, మీ పిల్లలు చల్లగా ఉండాలా! ఆ దేవుడు మిమ్మల్ని ఏ కష్టం లేకుండా కాయాలి" అని అన్నాడు .

ఆ మాటలకి కరుణ ఏం మాట్లాడకుండా మొహం పక్కకు తిప్పుకున్నది. అప్పుడు అతను జేబులో నుంచి 500 నోటు తీసి టీచర్ కి ఇచ్చాడు .

"అమ్మగారూ !ఇంతకాలం నా దగ్గర డబ్బులు లేక జీతం ఇవ్వలేదు ఇప్పుడు ఈ అమ్మ పుణ్యమా అని ఇవి కొనాల్సిన అవసరం లేదు. ఇవి నాకు ఒక పది రోజులకి వస్తాయి. అందుకనే తీసుకోండి..! మా ఆవిడ చెప్పింది ,గురువు దగ్గర ఉచితంగా విద్య నేర్చుకోకూడదని. అందుకే ఇప్పుడు ఫీజు ఇస్తున్నాను తీసుకోండి" అని అన్నాడు.

దాంతో కరుణ ఆశ్చర్యపోయింది. దానిని తీసుకొని టీచర్ లోపలికి వెళ్లి ఒక బాక్స్ తీసుకొచ్చి ,ఆ బాక్స్ లో 500 వేసి మూత పెట్టి అతనికి తిరిగి ఇచ్చి "ఇది మీ ఇంట్లో అటక మీద పెట్టు.ఇది ఎప్పుడైనా అత్యవసరమైతే వాడుకోండి" అని చెప్పి వాళ్ళని పంపించేసింది.

అప్పుడు కరుణకి వాళ్ల పరిస్థితి అర్థం అయింది.

టీచర్ వెంటనే కరుణవైపు తిరిగి -"చూడండి !నిజమైన సహాయం అనేది అవసరమైన వాళ్ళకి చేయాలి తప్ప అవసరం లేని వాళ్ళకి కాదు. మీరు ఉన్నవాళ్.లు ఫీజు ఇవ్వగలరు కాబట్టి మీ పిల్లల దగ్గర తీసుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఇచ్చిన ఈ బియ్యం, కూరగాయలను వాళ్లు నాకు ఇచ్చే ఫీజు డబ్బులు తోనే కొనుక్కుంటారు. అందుకే ఇవి వాళ్ళకి పంపించాను. దీనివల్ల వాళ్ళు ఒక పది రోజులు తినగలరు .అలాగే డబ్బును కాస్తైనా జమ చేసుకోగలరు "అని "ఈ నెలకి మీ అబ్బాయి ఫీజుకూడా ఇవ్వనవసరం లేదు ."అని చెప్పింది.

దాంతో కరుణ సిగ్గుతో తల దించుకొని "క్షమించండి టీచర్ గారు అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టాను. వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఆలోచించలేకపోయాను .ఇకనుండి ఇలా జరగదు ."అని చెప్పి వెళ్ళిపోయింది.

- సీతా గాయత్రి ( పొన్నూరు )

First Published:  17 Nov 2022 6:34 AM GMT
Next Story