Telugu Global
Arts & Literature

సందడి

సందడి
X

నిండుకుండలాంటి

గోదారమ్మను...

.వరద తాకిడి

గభాల్న పోటెత్తినట్టు...

పచ్చని పంటచేలను...

రివ్వున పైరగాలి

తూర్పారబట్టినట్టు...

సిగ్గొలకపోస్తున్న లేత బుగ్గలపై....

సినారె సినీగీతం,సిటికేసినట్టు...

మబ్బుమాటున దాగి

తొంగి తొంగి చూస్తున్న

చందమామకు...

కొబ్బరాకులడ్డమేసి...

కనుసైగచేసినట్టు...

సెలయేటొడ్డున రెల్లుపొదల్లో ఝుమ్మంటున్న ..ఎంకిపాటను

ఏ పిల్లగాలో ఎగరేసుకొచ్చినట్టు...

అలకావ్య కన్యక రేఖాచిత్రాలను...

జలతారు పట్టుబట్టలో చుట్టపెట్టేసినట్టు...

పెరట్లో బంతిపూల పరిమళాలు

గుసగుసలాడుతూ గుబాళించినట్టు

పల్లెతల్లి పసిడి 'మాగాణి'...

పడుచుపిల్ల ఒంటిపై

'లంగాఓణీ' యని

కవులంతా ఏకమై కవితలల్లేసినట్టు

పదహారేళ్ల పడతి

పరికీణికి జతగా.....

పరువాల రాగాలాలపిస్తూ ..

జిలుగు వెలుగుల

'సిల్కుఓణీ' సందడి చేసింది మోహనంగా..!

ఆ అందం, ఆనందం ,

ఆ అపరంజికే సొంతమైనట్టు

- శ్రీమతి భారతీ కృష్ణ

(హైదరాబాద్)

First Published:  15 Oct 2023 11:38 PM IST
Next Story