మనసున్న మని'షి' (కథానిక) - డా. తిరుమల ఆముక్తమాల్యద (చెన్నై)
హరిచరణ్ కి మనసులో మనసు లేదు. ఎలాగైనా ఈరోజు అమ్మకి తన ప్రేమగురించిచెప్పేయాలనుకున్నాడు.హరి ఇలా అనుకోవడం ఇది 18 వ సారి
హరిచరణ్ కి మనసులో మనసు లేదు. ఎలాగైనా ఈరోజు అమ్మకి తన ప్రేమగురించిచెప్పేయాలనుకున్నాడు.హరి ఇలా అనుకోవడం ఇది 18 వ సారి. అనుకోవడం మళ్ళీ అమ్మ తనను అపార్థం చేసుకుంటుందేమోనన్న భయం తో చెప్పలేకపోయి, విషయాన్ని తర్వాత చెబుదామని దాటేస్తున్నాడు. అదే పది రోజులక్రితం స్కైప్ లో అమ్మతో చెప్పాలని ఎంతో రిహార్సల్ చేసి, చివరికి చెప్పబోయే సమయంలో గొంతులో తడారిపోయి, అసలు మాటే పెగల్లేదు. ఎంతో ధైర్యంగా ప్రేమించిన తనకు ఆ విషయం అమ్మతో చెప్పాలంటే ఎందుకంత బెరుకో తనకే తెలియక కాస్త బాధ పడ్డాడు. హరి భయపడడానికి కారణం అతను ప్రేమించింది యోషితా అనే ఒక జపాను పిల్లను. ఆమె హరితోనే అమెరికాలో రీసెర్ఛ్ చేస్తోంది.
ఎమ్.టెక్. లో మంచి ర్యాంకు తెచ్చుకున్న హరిచరణ్ న్యూరోసైన్స్ లో రీసెర్చ్ చేద్దామనుకున్నాడు. తక్షణం తల్లికి చెప్పాడు. తల్లి వెంటనే ఒప్పుకుంది. హరి ఆన్ లైన్ లో దాదాపు 25 విశ్వవిద్యాలయాలకి దరఖాస్తు పెట్టుకున్నాడు. రెండునెలల తర్వాత అయిదు విశ్వవిద్యాలయాలనుండి పిలుపు వచ్చింది – రెండు అమెరికానుండి, ఒకటి జపాన్, ఒకటి లండన్, చివరగా జర్మనీ. మొదట వచ్చిన అమెరికా నే తన సన్నిహితులు ఓకే చేయడంతో ప్రయాణానికి సంసిద్ధుడయ్యాడు హరి. టిక్కేట్లు బుక్ చేసుకున్నాక, మిగిలిన చోట్లనుండి పిలుపు రావడంతో వాటిని పట్టించుకోలేదు. అమెరికాకి పై చదువులకి వెళుతున్న కొడుకుని ఎంతో సంతోషంతో సాగనంపుతూ, కంట తడి పెట్టుకుంది తల్లి సుమన మూడేండ్లు కొడుకుని విడచి ఉండాలన్న తలపు రావడంతో.
అమ్మ కన్నీటిని చూసి హరి మనసు ద్రవించింది. ఆవిడ కళ్ళు తుడుస్తూ "అమ్మా! నాకు మాత్రం నిన్ను విడచి ఉండాలని ఉందా అమ్మా? సంవత్సరానికి ఒకసారి వస్తాను కదా, వీలైతే ఆరు నెలలకొకసారి వస్తాను, మన పరిస్థితులు నా గైడ్ కి చెప్పి. రోజూ రాత్రి నీతో స్కైప్ లో మాట్లాడుతాను సరేనా?" అంటూ నచ్చజెప్పాడు. "నీ ఆరోగ్యం జాగ్రత్తమ్మా. వేళకి సరిగా భోంచెయ్యి." అని తల్లికి పాదాభివందనం చేసాడు. కొడుకుని వాత్సల్యంతో దగ్గరకి తీసుకుని, "జాగ్రత్త నాయనా! కొత్త ప్రదేశం, కొత్త మనుష్యులు. అన్ని విషయాలలోనూ కాస్త జాగరూకత అవసరం సుమా! ఎంత చదువులో మునిగినా, చక్కగా వంట చేసుకుని వేళకి భోంచెయ్యి. వంట చేయడానికి కుదరకపోతే పళ్ళూ అవీ తిను. అలవాటు లేని పదార్థాలు తిని, ఒళ్ళు చెడుపుకోకు. కనీసం 7 గంటలు నిద్ర పో. ఆరోగ్యం జాగ్రత్త సుమా! క్షేమంగా వెళ్ళి, లాభంగా రా కన్నా!" అంటూ దీవించి పంపింది సుమన. కనుచూపుమేరదాకా కొడుకుని చూస్తూ, టాటా చెబుతూ, భారమైన మనసుతో ఇంటికి తిరిగి వచ్చింది సుమన.
ఇంటికి వచ్చిన సుమనకి ఇల్లంతా బోసిపోయినట్లనిపించింది. అకస్మాత్తుగా తను ఒంటరిదానైనట్లు భావన కలిగి, దుఃఖం పొంగుకొచ్చింది. మళ్ళీ "ఛీఛీ ఇదేమిటి మరీ చిన్న పిల్లలాగా తను ఏడుస్తోంది? అసలు తనకేమైంది ఈరోజు? వాడు పైచదువు కొరకేగా వెళ్ళాడు? చదువు ముగించాక తనతోనే ఉంటాడు కదా. తర్వాత రీసెర్చ్ అయ్యాక ఉద్యోగం వచ్చిన వెంటనే వాడికి పెళ్ళి చేసేస్తే, తను నిశ్చింతగ ఉండవచ్చు అనుకుని, మనసుని సమాధానపరిచింది. అసలే ఈ మధ్య వధువులు దొరకడం చాలా కష్టమైపోయింది కాబట్టి కొడుకులాగా బాగా చదువుకున్న అమ్మాయిని ఇప్పుడు వెదకడానికి మొదలెడితే, వాడి చదువు ఐయ్యేలోపల మంచి అమ్మాయి దొరుకుతుంది అనుకుంటూ తన దైనందిక జీవితంలో పడింది సుమన.
ఒక రోజుతన భర్త చిన్ననాటి స్నేహితుడిని, కూతురు మానసవీణతో బజారులో చూసింది. పాపం తల్లిని చిన్నపుడే పోగొట్టుకున్న దురదృష్టవంతురాలు. అమ్మాయి చూడ చక్కగా ఉంది. బి.ఎస్.సి. చివరి సంవత్సరం చదువుతోందట. మానస సుమన మనసు దోచుకుంది. ఎలాగైనా సరే, పొందికగా, అణకువగా ఉన్న మానసని తన కోడలుగా చేసుకోవాలని నిశ్చయించింది. ఈసారి హరి ఫోన్ చేసినప్పుడు మానస గురించి చెప్పాలనుకుంది. మొదటే పెళ్ళి అని చెప్పకుండా, మెల్లగా కొడుకు మనసులో పెళ్ళి పైన అభిప్రాయం ఏమిటో తెలుసుకోవాలనుకుంది.
పెళ్ళి అన్న మాట అనగానే తన పెళ్ళి గురించిన జ్ఞాపకాలు సుమన మనసుని పిల్ల తెమ్మెరలా సోకి, మనసు పులకించగా, చిరునవ్వుపువ్వు పెదవులపై పూచింది.
మధ్య తరగతి కుటుంబానికి చెందిన సత్యశీల్, సత్యకళకి ఐదు మంది సంతానం. ముగ్గురమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. అందులో చివరిగా పుట్టింది సుమన. అంతగా గారాబం, ముద్దు మురిపాలు లేకుండా, అక్కలు వాడుకున్న బట్టలు, పుస్తకాలతో సర్దుకొనిపోవడం చిన్ననాటినుండే అలవడింది సుమనకి. ఉన్నదాంట్లో తూ,తూ మంత్రాలతో ఇద్దరు కూతుళ్ళకి తమ తాహతుకి తగ్గట్టు పెళ్ళి చేసారు సత్యశీల్ దంపతులు. ఇద్దరు అబ్బాయిలు తమకు ఉద్యోగాలు వచ్చినవెంటనే, తమ కొలీగ్స్ ని ప్రేమించి, పెళ్ళి చేసుకుని, ఇంటివాళ్ళని పట్టించుకోకుండా తుర్రుమన్నారు. అప్పటికే రెటైర్ ఐన సత్యశీల్ ఇక సుమన పెళ్ళి ఎలా జరుగుతుందోనన్న బాధతో మానసికంగా కృంగిపోయాడు.
ఒకరోజు ప్రక్కింటి అమ్మాయికి పెళ్ళిచూపులకి చేదోడు, వాదోడుగా ఉండటానికి వెళ్ళింది సత్యకళ సుమనతో. వచ్చిన వరుడు హృదయ్ అదృష్టవశాత్తు సుమనని ఇష్టపడటం, తనే మరీ ఖర్చు పెట్టుకుని పెళ్ళి చేసుకోవడంతో సుమన తలిదండ్రులకి ఎంతో సంతోషం, మన:శ్శాంతి కలిగాయి. కనిపించని ఆ భగవంతునికి నమస్కరించి, తమ కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
పెళ్ళి జరిగిన 10 రోజుల తర్వాత హృదయ్ తో కలిసి, తలిదండ్రులని ఒంటరిగా విడవలేక, విడవలేక, తప్పనిసరి పరిస్థితిలో విజయవాడనుండి చెన్నైకి బయలుదేరింది. స్నేహ, ప్రేమమయమైన గృహస్థాశ్రమంలో అనురాగలతలతో పెనవేసుకున్న బాంధవ్యంతో ఎంతో ఆనందంగా కాలం గడిచింది. వారినోముల పంటగా హరిచరణ్ పెరిగి, పెద్దవాడు కాసాగాడు. తమ తహతుకి తగ్గట్లు ఒక చిన్న ఫ్లాట్ కొన్నారు హృదయ్ ఆఫీసుకి దగ్గిరగా. ఉన్నదాంట్లో సర్దుకుంటూ, కాస్త నగదు కూడా చేర్చుకున్నారు పిల్లవాడి భవిష్యత్తు కోసం. హరి 10వ తరగతిలో ఉన్నపుడు ఒకరోజు ఆఫీసులో ఉన్నపుడు హృదయ్ కి హఠాత్తుగా, గుండెలో కాస్త నొప్పి వచ్చింది. కూడా పని చేస్తున్నవారు దగ్గరలో ఉన్న ఆస్పత్రిలో చేర్చారు. ఒక స్నేహితుడు ఇంటికి వచ్చి, సుమనకి ఈ విషయం తెలిపి, తనతో పాటు సుమనని, హరిని ఆస్పత్రికి తీసుకెళ్ళాడు. అతడు చెప్పింది విని మొదట షాక్ కి గురై, ఏం చేయాలో అర్థం కాలేదు సుమనకి. హృదయ్ కేమిటీ, గుండె నొప్పేమిటీ? ఇంతదాకా తలనొప్పి కానీ, జ్వరం కానీ తెలియని హృదయ్ కి ఎందుకిలా జరిగింది? అంటూ చాలా బాధ పడింది. ఆలోచనలు పరిపరివిధాలుగా సాగాయి. వీళ్ళు వెళ్ళేటప్పటికే ఆస్పత్రిలో ట్రీట్మెంటు మొదలుపెట్టారు. సుమనని చూడగానే డాక్టరు " అమ్మా! కంగారు పడకండి. ఆయన ఐ.సి.యు. లో ఉన్నారు. మందులూ, ఇంజెక్షన్స్ ఇచ్చాం. పడుకున్నారు. ఇంతకు ముందు ఎప్పుడైనా ఆయనకి గుండె నొప్పి వచ్చిందా?" అని అడిగారు. "లేదండి. " అంది వస్తున్న దు:ఖాన్ని ఆపుకోడానికి ప్రయత్నిస్తూ. "ఆయనకి ఎలాఉంది డాక్టర్?" అని వణుకుతున్న స్వరంతో అడిగింది. " అంటే, ఇది మొదటి అటాక్ అన్నమాట. రావడమే రావడం తీవ్రంగా వచ్చింది. మన ప్రయత్నాలు మనం చేద్దాం. మీరు కాస్త ధైర్యంగా ఉండండి. ఒక గంట తర్వాత మీరు ఆయన్ని చూడవచ్చు" అని కర్తవ్యం ముగిసినట్లు తన క్యాబిన్ వైపు వెళ్ళిపోయాడు. అంతే కళ్ళు బైరులు కమ్మాయి సుమనకి. నోట మాట రాలేదు. అక్కడే ఉన్న కుర్చీలో నిస్సత్తువతో కూలబడింది. హరిని అక్కున చేర్చుకుంది. కళ్ళు కొలనులయ్యాయి. భగవంతుని ప్రార్థించసాగింది హృదయ్ ని కాపాడమని.
తల్లి చేష్టలు, తండ్రి ఉన్న గది నుండి బయటికి, గది లోపలికీ అటూ, ఇటూ గంభీరంగా, వేగవేగంగా తిరుగుతున్న నర్సులనూ, డాక్టర్లనూ చూస్తున్న హరికి ఏం చేయాలో తోచలేదు. ఎప్పుడూ హుషారుగా ఉండే తల్లి కంటనీరు చూడలేకపోయాడు. అమ్మభుజాల చుట్టూ చేతులు వేసి, ఆమె తలని తన భుజంపై ఆనించుకున్నాడు. అమ్మ ఎంత బాధలో ఉందో అర్థం చేసుకున్నాడు తన భుజం తడవడం బట్టి.ఒక గంట తర్వాత నర్స్ వచ్చి పిలిచింది సుమనని, రోగిని డాక్టర్ చూడ్డానికి రమ్మన్నారని. సుమన హరితో బాటు వెళ్ళింది. హరి తండ్రి నీరసంగా పడుకుని ఉన్నాడు. తనని చూడ్డానికే అన్నట్లు, మూతపడుతున్న కళ్ళని బలవంతంగా తెరవడానికి ప్రయత్నిస్తున్నాడు. "ఏవండీ!" అన్న పిలుపు వినబడ్డవైపుకి తల తిప్పుతూ, అతి కష్టం మీద కళ్ళు తెరుస్తూ, " సుమా! బాధపడకు. నీవు, హరి జాగ్రత్త. నేనెప్పుడూ మీతోనే ఉంటాను." అంటూ వారిద్దరి చేతులనూ తన చేతితో కలుపుతూ "నన్ను నవ్వుతూ సాగనంపండి." అంటూ నవ్వుతూ ప్రక్కకి వాలిపోయాడు హృదయ్. అంతే. పక్కనున్న నర్సు, డాక్టర్ తమ పని ఐపోయినట్లు చేతులు పిసుక్కుంటూ "వి ఆర్ సారీ అమ్మా. అంతా ఐపోయింది. మీ దగ్గరివారందరికీ కబురు పంపడమ్మా" అంటూ అక్కడినుండి బయటికి నడిచారు.
తర్వాతి కార్యక్రమాలు చక చకా జరిగిపోయాయి. దగ్గరి బంధువులు, సన్నిహితులు అందరూ వచ్చి, సానుభూతి ప్రకటించి, వారి వంతు సమాధానపు పలుకులు పలికి ఎవరి దారి వారు పోయారు. పదమూడో రోజు తర్వాత ఇల్లంతా బోసిపోయింది. అంతదాకా సందడిగా ఉన్న ఇల్లు ఒక్కసారిగా భయపెట్టే నిశబ్దంతో నిండిపోయింది. పట్టపగలే చీకటిని చూసినట్లైంది సుమనకి. పదమూడురోజులకే చిక్కి సగమైన తల్లిని చూసి భయపడ్డాడు హరిచరణ్, తను ఒంటరివాడైపోతాడేమోనని. బిక్కమొహం వేసిన హరిని చూసి, స్పృహలోకి వచ్చింది సుమన. పాపం. పిల్లవాడు.
ఇంత పెద్దదైన తనే ఇలా డీలాపడిపోతే, పసివాడి మనసు ఎంత గాయపడిఉంటుందో అన్న తలపు వచ్చి, కళ్ళు తుడుచుకుని, హరిని దగ్గరికి తీసుకుని, "నాన్నగారు ఎప్పుడూ మనతోనే ఉంటారు కన్నా! ఇక నేనెప్పుడూ ఏడవను. సరేనా?" అంటూ, ఆ మాటని నిలబెట్టుకుంది.
వస్తున్న ఫ్యామిలీ పెన్షన్, నేర్చుకున్న టైపింగ్ వల్ల డి.టి.పి. చేస్తూ తండ్రి లేడన్న విషయం గుర్తుకు రాకుండా తానే తండ్రియై హరిని వాడి కోరిక ప్రకారం ఎమ్.టెక్. నానో టెక్నాలజీ చదివించింది. పరిశోధన కొరకు విదేశానికి పంపింది.
......
హరిచరణ్, చివరికి ఎలాగోలా ధైర్యం చేసి క్యాలండర్ లో తన నక్షత్రానికి శుభప్రదం అని రాసిఉండడంతో కాస్త ధైర్యం తెచ్చుకుని అమ్మతో స్కైప్ లో మాట్లాడాలని సిశ్చయించుకున్నాడు. ఫోన్ చేద్దామనుకునేలోగా ఫోన్ మ్రోగింది. అది అమ్మపిలుపే అవడంతో, అమితోత్సాహంతో " అమ్మా!" అంటూ అరిచినంత పని చేసాడు. హరి గొంతులోని ఉత్సాహం సుమనకి ఆనందం కలిగించింది, ఔను మరి. లాబ్ లో ఎక్కువగా పని ఉండడంవల్ల రెండు వారాలయ్యాయి తామిద్దరూ మాట్లాడుకుని. పిచ్చి నాన్న, తనంటే కొడుక్కి ఎంత ప్రేమో అనుకుని మురిసిపోయింది, అసలు విషయం తెలియక. "కన్నా! ఎలా ఉన్నావురా? వేళకి సరిగ్గా భోజనం అదీ చేస్తున్నావా? లేక పనిలో పడి అన్నీ మరిచిపోతున్నావా?" అంటూ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. తల్లి వాత్సల్యానికి వెన్నలా కరిగిపోయాడు హరి ఎప్పటికీ అమ్మకి తన బాగోగుల గురించే తపన అని. కళ్ళు చెమర్చగా, "అమ్మా! నేను బాగానే ఉన్నాను. నీవెలా ఉన్నావమ్మా? నీతో చాలా మాట్లాడాలి. నిన్ను చూడాలని ఉందమ్మా" అన్నాడు. " దానికేం భాగ్యం? నాకూ నిన్ను చూడాలని, బోల్డు విషయాలు చెప్పాలని ఉంది రా. సంక్రాంతి పండగప్పుడు ఓ వారం రోజులు సెలవు పెట్టి వచ్చేసెయ్. ఈ మధ్య మీ నాన్నగారి స్నేహితుడిని చూసాను. పాపం. ఆయన భార్య ఏదో గుండె జబ్బుతో పోయిందట. వారి అమ్మాయి ….." అంటూ హరికి మాట్లాడ్డానికి అవకాశమీయకుండా చాలా విషయాలు చెప్పింది సుమన. అమ్మ ధాటికి తను చెప్పదలుచుకున్న విషయాన్ని గొంతులోకే నొక్కేసాడు హరి. మనసులోని అసలు మాటని చెప్పలేకపోతున్నందుకు మనసు పాడై, అమ్మ చెప్పిన విషయాలను పూర్తిగా వినలేకపోయాడు. అమ్మ అన్నవాటికి అన్యమనస్కంగానే సరే సరే అని అన్నాడు. ఎలాగూ సంక్రాంతికి వెళ్ళినపుడు నిదానంగా తన విషయం తెలిపి, అమ్మని ఒప్పించుదామని, ప్రయాణానికి సన్నిద్ధుడయ్యాడు.
సంక్రాంతి రానే వచ్చింది. హరి కూడా తల్లిని కలవబోయే ఉత్సాహంతో ఇంటికి వచ్చాడు. వచ్చీ రాగానే, సుమన "హరీ! వెంటనే స్నానం అదీ కానివ్వు. టిఫిను తిని, కొత్త పంచె కట్టుకురా. మనం గుడికి వెళ్ళాలి" అంటూ హడావిడి చేసేసరికి, గబ గబా ఆ పని ముగించాడు. వెంటనే కొడుకుని మానస ఇంటికి తీసుకు వెళ్ళింది. అక్కడినుండి మానస, ఆమె తండ్రి మరో నలుగురు వీరితో బాటు గుడికి వచ్చారు. గుడిలో ఏదో ఉత్సవం జరుగుతున్నట్లు పూజాసామగ్రి, అదీ చూసి, అమ్మ తను వచ్చినందుకు ఏదో పెద్ద పూజ చేయిస్తోందని అనుకుని నవ్వుకున్నాడు. కానీ, అక్కడికి వచ్చినవారు తనవైపు , మానసవైపు తదేకంగా చూడడం గమనించి, కాస్త అనుమానం కలిగింది. అదే అడగాలనుకుని అమ్మ వైపు తిరిగేలోగా, ఎవరో అమ్మని పిలవడం, అమ్మ వేరే వైపుకి వెళ్ళడం జరిగింది. కాస్సేపు తర్వాత హడావిడిగా తన దగ్గరికి వచ్చి, " హరీ! అలా ఇద్దరూ బొమ్మల్లా నిలిచారేమిటి? వచ్చి పీటలమీద కూర్చోండి" అంటూ తనను, మానసని పీటలవైపు తీసుకెళ్ళడం చూసి నిర్ఘాంతపోయాడు. అసలు ఏం జరుగుతోందో అర్థం కాలేదు కొంతసేపుదాకా. తర్వాత తేరుకుని, " అమ్మా! ఏం జరుగుతోంది ఇక్కడ?" అనడిగాడు. "నీకు, మానసకి పెళ్ళి". "మరి నా పెళ్ళి నన్ను అడగకుండా ….ఎందుకు నాకు ముందే చెప్పలేదు? నా ఇష్టంతో పనిలేదా?" అని అరుద్దామనుకున్నాడు. కానీ సభ్యత కాదని, మెల్లగానే తల్లికి మాత్రం వినబడేటట్లు అడిగాడు." నీకు ఏది మంచో నాకు తెలియదట్రా? నీ అభిరుచులకి సరిగ్గా సరిపోతుందనే మానసని ఎంపికచేసాను. నీతో అన్నీ ఫోన్లోనే చెప్పాను కదరా. అప్పుడు అన్నిటికీ సరేనని, ఇప్పుడేంటి ఇలా? ఇక ఏం మాట్లాడకు. చక్కగా పెళ్ళి చేసుకుని, హాయిగా ఉండు." అంటూ నవ్వుతూ కొడుకు బుగ్గలు నిమిరింది సుమన.
ఇంతలో పురోహితులు "వర్జ్యం వచ్చేస్తుంది. పెళ్ళికొడుకు త్వరగా రావాలి" అంటూ గట్టిగా అనేటప్పటికి, సుమన హరిని నెట్టింది పీటవైపుకి. మొద్దుబారిన హరి మెదడు కుదుటపడే లోపల పెళ్ళి జరిగిపోయింది. అందరి ఆశీర్వాదాలు పూల, అక్షింతల వర్షమై పడితే, హరి మనసు మాత్రం మూగగా రోదించింది. అంతా కలలో జరిగినట్లనిపించింది. ఏదో మరమనిషిలాగా ఉండి, మూడు రాత్రులూ ముగించుకున్నాక విదేశానికి బయలుదేరాడు మానసతో. సుమన కొడుకు ముభావాన్ని పెళ్ళైన కొత్త అనుకుని, సరిపెట్టుకుంది.
విదేశానికి వెళ్ళాక కూడా తన ముభావాన్ని వీడలేదు హరి. మానస హరి అలవాట్లను, అభిరుచులను అత్తగారి ద్వారా తెలుసుకుంది కనుక హరికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఒక నెల దాటినా తనతో మాట్లాడని భర్త ఆంతర్యం మానసకి అంతుబట్టలేదు. అసలు తన ఉనికినైనా పట్టించుకోని భర్త వైఖరి మానసకి చాలా బాధ కలిగింది. కనీసం చుట్టుప్రక్కల వారిని పరిచయం చేయడం కానీ, స్నేహితుల పార్టీలకి గాని, షికారుకి గాని, స్నేహితుల ఇళ్ళకు గాని తనను తీసుకెళ్ళని భర్త , స్నేహితులతో ఎంతో ఉత్సాహంగా, నవ్వుతూ ఫోన్లో మాట్లాడడం చూసి, అతని ప్రవర్తనకి ఆశ్చర్యపోయింది. "నవ్వుతున్న హరిముఖం ఎంత చూడముచ్చటగా ఉంటుంది" అనుకుంటూ, హరి చాలా కలుపుగోరు మనిషన్న అత్తగారి మాట గుర్తుకు వచ్చి, ఎలాగైనా భర్తని నిలదీయాలనుకుంది.
రాత్రి భోజనం ముగించాక, తమలపాకులు ఇచ్చే సమయంలో మెల్లగా"ఏవండీ! మీతో కాస్త మాట్లాడాలి." అని అంది.
తమలపాకులను నములుతున్నది ఆపి ఏమిటన్నట్లు విసుగ్గా చూసాడు హరి ఆమెవంక. "మిమ్మల్ని ఒక మాట అడగనా? మీరు నన్నుఇష్టపడే నన్ను పెళ్ళి చేసుకున్నారా? లేక మీ అమ్మగారి బలవంతం మీదా?" అని అడిగింది.
"తెలుసుకుని ఏం చేస్తావు? నన్ను అర్థం చేసుకునేంత మనసు నీకుందా?" అనడిగిన హరికి చిరునవ్వుతో తల ఊపింది సమాధానంగా.
"ఏ సమస్యకైనా పరిష్కారముంటుందండి. తాళంచెవి లేకుండా తాళాలు తయారు కావు కదా. మీకు నాలో నచ్చనివి తెలపండి. మీ ఇష్టప్రకారంగా నేను మారుతాను. ఒక వేళ మీకు నిజంగా నేనంటే ఇష్టం లేకుంటే, తెలపండి. ఇప్పుడే మన దేశానికి వెళ్ళిపోతాను. నా మూలంగా మీ నైజానికి విరుద్ధంగా ముభావంగా ఉంటూ, లేని పోని ఒత్తిడిని, అనారోగ్యాన్ని కొని తెచ్చుకోకండి. పెళ్ళి అన్నది రెండు మనసుల ఆంతరంగిక అన్యోన్యాన్ని, రెండు కుటుంబాల సాన్నిహిత్యాన్ని పెంపొందించేట్లు ఉండాలే తప్ప బాంధవ్యాన్ని తుంచేది కాకూడదు. నేను అత్తయ్యగారికి ఏదో సర్ది చెబుతాలెండి. మీరు ఏ విషయమూ ఆలోచించి, తెల్లవారి చెప్పండి. మీకు నేను నచ్చకపోతే మీరు ఆఫీసునుండి వచ్చేసరికి నేను ఇక్కడ ఉండను. నావల్ల మీకు భవిష్యత్తులో కూడా ఎటువంటి ఇబ్బంది కలుగదు." అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది మానస. నిదానంగా అన్నా, స్థిరంగా అన్న ఆ మాటల పదునుకి అదిరిపోయాడు హరి. ఎంత సంస్కారవంతంగా ఉంది మానస ప్రవర్తన అని అనుకుని ఆశ్చర్యపోయాడు, ఆమెలో తనకు నచ్చనివి ఏమైనా ఉన్నాయా అని ఆలోచించాడు. ఊ( హూ. ఒక్కటి కూడా లేదు. ఈ నెల రోజులూ తనకు ఒక తల్లిలాగా అన్నీ సమయానికి తగ్గట్లు సమకూర్చింది. ఇంటిని శుభ్రంగా ఉంచి, పెరట్లో చిన్న గులాబీల తోట కూడా తయారుచేసింది. తన చదువుకి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా రాత్రుళ్ళు ప్రక్కగదిలో పడుకొనేది. తను కనీసం ఒక్కసారి కూడా ఆమెని పట్టించుకోకపోయినా, తన గురించి పూర్తిగా ఎంతో అక్కరగా పట్టించుకున్న ఈ సుగుణాలరాశినా తను నిర్లక్షం చేసింది అని బాధపడ్డాడు.
తను ప్రేమించిన యోషితాకు కూడా మానసకి తెలిసినంతగా తన అలవాట్ల గురించి తెలియదు. పాపం తన బాధలని చెప్పుకోడానికి తల్లి కూడా లేని పిల్లని తను ఎంతగా క్షోభపెట్టాడు అనుకుని మనసులోనే కుమిలిపోయాడు. తన ప్రియురాలు తనని వివాహమాడితే తన బంధువులనందరినీ విడచి, తనతోనే రావాలంది, కానీ మానస భర్త సుఖం కోసం తానే భర్తను వీడడానికి సిద్ధమైంది. ఇలా ఆలోచించి, చివరకి తను ప్రేమించినందుకు శిక్ష మానస అనుభవించడం సబబు కాదనిపించింది. నిజంగా అమ్మ ఎంపిక అద్భుతం. తనే మారాలి. అనుకుంటూ చాలా సేపు తర్జన భర్జన పడి, ఎప్పుడో నిద్రపోయాడు.
ఉదయాన్నే మానస లేవడానికి ముందే మేలుకొని, గబగబా పెరట్లోకి వెళ్ళి, హిమబిందువులతో పలకరించిన గులాబీలను సున్నితంగా కోసి, శుభోదయం పలకడానికి మానసవీణ గదివైపుకి వెళ్ళాడు ఉత్సాహంతో హరిచరణ్.