Telugu Global
Arts & Literature

ఊరికొక్కడు

Orikokkadu
X

ఊరికొక్కడు

పంటలు పండక, పనులులేక ఊరంతా వలసదారి పట్టింది. పెద్దపెద్ద భూస్వాములు, పెట్టిన పెట్టుబడి గిట్టుబాటు కాక, తమతమ పొలాలను బీడు పెట్టి సిటీల్లో రకరకాల వ్యాపకాలలో మునిగితేలుతున్నారు. ఇక మిగిలిన ఊరిజనాలకు వలసబాట తప్పలేదు. ఆదారిబట్టిన కుటుంబాలలో వీరప్పదికూడా ఒకటి.

వీరప్పకు దాదాపుగా డెబ్భై ఏళ్ళుంటాయి. అయినా మనిషి చురుగ్గా ఉండి ఏదో ఒక పని చేస్తూంటాడు.

“అప్పా! కదులు, పట్నంలో అయితే ఎప్పుడూ ఏదోఒక పని దొరుకుతుందని అంతా చెప్పుకుంటున్నారు. మన బీడుపడిన పొలంలో ఇంకా ఏం అవస్థ పడతాం. నీ అంగీలు మూటకట్టుకో. పదలే!” అంటూ వీరప్ప కొడుకు భార్యా పిల్లలతో బయలుదేరుతూ తండ్రిని కంగారు పెడుతున్నాడు.

“నా తాతలకు, తండ్రికి, నాకూ జన్మనిచ్చిన ఈ నేలమ్మనొదిలి నేనెక్కడికి రాను. మీరు వెళితే వెళ్ళండి. నేను చావోరేవో ఇక్కడే ఉండి తేల్చుకుంటాను” అని తెగేసి చెప్పాడు వీరప్ప.

వీరప్ప పూర్వీకులు ఊరిలోని రెడ్డిదొరలవద్ద పనిచేసి బ్రతికినోళ్ళే! వీరప్ప తాత చేసిన గొడ్డుచాకిరికు మురిసిన పెద్దదొర మూడెకరాలభూమినిచ్చాడు. ఆ నేలలో చిన్నచిన్న పంటలను పండించుకుంటూ, చిన్న మట్టిమిద్దెలో బ్రతుకులనీడుస్తూ వీరప్పకు ఓ ఎకరం పొలం మాత్రం ఇవ్వగలిగాడు తండ్రి. కరువు చుట్టుముట్టటంతో ఆ వున్న ఎకరం కూడా తనఖాకు వెళ్ళి, తమ పొలంలోనే కూలీగా మారాడు వీరప్ప.

“అప్పా! నాకిదంతా సిత్రంగా అనిపిస్తుంది. పెద్దరెడ్డి తన కొడుక్కి 25ఎకరాల భూమినిచ్చిపోతే, చిన్నరెడ్డి దాన్ని రెట్టింపు చేసి తన కొడుక్కు 50ఎకరాలనందించాడు. మనతాత ఇచ్చిన ఎకరంపొలాన్ని కూడా తనఖా నుండి విడిపించుకోలేని దురదృష్టంతో మన బతుకులు తెల్లారిపోతున్నాయి. ఛా! ఎదవ జన్మ” అంటున్న కొడుకుకు జవాబీయలేని స్థితిలో పడిపోయాడు వీరప్ప.

“సరే! ఒక్కమాట అప్పా! నేనిప్పుడెళ్ళి పనులు కుదుర్చుకుని కాస్త తీరిక చేసుకుని దుడ్లు పట్టుకు వస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇంట్లో కొన్ని తిండిగింజలున్నాయి. గంజి కాచుకోవటానికి సరిపోతాయి” అంటూ భార్యాబిడ్డలతో పట్నంతోవ పట్టాడు కొడుకు.

ఊరంతా వల్లకాడులాంటి నిశ్శబ్దం మిగిలింది. ఎనుములనన్నింటిని చేత సంతలో అమ్మేసి అంతా బరువులొదుల్చుకుంటున్నవేళ వీరప్ప గొడవచేయటంతో కొడుకు దానిని అమ్మకుండా తండ్రికిచ్చి వెళ్ళాడు. ఒకరికొకరు తోడునీడగా ఉన్నారు.

చూస్తుండగానే రెండేళ్ళు గడిచిపోయాయి. మధ్యలో కొడుకువచ్చి తండ్రికి కావలసిన తిండిగింజలనిచ్చి వెళ్ళాడు. ఆరోజు భానుడికన్నా ముందే లేచాడు వీరప్ప. తొలికిరణం నీకు నేను తోడంటూ పలకరించింది. చూపు సరిగా ఆనటంలేదు. రోజూ చూస్తున్నట్లుగానే రహదారి వైపు దృష్టి సారించాడు వీరప్ప.

గోధూళివేళ ఇళ్ళకు చేరే ఆలమందల్లాగా జనం ఒకరివెనక ఒకరు చంకల్లో పిల్లలు, చేతుల్లో మూటలతో వస్తూ కనిపించారు. ఆనందంగా దగ్గరికెళ్ళి అందరిని సంబరంగా పలకరించాడు వీరప్ప.

“బాగుండావా తాతా?” అంటూ అంతా ఆప్యాయంగా పలకరించారు. అయితే ఒక్కరి ముఖంలోనైనా తమ ఊరికివచ్చామన్న సంతోషం కనపడటంలేదు.

కోడుకు, కోడలు దగ్గరికి రాగానే "ఏమైంది? మూతికి ఆ గుడ్డలేమిటి?" అని అడిగాడు వీరప్ప.

“అప్పా! నీవిక్కడ పెపంచంలో ఏం జరుగుతోందో తెలియకుండా ఉన్నావు! కరోనా వ్యాధి చిక్కుడు తీగలాగ అల్లుకుపోయి జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. మాకు పనులు పోయాయి. అందరూ ఇళ్ళలో బందీలయ్యారు. ఇతరుల దయాదాక్షిణ్యాలపై బతుకులీడుస్తూ, కలోగంజో తాగుతూ ఉన్న ఊర్లో పడుందామని అంతా వచ్చేసాం” అన్నాడు కొడుకు.

“బాబాయ్! ఊరంతా ఖాళీ అయితే శ్మశానంలో శివుని తీరుగ, ఊరికి కాపలాగా నీఒక్కడివే ఎట్లావున్నావు?” అన్నాడు మలప్ప.

“ఒరే మలప్పా! ఇట్లాంటి కరువులెన్ని వచ్చి ఎన్నిపోలా? నాగుండె ధైర్యమే నాస్నేహితుడు. మీరెళ్ళిన కొద్దికాలానికే చిన్నదొర ఇల్లు చూచుకోవటానికి వచ్చి తనదగ్గరున్న కొర్రలు, అరికెలు పుచ్చిపోతున్నాయి, నువ్వు తీసుకుపోరా" అంటూ వసారాలో పెట్టి పోయాడు.

వాటిలో కొన్నింటిని గంజికాచుకు త్రాగాను. వానదేముడు కరుణించినంతలో వాటిని బాగుచేసి అందరి పొలాల్లో గుప్పెడుచొప్పున జల్లాను. చక్కగా మొలకెత్తి పంట కొచ్చాయి. అలా అందరూ బీడు భూములని వదిలేసిన చోట కొద్దోగొప్పో పంట చేతికొచ్చింది. ఇంకొంతకాలం గంజికొస్తాయి కదా” అని ఎంతో ఆత్మ విశ్వాసంతో అన్నాడు వీరప్ప.

“నెర్రులిచ్చి బీడుపడిన నేలతల్లిని విశ్వాసమనే గింజలు జల్లి, ధైర్యమనే ఊటబావి నీటిని చిలకరించి, పచ్చని రంగుతో పసుపుపూలనద్ది ఇటు జనాలకు అటు పక్షులకు పెద్ద దిక్కయ్యడు” వీరప్ప.

"ఎవరో వస్తారని, ఏదో చేస్తారని..." అంటున్న శ్రీశ్రీ కలం ఘంటసాలవారి గళంలో మారుమ్రోగుతోంది.

- మధుపత్ర శైలజ ( హైదరాబాద్)

First Published:  8 Jan 2023 5:10 PM IST
Next Story