Telugu Global
Arts & Literature

కుచేలుడు - డా .ఎమ్ .సుగుణరావు (విశాఖ)

కుచేలుడు - డా .ఎమ్ .సుగుణరావు (విశాఖ)
X

ఆ విశాలమైన స్థలంలో ఉన్న ఆ మూడంతస్తుల భవనం గేటు ముందు నుంచున్నాడు సుదామ. సెక్యురిటీ గార్జుతో ఒక పావుగంట నించీ ప్రాధేయపడుతున్నాడు, తనను లోపలకు పంపమని.

"పంపడం కుదరదండీ, అయ్యగారు ఎవరినీ లోపలకు పంపొద్దన్నారు, ఆయన మూడ్ అసలేమీ బాగోలేదు" అన్నాడు సెక్యురిటీ.

"నా పేరు సుదామ. ఆయన బాల్యమిత్రుడిని ఒకసారి ఆపేరు చెప్పండి" అన్నాడు .

ఇక తప్పదని "సర్... కూర్చోండి... కాసేపు ఆగి చెపుతాను"అన్నాడు సెక్యూరిటీ.

"అమ్మయ్య అనుకుంటూ కూర్చున్నాడు... తను రైల్లో, బస్సులో కష్టపడి వచ్చాడు, చాలాకాలం తర్వాత మిత్రుడిని కలుద్దామని వచ్చాడు, కలవకుండా వెళ్ళడం ఇష్టంలేదు. అమెరికా నుంచి ఈ మధ్యనే వచ్చాడని తెలిసి వచ్చాడు.

ఇంతలో ఒక కారొచ్చి ఆగింది. దాంట్లోంచి ఒకాయన దిగాడు. రేబాన్ కళ్ళద్దాలు. సఫారీడ్రెస్. వేళ్ళకు రెండేసి ఉంగరాలు. ఖరీదైన సెంటు కాబోలు, ఆ ప్రదేశం అంతా ఒక్కసారి గుభాళించింది. అతను రాగానే సెక్యూరిటీ గార్డ్ సెల్యూట్ చేసి గబగబా, పక్కనున్న కుర్చీ వేసాడు. అతడు కూర్చుని తన పక్కనే ఉన్న సుదామను చిరాగ్గా చూసాడు.

సుదామ రకరకాల వాహనాల్లో ఉదయం నించీ ప్రయాణం చేయడంలతో బట్టలు మాసిపోయాయి. చెమటతో శరీరం తడిసిపోయింది.

ఎందుకో ఆ వచ్చిన ఉంగారాలాయనకు సుదామ అసలు నచ్చలేదు.

అతని వంక చిరాగ్గా చూసి-

"ఎవరు నువ్వు?! ఇలా వచ్చావ్" అన్నాడు ఏకవచనంలో.

"మా మిత్రుడు కృష్ణారావు గారిని చూద్దామని వచ్చానండి" అన్నాడు సుదామ వినయంగా.

"సహాయం కోసమా, అతను సహాయం చేసే స్థితిలో లేడు. సహాయం అర్థించే స్థితికి పడిపోయాడు. అందుకే వచ్చాను. ఆయన కొడుకు నిర్లక్ష్యం వలన కోట్లల్లో నష్టం. షిప్ మునిగిపోయింది. దానికి ఇన్సూరెన్స్ లేదు. ఇపుడు బతుకు రోడ్డున పడింది. ఇలాంటి సమయంలోనే కేష్ చేసుకోవాలి. అందుకే అప్పివ్వడానికి వచ్చాను" అన్నాడతను.

ఆ మాటలకు ఏమీ సమాధానం చెప్పకుండా మౌనంగా ఊరుకున్నాడు సుదామ

ఇంతలో సెక్యూరిటీ గార్డ్ దగ్గరున్న ఫోన్ మోగింది. అతను ఏదో మాట్లాడి ఫోన్ పెట్టేసాడు.

"సార్, మిమ్మల్ని రమ్మన్నారు" అన్నాడు సెక్యూరిటీ.

"నన్నేనా... ఔను నన్నే రమ్మంటారు" అన్నాడు ఆ ఉంగరాల సెంటు మనిషి గర్వంగా, సుదామ వంకచూసి.

"కాదండీ, మిమ్మల్ని కాదు, ఈ సుదామగారిని అయ్యగారు రమ్మన్నారు! " అన్నాడు.

"ఏదో పొరపాటున వినివింటావు" అన్నాడు చిరాకుగా ఉంగరాలాయన.

"లేదు సార్. ఆయన స్పష్టంగా చెప్పారు సుదామగారినే పైకి పిలిచారు"

ఆ మాటలకు సుదామ తన సంచీ తీసుకొని మెట్లెక్కాడు.

"అబ్బే నన్నే పిలిచి ఉంటారు" అంటూ అతను సెక్యూరిటీ చెపుతున్నా వినకుండా సుదామతో పాటు గబగబా మెట్లెక్కాడు.

లోపల ద్వారం దగ్గర నుంచుని బిడియంగా చూస్తూ నిలబడ్డాడు సుదామ.

"మిత్రమా" అనే పిలుపు. అప్పుడే స్నానం చేసినట్టున్నాడు. తెల్లటి మల్లెపూవులాంటి లాల్చీ, పైజమా.

"ఎంతసేపయింది వచ్చి! సారీ, నేనేదో టెన్షన్లో ఉండి ఎవరితోనూ మాట్లాడలేక కాసేపు అలా ఉండిపోయాను" అంటూ మిత్రుడిని ఆలింగనం చేసుకున్నాడు.

ఉంగరాలాయన ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. అతను ఊహించని దృశ్యం.

"మీతో మాట్లాడడానికి వచ్చాను. మీ అవసరం తీర్చడానికి వచ్చాను" అన్నాడు అతను.

"క్షమించండి, నా బాల్య మిత్రుడితో మాట్లాడడానికి, కాస్త టైమ్ ఇవ్వండి, కాసేపు మీరు అలా కూర్చోండి" అన్నాడు కృష్ణారావు.

కాసేపు నోటమాట రాక నిశ్చేష్టుడై ఉండిపోయాడు సఫారీ డ్రెస్సు.

"మిత్రమా ఏమిటి చెప్పు" విశేషాలు ఏమిటి? చల్లగా ఏమైనా తాగుతావా?!

అంటూ లోపలికెళ్ళి ఫ్రిజ్ లోంచి డ్రింక్ తీసుకొచ్చి మిత్రుడికి అందించాడు.

ఉంగరాలాయనకు అసహనంగా ఉంది, అవమానంగా ఉంది.

ఇక ఉండబట్టలేక మనసులో మాట కక్కేసాడు.

"మీ అవసరంలో ఆదుకోవడానికి వచ్చాను. నన్నొదిలేసి. తన అవసరం కోసం వచ్చిన ఈ పెద్దమనిషితో మాట్లాడుతున్నారు" అన్నాడు. కోపంగా.

ఆ మాటలకు కృష్ణారావు వెంటనే "ఏంటి మిత్రమా! నీకు ఏదైనా సహాయం కావాలా చెప్పు?!"అన్నాడు సుదామ ముఖంలోకి పరిశీలనగా చూసి.

"లేదు మిత్రమా. చిన్నప్పుడు ఇద్దరం ఒకే స్కూల్లో చదువుకున్న బాల్య మిత్రులమని గుర్తుపెట్టుకొని నాకు అడగకుండానే ఎన్నో చేసావు. నా కూతురి పెళ్ళికి, కొదుకు ఉద్యోగం రావడానికి. ఇప్పుడు నువ్ ఇబ్బందుల్లో పడ్డావని తెల్సి వచ్చాను" అంటూ తన సంచీలోంచి దస్తావేజులు తీసాడు సుదామ.

'కుచేలుడు కృష్ణడికి సాయమా!' అంటూ మనసులో వెటకారంగా నవ్వుకున్నాడు ఉంగరాలాయన.

సుదామ వెంటనే అన్నాడు-

"నా పొలం కాగితాలు ఇవి. పొలం అమ్మేస్తే నీకేమైనా ఉపయోగం ఉంటుందేమో... నాకు వీటి అవసరం లేదు నీ దయవల్ల పిల్లలు స్థిరపడ్డారు. నాకు తెలుగు మాస్టారు ఉద్యోగం ఉంది. ఇది ఉడదతసాయం అనుకో" అన్నాడు.

ఆ మాటలకు వెంటనే మిత్రుడిని కౌగిలించుకున్నాడు. అతని కళ్ళ నించి నీళ్ళు జలజల రాలాయి.

"కోట్ల రూపాయలకన్నా కోటికి ఒకడుగా మెగిలే నీలాంటి వాడే నాకు అసలైన ఆస్తి. తృప్తిగా జీవించే నీ జీవితమే నాకు స్ఫూర్తి." అన్నాడు మిత్రుడి వంక చూస్తూ కృష్ణారావు.

ఆ ఇద్దరి స్నేహాన్ని అర్ధం చేసుకోలేక పోయినందుకు ఆ ఉంగరాలాయన సిగ్గుపడి తలొంచుకున్నాడు.

First Published:  29 Oct 2022 1:25 PM IST
Next Story