కృష్ణుని చరితం కౌతుక భరితం!
కృష్ణుడి జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకొని కన్నడంలో హెచ్.ఎస్. పార్వతి రాసిన నవల - యుగపురుషుడు. ఈ నవల చదివిన వేలూరి కృష్ణమూర్తి గారు ఎంతో ఇష్టంగా, ప్రేమగా తెలుగులోకి అనువాదం చేశారు.
కృష్ణుడి జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకొని కన్నడంలో హెచ్.ఎస్. పార్వతి రాసిన నవల - యుగపురుషుడు. ఈ నవల చదివిన వేలూరి కృష్ణమూర్తి గారు ఎంతో ఇష్టంగా, ప్రేమగా తెలుగులోకి అనువాదం చేశారు. ఈ నవల 2020లో పాలపిట్ట బుక్స్ నుంచి వెలువడింది. కృష్ణుని జీవితానికి సంబంధించి వైవిధ్యమైన నవల ఇది. ఈ నవల రచించిన పార్వతి గారు కన్నడ సాహిత్యసీమలో అనేక ప్రక్రియలలో రచనలు చేసిన ప్రఖ్యాత రచయిత్రి. ఈ విలక్షణ నవల గురించి అనువాదకుడయిన కృష్ణమూర్తి గారి ముందుమాటలోని కొన్ని వాక్యాలు ఈ కింద చూడండిః
మహాభారతం, భాగవతాలలోని శ్రీ కృష్ణుడిది అత్యంత సంకీర్ణ వ్యక్తిత్వం. హిందువులు అతడిని అవతార పురుషుడనే నమ్ముతారు. జగద్గురువని ప్రశంస చేస్తారు. శ్రీ కృష్ణుడంటే, మనలను కాపాడే భగవంతుడన్న నమ్మకం శత-శతాబ్దాలుగా జనులలో వ్రేళ్ళూరిన పాత్రకు పూర్తి విరుద్ధంగా అతడు భగవంతుడి ఎత్తుకు వెళ్ళినది అతడిలోవున్న ఏ ఏ గుణాలవల్ల అన్న వివేకపూర్ణమైన దృష్టితో లోతుగా ఆలోచించి రచించిన నవల యుగపురుషుడు. శ్రీ కృష్ణుడు ఒక సాధారణ మానవ మాత్రుడుగా, అతడిలోవున్న విశేషమైన శక్తిని, జాణతనాన్ని, రాజకీయ చతురతా దృష్టిని, మానవీయతను ఈ నవలలోని ఎన్నో సన్నివేశాలలో నిరూపించడంద్వారా రచయిత్రి పార్వతి గారు చదువరుల గమనానికి తెస్తారు.
చిన్నప్పటినుండి తాను చూపుతున్న ధైర్యసాహసాలు, స్నేహశీలత, మానవీయత, శాంతి ప్రియత్వం, రాజకీయ దురంధరత, ధర్మనిష్ఠ లాంటి లక్షణాలకు సాకారమూర్తియైన శ్రీ కృష్ణుడు గొప్ప తత్వజ్ఞానిగా తన జీవితకాలం చివరివరకు ఎలా గడిపాడని రచయిత్రి ఈ నవలలో ఆ పాత్రను విశిష్ఠ రీతిలో చిత్రించారు. శ్రీకృష్ణుడు మానవ సమాజం ఉన్నతికోసం, నిస్వార్థంతో పరిశ్రమిస్తూ, మానవత్వంనుండి దైవత్వానికి ఎదిగిన శ్రీకృష్ణుడి పాత్రను ఈ నవల సమర్థవంతంగా చిత్రిస్తుంది. ఈ నవల చివరి ఘడియలలో యాదవుల మధ్య అంతఃకలహాలతో ప్రారంభమైన పోరాటం చివరకు అంతర్యుద్ధంగా మారడంతో, ఆ పోరాటంలో తన కుమారుడు ప్రద్యుమ్నుడు క్రిందకు పడిపోవడాన్ని చూసిన శ్రీకృష్ణుడు సహించలేక అంతఃకరణలున్న ఒక తండ్రిగా, అలాగే ఒక సామాన్య మానవుడుగా ప్రవర్తించి నూరారుమందిని హతమార్చే సన్నివేశంలో మనం నిశితంగా గమనించవచ్చు. 2008లో కన్నడంలో ప్రచురింపబడిన శ్రీమతి పార్వతి గారి యుగపుషుడు నవల శ్రీ కృష్ణుడి జీవితానికి సంబంధించిన ముఖ్య ఘటనలను, సాందీపిని గురుకులంలోని విద్యార్థి దశనుండి 'జర' అన్న ఒక వేటగాడి బాణం తగలడంతో జీవితం ముగిసే వరకూ హృద్యంగా వివరిస్తుంది. దీనికి మొదలు శ్రీమతి పార్వతి రచించిన నందనందన నవల కృష్ణుని బాల్య లీలలను వర్ణిస్తుంది.
నేను ఈ నవలను ఐదేళ్ళ క్రితం చడివినపుడు చాలా యిష్టపడి తెలుగుకు అనువదించాలని వ్రాతప్రతిని ప్రారంభించా. ఆ సందర్భంలో 2014లో అనుకొంటా, శ్రీమతి పార్వతి గారితో ఫోనులో మాట్లాడి నా కోరికను తెలిపా. అనంతరం వారి అనుమతిని కోరడానికై బెంగళూరు వెళ్ళినపుడు వారి స్వగృహంలో వారిని, వారి భర్త శ్రీహరి గారిని కలిశా. పార్వతిగారు చాలా సంతోషంతో నా కోరికకు స్పందించి అనుమతి యివ్వడమే కాక, వారు 75 ఏళ్ళ సంపూర్ణ సార్థక జీవితం గడిపిన సందర్భంలో వారి సాహిత్య మిత్రులందరూ చేరి వెలువరించిన 'సృజనశీల రచయిత్రి శ్రీమతి హెచ్ ఎస్ పార్వతి విమర్శనాత్మక, భావనాత్మక రచనల సంగ్రహం' అన్న అభినందనా గ్రంథాన్ని నాకు ఇచ్చారు.
...
పుస్తకాలు చదివే అభిరుచి ఉన్న వారు చదవదగిన నవల యుగపురుషుడు. మానవ జీవితంలోని సకల విషాదానందాలను అనుభవిస్తూనే మానవులందరికీ ఆరాధ్యునిగా పరిణమించే క్రమాన్ని ఎంతో ఆసక్తికరంగా చిత్రించారు రచయిత్రి. అందమైన తెలుగులో రమ్యమైన రీతిన అనువాదం చేశారు వేలూరి కృష్ణమూర్తి గారు. ఈరోజు కృష్ణాష్టమి శుభాకాంక్షలంటూ వాట్సాప్‌లో వినిపిస్తుంటే ఈ నవల గుర్తుకొచ్చింది.
...
ఈ నవలలోని ముగింపు మాటలు ఇవిః
శ్రీకృష్ణుడు మరణించాడా?
అతని మానవదేహం పడిపోయి పంచభూతాలలో పడిపోయి చేరిపోయి వుండవచ్చు. కానీ అతని కీర్తి శరీరం యుగయుగాలను దాటి - దేశ దేశాల ఎల్లలనూ దాటి - విశ్వాన్నంతటినీ వ్యాపించింది, వ్యాపిస్తూనే ఉన్నది!
కృష్ణునికి, కృష్ణుని లాంటి వారికి ఎన్నటికీ మరణం లేదు!
కృష్ణుని పేరే లోకప్రియం!
అతని చరిత్ర కౌతుక భరితం!!
...
ఇలాంటి రచనని తెలుగులో ఎవరూ చేయలేదు. కనుకనే తెలుగువారికి ఈ నవల అందజేయాలని పాలపిట్ట సంస్థ ప్రచురించింది.
ఇందులోని కథా సంవిధానం, శిల్ప విన్యాసం ఆద్యంతం వైవిధ్యభరితం. చదివిన కొద్దీ చదవాలనిపించే వచనశైలి ఈ రచనలోని విశిష్టత.