Telugu Global
Arts & Literature

మమత విరిసిన వేళ....(కథ)

మమత విరిసిన వేళ....(కథ)
X

తూర్పు తలుపు సందులోంచి సూర్యకిరణాలు పడి షాబాద్ బండలు మెరుస్తున్నాయి.పొయ్యి మీద మంటలు కూడా నాలుకలు చాచి మెరుస్తున్నాయి. చేతుల నిండా ఉన్న ఎర్రగాజులు సన్నని శబ్దం చేస్తున్నాయి. ఛాయగిలాసలు వరుసగా పెడుతూ

"కేదారాది సమస్త తీర్థములు కొర్కెంజూడ బోనేటికిం" అంటూ ధూర్జటి ఆనాడెప్పుడో ‘శ్రీకాళహస్తీశ్వర శతకం‘లో రాసాడంటే నిజంగా ఆశ్చర్యమేస్తుంది గానీ గడప కైలాస శైలం, ముంగిలి వారణాసి అని అనడమూ వింతగానే ఉంటుంది. ఎక్కడో కైలాసాన కూర్చున్నోడిని తలచుకోవడమూ, ఇల్లు ఇల్లాలు పిల్లలతోనే బ్రతుకుమని అనడమూ ఆలోచించలేనంత విచిత్రమే... అబ్బ! ఏంటో ఏమో ప్రొద్దుటి నుండి ఇవ్వాళ ఈ పద్యం పట్టుకున్నదేందో ఏమో! అనుకుంటూ నే రాగమెత్తుకున్నది లక్ష్మీ ప్రియమ్మ

ఊఁ.....ఊఁ.... ఆఁ.... ఆఁ...

"కేదారాది సమస్త తీర్థములు కోర్కెం జూడ బోనేటికిం

గాదా ముంగిలి వారణాసి కడపే కైలాస శైలంబు మీ

పాద ధ్యానము సంభవించనపుడే భావింప నజ్ఞానల

క్ష్మీ దారిద్ర్యులు గారె లోకు లకటా శ్రీకాళహస్తీశ్వరా!?”

అట్లా గొంతెత్తి పాడుకుంటూనే, మోక్షం రావాలంటే సంసార సాగరంలో మునిగి తేలమన్నాడీ కవి పుంగవుడు. అబ్బో ఇంతగొప్ప జ్ఞానలక్ష్మి ఎప్పటికి దొరుకుతుందీ ఏంది? అనుభవాలు నేర్పిన పాఠాలు ఎన్ని? ఏంటీ! అని అనుకుంటున్నది.

పాత చింతకాయ పచ్చడిలో పోపు పెడ్తూ ఇప్పటికి ఎన్నిసార్లు తలుచుకున్నదో ఈ పద్యభావాన్ని గానీ పద్యాన్ని గానీ !

లక్ష్మీప్రియమ్మ మనస్సంతా వరద బీభత్సపు మురికికాలువలా రొద చేస్తూనే ఉన్నది. గత కొద్దిరోజులుగా చికాకు కలిగించే విషయాలు వింటున్నది కాబట్టి.

యాభై ఏళ్ళ వైవాహిక జీవితం. పురుళ్ళకూ, పెండ్లిళ్ళకూ తక్కువైన ఇల్లా ఇది? హూఁ! చేసి చేసి చేతులు కాయగాసినా చింతలెరుగని శ్రీమన్నారాయణుని వంటి మొగుడితో ఈ కాయమున్నంతవరకూ తప్పదు” అనుకుంటున్నది . ఈ సుదీర్ఘాలోచనలకు , ఎక్కడినుండో రాయిపై సుత్తితో బాదుతున్న చప్పుడులా...

“అమ్మా,.... ఓ అమ్మా.... ఏందమ్మా నీలోపట నువ్వే ఏందో గుణుక్కుంటున్నవ్ ఏమైందమ్మా” అన్నది పనిమనిషి లచ్చమ్మ.

దెబ్బకు ఈ లోకంలోకి వచ్చి, “హూఁ ఏమున్నది లేవే నీకూ నాకూ తత్సమ తద్భవ భేదమేగాని మరేం లేదులేగానీ ఆ పచ్చడి జాడీ ఖాళీ అయ్యింది, అదిగో ఆ మోరి దగ్గర బెట్టాను కడిగినావా ఇంతకూ...?” అన్నది లక్ష్మీప్రియమ్మ.

"ఏందో ఏమేమో గమ్మతుగ మాట్లాడుతున్నవేందమ్మ ఇయ్యాళ? తత్సం.. ఏందో” లచ్చిమి అంటుంటేనే - “ఆఁ ఏంలేదు నా పెండ్లై ఒచ్చినప్పటినుండి నువ్వు నీ పనులతో, నేను నా పనులతో చీకిన కర్రల్లా అట్లానే ఉన్నాంలే గానీ నువ్వు బాధపడకు లక్ష్మి" అన్నది లక్ష్మీప్రియ.

"నా పని నాకు సరిపోయింది, నీ పని నీకు సరిపోతున్నది గని ఇయాల ముచ్చటేందో తెల్సామ్మా? చిన్నగైపోయిన జాడలు చూపుతున్న ఇంతలేసి కళ్ళతో , చేతులు తిప్పుకుంటూ మాట్లాడుతున్న లచ్చమ్మ లక్ష్మిదేవమ్మకు సాక్షాత్ నారదమహామునిలా తోస్తున్నది. అన్ని వార్తలనూ చేరవేసే వాడనేకంటే , చిచ్చులు పుట్టిచ్చినోడుగానే చూసి నారదుడంటేనే ‘ కలహభోజనుడ ‘నే పేరుబడింది. ఏమోగాని ఏ న్యూస్ పేపర్లూ, దూరదర్శనులూ లేని కాలంలో ప్రాపంచిక విషయాలనూ, ప్రపంచ విషయాలనూ నారాయణునికి చేరవేసిందాయనొక్కడే గదా మరి!

అమ్మా’ గద్దింపుతో మళ్ళీ ఈ లోకంలోకొచ్చింది దేవలోకాన్ని వీడి లక్ష్మమ్మ. "ఆఁ! ఏందే లక్ష్మీ ఏమైందేంటి? ఊరు ముచ్చట్లన్ని నాకు చెప్పేదాక నీ మనస్సాగదు గదనే!

ఊఁ చెప్పు చెప్పు ఏమైంది?”

“గా బండింటోళ్ల బుచ్చయ్య లేడామ్మా గావాళ్ళ కొట్లాటైతే ఛీ నీ పాడుగాను ఏం గోసమ్మా వనమ్మ గోస వాణ్ణి కట్టుకున్నప్పటి సంది గిదేనాయె!” అనగానే లక్ష్మీ ప్రియమ్మ "ఏమైంది వనమ్మకు? మళ్ళేం దెచ్చిండు " యజమాని మాట పూర్తి కాకుండానే.

“ఏమైందేందమ్మా! గా పోరడు లేడా రాజోలు! వాణ్ణి బాగా కొట్టిండంట కల్లు కాంపౌండ్ కాడ! ఆ పోరనికి మాట పడిపోయిందంట దావకానాకు ఏసుక పోయిండ్రు. నేను ఈడికొస్తాంటే గల్మట్ల గూసోని ఏడుస్తాంది వనమ్మ. దేనికైన పెట్టి పుట్టాల్నమ్మా! తిని కూసుంటే తరగని బూమి జాగల్నిచ్చిపోయిండు ఆడి నాయిన పోలయ్య. వీనికేం సొట్టుబోయిందమ్మ. ఒక్కనాడు ఓ పంటలు పండిచ్చినోడు గాదు. ఒక్కనాడు దూపలు దీర్చినోడు గాదు బుచ్చయ్య. పిల్లలన్న బుట్టకపాయె , పెంచుకుందామంటే ఇనకపాయె అని నెత్తంత కొట్టుకుంట మొత్తకుంటాంది వనమ్మ” అని సుదీర్ఘంగా చెప్పింది లచ్చిమి.

లచ్చమ్మ ఈ ఇంట్లో పాచిపని చేయబట్టి ఎన్నేళ్ళవుతున్నదో! లక్ష్మీప్రియమ్మ పెళ్ళై వచ్చేవరకే ఉన్నది. అత్తమామగార్లు పెట్టే అదుపాజ్ఞల్లో కూరుకుపోయిన లక్ష్మమ్మకు ఓ వాసంత సమీరంలా లచ్చమ్మ ఊసులే ఊరటనిచ్చేదా

రోజుల్లో! పెంకుటిల్లును తీసేసి డాబా బోయించిన భర్త రమేష్ కు ఊళ్ళో ఉన్న మంచిపేరు, మామగారి కున్న హోదా అన్నీ కూడా ఎత్తుకెత్తైనవి.

తనకు పిల్లలు పుట్టినప్పుడు కాన్పు లెల్లదీసిన లచ్చమ్మ పనులు ఆమె ఊపిరున్నంతవరకు గుర్తుండి పోతాయి. ఎక్కడి ప్రేమో ఏమో ఎక్కిరాని కొండై చక్కని జంటై కూర్చున్నది ఇద్దరి మధ్య. 'లక్ష్మమ్మ' అంటే లక్ష్మమ్మ. మా లచ్చిందేవే అని మురిసి మురిసిపోతూ ఉంటుంది లచ్చమ్మ.

లక్ష్మీప్రియమ్మ ఆ రోజుల్లో పదివరకు చదువుకున్నది. కాలేజీకి పంపే స్తోమత లేక పోవడమూ, ఎదిగిన పిల్లను పరాయిండ్లల్లో ఉంచి పట్నపు చదువులంటూ కష్టాల్లోకి తోయడమూ ఎందుకులే అనుకుంటున్నప్పుడే చుట్టాల పెళ్ళిలో చూసి రమేష్ ఇష్టపడడమూ, వారి అంతస్తుకు తగినట్లు లేకున్నా మెట్టుదిగి ఆంజనేయులు, సుజాతమ్మలు వాళ్ళ కొడుక్కు సంబంధం అడగడం అయిపోయింది. ఈడుజోడు బాగున్నది పిలగాడు చదువుకున్నడు. పక్కూర్లోనే రైల్వేలో ఉద్యోగం! అంతా బాగానే ఉన్నదని పెండ్లి చేసారు లక్ష్మీప్రియమ్మ తల్లిదండ్రులు.

ఉన్నంతలో బాగానే పెంచారు కాబట్టి తోడబుట్టిన అన్న అక్కలు అంతా మంచోళ్ళే కాబట్టి లక్ష్మికి ఏనాడూ ఏ లోటూ రాలేదు. ఊరు మారింది, ఇల్లు మారింది .మనుషులు మారారు వరసలు మారాయి అంతే! ప్రేమాదరాభిమానాలకు కొదువలేదు.

పెళ్ళైన కొత్తలో ప్రతి గురువారం నాడు తప్పనిసరిగా తనకు చదువు చెప్పిన సార్లను గుర్తుచేసుకొనేది .

'బళ్ళో తెలుగు టీచర్ గోపాలం మాస్టర్ చెప్పిన పాఠాలు ఒక్కటే మనసులో నాటుకుపోయేవి గాని, సైన్స్, లెక్కలు, ఇంగ్లీష్ ఎంత కష్టమో అవి అత్తెసరు మార్కులతో పాసైన 'అని పెళ్ళైన కొత్తలో భర్త రమేష్ చెప్తే విని నవ్వాడు. పని మీద పట్నం బోయినప్పుడు కొన్ని శతకాలు, కొన్ని కథల పుస్తకాలూ, నవలలూ కొనుక్కొచ్చి ఇచ్చాడు.

తను పద్యాలను కూనిరాగం తీస్తుంటే ముసిముసి నవ్వులు విసిరేవాడు. అట్లా అలవాటైన పద్య పఠనం లక్ష్మికి నిరంతరం వాచ్యార్థ స్నేహభావాల్నే ఇస్తుంటాయి. తన పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో వేసినా తెలుగుకు ప్రథమ ఉపాధ్యాయురాలు తానే అయ్యింది లక్ష్మి.

కాలం గిర్రున తిరిగింది. అత్తమామలు కాలం చేసారు, భర్త రిటైర్ అయ్యాడు. పిల్లలు ఉద్యోగాలకి పట్నం దారి పట్టారు. లక్ష్మమ్మ , లచ్చమ్మల స్నేహమొక్కటే దూరమవలేదు.

***. ***

తన పెళ్ళైన కొత్తలో

"లక్ష్మీ! లక్ష్మీ!” అని పిలిస్తే చప్పుడు చేయట్లేదు ఇదేంటబ్బా అని ఇంటెనుకకు పోయి చూస్తే అక్కడే ఉన్నది. "అదేంటి లక్ష్మీ పలకవేంటి? వినిపించలేదా?” అని అడిగిన లక్ష్మికి ఆమె జవాబు ఆనాడు పరేషాన్ చేసింది.

"వినిపించిందమ్మా ,కాని నేను కావాలనే , పల్కాలనే పల్కలేదు” అన్నది లక్ష్మి.

"ఆఁ! ఏంటి? ఎందుకు?" ఆశ్చర్యం తన వంతైంది.

“నువ్వు ఈడికి, ఈ ఇంటెన్కకు రావాల్ననే నేను నీకు జవాబియ్యలేదు” అన్నది చాలా స్థిరంగా లచ్చిమి.

"ఆఁ! అదేంది? ఎందుకు?" అంటుంటేనే

“అమ్మా నువ్వు నన్ను లక్ష్మీ అని పిల్వకమ్మా నాకు బాగాలేదు అట్ల బిలిస్తే, లచ్చిమీ అనే పిల్వు, అందరోలెనే! ఇది చెప్పాలనే ఈడనే ఉన్న” అన్నది లచ్చిమి.

“ఎందుకు? అంత మంచిపేరు లక్ష్మి అని ఉంటే లచ్చిమనెందుకు అనాలి!" అని అడిగింది లక్ష్మీప్రియమ్మ.

“అమ్మా నా పూర్తిపేరు భూలచ్చిమి. నాకు నా పేరస్సలే ఇష్టంలేదు” అని లచ్చిమి అంటుంటేనే "భూలక్ష్మి” అబ్బ ఎంత మంచిపేరు! మరెందుకు అందరు నిన్ను లచ్చిమి అంటారు?” అన్నది లక్ష్మీప్రియమ్మ.

“ఏమోనమ్మా!”...

“నాకు అట్ల పిలిస్తే బాలే! భూలక్ష్మి - అబ్బే ఏంపేరు అది. లచ్చిమి బాగున్నది. అవునమ్మా అందరన్నట్టు రావే పోవే అని ఎందుకనవు నువ్వు?” అట్లనే పిలువు మనిద్దరం ఒక్క ఈడోళ్ళమే గదా! బాగుంటది అట్ల అంటే" అన్నది లచ్చిమి.

వెంటనే లక్ష్మీప్రియమ్మ.

“అయితే నువ్వు కూడా నన్ను ఏందే రావే పోవే అనే అను. దాదాపు ఒక్క వయస్సు వాళ్ళమేగా”అన్నది.

“అమ్మో గదేందమ్మా తప్పు? తప్పు! గట్లనొద్దు మీరు పెద్దోళ్ళు నేనెట్లంట?” అన్నది లచ్చిమి. అంటూనే

“ఏమో అమ్మా నాకు ఏమనిపిస్తదో తెల్సా? నన్ను దూరం బెట్టినట్టు అనిపిస్తది. నేను పుట్టినప్పటి సంది ఈ ఇంట్లోనే పెరిగిన. నన్ను కన్నబిడ్డోలె చూసుకున్నరు అమ్మోళ్ళు. నీకు ఇయన్నీ దెల్వయిగదా! నువ్వు కూడ అట్లనే పిలువు , అట్లనే అను" అని ఖచ్చితంగా అన్నది లచ్చిమి.

ఇక ఆనాటి నుండి స్నేహితురాళ్ళలానే ఉన్నారు కాని ఎవరి పరిధుల్లో వాళ్ళున్నారు. కష్టసుఖాలు సంసారంలోని ముచ్చట్లు అన్నీ చెప్పుకునేవాళ్ళు. ప్రేమపూరిత వాత్సల్యపూరితమైన కలయికనే వాళ్ళిద్దరిది.

చదువు చెప్పడానికి లక్ష్మమ్మ ఎంత ప్రయత్నించినా లచ్చిమి అస్సలే పడనివ్వలేదు. ఉండీలేని సంసారం తాగుబోతుల వ్యవహారం లచ్చిమికి ఏనాడూ ప్రశాంతత లేదు. ఆమె సేదదీరేది లక్ష్మీప్రియమ్మ దగ్గరే!

*** ***

"అమ్మా! అమ్మా!”... దబదబ బాదుతున్న తలుపు చప్పుడుకు ఒక్క ఉదుటన నిద్ర లేచింది లక్ష్మీప్రియమ్మ. ప్రక్కకు చూస్తే మాంచి నిద్రలో ఉన్నాడామె భర్త.

ఆ రోజు శుక్రవారం . సాధారణంగా తొందరగా మేల్కొనే అలవాటు. మెల్లగా లేచి వచ్చి కిటికీ లోంచి చూస్తే తలమీంచి రక్తం కారుతూ లచ్చిమి! "ఆఁ ఇదేంటి - ఏమైంది లచ్చిమీ! "అంటూ తలుపు తీసింది. అలా తూలి పడిపోయింది గడపపైన లచ్చిమి.

“అయ్యో అయ్యో” అంటూ ఆమెను లోపలికి లాగి తలుపు వేసేసి, లోపల టేబుల్ పైన ఉన్న చెంబులోంచి నీళ్ళు తీసి లచ్చిమి ముఖంపై చల్లి, ఆమె తలను తన ఒళ్ళో పెట్టుకొని "లక్ష్మీ ఏమైందే లే లేమ్మా!” అన్నది.

మెల్లిగా కళ్లు తెరిచి లక్ష్మమ్మ కళ్ళలోకి చూస్తూ, తల కొట్టుకుంటూ..

“అమ్మా అంతా అయిపోయిందమ్మా... అంతా అయిపోయింది. నేను... నేను”

“ఏంటే ఏమైంది? ఏందో చెప్పు.. అయ్యో....” అని లక్ష్మమ్మ అంటుంటే

“చంపేసినానమ్మా నా మొగుణ్ణి నేనే చంపేసిన...” అంటూ పెద్దగా ఏడుపందుకున్నది.

లోపలి నుంచి లక్ష్మీప్రియమ్మ భర్త వచ్చాడు. “హాఁ...! ఏంది ఏమైంది?” అని ఆగమన్నట్టు సైగ చేస్తున్న భార్యనేమీ అనక కిటికీలోంచి వాకిట్లోకి చూసాడు. అక్కడెవ్వరూ లేరు.

“ఏంది.. ఏమైందట” అంటుంటే, "ఈ నీళ్ళు తాగవే తాగి చెప్పసలు ఏమైందో” అని మెల్లిగా మంచినీళ్ళు తాగించింది.

రాత్రి బాగా పొద్దుపోయాక భర్త బాగా తాగొచ్చి లొల్లి చేస్తుంటే ఇంట్లోంచి వెళ్ళిపోయి ఇంటెనుక చేదబావి దగ్గర కూర్చున్నాననీ, కొద్దిసేపు అక్కడే ఉన్నాననీ , చాలా రాత్రయ్యాక ఇంట్లోకి వెళ్తే కాపుగాసి ఉండి తనమీద దాడి చేసాడనీ, ఆ కొట్లాటలో తానూ రోకలి బండ తీసాననీ అతడు కత్తిపీట ఎత్తి కొట్టాడనీ, తాను రోకలిబండతో మోదగానే ఒక్క దెబ్బకే కిందపడి గిలగిల కొట్టుకున్నాడనీ ఆ గుడ్డిదీపం వెలుగులో చూసాననీ భయమై పరుగెత్తుకొచ్చాననీ చెప్పింది.

“చచ్చిపోయిండానే మీ ఆయన?” అని అడిగింది లక్ష్మీప్రియమ్మ.

“సచ్చే ఉంటడమ్మా చేతులు ఏలాడేసి కింద పడ్డడమ్మ, నాకేందోస్తలేదు నేనేం జేయాలమ్మా” అని బోరుమని ఏడుస్తున్న లచ్చిమిని ఓదారుస్తూ "ముందు నిశ్శబ్దంగా ఉండు. అయ్యను పొయ్యి కనుక్కోమంటా"నని భర్తను లోపలికి తీసుకొని పోయింది.

ఆయనేమో చాలా కోపోద్రిక్తుడై “ఒక హంతకురాలిని ఇంట్లో పెట్టుకుంటే ఏమౌతుందో తెల్సా” అని గద్దిచ్చాడు. “ముందామెను ఈబయటికి పొమ్మను, పంపించెయ్! ఊరోళ్ళు ఊరుకుంటారా? వాని అక్కచెల్లెళ్ళు, తమ్ముడు పోలీస్ కేస్ పెడ్తారు. పోలీసులొచ్చి మనల్ని నిలదీస్తరు. ఏందమ్మా? ఇదంతా నీకెందుకు? మనం మధ్యన ఇరుక్కుంటం తెల్సా?” అని గుడ్లురుముతూ పళ్ళు బిగించి అరుస్తున్నాడు.

“అయ్యో! మెల్లెగనండీ! ఉండండి ! మీకు దణ్ణం బెడ్తా! మీరు ఇక్కడే కూర్చొండి పాపం లక్ష్మి పాపం...” అనుకుంటూ లచ్చిమి దగ్గరికొచ్చింది.

ఏడుస్తున్న లచ్చిమిని చూస్తుంటే లక్ష్మీప్రియకు ఏమీ తోచలేదు లేదు. 'చీకటి ఇంకా పోలేదు. ఊరంతా గుప్పుమంటుంది ఎట్లా? ఏం చేద్దాం 'అని ఆలోచించి, ఉన్నపళంగా లక్ష్మిని అట్లా ఒంటరిగా బయటికి పంపే ప్రసక్తే లేదు. నేనుగాక దీనికెవరున్నారు?ఏం చేయాలి? ఎట్లా? ఏం చేయాలి? మొగుడూ పెళ్ళాం ఇద్దరు కూడా ఇట్లా అవుతుందనుకోలేదు. వాడు తాగిన మైకంలో ఉన్నాడు. ఇది పిచ్చికోపం ప్రదర్శించింది అంతేగాని చంపేసుకునేంత పగలు కావు. పొరపాటున జరిగింది. కానీ నేరం నేరమే! పోలీసులొస్తారు కేసవుతుంది, లచ్చిమిని జైల్లో పెడతారు. ఆ!ఁ నా నేస్తం ! నా నేస్తం జైలుకెళ్తుందా? అయ్యో! నేనెట్లా భరించేది అనుకుంటుంటే లక్ష్మీప్రియమ్మ కళ్ళు ధారగా కురుస్తునే ఉన్నాయి, లచ్చిమితో బాటు ఏడుస్తోంది!

ఇంకాసేపట్లో తెల్లారుతుంది. వార్త తెలిసిన జనం ముందు ఇక్కడికే వస్తారు. పోలీసులకు లొంగిపోమనాలా? ఇదంతా ఎవ్వరికీ తెలియకుండా తనింట్లో నే లచ్చిమిని దాచేయాలా? 'లచ్చిమి పారిపోవే ఎక్కడికైనా 'అని చెప్పాలా? ఎట్లా ఏమి చేస్తే ఏమవుతుందో? దీని వైపు నిలబడి వాదించి ఇన్నేళ్ళ జీవితాన్ని తన్నులతో దెబ్బలతో చిత్రహింసలు పెట్టి, నరకమంటే ఎక్కడోలేదు ఇక్కడే ఈ భూమ్మీదనే భూలక్ష్మి ఇంట్లోనే ఉన్నదని ఆ కూపం నుంచి ఇప్పుడు విముక్తి అయ్యిందని గొంతెత్తి అరచి న్యాయస్థానంలో కళ్ళకు గంతలు కట్టుకున్న న్యాయదేవత ముందు నిలిచి గెలవాలని ఉన్నది లక్ష్మీప్రియమ్మకు.

“మనం ఒదిలే మలినాలన్నీ తనలో కలిపేసుకుని తనలోనుండి పచ్చని పసరికల్ని ఇస్తదమ్మా నేల- అందుకే నేలమ్మ అంటరేమో!” అని కిలకిల నవ్విన భూలక్ష్మి మాటలు గుర్తుకొచ్చి ఇప్పుడర్థమైంది తనకు తన పేరు ఇష్టం లేదని ఎందుకు అనేదో ! లక్ష్మీప్రియమ్మ మనస్సంతా దుఃఖమయమై పోయింది!

భూలక్ష్మి ఏ దేవునికి మొరబెట్టుకోవాలో! ఈశ్వరా! అనుకుంటూ తన నేస్తాన్ని రెండు చేతులా పొదువుకున్నది లక్ష్మీప్రియమ్మ!

- కొండపల్లి నీహారిణి

First Published:  26 July 2023 11:47 PM IST
Next Story