గత్యంతరం లేక
ఇన్నాళ్ల దాంపత్యానికి
గుర్తుగా ..
ఏదేనా చేయాలనుకొంటా ...
ఒకానొకప్పుడు
నెమలీక ఇచ్చాను
సంబరపడిపోయావు ..
అది వొక ప్రేమ సందేశం గా దాచుకున్నావు
ఏదో వొక సినిమా పాటని
నీకు అనుకూలంగా
మార్పులు చేసి..
శృతి లేకుండా
పాడివినిపిచాను ...
ఆ గీతాన్ని విని,
పరవశం చెందావు.
రెండు సున్నాలు చుట్టి,
కాళ్ళు, చేతులు, కళ్ళు వేసి
మనిద్దరం అన్నాను.
దాన్ని మొన్నటిదాకా
చీర మడతల్లో దాచుకున్నావు.p
సముద్రం ఎదుట నిలబడి
ఇద్దరం కలిసి ఈదేద్దాం
అన్నాను..
సిద్ధపడిపోయావు.
ఇసుక గుడి కట్టి
ఇది మన ప్రేమనగర్ అన్నాను...
నమ్మేసావు.
ఇప్పుడు
వొడిలో ఇద్దరు బిడ్డలు,
మెడలో తాళి,నల్లపూసలు.
ఐనా పసుపాడిన
నీ ముఖం జగదేక సుందరి.
ఇలా....గడిచి,ఖండించి,
గడిపి,గడిపి ...
తాతా! నీకు అమ్మమ్మ
ఎలా నచ్చింది?
అన్న వారి ప్రశ్నకు...
గత్యంతరం లేక అన్న
నా సమాధానం లో
చమత్కారం తోచలేదు,
పరిహాసం అనిపించలేదు...
ఇప్పుడే కాదు !
గతం అంతా
ముడతలు పడినట్లు,
జరిగిందంతా తుడవలేని
మరకలు పడినట్లు...
పట్టుచీర చిరుగులు పడినట్లు....
ఒక శూన్యం ...
ఒక నిశ్శబ్దం..
ఒక అవమానం...
ఒక భరించలేని తనం.
ఇప్పుడు
యుద్ధానికి
ఓపిక లేదు,
సంధికి సమయంలేదు.
- కవిరాజు