వనవాసం (అనువాద కవిత)
ఓ రామా!
ఈ తపోవాటికలో
నిశ్శబ్దసాయంకాలాల ఒంటరితనంలో
నిన్ను తలపోస్తూ
నా హృదయం
తీవ్ర పరితాపంతో బరువెక్కింది.
నీ కష్టాల్నీ నష్టాల్నీ
తలపోసుకుంటూ
ఓ రామా !
నా పిల్లలు దూరంగా
దుర్గమారణ్యం లో
వాల్మీకి మహర్షి దగ్గర
అరణ్యవాసపు అనుభవాల్ని
మహాకావ్యంగా, ఇతిహాసంగా
నేర్చుకుంటున్నప్పుడు
అప్పడు గుర్తుకొస్తాయి-
మన పదమూడేళ్ళ వేసవుల జీవితమూ
మన అన్యోన్య బాంధవ్యమూ
బ్రహ్మనంద సదృశపు ఆనందమూ
అద్వితీయమైన నీ సాహచర్యమూ
మీ ఉనికే వ్యక్తీకరించే
అనంత అమేయ పారవశ్యమూ
మీరు నా కోసమే అయిన ఆ రోజులు
అప్పడు గుర్తుకువస్తాయి
ఆ రోజుల్లో మనమధ్య
రాజ్యభారపు
ఏ నిప్పులూ పడలేదు
పరనిందల
విషపు గాలులూ వీయలేదు
వ్యాజ్యస్తుతి చేసేగాయకులూ,
రాజ్య కవులూ
మన దగ్గరకి వచ్చేవారు కాదు
ఏ పరిచారికల బృందమూ
ఎప్పడూ వచ్చి
మన ఏకాంతాన్ని
భగ్నం చేయలేదు.
మనిద్దరం ఏకాంతంగా
కూచునే వేళల్లో
లక్ష్మణుడు కూడా
మన ఏకాంతానికి
భంగపరచకుండా
ఏదో మిషతో దూరంగా వెళ్ళిపోయేవాడు.
ప్రతిదినమూ తలలూపుతూ అటూయిటూ
కదిలే చెట్లూ ,వాటినీడలూ
అడవి జింకల మందలూ
సాయంత్రాలు
నర్తించే నెమళ్ళ గుంపులూ
మనకై అడవి దాచి వుంచిన కిలకిలారావాలూ
మునుల్ని కూడా
మోహపరిచే లతలూ
పరిమళంతో మత్తెక్కించే
పూలగుత్తులూ
అటువంటి రోజుల్లో -
సుగంధపు మట్టి,
జల్లు జల్లుగా కురిసే వర్షం
మెలమెల్లగా వీచే గాలి,
మనల్ని
వన సంతానంగా మార్చివేశాయి.
నువ్వెప్పుడన్నా
గుర్తుచేసుకున్నావా
అరణ్యపు సర్గాన్ని
ఆ అరణ్యపు స్వర్గాన్ని .
నీకు అరణ్యవాసం
నిర్ణయం అయినప్పుడు
వెనువెంటనే ఏ సందేహమూ సంకోచమూ లేకుండా
నీవెంట నేనుండటానికి
తోడుగానడవటానికి నిర్ణయించుకున్నాను.
ఆ తరువాత
మరోసారి నాకు
వనవాసజీవితం
విధించినప్పుడు
ఒంటరిగా
అడవిలో వదిలినప్పుడు
ఓ రాఘవా !
నువ్వు మర్చిపోయావా
దండకారణ్యంలో
మనిద్దరం అనుభవించిన
అడవి మాధుర్యాన్ని
గుర్తుకురాలేదానీకు
ఆ వనవాస సౌందర్యం!
జ్ఞాపకం రాలేదా !
ఆ అరణ్యపు స్వర్గపు జీతం
ఎంత కష్టం?
రాజ్యం - సింహాసనం మధ్య నలిగిపోయిన మానసిక స్థితి.
ఓ రామా!
మరో వనవాసాన్ని స్వీకరించే ధైర్యం కోల్పోయావా?
ఓ రామా!
మరో వనవాసాన్ని స్వీకరించే ధైర్యం కోల్పోయావా?
ఒక వేళ నువ్వు మరో సారి నాతో
వనవాసం గడిపివుంటే
మన జీవితం
ఉతృష్ట ఇతిహాసమై వుండేది.
మరోసారి నాకు వనవాసాన్ని అనుగ్రహించిన
ఓ రామా!
ఆ రాజమహల్లో జరిగే
కుట్రల దుర్గంధమూ,స్వా ర్థమూ
అధికరదాహమూ,
రాజ్య వ్యామోహమూ
ఆలోచిస్తూ నా మనస్సు
కకావికలవుతుంది .
నీ గురించి తలుచుకుంటే
నీకు జరిగిన నష్టాన్ని
గుర్తుకు చేసుకుంటే
నీకు తెలియదు
నీపై నాకు గాఢ సానుభూతి కలుగుతుంది.
ఈ రాజ్యమూ,రాజ్య కాంక్షా
నగరమూ
నీ కెప్పుడూ
వనవాస సౌందర్యాన్నీ
ప్రకృతి రామణీయకతనూ
చేరువగా తెచ్చేందుకు
అవకాశం ఇవ్వలేదు.
రామా !రఘురామా!
నీకు జరిగిన ఇంతనష్టాన్ని
తలుచుకుని
నా మనసు జాలిగా మూలుగుతుంది
నా మనసు జాలిగా
మూలుగుతుంది ఇప్పుడు.
( ఆకాశవాణి జాతీయ
సర్వభాషా కవిసమ్మేళనం 2023)
మళయాళ మూలం :
కె. జయకుమార్
అనువాదం : కె.శివారెడ్డి