బంధం (కథ)
"ఓయ్ మీనాక్షి నేను పొలం వెళ్తున్న అమ్మకు కాఫీ ఇచ్చి టిఫిన్ పెట్టు" అంటూ గావుకేక వేసి పొలం కి బయలుదేరాడు వెంకటేష్.
"ఒరేయ్, వెంకటేశా ఇలారా వచ్చి నా పక్కన కూర్చోరా" అంటూ పిలిచింది ఆనందమ్మ ..
"ఏంటమ్మా, పొలంకి వెళ్లి, నీళ్లు పెట్టాలి, మోటార్ తెప్పించాను ఆలస్యం అయిపోతుంది" అంటూనే, అమ్మ పక్కన వచ్చి కూర్చున్నాడు...
"అది కాదురా అయ్యా, నీతో ఒక విషయం మాట్లాడాలని పిలిచాను నీకు పని ఉంటే పోయి చేసుకో రాత్రికి మాట్లాడుకుందాం" అన్నది కొడుకు భుజం మీద ప్రేమగా రుద్దుతూ.
భర్త ఇంకా వెళ్లకపోయే సరికి, వాళ్ళిద్దరికీ కాఫీ ఇచ్చి లోపలికి వెళ్తున్న మీనాక్షిని కూడా ఆపి, "నువ్వు కూడా కూర్చో" అన్నది ఆనందమ్మ.
"ఏంటి అత్తమ్మ చాలా పనులు ఉన్నాయి ,
ఇడ్లీ పొయ్యి మీద పెట్టాను ఆవిరి వచ్చేస్తుంది వెళ్లి ఆపి వస్తాను ఉండండి" అని లోపలికి వెళ్లి స్టవ్ ఆపేసి వచ్చి, "అత్తమ్మ ఏంటి ఈరోజు కొత్తగా ఇద్దరిని పిలిచి మాట్లాడుతున్నారు" అన్నది మీనాక్షి తడిగా ఉన్న చేతులు కొంగుతో తుడుచుకుంటూ.
"ఏమీ లేదే మీతో ఒక విషయం చెప్పాలి ఎందుకో మనస్సు అంతా భారంగా ఉంది". "అయ్యా ,వెంకటేశ నాది ఒక చిన్న కోరిక తీరుస్తావా" అన్నది .వెంకటేష్ చేతులు రెండు పట్టుకొని...
వెంకటేష్ వెంటనే భార్య వైపు చూసాడు "ఏంటమ్మా నీ కోడలు నిన్ను సరిగ్గా చూసుకోవడం, నీకు కావలసినవి వండి పెట్టట్లేదా" అన్నాడు నవ్వుతూ.
"హా! బాగుందే అత్తగారిని మా అమ్మలా చూసుకుంటుంటే, లేని పోని అనుమానాలు మీరు కల్పించకండి" అన్నది రుసురుసా చూస్తూ...
"వాడంతే అంటాడు నువ్వేమీ బాధ పెట్టుకోకు మీనాక్షి వాడు సంగతి తెలిసిందేగా" అన్నది ఆనందమ్మ కోడలికి కోపం వచ్చిందేమో అని...
"ఒరేయ్, వెంకటేశా నాకా వయసు అయిపోతుంది రేపు మాపో పాడెక్కుతాను" అనగానే..
"అయ్యో , ఏంటి అలా మాట్లాడకండి అత్తమ్మ నాకు ఏడుపొస్తుంది" అన్నది వెంటనే ఏడుస్తూ మీనాక్షి ...
ఆమె కళ్ళు వెంట కన్నీళ్లు వస్తుంటే," పిచ్చి పిల్ల" అని ,"ఇలాంటి బంగారం నా కోడలు అయినందుకే ఇంకా నేను బ్రతికి ఉన్నాను, అదే వేరే పిల్ల గనుక అయ్యుంటే ఈపాటికి ఎప్పుడో చనిపోయేదాన్ని.. నువ్వు నా బంగారానివి అమ్మ" అంటూ కోడల్ని దగ్గరికి తీసుకొని బుజ్జగించింది.
కొడుకు వైపు చూసి," నీ చెల్లికి పెళ్లి చేసి పంపించి ఆరేళ్లయింది, నా కూతురు లేని లోటు నా కోడలు తీరుస్తుంది నీకు తెలుసా!?" అన్నది...
"ఒరేయ్, నా కోరిక ఏంటంటే ఈ ఉగాది పండక్కి మీ చెల్లిని పిలవరా, అది వెళ్లిన తర్వాత కనీసం ఒక్కసారి కూడా ఇండియా రానేలేదు ఆ సింగపూర్ లోనే ఉంది, దూరాభారం అని నువ్వు చెల్లిని పిలిచింది లేదు. వచ్చే ఉగాది పండక్కి చెల్లిని, బావని మేనల్లుడిని పండక్కి రమ్మని ఫోన్ చేయరా అయ్యా! వచ్చే ఏడాది నేను ఉంటానో, పోతానో తెలియదు మీ ఇద్దరినీ సంతోషంగా చూసి చచ్చిపోతాను" అన్నది బ్రతిమిలాడుతూ...
వెంకటేష్ కి కూడా చెల్లెల్ని పండగకి పిలవాలని ఆశగానే ఉంది...
కానీ, ఆర్థికంగా చాలా దెబ్బ తిన్నాడు ఇప్పుడు వాళ్ళని పిలిస్తే కనీసం 70,000 కావాలి ఎయిర్పోర్ట్ కి వెళ్లి తీసుకు వచ్చిన దగ్గర నుండి తిరిగి ఎయిర్పోర్ట్లో దించే వరకు ఖర్చు అంతా తనే భరించాలి...చీర, సారె పెట్టాలి ఎలా అని ఆలోచిస్తూ ఉండిపోయాడు...
"ఏరా ఏం మాట్లాడావ్ ఏంటి? " అన్నది ఆలోచనలో పడి ఉన్న కొడుకుని చూస్తూ...
"వచ్చే ఏడాది చూద్దాంలే అమ్మ, ఇప్పుడు రావాలంటే చెల్లికి ఇబ్బంది, అయినా ఎప్పుడు పిలిచినా మీరే రండి అంటుంది. నేను సింగపూర్ వెళ్ళలేను అనే కదా అలా పిలుస్తుంది, నన్నేదో దెప్పుపొడుస్తున్నట్టు ఉంటుందమ్మా ఆ మాట " అన్నాడు బాధగా వెంకటేష్...
కొడుకు మాటకు ఆనందమ్మ మనస్సు నొచ్చుకుంది...
మీనాక్షి కూడా ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది...
చిన్నప్పుడు ఇద్దరినీ చూసుకొని మురిసిపోయేది, పండగ కోసం పిల్లలకి పిండి వంటలు, బట్టలు వారికి నచ్చినవి అన్నీ సిద్ధం చేసి వారిని చూసి ఎంతో సంతోషపడేది ఆనందమ్మ...
పిల్లల పెళ్లిళ్లు అయిపోయి ఎవరిదారిన వారు వెళ్ళిపోతే కనీసం ఒకరికొకరు చూసుకోవడం కూడా లేకుండా పోయింది ....
ఈ పండగ సందర్భంగా అయినా పిల్లలిద్దరూ కలిసి ఒక రెండు రోజులు ఉంటే వాళ్లని తనివితీరా చూసుకోవాలని ఆమె ఆశపడుతుంది...
తల్లి మనస్సు పిచ్చిది, ఎప్పుడు బిడ్డలను చూసుకోవాలని కొట్టుకులాడుతుంది...
"ఏంటండీ! అత్తమ్మ ఉదయం అడిగిన విషయం ఏం చేశారు? " అన్నది మీనాక్షి పక్క సర్దుతూ...
"ఏముంది మన పరిస్థితి నీకు తెలియనిది కాదు ఉన్న డబ్బు అంతా పొలం మీద పెట్టాను, చేతికి వచ్చిన పంట నోటికాడకి రాకుండానే ప్రతి ఏడాది ఏదో ఒక రూపంలో కొట్టుకుపోతుంది". మనం తినడానికి కష్టంగా ఉంటుంది ఇప్పుడు వాళ్ళు వస్తే ఎలాగే" అన్నాడు దిగులుగా మంచం మీద పడుకుంటూ...
"మీరిద్దరూ కలిసి ఉంటే చూడాలని అత్తమ్మ కోరిక మీ చెల్లిని చూసి ఏళ్ళు గడిచిపోయాయి. ఆడపిల్లకు పుట్టింటి మీద ఆశ ఉంటుంది మీరు పిలవందే ఆ అబ్బాయి మాత్రం ఎందుకు పంపిస్తాడు..!? డబ్బు ఈ రోజు లేదు, రేపు వస్తే అత్తమ్మ కోరిక తీరుతుందా? ..అసలే ఆమె ఆరోగ్యం అంతంత మాత్రమే ఉంది. డబ్బు కోసం కంగారు పడకండి ఇప్పుడే ఫోన్ చేయండి" అంది మీనాక్షి ఫోన్ అందిస్తూ....
"ఖర్చులు ఎలా మేనేజ్ చేయాలి?" అన్నాడు ఆమె వైపే చూసి, వెంటనే ఆమె చేతులకు ఉన్న గాజులు చూపించి "ఇలా" అన్నది...
ఆమె రెండు చేతులు దగ్గరికి తీసుకుని ముద్దుపెట్టుకొని చెల్లికి ఫోన్ చేశాడు వెంకటేష్...
ఎయిర్పోర్ట్ కార్ తీసుకొని వెళ్ళాడు... చెల్లిని ,బావని, అల్లుడ్ని చూడగానే చాలా సంతోషం అనిపించింది ...
వెంటనే చెల్లిని పట్టుకొని "నా బంగారు తల్లి ఎన్నేళ్లు అయింది నిన్ను చూసి " అని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు .
ఆప్యాయంగా అన్నయ్యని అల్లుకుపోయింది సుధా...
"మామయ్య" అంటూ దగ్గరికి వచ్చి కౌగిలించుకున్నాడు మేనల్లుడు...
"బావ బాగున్నావా" అని హత్తుకున్నాడు సుధ భర్తను ...
అందరూ దగ్గర అయినప్పుడు ఆనందం, పట్టరాని సంతోషంతో అందరి కళ్ళు, కన్నీళ్ళతో నిండిపోయాయి...
ఆనందమ్మ కుటుంబం మొత్తం ఒకచోట ఉండటం చూసి ఉబ్బి తబ్బిబ్బు అయిపోయింది...
ఉగాది పండక్కి మీనాక్షి అందరికీ కొత్త బట్టలు కొన్నది, పిండి వంటలూ చేసింది...
ఉగాది పచ్చడిలో ఉన్నట్టే షడ్రుచుల ఆనందాన్ని అందరూ అనుభవిస్తున్నారు...
మీనాక్షి సుధకి పట్టు చీర, సారే పెట్టింది...
అవి తీసుకొని " ఏం వదినా గిఫ్ట్లు అన్ని మాకేనా మీ ఆనందం అంతా మాకే పంచేస్తావా" అన్నది.
"మీరు ఆనందంగా ఉండటమే నాకు కావాలమ్మా " అన్నది మీనాక్షి నవ్వుతూ.
వెంటనే సుధ చేతికి ఒక బాక్స్ అందించాడు భర్త.
మీనాక్షి రెండు చేతులు తన చేతిలోకి తీసుకొని రెండు చేతులకి 6 గాజులు వేసింది...
మీనాక్షి ఆశ్చర్యంగా వాటి వైపు చూసింది.
" నీ కోసం ప్రతి సంవత్సరం ఒక గాజు తీసుకుంటున్న వదిన ఇప్పటికీ ఆరేళ్లకి 6 గాజులు అయ్యాయి..."
"మీరు సింగపూర్ వచ్చినప్పుడు వీటిని నీకు గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్నాను" అంటూ, గాజులు వేసిన చేతిని ముద్దు పెట్టుకుంది...
మీనాక్షి వెంటనే వెంకటేష్ వైపు చూసింది కళ్ళ నిండా కన్నీళ్ళతో పెదవుల మీద చిరునవ్వుతో చెల్లి భుజాలు పట్టుకొని నా చెల్లి అని గర్వంగా చూసాడు మీనాక్షి వైపు.
మీనాక్షి నవ్వి, సుధని కౌగిలించుకుంది....
ఆనందమ్మ అన్న, చెల్లి ప్రేమ ఆప్యాయతలకు మురిసిపోతూ సంతోషంగా మనవడితో ఆడుకుంటుంది...
ఒక బంధం నిలవాలంటే ప్రేమ కావాలి
ప్రేమ నిలవాలంటే బంధం కావాలి
- కె.కనకదుర్గ