పుట్టినిల్లు (కథ)
నా పెళ్లి అయ్యి ఇరవై నాలుగు గంటలు గడిచింది..వ్రతం, భోజనాలు అయ్యాక అందరూ ఎక్కడివారక్కడే నిద్ర తీస్తున్నారు.నేనూ మా అక్కా గదిలో ఓ వార చాప మీదపడుకున్నాము.
ఇంతలో ఎవరో తట్టి లేపుతున్నా కళ్ళు విడలేదు నాకు.అక్క అప్పటికే లేచినట్టుంది. ముఖం కడుక్కుని ఆ తడిచేతులతో నా కళ్ళు రుద్దుతూ 'లే హరీ' అంది. బద్ధకంగా ఇటు నుండి అటు తిరిగేను. మెళ్ళో ని పసుపుతాడు కు వేలాడుతున్న పుస్తెలు గమ్మత్తుగా గల గల మన్నాయి.
'లహరీ' అంటూ లోపలి గది లో నుండీ పిలుపు వినపడింది.
" మీ అత్తగారు పిలుస్తున్నారు,ఇంకా పడుకుంటే బాగుండదు.అమ్మ దగ్గర ఉన్నావనుకుంటున్నావా !లేవాలింక హరీ " అంటూ అక్క ముఖం తుడుచుకుని అద్దంలో బొట్టు సరిజూసుకుంటోంది.
అవును కదా!అమ్మ దగ్గర నేను లేనా,నా దగ్గర ఇపుడు అమ్మ లేదా..రెండూ వేరు వేరు నా?.పెళ్లి అవ్వగానే ఎంత దూరం పెరిగిపోయింది.నిన్న వరకూ ఉన్న నా ఇల్లు ఇపుడు అమ్మ ఇల్లు అయింది అని అనుకోగానే మనసు లో ఏదో తెలియని బెంగ మొదలైంది.
*******************
పెళ్లిఅయ్యి పదహరురోజులైంది. ఇంటి ముందు వేసిన పందిరి తీస్తున్నారు. అమ్మ ఒక్కతే వచ్చింది.నాన్నకు కొంచం నలత గా ఉందట.అత్తగారు తో చెప్తుంటే విన్నాను..వెంటనే నాన్న ను చూడాలని అనిపించింది..శ్రీవారి తో చెప్పి, అమ్మతో కలిసి వెళ్దాంఅనుకున్నాను .కానీ అత్తగారు ఒప్పుకోలేదు. మా పెళ్లికి రాలేక పోయిన బంధువులు ఎవరో రేపు నన్ను చూడటానికి వస్తారట. అందుకు నేను ఉండి తీరాలిట.
నాకేమో వెంటనే నాన్నను చూడాలని కోరిక..నా ఇష్టాయి ష్టాలతో పనిలేకుండా
అత్తగారు చెప్పిన కారణానికి అమ్మ ఏమీ అనకుండా, తిరిగి వెళ్ళిపోయింది. వీలైనప్పుడే వచ్చి నాన్నను చూడు అని చెప్తూ..
ఆ తరువాత నాన్నకు చాలా సీరియస్ అయ్యి హాస్పటల్లో చేర్చారని కబురు తెలిసాక నా రాక కూడా
తెలియలేని స్థితి లో ఉన్న నాన్న ను చూసేను.కన్నీళ్లాగలేదు. 'రిటైరయ్యి రెండేళ్లు దాటుతోంది ఆడపిల్ల కు పెళ్లి చేయకుండానే పోతానా 'అని తరచుగా నాన్న నోటి వెంట వచ్చే మాట గుర్తొచ్చింది నాకు.'నా పెళ్లి తో నీ బాధ్యత బరువు తీరిపోయిందా నాన్నా ,నాకెందుకో నీ బాధ్యత బరువు దించుకుని,నాకు బరువు బాధ్యతలు పెంచేవనిపిస్తోంది 'అచేతనంగా ఉన్న నాన్న ను చూస్తూ అనుకున్నాను...
************
నాన్న పోయిన రెండేళ్ల తరువాత స్వరూప్ పుట్టేడు.. అమ్మకు వాడంటే ఎంత ప్రేమో!నాకన్నా రెండేళ్లు ముందే అక్కకు పెళ్లి అయినా పిల్లలు లేరు. మనవడి ముచ్చట అమ్మ కు నా కొడుకు వల్లే తీరింది.
కానీ నేను పుట్టింటికి వెళ్లాలంటే అత్తగారు అంత తొందరగా పంపే రకం కాదు..ఎదిరించి వెళ్లి వచ్చే రకం నేనూ కాదు..దాంతో అమ్మే అపుడపుడూ మా ఇంటికి వచ్చేది మనవడి కోసం.. కొన్నాళ్ళకు రావడం తగ్గించింది కూడా..ఆడపిల్ల ఇంటికి తరచూ రాకూడదని అనుభవ పూర్వకంగా తెలుసుకుందని,తర్వాత అర్ధమయ్యింది నాకు ...అయినా కూడా ఏమీ చేయలేని నిస్సహాయత..ఆడపిల్ల పెంపకం నుండే ఉగ్గు పాల తో పాటు కొంత ఒగ్గి ఉండటం కూడా నేర్పుతారేమో.
మనవడి అన్నప్రాసన నుండి ఇప్పుడు అవుతున్న వాడి పెళ్లి వరకూ పుట్టిoటి నుండి లాంఛనాలన్నీ అమ్మమ్మ గా అందించడం లో ఎలాంటి తక్కువా చేయలేదు..
కోడలు మా ఇంట్లో అడుగుపెట్టిన వేళ, నాకు పెళ్లి అయిన మొదటిరోజు గుర్తు వచ్చింది....అత్తగా ఏ రోజూ పుట్టింటికి వెళ్లకుండా అడ్డు పెట్టను నా కోడలికి అనుకున్నాను.. ఆరోజులు మారాయి.. ఆ మనుషులూ మారేరు..కోడలు వాళ్ళింటికి వెళ్లేముందు పర్మిషన్ కాదు,ఇన్ఫర్మేషన్ ఇస్తుంది..నేను కోరుకున్నదీ అదే..!
వయసురీత్యా అమ్మ అలిసి పోయింది..ఒక్కర్తె ఉండే పరిస్థితి లేదు..అక్క కుటుంబం దూరంగా ఉంది. అమ్మను మేమే చూడాలి. కానీ ‘కొడుకు ఏమంటాడో, కోడలు ఏమనుకుంటుందో’ భయం మొదలైంది నాలో.. అదే అన్నాను మా వారితో..
"ఎవరు ఏమనుకుంటారో అనే ఆలోచన భయం వదిలి నువ్వు చెయ్యాలనుకున్నది చెయ్యు..తరువాత ఏం జరిగినా వెనుకడుగు వెయ్యకు" అన్నారు.
ఆయన మాటలు వింటుంటే నవ్వొచ్చింది.
మా పెళ్లి అయిన కొత్తలో అత్తగారి ఆంక్షలు కు ఈయన ఎందుకు అడ్డుకట్ట వేయలేదో!కొన్నింటికి జవాబులు ఉండవు పరిస్థితులు బట్టీ మారే మనస్తత్వాలు..
స్వరూప్ కు అమ్మను తీసుకువస్తున్న సంగతి చెప్తే,'నీ ఇష్టం' అన్నాడు..కోడలు ఏమీ మాట్లాడలేదు. అమ్మను నాదగ్గరే ఉంచి చూసుకోవాలి.కాదు అమ్మను చూసుకోవాలి. అవును నేను నా తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాలంటే అమ్మను నా దగ్గరకు తెచ్చుకోవడం కాదు, నేనేవెళ్తున్నా .
స్వేచ్ఛగా నా పుట్టింటికి వెళ్తున్న ఆనందం మొదటిసారిగా కలిగింది నాలో !!
కానీ అమ్మ మాత్రం నాకా ఆనందం ఎక్కువసేపు ఉంచలేదు..నా అవసరం వద్దనుకుందో ఏమో పుట్టినిల్లు నాకు శాశ్వతంగా దూరంచేస్తూ వెళ్ళిపోయింది...
- కె.గీత