Telugu Global
Arts & Literature

జాతి వనరులు (కథ) - అంబల్ల జనార్దన్ ( ముంబయ్)

జాతి వనరులు  (కథ) - అంబల్ల జనార్దన్ ( ముంబయ్)
X

డా.అంబల్ల జనార్దన్ 1950 లొ జన్మించారు

సొంత ఊరు : ధర్మోరా, నిజామాబాద్ ఎం. కాం. ఎల్ఎల్ .బి. సిఏఐఐబి.

చదివారు .బ్యాంకింగ్, ఆర్థిక రంగాల్లో 52 సంవత్సరాల అనుభవం.

గత 30 సంవత్సరాలుగా కథ, కవిత, వ్యాస ప్రక్రియ ల్లో 18 పుస్తకాల ప్రచురణ కావించారు.

డా.అంబల్ల జనార్దన్

వీరికథలు హిందీ, మరాఠీ, ఒడియా, ఇంగ్లీషు, భాషల్లోకి అనువాదమై సంపుటాలు గా ప్రచురితమైనవి.

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం తో సహా దాదాపు 30 పురస్కారాలు.పొందారు .

ముంబయి తెలుగు రత్న, ముంబయి కథాకెరటం, కవి రత్న , సాహిత్య రత్న. బిరుదాంచితులు .



"ఏంటమ్మా నాన్నగారు! ఆ లైట్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేయలేదు? ఇప్పుడు ఈ రూమ్ లో పంఖా అవసరమా? పగలూ రాత్రంతా ఏసీ వేయడం కూడా అవసరమా? అని అస్తమానం కరెంట్ వృధా చేయడంపై క్లాస్ తీసుకుంటారు?

'మా రోజుల్లో అసలు కరెంటే లేదు. వీధి కిరసనాయిలు దీపాల వెలుగులో చదువుకొని డిగ్రీ ఫస్ట్ క్లాసులో పాసయ్యాను!' అని గొప్పలు చెబుతారు. అప్పటి రోజులకి, ఇప్పటి దినాలకి ఏమైనా సామ్యం ఉందా? కాలంతో పాటు మనం కూడా మారాలి అనే స్పృహ లేకపోతే ఎలా? నేనైతే ఆయన లెక్చర్ విని విని విసిగి పోయాను. నువ్వైనా ఆయనకు అర్థమయ్యేలా చెప్పమ్మా." తల్లితో మొరపెట్టుకున్నాడు ధరాధర్.

" అది కాదు బాబూ! గత నెలలో కరెంట్ బిల్లు ఎనిమిది వేలు దాటింది తెలుసా? అది మామూలు కంటే చాలా ఎక్కువ కదా? అందుకే నీతో అలా అని ఉంటారు." అని సవరమ్మ భర్తను వెనకేసుకొచ్చింది.

"మనం ఆ మాత్రం కరెంట్ బిల్లు కట్టే స్థితిలో లేమా? కరోనా లాక్డౌన్ వల్ల, నేను, ఇందిరా వర్క్ ఫ్రం హోం చేయాల్సి వస్తోంది. కంప్యూటర్ సిస్టమ్, ఇన్వర్టర్ కు ఏసీ చాలా అవసరం. ఆఫీసులో సెంట్రల్ ఏసి ఉంటుంది కాబట్టి, ఇబ్బంది లేదు. ఇంట్లో అవి అదే టెంపరేచర్ లో ఉంచాలి కదా? ఏసీ కి అలవాటు పడటం వల్ల మాకు రాత్రి కూడా అది అవసరం అవుతోంది. అంతేకాక కరెంటు బిల్లు లో కొంత భాగం మా ఆఫీస్ వాళ్లు తిరిగి ఇస్తామన్నారు అందుకని ఆయన్ని ఆందోళన పడవద్దని చెప్పు" ధరాధర్ లో దూకుడు.


"అమ్మా! నేను గంటలకు గంటలు బాత్రూంలో గడుపుతున్నానని

ఎద్దేవా చేస్తున్నారు నాన్న. దినమంతా కంప్యూటర్ ముందు పని చేసి అలసిపోయి, ఆటవిడుపుగా రాత్రి పాటలు వింటూ షవర్ కింద స్నానం చేయడం తప్పా? " తన నాన్న గారి పై ఫిర్యాదు చేసింది ఇందిర.

"నాన్న అన్నది నిజమే నమ్మా. గత నెల నీళ్ల బిల్లు, మామూలు కంటే రెండు రెట్లు వచ్చింది. అందుకే నీళ్లు దుబారా చేయవద్దని అని ఉంటారు. అయినా గంటలకు గంటలు బాత్రూంలో గడపడం అవసరమా? నీళ్లతో పాటు నీ సమయం కూడా వృధా అవుతుంది కదమ్మా." కూతురికి హితబోధ చేసింది సవరమ్మ.

"ఇంటి నుండి ఆఫీసు పని చేయడం బోర్ గా ఉంది. ఆఫీసులో అయితే ఎంచక్కా తోటి పని వారితో బాతాఖానీ కొడుతూ , మాటిమాటికి క్యాంటీన్ కి వెళ్లి, ఇష్టమైన స్నాక్స్ తినడం, టీ, కాఫీ తాగడం, ఆ మజాయే వేరు. ఇక్కడ? మీ ముఖాలు నేను, నా మొహం మీరు చూసుకోవడం తో సరిపోతోంది. ఓ అచ్చటా లేదు. ముచ్చటా లేదు. పైగా అది వృధా చేస్తున్నావు, ఇది వృధా చేస్తున్నావు, అని విసుర్లు. నీళ్ల బిల్లు ఎంత వచ్చినా నేనే కడతానని నాన్నకు అర్థమయ్యేలా చెప్పమ్మా. అబ్బబ్బా ఈ వర్క్ ఫ్రం హోం కాదు కానీ , నా ప్రాణం మీదికి వస్తోంది" ఇందిరలో చిరాకు.

" సరేనమ్మా నీ బాధ నాన్నగారికి చేర వేస్తాను."

రాత్రి పడక గదిలో, పిల్లల ఫిర్యాదుల గురించి భర్త శాంతారాం కు చెప్పింది సవరమ్మ.

"సరే రేపు పొద్దున టిఫిన్ చేసేటప్పుడు వారితో మాట్లాడతాను" అన్నాడు శాంతారాం.

మర్నాడు డైనింగ్ టేబుల్ పై నలుగురు కుటుంబసభ్యులు కూర్చుని టిఫిన్ చేస్తుండగా శాంతారామ్ మొదలుపెట్టాడు.

"ధరా! కరెంటు విషయంలో నేను అన్న మాటల గురించి మీ అమ్మతో ఫిర్యాదు చేశావట?"

"అవును నాన్నా! నెలకు లక్షలకు లక్షలు జీతం తీసుకునే మమ్మల్ని కరెంట్ విషయంలో, చిన్నపిల్లలను మందలించినట్టు మాటలనడం ఏం బాగాలేదు" ధరాధర్ లో ఉక్రోషం.

"పోయిన నెల కరెంట్ బిల్లు ఎంత వచ్చిందో తెలుసుగా?"

"ఎన్ని వేలు వస్తే ఏంటి నాన్నా? అది కట్టడం మాకు పెద్ద సమస్య కాదు. పైగా మా ఆఫీసు కూడా నెలకింతని కరెంట్ బిల్ ఇవ్వబోతోంది." ధరాధర్ లో ధీమా.

"అమ్మా ఇందూ! నీ కంప్లైంట్ ఏమిటమ్మా? "

"అదే నీటి వృధా విషయం. అమ్మ మీకు చెప్పే ఉంటుంది కదా నాన్నా?"

ఇందిరలో సంకోచం.

" సరే వినండి. కరెంటు, నీరు, వంటగ్యాస్, ఇవి జాతీయ వనరులు. వాటి ఉత్పత్తి మన చేతిలో లేదు. అందుకని అవి వృధా చేయరాదు. ఎంత బిల్లు అయినా, కట్టే స్తోమత మన దగ్గర ఉండొచ్చు, కానీ మనం అనుకున్నప్పుడు వాటి ఉత్పత్తి సాధ్యం కాదు. బిల్లు గురించి కాదు, దేశ సంపద వృధా చేయడం గురించి నేను మాట్లాడాను. పరిమితమైన ఈ వనరులను ఇప్పుడు మనం వృధా చేస్తే, ముందు ముందు మనం అంటే, మన దేశం ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.

పరాయి దేశాల్లో ఆహారం వృధా చేస్తే జరిమానా విధించడం మీరు చదివే ఉంటారు. అంటే ఎవరికి వారు తిన గలిగినంత మాత్రమే ఆర్డర్ చేయాలన్నమాట. ఆర్డర్ చేసిన వాటికి మొత్తం బిల్లు కట్టినా, ఆహారం వృధా చేస్తే జరిమానా కూడా కట్టాలి. వారనేదేమిటంటే ఆహారం కూడా రాష్ట్ర సంపద అని. అది వృధా చేసే అధికారం ఎవరికీ లేదు.

అలాగే విద్యుత్తు, వీళ్ళు వంట గ్యాస్, ఇవి కూడా మన జాతి సంపద. అందుకని సాధ్యమైనంత వరకు వీటి వృధా అరికట్టాలి. పెద్ద చదువులు చదివిన మీకు ఎక్కువ వివరించాల్సిన అవసరం లేదనుకుంటాను.

సవరా! వంట గ్యాస్ గురించి ఎందుకు చెప్పానంటే నువ్వు కూడా గ్యాస్ ఆన్ లో పెట్టి కాయగూరలు తీరిగ్గా కోస్తూ ఉంటావు. అలా కాకుండా అన్ని తయారుగా ఉంచుకొని గ్యాస్ వెలిగిస్తే అది వృధా కాదు. నా మాటలు మీకు చాదస్తంగా అనిపించవచ్చు. కానీ సావధానంగా ఆలోచిస్తే నా మాటల అంతరార్థం బోధపడుతుంది. మీ మనసు నొప్పించి ఉంటే క్షమించండి." శాంతారాం శాంతంగా ఉద్బోధించి తన గదిలోకి వెళ్ళిపోయాడు.

First Published:  20 Oct 2022 2:38 PM IST
Next Story