జల గీతం
వనరుల పరిమితుల వలన నీటి కొరత
విశ్వమంత నేడు విస్తరించె
కొద్దీ నీటి తోడ కొల్లగా వరిపండు
పద్ధ తెరిగి మనుజ పదము కదుపు
నగరు చుట్టునున్న నదులనూ చెరువులన్
నీటి కొరత లేక నింపి వదులు
భూమిలోకి యింక భూగర్భ జలములు
బుస్సు మనుచు పొంగు భూరిగాను
ఇండ్ల యందు నెప్పు డింకుడు గుంటలు
తవ్వ వాన నీరు దాని చేరు
నిప్పు గాలి భూమి నీరు నభములన్ని
తిరిగి పుట్ట వికని తెలియు మయ్య
కాల్వ చెరువు లన్ని ఖాళీగా కనిపించ
కట్టి నావు మేడ ,కనక మునకు
వరద వచ్చి నపుడు పారెడు నీరంత
వెసులు బాటులేక వెడలి పోయె
టప్పు టప్పునపడి డప్పు వాయించెడి
పంపు జారు నీరు పట్టు మయ్య
బొట్టు బొట్టు నొడిసి పట్టుకో కుంటి వా
చుట్టు ముట్టు నీటి గట్టి కొరత
చెంబు నీట పోవు చేతి మాలిన్యము
కడవ నీట కడుగు ఘనుడ వయ్య
పొదుపు నేర్చు కొనుచు నదుపులో నుండిక
వలసి నంత నీరు వాడు మనుజ
నింగి నీది కాదు ,నీరు నీ దెట్లౌను?
గాలి కూడా నీది కాదు మనుజ
దాచి శుద్ధముగను తరువాతి తరముల
కప్ప జెప్ప వలసి నాస్తు లయ్య
-ఉపద్రష్ట లక్ష్మి