విహారి- ఏరిన ముత్యాలు
ఇందిరాదేవి గారు 1919 సంవత్సరం సెప్టెంబరు 22వ తేదీన వరంగల్ జిల్లా హన్మకొండలోజన్మించారు.
-విహారి
ఇందిరాదేవి గారు 1919 సంవత్సరం సెప్టెంబరు 22వ తేదీన వరంగల్ జిల్లా హన్మకొండలోజన్మించారు.
సాహిత్యం, స్వాతంత్ర్యోద్యమం, మహిళా ఉద్యమం, సామాజిక చైతన్యంతో తెలంగాణ ప్రజల అభ్యున్నతికి కృషి చేసిన ఉద్యమకారిణి ఆమె.
నిజామాబాద్ లో 1937లో జరిగిన ఆరవ ఆంధ్ర మహిళాసభకు అధ్యక్షత వహించారు. మహిళల్లో అక్షరాస్యత పెంచడానికి కృషి చేయడమే కాక, స్నేహితురాండ్రతో కలిసి ‘ఆంధ్ర యువతీ మండలి’ని స్థాపించారు.
హైదరాబాద్ రాజ్యంలోని దక్కన్ రేడియోలో ప్రసంగించిన తొలి రచయిత్రి ఆమే. తరువాత అరవై ఏళ్లపాటు ప్రసంగాలు కొనసాగించారు. వాటిలో కొన్నిటిని ఎంపికచేసి ‘మసకమాటున మంచిముత్యాలు’ సంకలనాన్ని ప్రచురించారు.
పందెం, గంగన్న, వాయిద్యం సరదా, ప్రథమ పరిచయం, పిచ్చి ప్రాప్తం, ఏకాకి, రూల్సు ప్రకారం మా ఇల్లు, మావారి పెళ్లి, రాగమాలిక వంటి కథలు, నాటికలు, కవిత్వం, వ్యాసాలు రాశారు. అవి ఆంధ్రజ్యోతి, చిత్రగుప్త, ఆంధ్రకేసరి, భాగ్యలక్ష్మి, శోభ, సుజాత, ప్రజామిత్ర, వనితాజ్యోతి తదితర పత్రికల్లో ప్రచురితమయ్యాయి.
సామాజిక సంబంధాలు, సంసార బంధాలు, స్త్రీపురుష మనస్తత్వాలను ఆమె విభిన్నమైన శైలితో తమ కథల్లో చిత్రించారు. సంఘసంస్కరణోద్దిష్టంగా సాగిన ఆమె రచనల్లో సున్నితమైన హాస్యం తొంగిచూసేది.
ఇందిరాదేవిగారు తన అధ్యక్షతన 1940లో హైదరాబాద్ అఖిలాంధ్ర కథకుల సమావేశాన్ని నిర్వహించి, చిన్నకథపై విస్తృతంగా చర్చించారు.
అంతరంగ చిత్రణకు అద్భుతమైన నమూనా: ‘వాయిద్యం సరదా’ కథ
ఇందిరాదేవిగారి కథల్లో ‘వాయిద్యం సరదా’ మానవ స్వభావాల మీద నిశిత విశ్లేషణతో సాగిన కథ. మీనాక్షి, ఆమె భర్త నరసింహం, వారి ఆరాడేళ్ల కొడుకు చిట్టిబాబు. ఈ ముగ్గురి స్వరూప స్వభావాల చిత్రణలో తమకున్న అపారమైన లోకానుశీలనాన్నీ, మానవ మనస్తత్వ పరిశీలనా పటిమను నిరూపించుకున్నారు రచయిత్రి .
మీనాక్షి, చిట్టిబాబుల ఆవేదననీ, మూగ బాధనీ వాచ్యం చేసీ చేయకుండా – కళాత్మకంగా కథాత్మకం చేసిన రచనా నైపుణ్యం నిజంగా అద్భుతం.
భర్త పురుషాహంకారం, ఆధిపత్య ధోరణి-భార్య మనసుని ఎంతగా కలచివేశాయో లోతైన విశ్లేషణతో చిత్రించారు. తండ్రి రాతి హృదయపు నిరాదరణ వలన చిట్టిబాబు నిజంగా ‘హిడెన్ డైనమైట్’ గా మారతాడనిపించే రీతిలో ఆ పసివాడి పాత్రనీ నేర్పుగా మలిచారు.
కథంతా మౌఖిక కథాశిల్పంతో వన్నె మీరింది. పాత్రలూ, సన్నివేశాలూ, సంఘటనలూ, వాతావరణ నేపథ్యం- అన్నీ డాక్యుమెంటరీ టెక్నిక్ తో చూపారు. ఇతివృత్తం దృష్ట్యా చూస్తే మానవ స్వభావంలోని, ప్రవర్తనలోని అత్యంత సునిశితమైన ప్రకంపనల్ని అతి సూక్ష్మమైన పరిశీలనతో ఆవిష్కరించారు. ఆ వైరుధ్యాల్ని-ఇంత సున్నితంగా, ఇంత చిన్నకథలో పొందుపరచి కథని సంవేదనాత్మకం చేయటం- రచయిత్రి ప్రతిభకు తార్కాణం.
‘‘వేయి మొగ్గల్ని వికసించనీయండి. త్రుంచి వేయకండి’’ అనే సూక్తినీ పూసల్లో దారంలా సందేశాత్మకంగా కథాగతం చేశారు రచయిత్రి.
పాఠకులు పదికాలాలపాటు కథని తమ హృదయాల్లో నిలుపుకొనే రీతిలో రచించారు.
‘వాయిద్యం సరదా’ కథానికలో వస్తువు సంవేదనాత్మకం. కథనం రసరమ్యం. శైలి గంభీరం.ఈ త్రివేణీ ప్రవాహం పాఠకులకి అపూర్వమైన అనుభూతి పారవశ్యాన్ని కలిగిస్తుంది.
ఇందిరాదేవిగారి భర్త నందగిరి వెంకట్రావు గారు. తెలంగాణ తొలితరం కథకుల్లో సుప్రసిద్ధులు. 1930లో వారు రాసిన ‘పటేలు గారి ప్రతాపం’ కథ ధనస్వామ్యం ఆధిపత్యాన్ని, అధికార జులుంని నిరసించే ఉత్తమ కథ. బహుధా ప్రశంసించబడింది.
ఇందిరాదేవిగారు 2007, జనవరి 27న పరమపదించారు. కానీ, కథారచయిత్రిగా ఆమె అమరజీవి.
నిత్య చైతన్య మార్గదర్శి
నందగిరి ఇందిరాదేవి