నేనూ ఒక నదీ
అదే నది అవే నీళ్ళు
ఎక్కడ ఆగితే అక్కడ కాళ్ళు ము౦చి
ఒక పల్చని స్పటికపు తెర అలదుకున్నట్టు
చల్లదనాన్నీ బాల్యాన్నీ మురిపెంగా బుజ్జగిస్తూ
చుట్టూ చుట్టూ తిరిగి ఊసులు పంచుకున్న క్షణాలు
ని౦గినంతా ఒ౦పి కరిగించిన నీరు నీలమై౦దని
నొక్కి చెప్పిన ఊహాకల్పనలు నదిచుట్టూ కధలు పారిన సమయం
అదే నది అవే నీళ్ళు
గలగలల శబ్దాల్లో హృదయాలు
మోసుకు వచ్చి
తీరం తీరమంతా
తీపి తలపులు నాటి సారవంతం చేసిన
యౌవన
మాగాణీ మడులు
పూల వనాలై పుప్పొడి బుక్కాలు చల్లుకు౦టూ
నీట్లోకి విసిరినా
వలల తో పాటు
వలపు ఎరలు విసిరి
కొన్నింటికి తగిలి గిలగిల్లాడిన ఘడియలు
అదే నది అవే నీళ్ళు
నడికట్టు బిగించుకు ఒడిలో పసిపాపతో
నావనెక్కి తలపుల జడి వానలో నాని నాని
చెమ్మగిలిన కళ్ళతో సెలవు తీసుకున్న వేళ
నది ఉన్నట్టుండి అదృశ్యమై
కంటివెనకాల శయనించిన సముద్రంలా మారింది.
అదే నది అవే నీళ్ళు
సుళ్ళు తిరిగిన
నీళ్ళ మధ్య
ఆత్మీయులు ఆస్థికలైనప్పుడు
జలపాతాలుగా మారిన జీవితం ముందు తలదించుకు
కుదించుకు కుంగి పోయిన సముద్రపు చుక్కై
ఎండా వానలను ఓర్చుకు౦టూ
ఆటుపోట్లను అదిమి పెడుతూ నది సాగుతూనే పోతుంది.
చీకటో వెలుతురో
ఏది ఉదయిస్తేనేం ఏది అస్తమిస్తేనేం
ఎల్లకాలం ఒడ్డుకు విసిరేస్తూ లోనికి లాక్కు౦టూ
సైకత స్నేహాల మాటున సహజీవనం సాగిస్తూ
నది కదులుతూనే ఉ౦టు౦ది
కాలాన్ని పెనవేసుకుని
నిజమే
ఏదేమైతేనేం
నాచుట్టూ నది ఉన్నంతకాలం
ఏ బుతువైతేనేం
అక్షరాలూ
సుళ్ళు తిరుగుతూ
ప్రవహిస్తూనే పోతాయి
- స్వాతి శ్రీపాద