నేనొక అగ్రవర్ణపు ప్రమిదను...
ఆరని వాక్యం ఇంకా తడిగానే ఉంది
ఎక్కడో రుధిర చినుకులు కురుస్తుంటే
ఆకలి చావు తప్పి ఆశలు మోస్తుంటే
పిడికిట పట్టి కులమతాలు పిసికి వేస్తుంటే..
దారి పొడుగునా ఎర్రని మరకలు
నిత్యం లేస్తూనే ప్రశ్నలు కురిపిస్తున్నాయి
అభద్రతా వలయంలో బిక్కు బిక్కు మంటూ
నాదైన మతం నన్నే ప్రశ్నలతో వేధిస్తుంటే...
నేను ఒక అగ్రవర్ణపు ఆలోచన ప్రమిదను
గుణములో ఉన్నతంగా జీవిస్తున్నా
రాజ్యాంగం లో నిరుద్యోగిలా మిగిలిపోయినా
వ్యత్యాసాల ఎదురీతలో ముందు నిలబడి వెనకబడ్డా..
చాలీచాలని జీవితపు బత్యపు చొక్కా సరిపోక
నెల అంతా సంసారపు తనువుకు సర్ద లేక
ఆత్మాభిమానపు మనిషిగా బ్రతుకు భారంగా మోస్తూ
స్వచ్ఛ భారతదేశం స్వేచ్ఛ కోసం ఎదురుచూస్తున్నా..
కాలాన్ని నిందిస్తూ ఎన్నని మాట్లాడాలి
సత్యము బోధపడని సమాజంలో ఎంతని అరవాలి
ఉన్నోడిలా నటించేందుకు నటన నేర్చుకుంటూ
అగ్రవర్ణ పుట్టుకలోనే శాపం దాగి ఉందేమో..
చెప్పుకునేందుకు గొప్పలు చరిత్రలో ఉండొచ్చు
తాతల మీసాలు ఊడి రోషాలు చచ్చుపడ్డాయి
చేతికి దానధర్మాల తొడుగులు తాకట్టు అయ్యాయి
తరతరాలుగా ఆస్తులు హారతి కర్పూరం లా కరిగాయి..
అగ్రవర్ణం అట్టడుగు వర్ణమై నేడు కన్నీరు కాస్తూ
ఫలాలు అందని తనయుడులా విలపిస్తూ
నా పుట్టుకకు నేనే నిత్యము కన్నీరు కారుస్తూ
మరో జన్మలో నైనా ప్రయోజనం కలిగించమని కోరుకుంటాను..
-కొప్పుల ప్రసాద్ (నంద్యాల)