హృదయశల్యం
"పోస్ట్!"
లోపలున్న కళ్యాణికి కిటికీలోనుండి దూసుకొచ్చేగాలి కాలింగ్ బెల్ మోత తోపాటు ఆపిలుపు కూడా మోసుకు వచ్చింది.
ఆపిలుపు చాలా రోజుల తర్వాత ఆత్మీయంగా పిల్చిన మేనమామో, ఏళ్లతర్వాత వినవచ్చిన మిత్రుని స్వరమో అన్నంత సంబరంగాఉంది.
కొన్నాళ్ళుగా ఊసులు,ఉత్తర్వులు శుభాశుభ వర్తమానాలు అన్ని..అన్నీ చరవాణీ సాంగత్యంతోనేగా!
ఎప్పుడేనా తపాలా కార్యాలయం వైపుగా వెళ్తూ అటుచూస్తే చిన్నప్పుడు చూసిన అమ్మమ్మగారి ఇల్లు లా అనిపిస్తుంటుంది...
"పోస్ట్ " మళ్ళీ వినిపించింది పిలుపు.
రెండు నిమిషాల్లోనే ఎన్ని ఊహలు!'
నవ్వుకుంటూ తలుపు తీసింది.
"బాగున్నావా, ఖాసిమ్!" అడిగింది.
"బాగున్నాను అక్కా" నవ్వుతూ అని కవరు అందించివెళ్లిపోయాడు.
వెనుతిరిగి లోనికి వస్తూ కవరుపై చిరునామా చూసింది.
చేవ్రాత అపరిచితంగా ఉంది.
"ఎవరబ్బా!" అనుకుంది కళ్యాణి.
లోపలికి వచ్చికూర్చుని కవరులో కాగితం బైటకుతీసింది.
'అబ్బో,పెద్దఉత్తరమే.ఇంతకీఎవరు?'అనుకుంటూ చదవసాగింది కళ్యాణి
"మేడమ్ కల్యాణిగారికి నమస్తే! నాపేరు ఆదిత్య. నేను మీకుతెలీదు. మీరు నాకుతెల్సు. ఎలాగంటారా?
ఇదిపూర్తిగా చదవండి. మీకేఅర్ధం అవుతుంది.
నాపేరు చెప్పానుకదా, మాఅమ్మ పేరు యశోద.ఇరవైఏళ్ల వయస్సులో వయసు ఉరవడిలో, పిచ్చినమ్మకం తో కన్నవారినికాదని, ప్రేమించానన్న వ్యక్తితో గడపదాటింది.అప్పటికే మా అక్క కడుపున పడటంతో తప్పక... దూరంగా వెళ్ళి కాపురం పెట్టారు..."
చదవటం ఆపిన కళ్యాణి 'ఈ సొదంతా నా కెందుకు బాబూ? ' అనుకుంటూ మళ్ళీ చదవ సాగింది.
"... అక్క పుట్టిన మూడేళ్లకు నేను కడుపులో ఉండగానే మా నాన్న ఏక్సిడెంట్లో పోయారు. తిరిగి పుట్టింటికి వెళ్ళటానికి అమ్మకు మొఖం చెల్లక, పనిపాటలు చేస్తూ మమ్మల్ని పెంచింది.
మేడమ్! నేను ఆరవ తరగతికి వచ్చాక, రోజూ నేను స్కూల్ కి వెళ్లే అప్పుడు అమ్మనాకు తలదువ్వుతు చెప్పే మాటేమిటో తెలుసాండీ?"
'నాకెలా తెలుస్తుంది, చెప్పు '
లోలోన అనుకుంది కళ్యాణి.
"...నాన్నా! నువ్వు ఆడపిల్లలెవరిని
ఏమనకు. నేను, అక్క ఒంటరిగా ఉంటున్నాం. ఎవరైనా మమ్మల్ని ఏమన్నా అంటే... మనకెంత బాధగా ఉంటుంది చెప్పు? అని చెప్పేది..."
'మంచి తల్లే, చక్కని పెంపకం'
అనుకుంది కళ్యాణి.
కళ్యాణి.
"...నేను పదవతరగతిలోకి వచ్చాక అక్కను ఇష్టపడ్డ ఒక కారు మెకానిక్ తో పెళ్లిచేసింది అమ్మ. తరవాత కొద్ది నెలలకే అమ్మ చనిపోవటంతో అక్కా బావ నన్ను తమదగ్గర ఉంచుకుని.. చదివించారు.
కాలేజీకి వెళ్లేరోజు అక్క నాకో రహస్యం చెప్పింది..ప్రేమించి తీసుకు వెళ్లిన నాన్న, అమ్మను మోసంచేసి.. వెళ్లి పోయాడని...అమ్మ మరో ఊరు మారి మమ్మల్ని పెంచిందని!
ఆరోజునుంచి అక్క అమ్మ పాటను అందుకుంది...
"రేయ్!కాలేజీకి వచ్చాను, పెద్దాడినై పోయానని ఫీలవ్వకు. ఆడ పిల్లల్ని ఏడిపించడం, నమ్మించి మోసగించ డము లాంటివి చేయకు. మార్కులు రాకపోయినా, జీవితంలో అలాంటి రిమార్క్ మాత్రం తెచ్చుకోకు..'అని "
కళ్యాణి క్షణంఆగి, చదవసాగింది.
"...అక్కఆదరణ, బావ మంచితనం తో చదువు పూర్తిచేసుకుని ఉద్యోగం లో స్థిరపడ్డాను. అమ్మాయిని వెదికి పెళ్లికూడా వారిచేతుల మీదుగానే చేశారు. ఉద్యోగం చేసే ఊళ్ళో మా కాపురం ఆరంభించాం..."
'ఇంకేం... సుఖాంతం!'
అనుకుంది కళ్యాణి.
"... సమస్య అప్పుడే మొదలైంది మేడమ్..అమ్మ కోల్పోయిన గౌరవ నీయమైన, అన్యోన్య దాంపత్యపు జీవితాన్ని మేమయినా పొందాలని ఆశ, ఆరాటం... ఆశయం కూడా.
నా భార్య జ్వలిత నాతో బాగానే ఉన్నట్లుండేది. కానీ..మేడమ్! భార్య గురించి మరోలా చెప్పుకోవల్సిరావ డము ఆ భర్తకు ఎంతటి నరక సదృశమో..దానికితోడు లోకుల దృష్టిలో అతడెంత అసమర్ధుడి గా లెక్కింపబడతాడో ఊహించగలరా?
గయ్యాళితనమో..చీరలు, నగల కోసమో అయితే అదోవిధం అండీ.
ఇంతకుమించి వివరంగా చెప్పలేను.
అడిగితే...'అనుమానమా..పురుషాధిపత్యమా?' లాంటి పడికట్టు మాట లతో యాగీ చేస్తుంది.
స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకు పరిధిలేదా? వైవాహికజీవితంలోకట్టుబాటువద్దా?
మగవాడు స్త్రీని మోసం చేసినా, హింసించినా అరిచి చెప్పుకోడానికీ... ధర్నాలుచేయడానికీ, దూరదర్శనిలో రోజుల తరబడి చర్చిస్తూ..వాడ్ని ఏకి పాకం పట్టడానికి మీలాంటి స్త్రీవాదు లున్నారు..."
చదువుతున్న కళ్యాణి నిటారుగా కూర్చుంది. ఆమెకు విషయం పూర్తి గా అర్ధమైయ్యింది.
"...కళ్యాణి గారూ! నేను కోరేది
ఏమంటే హింసనో, అన్యాయాన్నో ఖండించండి.కానీ, ఆడా,మగా? అని చూడకండి.
పైకి చెప్పుకోలేని మగవాళ్లకు ఎంత 'హృదయశల్యం'గా ఉంటాయోమీరు
ఆలోచిస్తారని...వర్గవాదులుగా కాక, మానవతావాదిగా ఉండమని కోరిక.
సెలవ్...ఆదిత్య."
చదవడం పూర్తిచేసిన కళ్యాణి ఆలోచిస్తూ ఉండిపోయింది.*
-విజయశ్రీముఖి. (గన్నవరం)