కేరళ నరబలి కేసులో నిందితుడు హైకూ కవి..!
అతని ఫేస్‌బుక్ ఖాతాను బట్టి విషయం వెల్లడి
కేరళ నరబలి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుల్లో ఒకరైన భగవల్ సింగ్ హైకూ కవి. హైకూ పద్యాలు రాయడం, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడం అతని అభిరుచి. భగవల్ సింగ్ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను పరిశీలిస్తే.. అతను తరచుగా హైకూలను పోస్ట్ చేయడంలో చురుగ్గా ఉంటాడని తెలుస్తోంది. అతని పద్యం కేవలం 17 అక్షరాలను కలిగి ఉంటుంది. ఈ విషయం అతని ఫేస్‌బుక్ ఖాతాను పరిశీలిస్తే వెల్లడైంది. నరబలి కేసులో అతని నేరమయ కార్యకలాపాలకు భిన్నంగా ఈ అభిరుచి ఉండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
అక్టోబరు 6న, అనుమానాస్పద నరబలి కేసులో ఇద్దరు మహిళలను దారుణంగా హత్య చేసి, ఛిద్రం చేసినందుకు తన భార్యతో పాటు అరెస్టయ్యే కొద్ది రోజుల ముందు, సింగ్ ఫేస్‌బుక్‌లో రెండు హైకూలను పోస్ట్ చేశాడు. ఒక పోస్ట్‌లో, అతను హైకూ పాఠాలు తీసుకుంటానని పేర్కొన్నాడు.
ఈ కేసులో ప్రధాన నిందితుడు మహ్మద్ షఫీ ఫేస్‌బుక్ ద్వారా భగవల్ సింగ్‌తో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. 2019లో, షఫీ శ్రీదేవి పేరుతో నకిలీ ఖాతాను సృష్టించి, క్షుద్ర అభ్యాసంలోకి సింగ్‌ను ఆకర్షించాడు.
భగవల్ సింగ్ (68) వృత్తిరీత్యా మసాజ్ థెరపిస్ట్. కేరళలోని పతనంతిట్ట జిల్లాలోని ఎలంతూర్ గ్రామంలో పద్మ, రోసలిన్ అనే ఇద్దరు మహిళలను క్షుద్ర పూజలో భాగంగా బలితీసుకున్నారనేది ఈ కేసులో నిందితులపై అభియోగం. హత్యలకు సంబంధించి నిందితులు... భగవల్ సింగ్, అతని భార్య లైలా (59), ప్రధాన నిందితుడు మహ్మద్ షఫీ (52)లను అక్టోబర్ 11 న పోలీసులు అరెస్టు చేశారు. వీరిని కోర్టు 12 రోజుల పోలీసు కస్టడీకి పంపింది.