గుప్పుమన్న పరువు (కథానిక)
ఉదయం
---------
"ఎండి రొయ్యలు, గోంగూర ఆహా తలుచుకుంటేనే నోరూరిపోతోంది. ఏం కాంతం తెమ్మంటావా"?
"ఇంక చాల్లే ఆపండి! ఆ వాసనకి ఇరుగుపొరుగు వారు ఏమనుకుంటారో, ఏమో! వద్దొద్దు పరువు పోతుంది".
"కూర వాసనకే పోయే పరువైతే దాన్ని అలానే పోనివ్వు. మనం మాత్రం దాన్ని ఎంతకాలం ఆపగలం?
అసలు మన ఇంట్లో మనం మనకు నచ్చినవి వండుకు తింటే పరువు ఎలా పోతుంది! అయినా ఇరుగుపొరుగు ఎవరూ జీవితంలో గోంగూర ఎండిరొయ్యలు కూరే వండుకోలేదంటావా! లేదా వండుకున్న ప్రతిసారి ఇలా పరువుకోసం పాకులాడారు అంటావా?"
"ఇదిగో చూడండి !ఉన్నపనులతోనే వేగలేక ఛస్తున్నా! మీతో వాదించే ఓపిక నాకు లేదు! మీ ఇల్లు, మీకు నచ్చినట్లు చేసుకోండి! మీ తిండి యావకోసం నా ప్రాణాలు తీయొద్దు. అయినా నా ఒక్కదానికేనా పరువు?"
"నేను ఏదో తిండి యావకోసమో లేక ఈ రోజు కూర గురించో కాదు మాట్లాడుతున్నది. మొన్నటికి మొన్న ఆరుబయట దండెంమ్మీద ఆరేసిన నీ చీరను సర్దుతుంటే అయ్యో ఎవరైనా చూస్తే పరువుపోతుంది అన్నావ్... నిన్నటికి నిన్న మొహం కడుగుతూ దగ్గితే మెల్లగా దగ్గoడి పరువు తీసేలా ఉన్నారు అన్నావ్... ఈరోజు చూస్తే ఇలా... అసలు ఏంటి పరువుగోల? "
"వామ్మో మీ వితండవాదానికి నేను సమాధానం చెప్పలేను మీకో దండం".
"ఇందులో వితండవాడవాదం ఏముంది? ఇరుగుపొరుగు ఎవరికి నచినట్లుగా వాళ్ళు బ్రతుకుతుంటే అడ్డురాని పరువు, మన మానాన మనం బ్రతకడానికి ఎందుకు అడ్డొస్తుంది అని అడిగా అంతేగా!"
(అరుస్తూ)
"మీ కాళ్ళు పట్టుకుంటాను నన్నిలా వేపుకుతినడం ఆపి కాస్త ప్రశాంతంగా బతకనివ్వండి? "
"అదేంటి కాంతం ఎందుకంత విసుగు! ఎందుకు అంతలా అరుస్తున్నావ్? ఇప్పుడేమైందని!"
"నేను అరుస్తున్నానా!
అవును లెండి నా బాధ మీకెప్పటికి అర్ధమవ్వాలి?"
"నీకు అంత బాధ ఎందుకు కలుగుతోంది? అసలు నేను ఏమన్నానని అంత బాధ?"
"అబ్బ ఎంత బొప్పిలా అడుగుతున్నారు! మీకు తెలియదా?"
"నిజంగా నాకు తెలియట్లేదు".
"మీకు తెలియకపోతే నాకూ తెలియదు".
"సరే ఇంతకీ ఏం తెమ్మంటావు!"
"మళ్ళీ మీరు అడిగింది వండిపెట్టలేదని నన్ను దెప్పిపొడవడానికా? మీకు నచ్చిందే తెచ్చుకోండి".
"అదేంటి ఇప్పటిదాకా పరువు అదీ ఇదీ అన్నావ్?"
"హా పరువు! నామొహానికి అదొక్కటే తక్కువ. సర్లే ఇది నాకేమైనా కొత్తగానకనా! మిమ్మల్ని కట్టుకున్నాక నాకంటూ ఒక పరువుకుడా ఏడ్చిందా!"
"అదేంటి అలా మాట్లాడతావ్! అంత పరువుతక్కువ పని నేనేం చేశాను?"
"మీకు తెలియదా?"
"నాకు తెలియదు."
"అయితే నాకూ తెలియదు."
"నువ్వొక్కదానివే ఇలానా లేక మీ జాతి మొత్తం అంతేనా!"
"జాతంటే?"
(స్వగతం:- అమ్మో ఇప్పుడు పుట్టింటి జాతి అనడం ప్రమాదం, స్త్రీజాతి అనడం ప్రమాదలకే ప్రమాదం మెల్లగా ఏదోలా తప్పించుకోవాలి)
"మొన్న నువ్వు కూరలు తరుగుతున్నపుడు ఏదో చిన్న ఆలాపన పాడావు చూడు అప్పుడు నీ ముంగురులు చూస్తుంటే రోబో సినిమాలో ఐశ్వర్యారాయ్ గుర్తొచ్చిందంటే నమ్ము".
"అవునా నిజంగనా!"
(స్వగతం:- హమ్మయ్య గొప్ప ప్రమాదం నుండి తప్పించుకున్నా!)
మధ్యాహ్నం భోజనాల వేళకు...
---------------------------
"ఏమోయ్ అన్నం వడ్డించు".
"ఏడ్చినట్లే ఉంది మీ వ్యవహారం. ఉదయమనగా వెళ్లి ఇప్పటికి వచ్చారు. ఏమి తెచ్చారని వంటచేయడానికి!".
"అదేంటి? ఉదయం ఎండిరోయ్యల కూర వండుకోకుండా మనం దాచుకున్న పరువు ఉందిగా! అదే మనకు ఈ పుటకు కడుపు నింపుతుంది కదా అని నేను ఏమి తెలీదు. ఏం అంత పోరాడి నువ్వు కాచుకున్న పరువు ఆమాత్రం మన అవసరం, ఆకలి తీర్చలేదా!"
"మీరొక్కరే ఇలానా లేక మీ జాతి మొత్తం ఇంతేనా?"
"జాతంటే!"
"నిన్న మీరు ఏ జాతి గురించి అన్నారో అదే జాతి".
(స్వగతం:- ఎంత తెలివి నా వేలితో నా కన్నే పొడిచింది)
తర్వాత రోజు ఉదయం
---------------------
(గుమ్మం బయట నిలబడిన భర్త)
"కాంతం త్వరగా ఇటురా ఎవరిదో పరువు పోపులో వేగుతోంది చూడు".
----
"ఆహా గుప్పు గుప్పు మంటూ ఎండి రొయ్యలు గోంగూర పరువు వాసన..."
----
"అబ్బా ఎంత వాసన!, ఎంత వాసన! ఎంత పరువు పోతోందో పాపం!..."
"ఇంక చాల్లే ఆపండి
మరీ అంత లేకిగా వాసన పీల్చుతూ పరువు తీయకండి!..."
"ఛీ! నా బతుకు... నువ్వు ఈ జన్మకు మారవు!"
- విద్యాసాగర్